Referendum Collection
-
హెచ్4 వీసాలపై పిడుగు!
వాషింగ్టన్: హెచ్–4 వీసాదారులకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అనుమతులను రద్దుచేయాలన్న డీహెచ్ఎస్ (డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ) ప్రతిపాదనను అమలుచేసే దిశగా మరో అడుగు ముందుకు పడింది. హెచ్–1బీ వీసా కలిగిన వ్యక్తుల జీవిత భాగస్వాములకు, వారి 21 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఇచ్చేదే ఈ హెచ్–4 వీసా. హెచ్–4 వీసా కలిగిన వారు కూడా ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులిస్తూ 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ అనుమతులను రద్దు చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా, డీహెచ్ఎస్ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించాల్సిందిగా మే 22న అమెరికా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దయితే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లక్ష మందికి పైగా భారతీయులు, తమ కొలువులను కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ లక్ష మంది భారతీయుల్లో స్త్రీలే అత్యధికంగా ఉన్నారు. కనీసం సంవత్సరం తర్వాతే.. ఒక వేళ హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దయినా, అది అమలు కావడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుందని అమెరికాలో వలస చట్టాల న్యాయనిపుణుడు రాజీవ్ ఖన్నా చెప్పారు. ‘హెచ్–4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకునే అనుమతిని రద్దుచేసే ప్రక్రియ ప్రస్తుతం చివరి నుంచి రెండో దశలో ఉంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రతిపాదనకు మద్దతు లభిస్తే, ఫెడరల్ రిజిస్టర్లో దీనిని పోస్ట్ చేస్తారు. 30 లేదా 60 రోజుల్లోపు మళ్లీ ప్రజలు తమ అభిప్రాయాలు తెలపవచ్చు. అనంతరం నిబంధనకు తుదిరూపు వస్తుంది’ అని ఆయన వివరించారు. వలస విధానాల్లో పూర్తి సంస్కరణలు తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం తొలి నుంచీ మొగ్గుచూపుతుండటం తెలిసిందే. అందులో భాగంగానే, గతేడాది ఫిబ్రవరిలో తొలిసారిగా హెచ్–4 వీసాలకు ఉద్యోగానుమతులు రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం చేసింది. అనంతరం గతేడాది అక్టోబర్‌లో డీహెచ్ఎస్ ఈ ప్రతిపాదనకు అనుకూలంగా మాట్లాడింది. అయితే హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దు చేస్తే అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రతిభావంతులైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. -
3 లక్ష్యాలు.. 3 అవార్డులు!
‘వ్యక్తులకు బిరుదులు అలంకారం కాదు. వ్యక్తులే బిరుదులకు వన్నె తెస్తారు’ అనేది నానుడి. ఇటీవల ప్రకటించిన కొన్ని అవార్డుల ఎంపికలో పారదర్శకత లోపించడం, ప్రజాభిప్రాయ సేకరణ జరగకపోవడంతో విమర్శలు తలెత్తాయి. ఎన్నికల వేళ ఓట్లు రాబట్టుకోవడం కోసం వ్యక్తులు, సంస్థలకు అవార్డులు ఇవ్వడం సహజమే. 2019 ఏడాదికి భారతరత్న పొందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ గాయకుడు భూపేన్ హజారికాలు ఈ అవార్డుకు అర్హులే. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందే వారిని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికచేయడం పట్ల బీజేపీ ఉద్దేశం స్పష్టంగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌ను కొన్ని దశాబ్దాల పాటు పాలించిన సీపీఎం బలహీనపడటంతో అక్కడ ధీటైన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మధ్య విద్వేషం పెరిగింది. అక్కడ మమత బెనర్జీకి పోటాపోటీగా నిలవాలని చాన్నాళ్లుగా బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ‘బెంగాలీ పుత్రుడు’ ప్రణబ్ పేరును చూపి సెంటిమెంట్‌తో ఆ రాష్ట్రంలో కేడర్‌ను బలోపేతం చేసుకోవాలని బీజేపీ ఆశిస్తూ ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పౌరసత్వ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా అస్సాం అట్టుడుకుతున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి అస్సాం గణపరిషత్ ఇప్పటికే తప్పుకుంది. రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలను బుజ్జగించడానికి ఆ ప్రాంత గాయకుడు అయిన హజారికాకు భారతరత్న ప్రకటించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక నానాజీ దేశ్‌ముఖ్‌కు భారతరత్నను ఇవ్వడం ద్వారా బీజేపీ ఆచితూచి అడుగులేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే, గ్రామీణాభివృద్ధికి ఆయన చేసిన సేవల్ని ప్రతిపక్షాలు కూడా గుర్తించాయి. దీంతో బీజేపీ రెండు ఆశయాల్ని నెరవేర్చుకుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఒకటి ఆరెస్సెస్‌ను సంతృప్తిపరచడం, రెండోది మేధావుల వారసత్వాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలే కాదు తాము కూడా గౌరవించగలమని చాటి చెప్పడం. ఎన్నికల ఎత్తుగడే కానీ.. ‘మమతా బెనర్జీకి చెక్ పెట్టి బెంగాల్లో పాగా వేయాలి. పౌరసత్వ బిల్లు వల్ల దూరమయ్యేలా కనిపిస్తున్న ఈశాన్య ప్రాంత ప్రజల్ని మళ్లీ తమ వైపు తిప్పుకోవాలి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఒత్తిడి పెంచుతున్న ఆరెస్సెస్‌ను ఎలాగైనా శాంతపరచాలి’..ఈ లక్ష్యాలతోనే బీజేపీ అనూహ్యంగా భారతరత్నకు ముగ్గురు విశిష్ట వ్యక్తుల్ని ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నా విపక్షాలు తప్పు పట్టలేని పరిస్థితి. జీవిత కాలమంతా కాంగ్రెస్‌కే సేవచేసిన ప్రణబ్ 2సార్లు ప్రధాని పదవిని తృటిలో కోల్పోయారు. రాష్ట్రపతి అయ్యాక బీజేపీ ఆయనతో మంచి సంబంధాలే కొనసాగించింది. ఇటీవల ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హజారికాతో బీజేపీకి రాజకీయ సంబంధాలున్నాయి. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్‌పై పోటీచేసి ఓటమిపాలయ్యారు. పౌరసత్వ బిల్లుతో అస్సాం రాజకీయ పార్టీలతో పెరిగిన దూరాన్ని హజారికా రూపంలోనైనా తగ్గించుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నానాజీ దేశ్‌ముఖ్ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1977లో మొరార్జీ దేశాయ్ కేబినెట్లో మంత్రి పదవి ఇస్తామన్నా వద్దనుకుని సామాజిక సేవకు అంకితమయ్యారు. ఓవైపు, ఆయన సేవల్ని గౌరవిస్తూనే, మరోవైపు ఆరెస్సెస్ వ్యక్తికి భారతరత్న ఇచ్చుకోవడంలో బీజేపీ సఫలీకృతమైంది. – సాక్షి నేషనల్ డెస్క్ -
ఉసూరుమన్న ప్రజాభిప్రాయ సేకరణ
ఒంగోలు సబర్బన్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏ.పి.ఇ.ఆర్.సి)గురువారం ఒంగోలులో నిర్వహించిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణపై బంధ్ ఎఫెక్ట్ పడింది. స్థానిక దక్షిణ బైపాస్ రోడ్డులోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏ.పి.ఈ.ఆర్.సి చైర్మన్ జస్టిస్ జి.భవాని ప్రసాద్ అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని నిర్వహించారు. మండలి సభ్యులు పి.రామ్మోహనరావు, పి.రఘు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీతో పాటు వామపక్ష పార్టీలు బంధ్ నిర్వహించాయి. దీంతో ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు రాక వెలవెల బోయింంది. పట్టుమని పది మంది కూడా విద్యుత్ వినియోగదారులు హాజరు కాలేకపోయారు. సమావేశానికి ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఎంఎం.నాయక్, డైరెక్టర్ పి.పుల్లారెడ్డి విజయవాడ సీఈ రాజబాపయ్య, కర్నూల్ సీఈ పీరయ్య, ప్రకాశం ఎస్ఈ ఎన్వీఎస్.సుబ్బరాజు, నెల్లూరు ఎస్ఈ విజయకుమార్ రెడ్డి, కర్నూల్ ఎస్ఈ భార్గవ రాముడు, వినియోగదారుల పరిష్కార వేదిక చైర్పర్సన్ ఏ.జగదీష్ చంద్రరావు, సభ్యులు పాల్ సురేంద్ర కుమార్, ఒంగోలు డీఈ కట్టా వెంకటేశ్వరరావు, ఒంగోలు పట్టణ ఏడీఈ పి.వి.వి ప్రసాదుతో పాటు జిల్లాలోని విద్యుత్ డీఈలు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ చార్జీల్లో మార్పు లేదు 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల్లో మార్పు లేదు. 2017–18లో ఉన్న చార్జీలనే అమలు చేస్తున్నాం. రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక ఆవశ్యకతగా రూ. 21,429 కోట్లు నిర్ధారించారు. విద్యుత్ చార్జీలు సంతృప్తి కరంగానే ఉన్నాయి. దేశంలో కల్లా రాష్ట్రంలోనే విద్యుత్ చార్జీలు తక్కువగా ఉన్నాయి. వినియోగదారులపై ఆర్థిక భారాన్ని మోపేదిలేదు. ఆదాయాన్ని, వ్యయాన్ని సమన్వయం చేసుకోవటానికే ఇలాంటి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – జస్టిస్ జి.భవానీ ప్రసాదు, ఏ.పి.ఇ.ఆర్.సి చైర్మన్ రూ. 6,218 కోట్లు సబ్సిడీ రావాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ సంస్థలకు రూ. 6,218 కోట్లు సబ్సిడీల రూపంలో రావాల్సి ఉంది. ఈ మేరకు ఏ.పి.ఇ.ఆర్.సి చైర్మన్‌కు ప్రతిపాదనలు అందించాం. పాత విద్యుత్ చార్జీలే యథావిధిగా ఉంటాయి. విద్యుత్ అమ్మకాల ద్వారా ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్‌కు రూ. 14,816 కోట్లు వస్తాయి. అందులో భాగంగా హెచ్.డి సర్వీస్‌ల ద్వారా రూ. 457 కోట్లు, ఎల్టీ సర్వీస్‌ల ద్వారా రూ. 7,370 కోట్లు వస్తాయి. విద్యుత్ కొనుగోళ్ల కోసం రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.16,850 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఒక్క ట్రాన్స్‌కోకు రూ. 930 కోట్లు చెల్లిస్తున్నాం. విద్యుత్ ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారాలను వెంటనే వాళ్ల బ్యాంక్ ఖాతాల్లో జమచేయాలి. – ఎం.ఎం.నాయక్, ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ సీఎండీ -
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దూకుడు
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖ నగరం దూసుకుపోతోంది. కీలకమైన ప్రజాభిప్రాయ సేకరణలో నగరవాసులు స్పందన అదిరిపోతోంది. రాష్ట్రంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఏడు రెట్లు అధికంగా స్పందించి పాయింట్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గురువారం వరకూ 72 వేల మంది వైజాగ్ వాసులు ఫీడ్ బ్యాక్ ఇవ్వడం విశేషం విశాఖసిటీ: సుందర నగరి.. సిటీ ఆఫ్ డెస్టినీ.. ఇలా ఎన్నో పేర్లను సంపాదించుకున్న విశాఖ మహా నగరం.. స్వచ్ఛత విషయంలోనూ పరుగులెడుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో మొదటి రెండేళ్లూ టాప్ 5లో చోటు దక్కించుకున్న విశాఖ.. ఈసారీ అదే జోరు కొనసాగిస్తోంది. ప్రజలే కీలక పాత్ర పోషించాల్సిన తరుణంలో వైజాగ్ వాసులు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్ర భాగాన నిలబెట్టేందుకు విశేషంగా స్పందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేస్తోంది. నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్తశుద్ధి నిర్వహణ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు నగరాల్ని ఎంపిక చేస్తోంది. మొత్తం 500 పట్టణాలు, నగరాల మధ్య ఈ పోటీ సాగుతోంది. తొలి ఏడాదైన 2016లో ఐదో స్థానంలో నిలిచిన విశాఖపట్నం.. 2017లో మరింత స్ఫూర్తితో మూడో స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది మాత్రం మొదట్లో ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. కానీ.. లవ్ వైజాగ్ నినాదంతో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారానికి నగర వాసులు విశేషంగా స్పందిస్తున్నారు. ర్యాంకుల్లో కీలకమైన ప్రజల ఫీడ్ బ్యాక్ అంశంలో స్పందన అద్భుతంగా ఉంది. గురువారం నాటికి 72,100 మంది వైజాగ్ ప్రజలు ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొదటి స్థానంలో.. ప్రస్తుత లెక్కల ప్రకారం గ్రేటర్ విశాఖ ఫీడ్ బ్యాక్ విషయంలో అందనంత ఎత్తులో ఉంది. ఈ విభాగంలో విజయవాడ 12,106 మంది, తిరుపతిలో 17,425 మంది, రాజమండ్రిలో 15,549 మంది, కాకినాడలో 10,012 మంది మాత్రమే స్పందించారు. వీరికి ఏడు రెట్లు అధికంగా విశాఖ వాసులు తమ ఫీడ్ బ్యాక్ ను అందించడంపై గ్రేటర్ వాసుల్లో ఆనందం రెట్టింపైంది. సిటిజన్ ఫీడ్ బ్యాక్‌కు ఈ ర్యాంకుల్లో 35 శాతం మార్కులు(1400 మార్కులు) లభిస్తాయి. స్వచ్ఛతా యాప్ వినియోగం ద్వారా 4,000 మార్కులు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు విభాగాల్లోనూ జీవీఎంసీ దూసుకుపోతోంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విషయంలో జీవీఎంసీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. 15 లక్షల బల్క్ ఎస్ఎంఎస్లు ద్వారా నగర వాసుల్ని అప్రమత్తం చేస్తూ, ఫీడ్ బ్యాక్ కోరుతోంది. అదే విధంగా వీడియో సందేశాలనూ కొన్ని మొబైల్స్‌కు పంపిస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రాధాన్యతను వివరిస్తోంది. దీనికితోడు 1969 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కానీ, స్వచ్ఛ సర్వేక్షణ్ వెబ్సైట్, స్వచ్ఛతా యాప్ ద్వారా కానీ ఫీడ్ బ్యాక్ అందించవచ్చని సమాచారం చేరవేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు స్పందించి తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. రోజుకు 4వేల మంది స్పందన స్వచ్ఛ సర్వేక్షణ్ పీపుల్స్ ఫీడ్ బ్యాక్‌లో నగర వాసుల స్పందన చాలా బాగుంది. రోజుకు సుమారు 3 వేల నుంచి 4 వేల మంది వరకూ ఫీడ్ బ్యాక్ అందిస్తున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం. దీంతో పాటు విద్యార్థుల్లో అవగాహన కోసం కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ప్రచారం చేపడుతున్నాం. నిర్ణీత సమయంలో 2 లక్షల మంది వరకూ ఫీడ్ బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నాం. – హరినారాయణన్, జీవీఎంసీ కమిషనర్ -
తెగబడితే.. భారీ మూల్యమే!
భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ ప్రేలాపనలు కశ్మీర్ అసంపూర్ణ ఎజెండా అని అభివర్ణణ ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్‌ను రెచ్చగొట్టడమే పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన ఎజెండాగా మారినట్లు కనిపిస్తోంది. ఓ వైపు సరిహద్దుల వెంట నిరంతర కాల్పులతో.. మరోవైపు, కవ్వింపు వ్యాఖ్యలతో భారత్‌పై కాలు దువ్వుతోంది. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్, దేశ విభజనలో మిగిలిపోయిన అసంపూర్ణ ఎజెండాగా కశ్మీర్‌ను అభివర్ణించడంతో పాటు.. ‘శత్రు దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే.. వారు భరించలేని స్థాయిలో నష్టం కలిగిస్తామ’ంటూ, భారత్ పేరును ప్రస్తావించకుండా హెచ్చరించారు. సత్వర, స్వల్పకాలిక భవిష్యత్ యుద్ధరీతులను తక్షణమే ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందంటూ భారతీయ సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ గతవారం చేసిన వ్యాఖ్యలకు స్పందనగా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. 1965 భారత్ పాక్ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రావల్పిండిలో ఆదివారం ఓ ప్రత్యేక కార్యక్రమంలో రహీల్ పాల్గొన్నారు. ‘ఎలాంటి విదేశీ దాడులనైనా ఎదుర్కొనేందుకు మన సైన్యం సిద్ధంగా ఉంది. చిన్నదైనా, పెద్దదైనా.. శత్రుదేశం ఏ స్థాయి దుస్సాహసానికి పాల్పడినా.. భరించలేని మూల్యం చెల్లించేలా మన స్పందన ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. అంతర్గతమైనా, బహిర్గతమైనా.. సాంప్రదాయకమైనా, పాక్షిక సాంప్రదాయకమైనా.. కోల్ట్ స్టార్ట్(హఠాత్తుగా పాక్‌తో యుద్ధం ఆరంభమైతే తక్షణమే స్పందించేలా ఇండియన్ ఆర్మీ రూపొందించిన తాజా విధానం) అయినా, హాట్ స్టార్ట్ అయినా ఏ విధమైన దాడులనైనా ఎదుర్కొనేందుకు పాక్ సైన్యం సర్వసన్నద్ధం. వియ్ ఆర్ రెడీ’ అంటూ సవాలు విసిరారు. కశ్మీర్ ఒక అసంపూర్ణ ఎజెండా అని, కశ్మీర్లో ప్లెబిసైట్(ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్న ఐరాస తీర్మానం ప్రకారం నడచుకోవాలని, కశ్మీర్ సమస్యను తాము అప్రాధాన్య అంశంగా పరిగణించబోమని వ్యాఖ్యానించారు. పాక్‌లో ఉగ్రవాద వ్యవస్థలను తుదముట్టిస్తామని ప్రతినబూనారు. జనరల్ రహీల్ వ్యాఖ్యలను బీజేపీ, కాంగ్రెస్‌లు పిచ్చి ప్రేలాపనలుగా కొట్టేశాయి. ‘గతంలో భారత్‌తో జరిగిన యుద్ధాల్లో ఎదుర్కొన్న ఘోర పరాజయాలను మరిచిపోయి, పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఓవైపు, దేశంలో నెలకొన్న అంతర్గత సంక్షోభం, మరోవైపు భారత్‌లో ఉగ్రదాడుల వెనుక పాక్ హస్తం బహిర్గతమవడం.. వీటితో నిస్పృహకు లోనై ఈ విధమైన అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ విమర్శించారు. కొనసాగుతున్న పాక్ కాల్పులు జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంట పాక్ ఆర్మీ భారీ ఎత్తున కాల్పులకు పాల్పడుతోంది. ఎల్ఓసీకి దగ్గర్లో ఉన్న భారతీయ ఆర్మీ ఔట్ పోస్ట్‌లపై, సమీపంలోని జనావాసాలపై సోమవారం 120 ఎంఎం మోర్టార్ బాంబులతో విచక్షణారహితంగా దాడులకు తెగబడింది. పాక్ కాల్పుల్లో ఒక గ్రామీణుడు చనిపోగా, నలుగురు గాయాలపాలయ్యారు. భారత్ కూడా తీవ్రంగా ప్రతిస్పందించడంతో సోమవారం రాత్రి వరకు ఇరుపక్షాల మధ్య కాల్పులు కొనసాగాయి. పాక్ తొలి స్వదేశీ ద్రోన్ తొలిసారి దేశీయంగా తయారు చేసిన, సాయుధ ద్రోన్ బురాఖ్‌ను సోమవారం పాక్ రంగంలోకి దింపింది. తొలి దాడిలోనే ఆ ద్రోన్ అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లోని షావల్ ప్రాంతంలో ఒక ఉగ్రవాద స్థావరంలో దాక్కుని ఉన్న ముగ్గురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను హతమార్చింది. పైలట్ రహిత చిన్న విమానం ఆ స్థావరంపై బుర్ఖ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. బురాఖ్ రూపకల్పనతో క్షిపణులను ప్రయోగించగల ద్రోన్లను కలిగి ఉన్న అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, చైనాల సరసన పాకిస్తాన్ కూడా చేరింది.