సర్జికల్ స్ట్రైక్స్.. భారత్ డ్రామానా?
- దాడులు జరగలేదంటూ పాక్ మీడియా కథనాలు
భారత్ సర్జికల్ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ విలేకరుల ఎల్‌వోసీ పర్యటన ఆదివారం ఆ దేశ పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కింది. పాక్ ఆర్మీ ఆధ్వర్యంలో ఎల్‌వోసీని సందర్శించిన విలేకరులు.. సర్జికల్ దాడులు జరిగినట్టు ఆధారాలు లేవన్న సైన్యం వ్యాఖ్యలనే సమర్థించారు.
ఈ పర్యటన నేపథ్యంలో ‘భారత్ నాటకం బట్టబయలైంది’ అంటూ పాక్‌లో అత్యధిక సర్క్యలేషన్ కలిగిన ఉర్దూ డైలీ ‘జంగ్’ శీర్షిక పెట్టింది. మరో రైట్‌వింగ్ పత్రిక ‘ఉమ్మాత్’.. ‘భారత్‌వి అబద్ధాలు.. అసత్యాలు బట్టబయలు’ అంటూ హెడ్‌లైన్ పెట్టింది. ‘భారత్ అపోహను బద్దలు చేసిన జర్నలిస్టులు’ అంటూ ఇంగ్లిష్ దినపత్రిక ‘ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కథనం రాసింది.
సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)లోని పలు ప్రాంతాలను జర్నలిస్టులకు చూపించారు. ఐఎస్‌ఐ ప్రజాసంబంధాల అధికారి వారికి ఈ ప్రాంతాల గురించి వివరించారు. ఈ సందర్భంగా స్థానికులు, మిలిటరీ అధికారులతో ఇంటర్వ్యూలు నిర్వహించిన జర్నలిస్టులు.. భారత్ చెప్పినట్టు సర్జికల్ స్ట్రైక్స్ (నిర్దేశిత దాడులు) జరగలేదన్న పాక్ సైన్యం వాదనపై సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు పాక్‌లో కీలకమైన ‘డాన్’ పత్రికకు వ్యాసం రాస్తూ.. మానవ హక్కుల నేత ఐఏ రహమాన్ కశ్మీర్ విషయంలో ప్రధాని నవాజ్ షరీఫ్ తీరును ప్రశంసించారు. కశ్మీర్ ప్రజల దుస్థితిని అంతర్జాతీయ సమాజం ముందుకు తెచ్చేందుకు షరీఫ్ తన శాయశక్తులా కృషి చేశారని, ఐరాస జనరల్ అసెంబ్లీలో ఈ అంశంపై ప్రస్తావించడమే కాకుండా.. ఈ సందర్భంగా న్యూయార్క్‌లో ప్రపంచాధినేతలను కలిసి కశ్మీర్ గురించి వివరించారని ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు.