H-4 visa
-
ఎన్ఆర్ఐలకు చేదువార్త : పిల్లల భవిష్యత్తేంటి?
అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులకు మరో చేదు వార్త. చట్టబద్ధమైన వలసదారుల పిల్లలు, దాదాపు 2.50 లక్షలమంది అమెరికాను వీడే పరిస్థితి కనిపిస్తోంది.'డాక్యుమెంటెడ్ డ్రీమర్స్' గా పిలిచే ఈ పిల్లలు తాత్కాలిక ఉద్యోగ వీసాలపై వారి తల్లిదండ్రులతో అమెరికా వచ్చారు. కానీ ఇప్పుడు 21 ఏళ్లు నిండిన (ఏజింగ్ ఔట్) కారణంగా ఆ పిల్లలు తమ డిపెండెంట్ స్థితిని కోల్పోయే ప్రమాదం ఉందన్న అంచనాలు ఆందోళన రేపుతున్నాయి.శాసన ప్రతిష్టంభనకు రిపబ్లికన్లను వైట్ హౌస్ ఆరోపించింది. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌కు సహాయం చేసేందుకు తాము ఒక ప్రక్రియను ప్రతిపాదించామని దాన్ని రిపబ్లికన్లు రెండుసార్లు తిరస్కరించాని అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ చెప్పారు. చట్టసభ సభ్యులు, న్యాయవాదులు అమెరికాలో పెరిగిన పిల్లలను రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. హెచ్ 1బీ కేటగిరీ కింద అమెరికాలో ఉండే విదేశీయుల పిల్లలకు హెచ్4 వీసా ఇస్తారు. ఇది పిల్లలకు 21 ఏళ్లు వచ్చేంతవరకు చెల్లుతుంది. భారతీయ పిల్లలు కనీసం 2.50 లక్షల మంది 21 ఏళ్లు నిండగానే అమెరికా వీడాల్సి ఉంటుంది. వారక్కడే ఉండాలంటే స్టూడెంట్ (ఎఫ్) వీసా సంపాదించాలి. లేదా కొత్త తాత్కాలిక స్థితికి మారాలి లేదా భారత్‌కు తిరిగి వచ్చేయాలి. లేదంటే యుఎస్‌లో ఉండటానికి చట్టపరమైన హోదా కోల్పోతే, అమెరికా చట్టాల ప్రకారం చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ద్వారా అమెరికా పౌరసత్వం మరియు వలస సేవల (USCIS) డేటా విశ్లేషణ ప్రకారం, ఆధారపడిన వారితో సహా 1.2 మిలియన్లకు పైగా భారతీయులు మొదటి, రెండవ, మూడవ ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కేటగిరీలలో వేచి ఉన్నారు. కాగా జూన్ 13న, ఇమ్మిగ్రేషన్, పౌరసత్వం మరియు సరిహద్దు భద్రతపై సెనేట్ జ్యుడిషియరీ సబ్‌కమిటీ చైర్‌గా ఉన్న సెనేటర్ అలెక్స్ పాడిల్లా నేతృత్వంలోని 43 మంది చట్టసభ సభ్యుల బృందం, ప్రతినిధి డెబోరా రాస్, వీరిని రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. -
జోబైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హెచ్-4 వీసా దారులకు భారీ ఊరట!
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-4 వీసా దారులకు ‘ఆటోమేటిక్‌గా వర్క్ ఆథరైజేషన్’ విధానాన్ని అమలు చేయనుంది. తద్వారా కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. హెచ్1- బీ వీసా దారులైన భార్య భర్తలు వారి 21ఏళ్ల లోపు వయస్సున్న పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా హెచ్-4 వీసాను జారీ చేస్తుంటారు. ఈ వీసా ఉంటే సరిపోదు ఉద్యోగం చేసేందుకు వీలుగా తప్పని సరిగా ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్, ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ధరఖాస్తు అనంతరం అధికారులు ఆథరైజేషన్ చేస్తారు. కానీ ఇక్కడే హెచ్-4 వీసా దారులకు ఆథరైజేషన్ సమయం ఎక్కువ కావడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ఈ నేపథ్యంలో వారికి లబ్ధి చేకూరేలో జోబైడెన్ ప్రభుత్వం హెచ్-4 వీసా దారులు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ధరఖాస్తు ప్రక్రియను మరింత సులభ తరం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. తాజాగా, అమెరికన్ సెనెట్‌లో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో ‘జాతీయ భద్రతా ఒప్పందానికి’ ఆమోదం తెలిపేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. ప్రస్తుతమున్న నిబంధనలు మార్చి హెచ్-4 వీసాదారులకు ఆటోమేటిక్‌గా వర్క్ ఆథరైజేషన్ కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు వైట్‌హౌట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా హెచ్-4 వీసా దారులకు లబ్ధి చేకూరుతుందని జోబైడెన్ తెలిపారు. -
అమెరికాలో అయ్యో పాపం మన పిల్లలు...
న్యూఢిల్లీ: అమెరికాలో ఉంటున్న భారతీయులకు మరో చేదు వార్త. వారి పిల్లల్లో చాలామంది 21 ఏళ్లు నిడగానే దేశం వీడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆరి హెచ్4 కేటగిరీ వీసాల ప్రాసెసింగ్‌కు దశాబ్దాలకు పైగా వెయిటింగ్ జాబితా ఉండటమే ఇందుకు కారణం. వీరి సంఖ్య లక్షకు పైగా ఉంటుందన్న అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్ కార్డుల కోసం ఉద్యోగాధారిత కేటగిరీ కింద దరఖాస్తు చేసుకుని వెయిటింగ్ లో ఉన్న భారతీయుల సంఖ్య 10.7 లక్షలకు పైగా ఉంది. ఇది చాలదన్నట్టు ఒక్కో దేశం నుంచి ఏటా ప్రాసెస్ చేసే వీసా దరఖాస్తుల సంఖ్యను 7 శాతానికి పరిమితం చేయడం సమస్యను జటిలం చేసింది. ప్రస్తుత వేగంతో మన వాళ్లందరికీ గ్రీన్ కార్డులు రావాలంటే హీన పక్షం 135 ఏళ్లు పడుతుంది. 21 ఏళ్ల కంటే తక్కువ వయసు వారు అమెరికాలో ఉండేందుకు వీలు కల్పించేదే హెచ్4 వీసా. ఈ కారణంగా కనీసం 1.34 లక్షల మంది భారతీయ పిల్లలు 21 ఏళ్లు నిండగానే అమెరికా వీడాల్సి ఉంటుందని డిసైడ్ మెయిర్ అనే ఇమిగ్రేషన్ వ్యవహారాల నిపుణుడు చేసిన అధ్యయనంలో తేలింది. హెచ్ 1బీ కేటగిరీ కింద అమెరికాలో ఉండే విదేశీయుల పిల్లలకు హెచ్4 వీసా ఇస్తారు. 21 ఏళ్లు వచ్చేదాకా అమెరికాలో ఉండేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఆ తర్వాత వాళ్లు హెచ్4 కేటగిరీ కింద అక్కడ ఉండేందుకు వీల్లేదు. వారక్కడే ఉండాలంటే స్టూడెంట్ (ఎఫ్) వీసా సంపాదించాలి. అవి చాల పరిమిత సంఖ్యలో మాత్రమే దొరుకుతాయి. దొరకని వారంతా అమెరికా వీడాల్సి ఉంటుంది. పిల్లలుగా అమెరికా వెళ్లి, అక్కడే పెరిగి పెద్దయిన వారికి ఇలా తల్లిదండ్రులను వదిలి దేశం వీడటం నరకప్రాయమే. పైగా భారత్ లోని తమ కుటుంబాలతో వారికి పెద్ద బంధాలేవీ ఉండే అవకాశం పెద్దగా ఉండదు. కనుక వెనక్కు వచ్చి ఇక్కడ, ఎలా ఉండాలన్నది మరో పెద్ద సమస్య కాగలదు. -
ఆన్లైన్ ఎంచుకుంటే అమెరికా రావద్దు
వాషింగ్టన్: వీసా విధానంలో రోజుకో మార్పు తీసుకువస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థుల అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా విద్యా సంస్థల్లో ఆన్లైన్ మాధ్యమంలో బోధనను ఎంపిక చేసుకునే కొత్త విద్యార్థులెవరినీ దేశంలోకి రానివ్వకూడదని ఆయన నిర్ణయించారు. ఈ సెప్టెంబర్ నుంచి మొదలయ్యే సెమిస్టర్లో ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులెవరూ దేశంలోకి అడుగు పెట్టకూడదని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ (ఐసీఈ) ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికి కటాఫ్ తేదీని మార్చి 9గా నిర్ణయించింది. ఆ తేదీ తర్వాత కొత్త విద్యార్థులెవరైనా ఆన్లైన్ బోధనా పద్ధతుల్ని ఎంపిక చేసుకుంటే అమెరికా రావడానికి వీల్లేదని ఐసీఈ స్పష్టం చేసింది. కొత్తగా జాయిన్ అయిన విదేశీ విద్యార్థులెవరికీ ఫారమ్ 1–20 జారీ చేయవద్దంటూ దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను హోంల్యాండ్ సెక్యూరిటీలోని స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్ఈవీపీ) ఆదేశించింది. స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆ ఫారమ్స్ అత్యంత కీలకం. ఈ విద్యా సంవత్సరంలో భారత్‌కు చెందిన విద్యార్థులకే అత్యధికంగా అమెరికా విద్యాసంస్థల్లో సీటు వచ్చింది. కొత్తగా సీటు వచ్చిన భారతీయ విద్యార్థులు దాదాపుగా 2 లక్షల మంది వరకు ఉండవచ్చునని ఒక అంచనా. అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశీయ, విదేశీ విద్యార్థులు ఎక్కువ మంది ఆన్లైన్ బోధనా పద్ధతుల్ని ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికాలో ఉంటూ ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు ఇచ్చి సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో తన నిర్ణయాన్ని ట్రంప్ సర్కార్ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. విద్యా సంస్థల్ని బలవంతంగానైనా తెరిపించడానికే ట్రంప్ ఇలా రోజుకో వివాదాస్పద నిర్ణయం తీసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. డీఏసీఏ దరఖాస్తులూ పెండింగ్‌లో చిన్నతనంలో అమెరికాకి వచ్చి, యుక్త వయసు వచ్చాక ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) దరఖాస్తులని సర్కార్ పెండింగ్‌లో ఉంచింది. గత నెలలో సుప్రీం కోర్టు డీఏసీఏని ఆపేయడం సరికాదని వ్యాఖ్యానించినప్పటికీ సర్కార్ పెడచెవిన పెట్టింది. మేరీల్యాండ్‌లో అమెరికా జిల్లా కోర్టు డీఏసీఏని తిరిగి పాత పద్ధతిలోకి తీసుకురావాలని ఆదేశించిన నేపథ్యంలో ఆ దరఖాస్తులన్నీ పెండింగ్‌లో ఉన్నట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్క్ పర్మిట్లలోనూ జాప్యం అమెరికాలో హెచ్4 వీసాలపై ఉన్న జీవిత భాగస్వాములకు పని చేయడానికి వీలుగా జారీ చేసే వర్క్ పర్మిట్లలోనూ∙జాప్యం జరుగుతోంది. ఈ మేరకు భారత్‌కు చెందిన మహిళ రంజిత సుబ్రహ్మణ్యం ఓహియో ఫెడరల్ కోర్టుకెక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న తనకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)కి ఆమోదించినప్పటికీ ఇప్పటివరకు తనకు అది అందలేదని ఆమె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అంతకు ముందు ఉన్న ఈఏడీ గడువు జూన్‌లో ముగిసిపోవడం, కొత్తది అం దకపోవడంతో తాను ఉద్యోగాన్ని కోల్పోయానని తెలిపారు. సాధారణంగా వర్క్ పర్మిట్‌కు అనుమతి వచ్చిన రెండు రోజుల్లోనే ఈఏడీ కార్డుని వారికి పం పాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 75 వేల కార్డులు ప్రింట్ కాకుండా పెండింగ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. -
‘హెచ్4’ ఉద్యోగాలతో ముప్పేం లేదు!
వాషింగ్టన్: అమెరికాలోని హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించే నిబంధనను తొలగించేలా ఆదేశాలివ్వవద్దని దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం వాషింగ్టన్‌లోని ఫెడరల్ కోర్టును కోరింది. వారు ఉద్యోగాలు పొందడం వల్ల అమెరికన్ల ఉద్యోగావకాశాలు అంతగా ప్రభావితం కావడం లేదని కోర్టుకు తెలిపింది. హెచ్4 వీసాదారుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు తీవ్రస్థాయిలో ముప్పు ఏర్పడుతుందన్న ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’వారి వాదన సరికాదని వాషింగ్టన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టుకు ట్రంప్ ప్రభుత్వం మే 5న వివరించింది. దానికి సంబంధించి ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’చూపిన ఆధారాలు సరికావని వాదించింది. ఈ నిర్ణయం వేలాది భారతీయులకు శుభవార్తగా మారింది. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామి, 21 ఏళ్లు పైబడిన పిల్లలకు అమెరికా ప్రభుత్వం హెచ్4 వీసా జారీ చేస్తుంది. హెచ్4 వీసాదారుల్లో కొన్ని కేటగిరీల వారు ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని 2015లో నాటి ఒబామా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా కల్పించింది. 2017 డిసెంబర్ నాటికి 1,26,853 హెచ్4 వీసాదారుల ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ దరఖాస్తులను అమెరికా పౌర, వలస సేవల(యూఎస్సీఐఎస్) విభాగం ఆమోదించింది.ఒబామా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమెరికన్ టెక్నాలజీ వర్కర్ల తరఫున ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’సంస్థ కోర్టులో సవాలు చేసింది. హెచ్4 వీసాదారులు యూఎస్‌లో ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటును తొలగించే విషయమై ఆలోచిస్తున్నామని అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కానీ, దానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. -
అమెరికా డ్రీమ్స్ కరిగిపోతాయా?
అమెరికాలో హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు (హెచ్–4 వీసాదారులు) వర్క్ పర్మిట్ రద్దుతో భారతీయుల ఆశలు నీరుగారిపోవడంతో పాటుగా అగ్రరాజ్యాన్ని బాగా దెబ్బ తీస్తుందని తాజా సర్వేలో వెల్లడైంది. సౌత్ ఏషియన్ అమెరికన్ పాలసీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎస్‌ఏఏపీఆర్‌ఐ) అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో హెచ్–4 వర్క్ పర్మిట్ రద్దు ప్రభావం అమెరికా ఐటీ ఇండస్ట్రీపై తీవ్రంగా ఉంటుందని తేలింది. అమెరికాలో హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా పని చేయాలంటే హెచ్4–ఈఏడీ (ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) వీసా ఉండాలి. ఈ వీసాలను రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలు తుది దశకు చేరుకుంటున్న సమయంలో ఎస్‌ఏఏపీఆర్‌ఐ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. దక్షిణాసియా దేశాలకే అత్యధిక లబ్ధి 1997– 2017 మధ్య కాలంలో హెచ్–4 ఈఏడీ వీసాల మంజూరు బాగా పెరిగింది. వాటితో దక్షిణాసియా దేశాలకు చెందిన మహిళలే ఎక్కువగా లబ్ధి పొందారు. 1997 నాటికి ఏటా 18, 979 మందికి ఈ వీసాలు మంజూరు చేస్తే, 2017 నాటికి వాటి సంఖ్య 1.18 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం హెచ్–4 వీసాదారుల్లో 93 శాతం మంది దక్షిణాసియా దేశాల వారే. ఇక భారత్‌కు చెందిన మహిళా ఇంజనీర్లు కూడా బాగా లబ్ధి పొందారు. 2015 నుంచి మంజూరు చేసిన వీసాల్లో 90 శాతానికి పైగా భారత్‌కు చెందిన మహిళలే దక్కించుకున్నారు. ప్రమాదంలో భారత మహిళల ఉద్యోగాలు 2017లో ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక వలస విధానాలను కఠినతరం చేశారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారికే హెచ్–1బీ వీసాలు మంజూరు చేయడానికి ప్రాముఖ్యతనిచ్చారు. హెచ్–1బీ వీసా గడువు పొడిగింపుల్ని కూడా తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం హెచ్–4 ఉన్న వారిలో ఎక్కువ మంది అమెరికాలోనే మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ చేసిన వారే. దాదాపుగా 80 శాతం మంది వీసాదారులు అత్యంత ప్రతిభావంతులు. వీటిని రద్దు చేయడం వల్ల ఎంతో మంది నిపుణులైన భారతీయ మహిళలు ఉద్యోగాలు కోల్పోతారు. సగం మందికిపైగా ఉద్యోగాల్లేవు ట్రంప్ అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ విధానం కారణంతో హెచ్–4 వీసా కింద వర్క్ పర్మిట్ వచ్చినప్పటికీ 63 శాతం మంది వీసాదారులకు ఉద్యోగాలే దొరకడం లేదు. ట్రంప్ సర్కార్ అన్నంత పని చేసి ఈఏడీని రద్దు చేస్తే జీవిత భాగస్వాములు మరో పదేళ్ల పాటు ఇంటిపట్టునే ఉండాల్సి వస్తుంది. ఇది భారతీయ మహిళా నిపుణులకు ఆందోళన కలిగిస్తోంది. హెచ్–4 వీసా దారుల్లో 75 శాతం పైగా పిల్లలు ఉన్నవారే. వారిలో 85 శాతం మంది పిల్లలు అమెరికా పౌరులు కావడంతో ఏం చేయాలో తెలియని గందరగోళంలో భారత్‌కు చెందిన తల్లిదండ్రులు ఉన్నారు. అమెరికాకు రావద్దని సలహా ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వలస విధానాలతో అక్కడ భారతీయులు విసిగిపోయారు. 80 శాతానికి పైగా హెచ్–4 వీసాదారులు అమెరికా రావద్దంటూ తమ సన్నిహితులకు సలహా ఇస్తున్నారు. ఇతర దేశాలకు వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నామని సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది వెల్లడించారు. అమెరికాకు చెందిన వారు కాకుండా ఇతర దేశాలకు చెందిన వారే 30 శాతం అధికంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారు. సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ కంపెనీలను స్థాపించిన వారిలో 25 శాతం మంది వలసదారులే. బరాక్ ఒబామా హయాంలో ఇచ్చిన ఈ వర్క్ పర్మిట్లను ఎత్తివేయడం వల్ల అమెరికాకే అత్యధికంగా నష్టం జరుగుతుందని ఎస్‌ఏఏపీఆర్‌ఐ సర్వే అంతిమంగా హెచ్చరించింది. -
హెచ్4 వీసాలపై పిడుగు!
వాషింగ్టన్: హెచ్–4 వీసాదారులకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అనుమతులను రద్దుచేయాలన్న డీహెచ్ఎస్ (డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ) ప్రతిపాదనను అమలుచేసే దిశగా మరో అడుగు ముందుకు పడింది. హెచ్–1బీ వీసా కలిగిన వ్యక్తుల జీవిత భాగస్వాములకు, వారి 21 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఇచ్చేదే ఈ హెచ్–4 వీసా. హెచ్–4 వీసా కలిగిన వారు కూడా ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులిస్తూ 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ అనుమతులను రద్దు చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా, డీహెచ్ఎస్ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించాల్సిందిగా మే 22న అమెరికా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దయితే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లక్ష మందికి పైగా భారతీయులు, తమ కొలువులను కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ లక్ష మంది భారతీయుల్లో స్త్రీలే అత్యధికంగా ఉన్నారు. కనీసం సంవత్సరం తర్వాతే.. ఒక వేళ హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దయినా, అది అమలు కావడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుందని అమెరికాలో వలస చట్టాల న్యాయనిపుణుడు రాజీవ్ ఖన్నా చెప్పారు. ‘హెచ్–4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకునే అనుమతిని రద్దుచేసే ప్రక్రియ ప్రస్తుతం చివరి నుంచి రెండో దశలో ఉంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రతిపాదనకు మద్దతు లభిస్తే, ఫెడరల్ రిజిస్టర్లో దీనిని పోస్ట్ చేస్తారు. 30 లేదా 60 రోజుల్లోపు మళ్లీ ప్రజలు తమ అభిప్రాయాలు తెలపవచ్చు. అనంతరం నిబంధనకు తుదిరూపు వస్తుంది’ అని ఆయన వివరించారు. వలస విధానాల్లో పూర్తి సంస్కరణలు తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం తొలి నుంచీ మొగ్గుచూపుతుండటం తెలిసిందే. అందులో భాగంగానే, గతేడాది ఫిబ్రవరిలో తొలిసారిగా హెచ్–4 వీసాలకు ఉద్యోగానుమతులు రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం చేసింది. అనంతరం గతేడాది అక్టోబర్‌లో డీహెచ్ఎస్ ఈ ప్రతిపాదనకు అనుకూలంగా మాట్లాడింది. అయితే హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దు చేస్తే అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రతిభావంతులైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. -
భారత ఐటీ నిపుణులకు మరో బ్యాడ్ న్యూస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. తాజాగా హెచ్1బీ వీసా కలిగివున్న వారి జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త), 21 సంవత్సరాల లోపు పిల్లలు ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని నిషేధించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ లాండ్ ప్రతిపాదన రెండవ దశకు చేరుకుంది. హెచ్4 వీసాలపై నిషేధం విధించే ప్రక్రియలోభాగంగా మే 22న అమెరికా ప్రభుత్వం ఒక నోటీసును కూడా జారీ చేసింది. ఇది చట్టం రూపంలో అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న దాదాపు లక్షకు పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ప్రధానంగా భారతీయులే ఎక్కువగా నష్టపోతారు. 2015 నుంచి హెచ్-4 వీసా కింద అమెరికాలో 1.2 లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో 90శాతం మంది భారతీయులే. ముఖ్యంగా భారత మహిళలే. ఏదేమైనా, ఈ ప్రతిపాదన పూర్తయ్యి, అమలులోకి రావడానికి కొంత సమయం పడుతుందని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే..ఫెడరల్ రిజిస్టర్లో పోస్ట్ చేస్తారు. వీటిపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు 30-60 రోజుల వరకు గడువు వుంటుంది. అనంతరం దీనిపై చట్టం తీసుకొస్తారు. అయితే ఇదంతా జరిగేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని ఇమ్మిగ్రేషన్.కామ్ మేనేజింగ్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా వ్యాఖ్యానించారు. దీని ద్వారా అమెరికాలో ఐటీ నిపుణుల కొరత ఏర్పడుతుందనీ, తద్వారా అమెరికా ఉద్యోగాలను తిరస్కరించే పరిస్థితి వస్తుందన్నారు. కాగా హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వారి జీవిత భాగస్వాములు అమెరికాలోని కంపెనీల్లో పనిచేసేందుకు హెచ్-4 డిపెండెంట్ వీసాల కింద వీలు కల్పిస్తూ 2015లో ఒబామా ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ విధానాన్ని తొలగిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించారు. భారత సంతతికి చెందిన ప్రజాప్రతినిధులు, పలు సంఘాలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవువుతున్నప్పటికీ అమెరికా యువతకు ఉద్యోగాలు కల్పించేందుకే ఈ నిబంధనలు తీసుకొస్తున్నట్లు ట్రంప్ సర్కార్ చెబుతున్న సంగతి తెలిసిందే. -
హెచ్4లకు ఉద్యోగాల రద్దు వద్దు!
వాషింగ్టన్: హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములు దేశంలో ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పించే నిబంధనను రద్దు చేయొద్దంటూ అమెరికా కాంగ్రెస్‌లో ఇద్దరు సభ్యులు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములైన హెచ్ 4 వీసాదారులు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని అధ్యక్షుడిగా ఒబామా ఉన్న సమయంలో కల్పించారు. అప్పటినుంచి లక్షకు పైగా హెచ్ 4 వీసాదారులు, వారిలో అధికులు మహిళలే.. అమెరికాలో ఉద్యోగాలు సాధించారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికన్ల ఉద్యోగ భద్రత కారణంగా చూపుతూ ఈ అవకాశాన్ని రద్దు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఏడాది చివరలోగా ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చ వచ్చన్న వార్తల నేపథ్యంలో.. అమెరికా కాంగ్రెస్‌లో అనా జీ ఏషూ, జో లాఫ్రెన్ ‘హెచ్ 4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్’ పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్ 4 వీసాదారులకు ఉద్యోగావకాశాలను నిరాకరించడం వల్ల అమెరికా ఆర్థికవ్యవస్థకు నష్టం కలుగుతుందని, భారత్, చైనా తదితర దేశాలకు చెందిన నిపుణులైన విదేశీ ఉద్యోగులు దేశం విడిచి వెళ్లడం కానీ, లేదా మెరుగైన వీసా నిబంధనలున్న మరో దేశానికి వెళ్లడం కానీ జరిగే అవకాశముం దని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక, సైద్ధాంతిక నిపుణులైన విదేశీయులకు అమెరికా లో ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించేదే హెచ్1 బీ వీసా. భారత్ నుంచి వేలాది మంది ఈ వీసాపై అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హెచ్ 4 వీసాపై అమెరికా వెళ్లిన వారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేయడం వల్ల ఆ కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం ఏర్పడిందని, అది అమెరికా ఆర్థిక వ్యవస్థకూ ఉపయోగపడిందని లాఫ్రెన్ పేర్కొన్నారు. హెచ్ 4 వీసాదారులకు ఉద్యోగావకాశం కల్పించడం ఆర్థిక సమానత్వానికి, కుటుంబ విలువలకు సంబంధించిన అంశమన్నారు. -
3 నెలల్లో ‘హెచ్4’ను తేలుస్తాం
వాషింగ్టన్: హెచ్–4 వీసాదారులకు వర్క్ పర్మిట్లను రద్దు చేసే విషయమై వచ్చే మూడు నెలల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ ప్రభుత్వం ఫెడరల్ కోర్టుకు తెలిపింది.‘హెచ్–1బీ వీసాదారుల భాగస్వాములకు ఉపాధి కల్పనకు అవకాశం కల్పించే హెచ్–4 వీసాకు సంబంధించిన నిబంధనను తొలగించాలని ప్రతిపాదించడంలో మేము కచ్చితమైన పురోగతి సాధిస్తున్నాం’అని కొలంబియా జిల్లాలోని అమెరికా జిల్లా కోర్టుకు సమర్పించిన నివేదికలో హోంల్యాండ్ భ్రదత విభాగం(డిహెచ్ఎస్) పేర్కొంది. కొత్త నిబంధనను మూడు నెలల్లో అధ్యక్ష భవనంలోని ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ బడ్జెట్(ఓఎంబీ)కు సమర్పిస్తామని,అంత వరకు ఈ కేసులో నిర్ణయాన్ని ప్రకటించవద్దని కోర్టును కోరింది. హెచ్1బీ వీసాపై అమెరికా వచ్చే విదేశీయుల భాగస్వాములకు అక్కడ ఉద్యోగ అవకాశం కల్పిస్తూ గతంలో ఒబామా ప్రభుత్వం హెచ్–4 వీసా నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధన కింద యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యుఎస్సిఐఎస్)హెచ్–1బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు(భాగస్వామి,21 ఏళ్లలోపు పిల్లలకు)హెచ్–4 వీసాలు మంజూరు చేస్తోంది.దీనివల్ల లక్షల మంది భారతీయ మహిళలు లబ్ది పొందుతున్నారు.ఒబామా హయాంలో ఇచ్చిన ఈ అవకాశం దుర్వినియోగమవుతోందని, ఈ నిబంధన సాకుతో కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని భావిస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఒబామా ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఒమాబా హయాంలో అమల్లోకి వచ్చిన ఈ విధానం వల్ల తమ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోందంటూ కొందరు అమెరికన్లు(ఉద్యోగులు) కోర్టులో కేసు వేశారు.ఆ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం గత ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. హెచ్4వీసాదారుల వర్క్ పర్మిట్లను రద్దు చేయనున్నట్టు ట్రంప్ ప్రభుత్వం బహిరంగంగాను, కోర్టులోనూ కూడా చెబుతూ వస్తోంది. హెచ్4 వీసా వర్క్ పర్మిట్ రద్దుకు త్వరలో నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు కోర్టుకు తెలిపింది. నిర్ణయం ఆలస్యం అవుతోందంటూ గత ఫిబ్రవరి 28, మే 22, ఆగస్టు 20లలో కోర్టుకు తెలిపింది. తరువాయి స్టేటస్ రిపోర్టును(స్థాయి నివేదిక) వచ్చే నవంబర్ 19న కోర్టుకు సమర్పించనుంది. సాధారణ ప్రక్రియే హెచ్4 వీసా వర్క్ పర్మిట్ల రద్దుపై నిర్ణయంలో జాప్యం జరగడం సాధారణమేనని అమెరికా అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు.‘డిహెచ్‌ఎస్‌కు చెందిన సీనియర్ నాయకులు ప్రతిపాదనను సమీక్షించడం, సవరణలు సూచించడం సాధారణంగా జరిగేదే.అవసరమైన సవరణలు పొందుపరిచిన తర్వాత తుది ఆమోదం కోనం యుఎస్సిఐఎస్ ఆ ప్రతిపాదనను డిహెచ్‌ఎస్‌కు పంపుతుంది. తర్వాత ఓఎంబీకి సమర్పించడం జరుగుతుంది’అని అటార్నీ తాజా అఫిడవిట్లో కోర్టుకు వివరించారు.అయితే, కోర్టు తీర్పు ఆలస్యం అవుతున్న కొద్దీ తమకు మరింత ఎక్కువ హాని జరుగుతుందని పిటిషనర్లు(సేవ్ జాబ్స్ యుఎస్ఏ) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా తీర్పు ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు. 1.26 లక్షల మందికి ఆనుమతి 2015, మే నుంచి ఒబామా విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి 2017 డిసెంబర్ 25 వరకు యుఎస్సిఐఎస్ 1,26,853 మందికి వర్క్ పర్మిట్లు మంజూరు చేసింది. వీటిలో 90,846 దరఖాస్తులు కొత్తగా అనుమతి కోరుతూ పెట్టుకున్నవి కాగా,35,219 రెన్యువల్ దరఖాస్తులు.వర్క్ పర్మిట్ కార్డులు పోవడంతో కొత్త కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులు 688.‘ యుఎస్సిఐఎస్ మంజూరు చేసిన దరఖాస్తుల్లో 93శాతం భారతదేశంలో పుట్టి ఇక్కడికి వచ్చిన వారివే.5శాతం చైనాలో పుట్టిన వారివి. మిగతా రెండు శాతం ఇతర దేశాల్లో పుట్టిన వారివి.’అని కాంగ్రెçసనల్ రీసెర్చ్ సర్వీస్ ఒక నివేదికలో తెలిపింది.యుఎస్సిఐఎస్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. -
భారత ఐటీ నిపుణులకు భారీ ఊరట
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం వీసా విధానాల్లో కీలక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అమెరికా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మేరీ కే ఎల్ కార్ల్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్1-బీ వీసా ప్రోగ్రాంలో పెద్దగా మార్పులేమీ లేవని న్యూఢిల్లీలో ప్రకటించారు. అంతేకాదు హెచ్-4 వీసాల జారీలోకూడా కొత్త మార్పులేమీ చేయడం లేదని పేర్కొనడం విశేషం. ఉద్యోగ వీసాలు, పని అనుమతులు ఇవ్వడం అమెరికా సార్వభౌమ నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు. భారత్, అమెరికాల మధ్య ఉన్నత విద్యకు సంబంధించిన సంబంధాల నేపథ్యంలో అమెరికా మిషన్ ‘స్టూడెంట్ వీసా డే’ కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించిన సందర్భంగా ఆమె వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చెన్నై, హైదరాబాద్, కోలకతా, ముంబైలోని అమెరికా రాయబార కార్యాలయాల్లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించారు. దాదాపు 4వేలమంది విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకున్నట్టు కార్ల్సన్ చెప్పారు. 2017లో 186,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యాసంస్థల్లో చేరారని తెలిపారు. దశాబ్దంతో పోలిస్తే రెండింతలు, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 12 శాతం పెరిగిందని మీడియా ప్రతినిధులతో చెప్పారు. మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 17 శాతం మందితో భారత్ రెండవ స్థానంలో ఉందని కార్ల్సన్ వెల్లడించారు. ఈ సందర్భంగా కార్ల్సన్ విలేకరులతో మాట్లాడుతూ.. హెచ్1-బీ వీసా ప్రోగ్రాంలో పెద్ద మార్పులేమీ లేవని, అలాగే హెచ్-4 వీసాలోనూ కొత్త విషయాలేమీ లేవని అన్నారు. హెచ్1-బీ వీసా దారుల జీవిత భాగస్వాములకు అమెరికాలో పనిచేసుకునేందుకు హెచ్-4 వీసా ద్వారా అనుమతి లభిస్తుంది. ప్రస్తుతం హెచ్-4 వీసాతో దాదాపు 70వేల మంది లబ్ది పొందుతున్నారు. వీరిలో ముఖ్యంగా భారతీయులే ఎక్కువగా ఉన్నారు. హెచ్-4 వీసా నిబంధనను ఎత్తేయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామని గత నెల భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ వెల్లడించారు. కాగా ట్రంప్ యంత్రాంగం అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన హెచ్-4 వీసా వర్క్ పర్మిట్‌ను ఎత్తేయాలని భావించారు. అమెరికా ఉద్యోగాలు, అమెరికన్లకే అనే నినాదంతో ట్రంప్ సర్కార్ వీసా జారీ ప్రక్రియలో పలు మార్పులకు యోచిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భారత ఐటీనిపుణులు భారీ ఆందోళనలో పడిపోయారు. అయితే కార్ల్సన్ తాజా వ్యాఖ్యలు వేలాదిమంది భారతీయుల్లో భారీ ఊరట కల్పించనునున్నాయి. -
హెచ్–4 పై అమెరికాను ఒప్పిస్తాం
న్యూఢిల్లీ: హెచ్–4 వీసాలు కలిగిన వారికి ఉద్యోగానుమతులు రద్దు చేయకుండా అమెరికా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని సుష్మ చెప్పారు. ప్రస్తుతం హెచ్–4 వీసాలపై దాదాపు 65 వేల మంది భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. హెచ్–4 వీసాలకు ఉద్యోగానుమతులను రద్దు చేసేందుకు అమెరికా కసరత్తు చేస్తోంది. భారత్‌లో జైళ్ల పరిస్థితిని పరిశీలిస్తామని ఓ బ్రిటన్ కోర్టు వ్యాఖ్యానించడంపై ప్రధాని మోదీ తన అసంతృప్తిని బ్రిటన్ ప్రధాని థెరెసాకు నేరుగానే తెలియజేశారని సుష్మ చెప్పారు. కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్‌లో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై లండన్‌లో ఓ కేసు విచారణ జరిగింది. ఆ సమయంలో మాల్యా లాయరు తన వాదన వినిపిస్తూ, భారత్‌లో కిక్కిరిసిన జైళ్లలో అపరిశుభ్రత, వేధింపులు ఉంటాయని కోర్టుకు తెలిపారు. దీంతో భారత్‌లోని జైళ్లను తాము పరిశీలిస్తామని అప్పట్లో కోర్టు వ్యాఖ్యానించింది. -
చివరి దశలో హెచ్-4 వీసా రద్దు
వాషింగ్టన్: భారతీయ ఐటి నిపుణుల గుండెల్లో గుబులు పుట్టించే వార్త. హెచ్-4 వీసాను రద్దు చేసే ప్రక్రియ చివరి దశల్లో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంకేతాలు అందించింది. అమెరికాలో హెచ్ -1బి వీసా మీద పనిచేస్తున్న వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకు ఇచ్చే స్పౌస్ వీసా హెచ్-4ను రద్దు చేయాలన్న నిర్ణయం తుది దశలో ఉందని ట్రంప్ పరిపాలన విభాగం అమెరికా కోర్టుకు తెలియజేసింది. ప్రతిపాదిత నియమం తుది దశంలో ఉందని డిపార్ట్మెంట్ అఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఫెడరల్ కోర్టుకు గురువారం నివేదించింది. ఈ నిర్ణయం తుదిరూపు దాల్చి అమలులోకి వస్తే అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. హెచ్1బి వీసా మీద అమెరికాలో పనిచేసే వృత్తినిపుణుల జీవిత భాగస్వాములు హెచ్-4 వీసా కింద అమెరికాలో నివసించడానికి అనుమతి లభిస్తుంది. అయితే.. అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో (2015)లో హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయటానికి అనుమతించిన ఈఏడీ (ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కి చరమగీతం పాడాలని ట్రంప్ సర్కార్ ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హెచ్-4 వీసాదారులకు ఈఏడీల జారీని రద్దు చేస్తామని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) 2017 సెప్టెంబర్‌లో ప్రకటించింది. అయితే 2018 ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ప్రకటన జారీ చేస్తామని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంలో భాగంగా హెచ్-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలు చేయటానికి ఇచ్చే అనుమతులను రద్దు చేయాలనీ ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్-1బీ, హెచ్-4 వీసాలను ఎక్కువగా పొందుతున్న భారతీయ ఐటీ నిపుణుల్లో ఇప్పటికే తీవ్ర ఆందోళన నెలకొన్న సంగతి విదితమే. దాదాపు 70వేల మంది హెచ్-4 వీసాదారుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం పొంచి ఉంది. -
హెచ్–4 వీసాల్లో 93% భారతీయులకే
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–4 (స్పౌస్) వీసాలు పొంది ఉద్యోగం చేస్తున్న వారిలో 93 శాతం మంది భారతీయులేనని అమెరికన్ సంస్థ సీఆర్ఎస్ తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో ఐదో వంతు కంటే ఎక్కువ (28,033) మంది కాలిఫోర్నియాలోనే పనిచేస్తున్నారని, టెక్సాస్, న్యూజెర్సీల్లో మరో 20 శాతం మంది పనిచేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములకు ఈ హెచ్–4 వీసాలు మంజూరు చేస్తారు. మొత్తంగా అమెరికా మంజూరు చేసిన హెచ్–4 వీసాల్లో 93 శాతం మహిళలకు.. ఏడు శాతం పురుషులకు ఇచ్చారు. అమెరికన్ చట్టసభ సభ్యులకు ఆసక్తి ఉన్న అంశాలపై కాంగ్రెస్ ఇండిపెండెంట్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) ఎప్పటికప్పుడు సర్వేలు చేసి నివేదికలు రూపొందిస్తుంది. దీనిలో భాగంగా ఆ సంస్థ హెచ్–4 వీసాలపై తాజాగా 9 పేజీల నివేదిక విడుదల చేసింది. హెచ్–4 కింద ఉపాధి కోసం జారీ చేసిన వీసాల్లో 93 శాతం భారతీయులకు, 5 శాతం చైనీయులకు, ఇతర దేశాలకు చెందిన వారికి రెండు శాతం వీసాలిచ్చినట్టు తెలిపింది. 2017, డిసెంబర్ 25 నాటికి 1,26,853 మంది హెచ్–4 వీసాదారుల దరఖాస్తులను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆమోదించింది. -
‘హెచ్–4 రద్దు’తో అమెరికాకే నష్టం
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు (వర్క్ పర్మిట్స్) రద్దు చేయాలన్న ప్రతిపాదనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటువంటి చర్యలు ఆయా ఉద్యోగుల కుటుంబాలకేగాక అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టదాయకం అవుతాయని ఫేస్బుక్ వంటి దిగ్గజ కంపెనీలతోపాటు కాంగ్రెస్ సభ్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికాలోని కంపెనీలకు వీలు కల్పించేవి హెచ్–1బీ వీసాలు కాగా, ఆ హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు (భర్త లేదా భార్య) హెచ్–4 వీసాలను మంజూరు చేస్తారు. హెచ్–4 వీసా కలిగిన వారు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా అనుమతులిచ్చారు. ప్రస్తుతం 65 వేల మందికి పైగా భారతీయులు హెచ్–4 వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే విదేశీయులు అమెరికా ప్రజల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారనీ, విదేశీయులకు ఉద్యోగ అనుమతులపై కఠిన నిబంధనలు తెస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2016లో ఎన్నికల ప్రచారం నాటి నుంచే చెప్తున్నారు. అమెరికాకే నష్టం ‘హెచ్–4 వీసాలకు ఉద్యోగ అనుమతులు రద్దు చేస్తే వేలాది మంది కొలువులు మాని ఇళ్లలో కూర్చోవాలి. దీని వల్ల నష్టం జరిగేది ఆయా ఉద్యోగుల కుటుం బాలకే కాదు, మన ఆర్థిక వ్యవస్థకు కూడా’ అని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్ అనే సంస్థ పేర్కొంది. ఈ సంస్థను ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక ప్రధాన ఐటీ కంపెనీలు కలసి స్థాపించాయి. ‘ఇప్పుడు హెచ్–4 వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వారిలో కనీసం 80 శాతం మంది మహిళలే. వారంతా వారివారి స్వదేశాల్లో ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు కూడా చేసి పెళ్లి అయ్యాక వారి జీవిత భాగస్వామితో కలసి ఉండేందుకు అమెరికా వచ్చారు. వారు ఇక్కడ పనిచేసి, వేతనాలు తీసుకొని మన ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు. మరికొంత మంది డబ్బు సంపాదించాక వ్యాపారాలు పెట్టి అమెరికా ప్రజలకు కూడా ఉద్యోగాలిస్తున్నారు. ఇప్పుడు హెచ్–4 వీసాలకు ఉద్యోగ అనుమతులు రద్దుచేస్తే కొంతమంది అమెరికన్ల ఉపాధికీ ప్రమాదమే’ అని ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్ పేర్కొంది. భారతీయ కంపెనీలకు భారీగా తగ్గిన ‘హెచ్–1బీ’ అమెరికాలోని భారతీయ కంపెనీలకు జారీ అయిన హెచ్–1బీ వీసాల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో భారీగా తగ్గింది. 2015తో పోలిస్తే 2017లో ఏడు ప్రధాన భారతీయ ఐటీ కంపెనీలకు కలిపి లభించిన హెచ్–1బీ వీసాల సంఖ్య ఏకంగా 43%తగ్గింది. 7 ప్రధాన భారతీయ కంపెనీలకు కలిపి 2017లో 8,468 హెచ్–1బీ వీసాలు లభించాయనీ, 2015లో ఈ సంఖ్య 14,792 అని ఓ అధ్యయన నివేదిక తెలిపింది. 2017లో అత్యధికంగా టీసీఎస్‌కు 2,312, ఇన్ఫోసిస్‌కు 1,218, విప్రోకు 1,210 వీసాలు లభించాయి. 2015తో పోలిస్తే ఈ కంపెనీలు కొత్తగా పొందిన వీసాల సంఖ్య సగానికిపైగా పడిపోయింది. -
భారత్ టెకీలపై మరో పిడుగు..!
అమెరికాలో పనిచేస్తున్న భారత టెకీలపై మరో పెద్ద పిడుగు పడనుంది. హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త) వర్క్ పర్మిట్ల తొలగింపుతో పాటు హెచ్-1బి వీసాల జారీ ప్రక్రియ క్రమబద్ధీకరణకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ దిశలో చర్యలు తీసుకోనున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా, తాజా పరిణామాలు మాత్రం వాటిని నిజం చేసే విధంగానే ఉన్నాయి. వీటి ప్రభావం వేలాది మంది భారతీయులపై తీవ్రంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2015లో బరాక్ ఒబామా హయాంలో హెచ్-1బి వీసాహోల్డర్ల జీవితభాగస్వాముల (భార్య లేదా భర్త)కు అక్కడ పనిచేసేందుకు చట్టం ద్వారా కల్పించిన ఈ అవకాశాన్ని ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం రద్దు చిట్టాలో చేర్చుతోంది. హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వాములు చట్టపరంగా పనిచేసేందుకు, వ్యాపారాలు చేసుకునేందుకు ఇప్పటివరకు వర్క్ పర్మిట్లు ఉపయోగపడుతూ వచ్చాయి. అయితే తాజాగా వీటి రద్దు ప్రణాళికలకు అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తుదిరూపునిస్తోంది. ఈ విషయాన్ని శాసనకర్తలకు (సెనెటర్లు) అమెరికా పౌరసత్వం, వలస సేవల (యూఎస్సీఐఎస్) డైరెక్టర్ ప్రాన్సిస్ సిస్నా వెల్లడించారు. వచ్చే ఆగస్టుకల్లా దీనిని అమల్లోకి తెచ్చే విషయంపై కార్యనిర్వాహక ఉత్తర్వు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) జారీ కావచ్చని తెలుస్తోంది. ‘ అమెరికాలో హెచ్-4 డిపెండెంట్ భాగస్వాములు ఉద్యోగం చేసేందుకు కల్పించే అధికారం రద్దుకు అవసరమైన మార్పులు తీసుకొచ్చే ఫ్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ పాత ఉత్తర్వుల స్థానంలో ప్రస్తుత ఇమిగ్రేషన్ సిస్టమ్‌లో అమెరికా ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కొత్త నిబంధనలు, మార్గదర్శకాలు ప్రతిపాదిస్తాం. దీనికి సంబంధించి ఇచ్చే నోటీస్, దానిపై స్పందించేందుకు ఇచ్చే నిర్ణీత కాలంలో తమ అభిప్రాయాలు తెలిపేందుకు ప్రజలకు అవకాశం ఉంటుంది ’ అని సిస్నా స్పష్టంచేశారు. గతంలో ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల లక్షకు పైగా హెచ్-4 వీసాహోల్డర్లు లబ్దిపొందారు. హెచ్ 1బి భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసేందుకు అనుమతినిస్తూ హెచ్-4 వీసాలు ఇచ్చారు. వీరిలో భారత అమెరికన్ల సంఖ్యే ఎక్కువ. అక్కడ శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డ్) కోసం దరఖాస్తు చేసుకున్నాక ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు పదేళ్లు, అంతకుపైగానే సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో హెచ్-1బి వీసా హోల్డర్ల భార్య లేదా భర్త ఉద్యోగం చేసేందుకు వీలుగా వర్క్ పర్మిట్ల జారీకి ఒబామా ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ఈ నిబంధననే రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. హెచ్-4 ఏమిటీ ? అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నవారి జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్-4 వీసా ద్వారా వర్క్ పర్మిట్ లభిస్తుంది. వీటి ద్వారా మనదేశానికి చెందిన వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం హెచ్-4 వీసాపై దాదాపు లక్ష మంది వరకు భారతీయులు ఆ దేశంలోనే ఉంటున్నారు. 2017లో మొత్తం 1,36,393 మందికి హెచ్-4 వీసాలివ్వగా వాటిలో భారతీయులు 1,17,522 మంది (86శాతం), చైనీయులు 4,770 మంది (3 శాతం), మెక్సికన్లు 2,066 మంది (2 శాతం) కి వర్క్‌పర్మిట్లకు అనుమతినిస్తూ పత్రాలు జారీ చేసినట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. గతేడాది మొదట్లో హెచ్-4 వీసాతో పనిచేసేందుకు అనుమతి పొందిన వారిలో 94 శాతం మంది మహిళలున్నారు. వారిలోనూ భారతీయులు 93 శాతం, చైనా నుంచి కేవలం నాలుగు శాతమే ఉన్నారు. హెచ్-1బి క్రమబద్ధీకరణ విదేశాలకు చెందిన ఉత్తమ మేథాశక్తి, నైపుణ్యాలను ఆకర్షించే లక్ష్యంతో హెచ్-1బి వీసా జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం మార్పులు తీసుకురానుంది. ఈ వీసాల కోసం మనదేశ టెకీలు అత్యధికంగా పోటీపడుతున్న నేపథ్యంలో వీటి జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. హెచ్-1బి వీసా ప్రోగ్రామ్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు వీలుగా వీసాల జారీ సంఖ్యపై నియంత్రణ, లాటరీ విధానంలో మార్పులకు తెరతీయనుంది. దీనితో పాటు అత్యున్నత నైపుణ్యం ఉన్న వారికే ప్రవేశం కల్పించేందుకు ప్రత్యేక వృత్తి అంటే ఏమిటన్న దానిపై గతంలో ఇచ్చిన నిర్వచనాలకు భిన్నంగా స్పష్టమైన వివరణనిస్తారు. అంటే సాంకేతికంగానూ, ఉన్నత డిగ్రీల పరంగానూ అత్యున్నతస్థాయిలో ఉన్న విదేశీయులకు అవకాశం కల్పిస్తారు. అమెరికన్ ఉద్యోగులు, వారికిచ్చే వేతనాలు పరిరక్షించడంలో భాగంగా ఉద్యోగం, యజమాని, ఉద్యోగి సంబంధాలపై స్పష్టతనిస్తారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నో వర్క్ పర్మిట్స్: ట్రంప్ షాకింగ్ నిర్ణయం
సాక్షి, వాషింగ్టన్: హెచ్1 బీ వీసాదారులకు ట్రంప్ సర్కార్ మరోసారి షాక్ ఇవ్వనుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వర్క్ పర్మిట్ వీసాదారులను నిరోధించేందుకు చర్యలు చేపట్టనున్నారు. హెచ్1-బీ వీసా హోల్డర్స్ జీవిత భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయకుండా నిరోధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఒక టాప్ ఫెడరల్ ఏజెన్సీ అధికారి చెప్పారు. ఈ షాకింగ్ నిర్ణయంతో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా నాటి నిబంధనలకు స్వస్తి పలకాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈ వేసవి తరువాత ఈ నిబంధనను రద్దు చేయాలని యోచిస్తోందని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సీఐఎస్) డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా సెనేటర్ చుక్ గ్రాస్లేకు అందించిన ఒక లేఖలో తెలిపారు. దీంతో ఇప్పటికే వీసా జారీలో కఠిన నిబంధనలతో భారత ఐటీ పరిశ్రమను ప్రమాదంలోకి నెట్టేసిన టంప్ తాజా చర్య అమల్లోకి వస్తే వేలాది మంది భారతీయులపై విధ్వంసకర ప్రభావాన్ని చూపనుందని నిపుణుల అంచనా. హెచ్-4 వీసాపై పనిచేస్తున్న 7వేల మంది భారతీయ ఐటీ నిపుణులను దెబ్బతీయనుంది. ప్రపంచం వ్యాప్తంగా 8 లక్షల మంది డ్రీమర్స్ వర్క్ పర్మిట్స్ రద్దు కానుందని అంచనా. -
హెచ్–4 వీసాల్ని కొనసాగించండి
వాషింగ్టన్: హెచ్1–బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసేందుకు వీలుకల్పించే హెచ్–4 వీసా నిబంధనను కొనసాగించాలని సిలికాన్ వ్యాలీకి చెందిన పలువురు డెమొక్రాట్ చట్టసభ్యులు డిమాండ్ చేశారు. 2015లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమల్లోకి తెచ్చిన ఈ నిబంధనతో భారతీయ–అమెరికన్లు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. హెచ్–4 వీసా నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత 1,04,000 మందికి అమెరికాలో పనిచేసేందుకు అనుమతి లభించింది. ట్రంప్ సర్కారు హెచ్–4 వీసాల్ని రద్దు చేసే ప్రయత్నాల్లో ఉందన్న వార్తల నేపథ్యంలో డెమొక్రాట్ ఎంపీలు స్పందిస్తూ.. మార్చి 5న అమెరికా హోం ల్యాండ్ విభాగానికి లేఖ రాశారు. -
ఆ వీసాలను ట్రంప్ సర్కారు రద్దు చేయనుందా?
హెచ్–4 వీసాల రద్దు దిశగా ట్రంప్ సర్కారు పావులు! వాషింగ్టన్: హెచ్–1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములకు ఇచ్చిన వర్క్ వీసాల్ని(స్పౌజ్ వీసా) ట్రంప్ సర్కారు రద్దు చేయనుందా? అమెరికా ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు వర్క్ వీసాలు జారీ చేయాలని 2015లో అమెరికా సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 2 లక్షల మంది ‘జీవిత భాగస్వామి వీసా’(హెచ్–4)లపై అమెరికాలో నివసిస్తున్నారు. వారిలో అధిక శాతం వివిధ ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. సర్కారు నిర్ణయాన్ని 2015లోనే కాలిఫోర్నియాకు చెందిన కొందరు ఐటీ ఉద్యోగులు కింది కోర్టులో దావా వేశారు. కేసును 2016లో కింది కోర్టు కొట్టివేసింది. తీర్పును పైకోర్టులో సవాలు చేశారు. ఇంతలో ట్రంప్ సర్కారు అధికారంలోకి రావడంతో ఈ కేసులో సమాధానం చెప్పేందుకు తమకు 60 రోజులు గడువు కావాలని కోర్టును కోరింది. ఆ గడువు సోమవారంతో ముగియడంతో... విచారణను మరో ఆరు నెలలు ఆపాలంటూ వాషింగ్టన్ డీసీ సర్క్యూట్ అప్పీలు కోర్టును ట్రంప్ సర్కారు కోరింది. 2015 నుంచిహెచ్–4 పేరిట జీవిత భాగస్వాములకు వర్క్ వీసాల జారీని ప్రారంభించారు. ప్రస్తుతం అమెరికాలో వీరి సంఖ్య 2 లక్షలుగా ఉంది. వీరిలో చాలా మందికి హెచ్ –1బీ వీసా వచ్చే అవకాశమున్నా... ‘జీవిత భాగస్వామి వీసా’ కోసం దానిని వదులుకున్నారు. దాదాపు 2 లక్షల మంది యువతులు జీవిత భాగస్వామి వీసాలపై అమెరికాలో నివసిస్తున్నారు. వారిలో అధికశాతం మంది అక్కడే స్థిరపడ్డారు. ఐతే విదేశీ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కారు హెచ్-4 వీసాలను రద్దు చేయడంపై దృష్టి సారించిందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.