అమెరికాలో హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు (హెచ్–4 వీసాదారులు) వర్క్ పర్మిట్ రద్దుతో భారతీయుల ఆశలు నీరుగారిపోవడంతో పాటుగా అగ్రరాజ్యాన్ని బాగా దెబ్బ తీస్తుందని తాజా సర్వేలో వెల్లడైంది. సౌత్ ఏషియన్ అమెరికన్ పాలసీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎస్‌ఏఏపీఆర్‌ఐ) అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో హెచ్–4 వర్క్ పర్మిట్ రద్దు ప్రభావం అమెరికా ఐటీ ఇండస్ట్రీపై తీవ్రంగా ఉంటుందని తేలింది. అమెరికాలో హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా పని చేయాలంటే హెచ్4–ఈఏడీ (ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) వీసా ఉండాలి. ఈ వీసాలను రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలు తుది దశకు చేరుకుంటున్న సమయంలో ఎస్‌ఏఏపీఆర్‌ఐ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
దక్షిణాసియా దేశాలకే అత్యధిక లబ్ధి
1997– 2017 మధ్య కాలంలో హెచ్–4 ఈఏడీ వీసాల మంజూరు బాగా పెరిగింది. వాటితో దక్షిణాసియా దేశాలకు చెందిన మహిళలే ఎక్కువగా లబ్ధి పొందారు. 1997 నాటికి ఏటా 18, 979 మందికి ఈ వీసాలు మంజూరు చేస్తే, 2017 నాటికి వాటి సంఖ్య 1.18 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం హెచ్–4 వీసాదారుల్లో 93 శాతం మంది దక్షిణాసియా దేశాల వారే. ఇక భారత్‌కు చెందిన మహిళా ఇంజనీర్లు కూడా బాగా లబ్ధి పొందారు. 2015 నుంచి మంజూరు చేసిన వీసాల్లో 90 శాతానికి పైగా భారత్‌కు చెందిన మహిళలే దక్కించుకున్నారు.
ప్రమాదంలో భారత మహిళల ఉద్యోగాలు
2017లో ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక వలస విధానాలను కఠినతరం చేశారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారికే హెచ్–1బీ వీసాలు మంజూరు చేయడానికి ప్రాముఖ్యతనిచ్చారు. హెచ్–1బీ వీసా గడువు పొడిగింపుల్ని కూడా తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం హెచ్–4 ఉన్న వారిలో ఎక్కువ మంది అమెరికాలోనే మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ చేసిన వారే. దాదాపుగా 80 శాతం మంది వీసాదారులు అత్యంత ప్రతిభావంతులు. వీటిని రద్దు చేయడం వల్ల ఎంతో మంది నిపుణులైన భారతీయ మహిళలు ఉద్యోగాలు కోల్పోతారు.
సగం మందికిపైగా ఉద్యోగాల్లేవు
ట్రంప్ అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ విధానం కారణంతో హెచ్–4 వీసా కింద వర్క్ పర్మిట్ వచ్చినప్పటికీ 63 శాతం మంది వీసాదారులకు ఉద్యోగాలే దొరకడం లేదు. ట్రంప్ సర్కార్ అన్నంత పని చేసి ఈఏడీని రద్దు చేస్తే జీవిత భాగస్వాములు మరో పదేళ్ల పాటు ఇంటిపట్టునే ఉండాల్సి వస్తుంది. ఇది భారతీయ మహిళా నిపుణులకు ఆందోళన కలిగిస్తోంది. హెచ్–4 వీసా దారుల్లో 75 శాతం పైగా పిల్లలు ఉన్నవారే. వారిలో 85 శాతం మంది పిల్లలు అమెరికా పౌరులు కావడంతో ఏం చేయాలో తెలియని గందరగోళంలో భారత్‌కు చెందిన తల్లిదండ్రులు ఉన్నారు.
అమెరికాకు రావద్దని సలహా
ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న వలస విధానాలతో అక్కడ భారతీయులు విసిగిపోయారు. 80 శాతానికి పైగా హెచ్–4 వీసాదారులు అమెరికా రావద్దంటూ తమ సన్నిహితులకు సలహా ఇస్తున్నారు. ఇతర దేశాలకు వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నామని సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది వెల్లడించారు. అమెరికాకు చెందిన వారు కాకుండా ఇతర దేశాలకు చెందిన వారే 30 శాతం అధికంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారు. సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ కంపెనీలను స్థాపించిన వారిలో 25 శాతం మంది వలసదారులే. బరాక్ ఒబామా హయాంలో ఇచ్చిన ఈ వర్క్ పర్మిట్‌లను ఎత్తివేయడం వల్ల అమెరికాకే అత్యధికంగా నష్టం జరుగుతుందని ఎస్‌ఏఏపీఆర్‌ఐ సర్వే అంతిమంగా హెచ్చరించింది.
అమెరికా డ్రీమ్స్ కరిగిపోతాయా?
Published Mon, Jul 22 2019 5:04 AM | Last Updated on Mon, Jul 22 2019 5:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment