వాషింగ్టన్: అమెరికాలోని హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించే నిబంధనను తొలగించేలా ఆదేశాలివ్వవద్దని దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం వాషింగ్టన్‌లోని ఫెడరల్ కోర్టును కోరింది. వారు ఉద్యోగాలు పొందడం వల్ల అమెరికన్ల ఉద్యోగావకాశాలు అంతగా ప్రభావితం కావడం లేదని కోర్టుకు తెలిపింది. హెచ్4 వీసాదారుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు తీవ్రస్థాయిలో ముప్పు ఏర్పడుతుందన్న ‘సేవ్ జాబ్స్ యూఎస్‌ఏ’వారి వాదన సరికాదని వాషింగ్టన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టుకు ట్రంప్ ప్రభుత్వం మే 5న వివరించింది. దానికి సంబంధించి ‘సేవ్ జాబ్స్ యూఎస్‌ఏ’చూపిన ఆధారాలు సరికావని వాదించింది. ఈ నిర్ణయం వేలాది భారతీయులకు శుభవార్తగా మారింది.
హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామి, 21 ఏళ్లు పైబడిన పిల్లలకు అమెరికా ప్రభుత్వం హెచ్4 వీసా జారీ చేస్తుంది. హెచ్4 వీసాదారుల్లో కొన్ని కేటగిరీల వారు ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని 2015లో నాటి ఒబామా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా కల్పించింది. 2017 డిసెంబర్ నాటికి 1,26,853 హెచ్4 వీసాదారుల ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ దరఖాస్తులను అమెరికా పౌర, వలస సేవల(యూఎస్‌సీఐఎస్) విభాగం ఆమోదించింది.ఒబామా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమెరికన్ టెక్నాలజీ వర్కర్ల తరఫున ‘సేవ్ జాబ్స్ యూఎస్‌ఏ’సంస్థ కోర్టులో సవాలు చేసింది. హెచ్4 వీసాదారులు యూఎస్‌లో ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటును తొలగించే విషయమై ఆలోచిస్తున్నామని అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కానీ, దానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment