అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. తాజాగా హెచ్1బీ వీసా కలిగివున్న వారి జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త), 21 సంవత్సరాల లోపు పిల్లలు ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని నిషేధించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ లాండ్ ప్రతిపాదన రెండవ దశకు చేరుకుంది. హెచ్4 వీసాలపై నిషేధం విధించే ప్రక్రియలోభాగంగా మే 22న అమెరికా ప్రభుత్వం ఒక నోటీసును కూడా జారీ చేసింది.
ఇది చట్టం రూపంలో అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న దాదాపు లక్షకు పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ప్రధానంగా భారతీయులే ఎక్కువగా నష్టపోతారు. 2015 నుంచి హెచ్-4 వీసా కింద అమెరికాలో 1.2 లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో 90శాతం మంది భారతీయులే. ముఖ్యంగా భారత మహిళలే. ఏదేమైనా, ఈ ప్రతిపాదన పూర్తయ్యి, అమలులోకి రావడానికి కొంత సమయం పడుతుందని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే..ఫెడరల్ రిజిస్టర్లో పోస్ట్ చేస్తారు. వీటిపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు 30-60 రోజుల వరకు గడువు వుంటుంది. అనంతరం దీనిపై చట్టం తీసుకొస్తారు. అయితే ఇదంతా జరిగేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని ఇమ్మిగ్రేషన్.కామ్ మేనేజింగ్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా వ్యాఖ్యానించారు. దీని ద్వారా అమెరికాలో ఐటీ నిపుణుల కొరత ఏర్పడుతుందనీ, తద్వారా అమెరికా ఉద్యోగాలను తిరస‍్కరించే పరిస్థితి వస్తుందన్నారు.
కాగా హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వారి జీవిత భాగస్వాములు అమెరికాలోని కంపెనీల్లో పనిచేసేందుకు హెచ్-4 డిపెండెంట్ వీసాల కింద వీలు కల్పిస్తూ 2015లో ఒబామా ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ విధానాన్ని తొలగిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించారు. భారత సంతతికి చెందిన ప్రజాప్రతినిధులు, పలు సంఘాలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవువుతున్నప్పటికీ అమెరికా యువతకు ఉద్యోగాలు కల్పించేందుకే ఈ నిబంధనలు తీసుకొస్తున్నట్లు ట్రంప్ సర్కార్ చెబుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment