
కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొన్నట్లు ఎట్టకేలకు దాయాది దేశం పాక్ అంగీకరించింది. ఈ మేరకు ఆ దేశ సైన్యాధిపతి బహిరంగ ప్రకటన చేశారు. దీంతో.. పాతికేళ్ల తర్వాత పాక్ సైన్యం తమ పాత్రను అంగీకరించినట్లయ్యింది.
శుక్రవారం రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యక్రమంలో పాక్ డిఫెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ప్రసంగిస్తూ.. ‘‘భారత్, పాకిస్థాన్ మధ్య 1948, 1965, 1971, కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణల్లో వేలాది మంది మన సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది’’ అని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Pakistan Acknowledges Role in 1999 Kargil War for the First Time#DY365 #Pakistan #KargilWar pic.twitter.com/pW6JcCNqQO
— DY365 (@DY365) September 7, 2024
1999 మే-జులై మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ముజాహిదీన్‌ల ముసుగులో నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన శత్రుసేనలు.. కార్గిల్‌లో ఖాళీగా ఉన్న భారత కీలక స్థావరాలను వశం చేసుకున్నాయి. కౌంటర్‌గా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ విజయ్’ పెట్టింది. ఈ ఎదురుదాడితో బెంబేలెత్తిపోయిన పాక్.. తోకముడుచుకుని పారిపోయింది. జులై 26న పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించగా.. అప్పటి నుంచి ఆ తేదీన కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించుకుంటున్నాం.

అయితే.. ఈ యుద్ధంతో తమ సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని పాక్ చెబుతూ స్న్నేతోంది. ముజాహిదీన్ ఫైటర్లు ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము పాట్రోలింగ్ మాత్రమే చేశామని చెప్పింది. గతంలో పాక్ ఆర్మీ మాజీ అధికారి ఒకరు కూడా కార్గిల్‌లో తమ దేశ బలగాల పాత్ర నిజమేనని చెప్పారు. ఆ ఆపరేషన్‌ను ‘ఫోర్ మ్యాన్ షో’ అని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) షాహిద్ అజీజ్ అభివర్ణించారు. అయితే పాక్ ఆయన వ్యాఖ్యలపై స్పందించలేదు. తాజా ప్రకటనతో.. పాక్ ఓటమి గుట్టు బట్టబయలైంది.
సంబంధిత వార్త: గెలవలేని యుద్ధం చేసిన పాక్