‘వ్యక్తులకు బిరుదులు అలంకారం కాదు. వ్యక్తులే బిరుదులకు వన్నె తెస్తారు’ అనేది నానుడి. ఇటీవల ప్రకటించిన కొన్ని అవార్డుల ఎంపికలో పారదర్శకత లోపించడం, ప్రజాభిప్రాయ సేకరణ జరగకపోవడంతో విమర్శలు తలెత్తాయి. ఎన్నికల వేళ ఓట్లు రాబట్టుకోవడం కోసం వ్యక్తులు, సంస్థలకు అవార్డులు ఇవ్వడం సహజమే. 2019 ఏడాదికి భారతరత్న పొందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ గాయకుడు భూపేన్ హజారికాలు ఈ అవార్డుకు అర్హులే.
అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందే వారిని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికచేయడం పట్ల బీజేపీ ఉద్దేశం స్పష్టంగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌ను కొన్ని దశాబ్దాల పాటు పాలించిన సీపీఎం బలహీనపడటంతో అక్కడ ధీటైన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మధ్య విద్వేషం పెరిగింది. అక్కడ మమత బెనర్జీకి పోటాపోటీగా నిలవాలని చాన్నాళ్లుగా బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ‘బెంగాలీ పుత్రుడు’ ప్రణబ్ పేరును చూపి సెంటిమెంట్‌తో ఆ రాష్ట్రంలో కేడర్‌ను బలోపేతం చేసుకోవాలని బీజేపీ ఆశిస్తూ ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పౌరసత్వ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా అస్సాం అట్టుడుకుతున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి అస్సాం గణపరిషత్ ఇప్పటికే తప్పుకుంది. రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలను బుజ్జగించడానికి ఆ ప్రాంత గాయకుడు అయిన హజారికాకు భారతరత్న ప్రకటించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక నానాజీ దేశ్‌ముఖ్‌కు భారతరత్నను ఇవ్వడం ద్వారా బీజేపీ ఆచితూచి అడుగులేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే, గ్రామీణాభివృద్ధికి ఆయన చేసిన సేవల్ని ప్రతిపక్షాలు కూడా గుర్తించాయి. దీంతో బీజేపీ రెండు ఆశయాల్ని నెరవేర్చుకుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఒకటి ఆరెస్సెస్‌ను సంతృప్తిపరచడం, రెండోది మేధావుల వారసత్వాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలే కాదు తాము కూడా గౌరవించగలమని చాటి చెప్పడం.
ఎన్నికల ఎత్తుగడే కానీ..
‘మమతా బెనర్జీకి చెక్ పెట్టి బెంగాల్‌లో పాగా వేయాలి. పౌరసత్వ బిల్లు వల్ల దూరమయ్యేలా కనిపిస్తున్న ఈశాన్య ప్రాంత ప్రజల్ని మళ్లీ తమ వైపు తిప్పుకోవాలి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఒత్తిడి పెంచుతున్న ఆరెస్సెస్‌ను ఎలాగైనా శాంతపరచాలి’..ఈ లక్ష్యాలతోనే బీజేపీ అనూహ్యంగా భారతరత్నకు ముగ్గురు విశిష్ట వ్యక్తుల్ని ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నా విపక్షాలు తప్పు పట్టలేని పరిస్థితి. జీవిత కాలమంతా కాంగ్రెస్‌కే సేవచేసిన ప్రణబ్ 2సార్లు ప్రధాని పదవిని తృటిలో కోల్పోయారు. రాష్ట్రపతి అయ్యాక బీజేపీ ఆయనతో మంచి సంబంధాలే కొనసాగించింది. ఇటీవల ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హజారికాతో బీజేపీకి రాజకీయ సంబంధాలున్నాయి. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్‌పై పోటీచేసి ఓటమిపాలయ్యారు. పౌరసత్వ బిల్లుతో అస్సాం రాజకీయ పార్టీలతో పెరిగిన దూరాన్ని హజారికా రూపంలోనైనా తగ్గించుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నానాజీ దేశ్‌ముఖ్ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1977లో మొరార్జీ దేశాయ్ కేబినెట్‌లో మంత్రి పదవి ఇస్తామన్నా వద్దనుకుని సామాజిక సేవకు అంకితమయ్యారు. ఓవైపు, ఆయన సేవల్ని గౌరవిస్తూనే, మరోవైపు ఆరెస్సెస్ వ్యక్తికి భారతరత్న ఇచ్చుకోవడంలో బీజేపీ సఫలీకృతమైంది.
– సాక్షి నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment