వాషింగ్టన్: అమెరికాలో హెచ్–4 (స్పౌస్) వీసాలు పొంది ఉద్యోగం చేస్తున్న వారిలో 93 శాతం మంది భారతీయులేనని అమెరికన్ సంస్థ సీఆర్‌ఎస్ తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో ఐదో వంతు కంటే ఎక్కువ (28,033) మంది కాలిఫోర్నియాలోనే పనిచేస్తున్నారని, టెక్సాస్, న్యూజెర్సీల్లో మరో 20 శాతం మంది పనిచేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములకు ఈ హెచ్–4 వీసాలు మంజూరు చేస్తారు. మొత్తంగా అమెరికా మంజూరు చేసిన హెచ్–4 వీసాల్లో 93 శాతం మహిళలకు.. ఏడు శాతం పురుషులకు ఇచ్చారు.
అమెరికన్ చట్టసభ సభ్యులకు ఆసక్తి ఉన్న అంశాలపై కాంగ్రెస్ ఇండిపెండెంట్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్‌ఎస్) ఎప్పటికప్పుడు సర్వేలు చేసి నివేదికలు రూపొందిస్తుంది. దీనిలో భాగంగా ఆ సంస్థ హెచ్–4 వీసాలపై తాజాగా 9 పేజీల నివేదిక విడుదల చేసింది. హెచ్–4 కింద ఉపాధి కోసం జారీ చేసిన వీసాల్లో 93 శాతం భారతీయులకు, 5 శాతం చైనీయులకు, ఇతర దేశాలకు చెందిన వారికి రెండు శాతం వీసాలిచ్చినట్టు తెలిపింది. 2017, డిసెంబర్ 25 నాటికి 1,26,853 మంది హెచ్–4 వీసాదారుల దరఖాస్తులను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment