తెగబడితే.. భారీ మూల్యమే!
భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ ప్రేలాపనలు
కశ్మీర్ అసంపూర్ణ ఎజెండా అని అభివర్ణణ
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్‌ను రెచ్చగొట్టడమే పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన ఎజెండాగా మారినట్లు కనిపిస్తోంది. ఓ వైపు సరిహద్దుల వెంట నిరంతర కాల్పులతో.. మరోవైపు, కవ్వింపు వ్యాఖ్యలతో భారత్‌పై కాలు దువ్వుతోంది. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్, దేశ విభజనలో మిగిలిపోయిన అసంపూర్ణ ఎజెండాగా కశ్మీర్‌ను అభివర్ణించడంతో పాటు.. ‘శత్రు దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే..
వారు భరించలేని స్థాయిలో నష్టం కలిగిస్తామ’ంటూ, భారత్ పేరును ప్రస్తావించకుండా హెచ్చరించారు. సత్వర, స్వల్పకాలిక భవిష్యత్ యుద్ధరీతులను తక్షణమే ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందంటూ భారతీయ సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ గతవారం చేసిన వ్యాఖ్యలకు స్పందనగా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. 1965 భారత్ పాక్ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రావల్పిండిలో ఆదివారం ఓ ప్రత్యేక కార్యక్రమంలో రహీల్ పాల్గొన్నారు.
‘ఎలాంటి విదేశీ దాడులనైనా ఎదుర్కొనేందుకు మన సైన్యం సిద్ధంగా ఉంది. చిన్నదైనా, పెద్దదైనా.. శత్రుదేశం ఏ స్థాయి దుస్సాహసానికి పాల్పడినా.. భరించలేని మూల్యం చెల్లించేలా మన స్పందన ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. అంతర్గతమైనా, బహిర్గతమైనా.. సాంప్రదాయకమైనా, పాక్షిక సాంప్రదాయకమైనా.. కోల్ట్ స్టార్ట్(హఠాత్తుగా పాక్‌తో యుద్ధం ఆరంభమైతే తక్షణమే స్పందించేలా ఇండియన్ ఆర్మీ రూపొందించిన తాజా విధానం) అయినా, హాట్ స్టార్ట్ అయినా ఏ విధమైన దాడులనైనా ఎదుర్కొనేందుకు పాక్ సైన్యం సర్వసన్నద్ధం. వియ్ ఆర్ రెడీ’ అంటూ సవాలు విసిరారు.
కశ్మీర్ ఒక అసంపూర్ణ ఎజెండా అని, కశ్మీర్లో ప్లెబిసైట్(ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్న ఐరాస తీర్మానం ప్రకారం నడచుకోవాలని, కశ్మీర్ సమస్యను తాము అప్రాధాన్య అంశంగా పరిగణించబోమని వ్యాఖ్యానించారు. పాక్‌లో ఉగ్రవాద వ్యవస్థలను తుదముట్టిస్తామని ప్రతినబూనారు. జనరల్ రహీల్ వ్యాఖ్యలను బీజేపీ, కాంగ్రెస్‌లు పిచ్చి ప్రేలాపనలుగా కొట్టేశాయి.
‘గతంలో భారత్‌తో జరిగిన యుద్ధాల్లో ఎదుర్కొన్న ఘోర పరాజయాలను మరిచిపోయి, పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఓవైపు, దేశంలో నెలకొన్న అంతర్గత సంక్షోభం, మరోవైపు భారత్‌లో ఉగ్రదాడుల వెనుక పాక్ హస్తం బహిర్గతమవడం.. వీటితో నిస్పృహకు లోనై ఈ విధమైన అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ విమర్శించారు.
కొనసాగుతున్న పాక్ కాల్పులు
జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంట పాక్ ఆర్మీ భారీ ఎత్తున కాల్పులకు పాల్పడుతోంది. ఎల్‌ఓసీకి దగ్గర్లో ఉన్న భారతీయ ఆర్మీ ఔట్ పోస్ట్‌లపై, సమీపంలోని జనావాసాలపై సోమవారం 120 ఎంఎం మోర్టార్ బాంబులతో విచక్షణారహితంగా దాడులకు తెగబడింది. పాక్ కాల్పుల్లో ఒక గ్రామీణుడు చనిపోగా, నలుగురు గాయాలపాలయ్యారు. భారత్ కూడా తీవ్రంగా ప్రతిస్పందించడంతో సోమవారం రాత్రి వరకు ఇరుపక్షాల మధ్య కాల్పులు కొనసాగాయి.
పాక్ తొలి స్వదేశీ ద్రోన్
తొలిసారి దేశీయంగా తయారు చేసిన, సాయుధ ద్రోన్ బురాఖ్‌ను సోమవారం పాక్ రంగంలోకి దింపింది. తొలి దాడిలోనే ఆ ద్రోన్ అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లోని షావల్ ప్రాంతంలో ఒక ఉగ్రవాద స్థావరంలో దాక్కుని ఉన్న ముగ్గురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను హతమార్చింది. పైలట్ రహిత చిన్న విమానం ఆ స్థావరంపై బుర్ఖ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. బురాఖ్ రూపకల్పనతో క్షిపణులను ప్రయోగించగల ద్రోన్‌లను కలిగి ఉన్న అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, చైనాల సరసన పాకిస్తాన్ కూడా చేరింది.