వాషింగ్టన్: అమెరికాలో హెచ్–4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు (వర్క్ పర్మిట్స్) రద్దు చేయాలన్న ప్రతిపాదనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటువంటి చర్యలు ఆయా ఉద్యోగుల కుటుంబాలకేగాక అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టదాయకం అవుతాయని ఫేస్‌బుక్ వంటి దిగ్గజ కంపెనీలతోపాటు కాంగ్రెస్ సభ్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికాలోని కంపెనీలకు వీలు కల్పించేవి హెచ్–1బీ వీసాలు కాగా, ఆ హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు (భర్త లేదా భార్య) హెచ్–4 వీసాలను మంజూరు చేస్తారు.
హెచ్–4 వీసా కలిగిన వారు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా అనుమతులిచ్చారు. ప్రస్తుతం 65 వేల మందికి పైగా భారతీయులు హెచ్–4 వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే విదేశీయులు అమెరికా ప్రజల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారనీ, విదేశీయులకు ఉద్యోగ అనుమతులపై కఠిన నిబంధనలు తెస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2016లో ఎన్నికల ప్రచారం నాటి నుంచే చెప్తున్నారు.
అమెరికాకే నష్టం
‘హెచ్–4 వీసాలకు ఉద్యోగ అనుమతులు రద్దు చేస్తే వేలాది మంది కొలువులు మాని ఇళ్లలో కూర్చోవాలి. దీని వల్ల నష్టం జరిగేది ఆయా ఉద్యోగుల కుటుం బాలకే కాదు, మన ఆర్థిక వ్యవస్థకు కూడా’ అని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్ అనే సంస్థ పేర్కొంది. ఈ సంస్థను ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక ప్రధాన ఐటీ కంపెనీలు కలసి స్థాపించాయి. ‘ఇప్పుడు హెచ్–4 వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వారిలో కనీసం 80 శాతం మంది మహిళలే.
వారంతా వారివారి స్వదేశాల్లో ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు కూడా చేసి పెళ్లి అయ్యాక వారి జీవిత భాగస్వామితో కలసి ఉండేందుకు అమెరికా వచ్చారు. వారు ఇక్కడ పనిచేసి, వేతనాలు తీసుకొని మన ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు. మరికొంత మంది డబ్బు సంపాదించాక వ్యాపారాలు పెట్టి అమెరికా ప్రజలకు కూడా ఉద్యోగాలిస్తున్నారు. ఇప్పుడు హెచ్–4 వీసాలకు ఉద్యోగ అనుమతులు రద్దుచేస్తే కొంతమంది అమెరికన్ల ఉపాధికీ ప్రమాదమే’ అని ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్ పేర్కొంది.
భారతీయ కంపెనీలకు భారీగా తగ్గిన ‘హెచ్–1బీ’
అమెరికాలోని భారతీయ కంపెనీలకు జారీ అయిన హెచ్–1బీ వీసాల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో భారీగా తగ్గింది. 2015తో పోలిస్తే 2017లో ఏడు ప్రధాన భారతీయ ఐటీ కంపెనీలకు కలిపి లభించిన హెచ్–1బీ వీసాల సంఖ్య ఏకంగా 43%తగ్గింది. 7 ప్రధాన భారతీయ కంపెనీలకు కలిపి 2017లో 8,468 హెచ్–1బీ వీసాలు లభించాయనీ, 2015లో ఈ సంఖ్య 14,792 అని ఓ అధ్యయన నివేదిక తెలిపింది. 2017లో అత్యధికంగా టీసీఎస్‌కు 2,312, ఇన్ఫోసిస్‌కు 1,218, విప్రోకు 1,210 వీసాలు లభించాయి. 2015తో పోలిస్తే ఈ కంపెనీలు కొత్తగా పొందిన వీసాల సంఖ్య సగానికిపైగా పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment