షరీఫ్ దిగిపోతే.. భారత్‌కు గండమే!
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: కూతురు మర్యమ్ షరీఫ్ డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో ఘోరమైన తప్పిదం చేసి దొరికిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు పదవి గండం ఏర్పడింది. ఒకవేళ షరీఫ్ గనుక ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తే భారత్ పరిస్ధితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్ధల వరుస దాడులతో భారత్ సతమతమవుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో షరీఫ్ ప్రభుత్వం పడిపోతే.. పాకిస్తాన్ ఆర్మీ దేశ పాలనను చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి పాకిస్తాన్‌లో ఏ ప్రభుత్వం గద్దెనెక్కినా తెర వెనుక రాజకీయం నడిపించేది పాకిస్తాన్ ఆర్మీయే అనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం భారత్-పాకిస్తాన్‌ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు బాగా సన్నగిల్లాయి. ఈ పరిస్ధితుల్లో పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే.. భారత్‌కు భద్రతా పరమైన ముప్పు మరింత పెరుగుతుంది.
కాగా, డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసును విచారిస్తున్న జిట్ బృందం ఆ దేశ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలితే.. షరీఫ్ పదవి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి లేదా షరీఫ్ కీలుబొమ్మగా మారే అవకాశం కూడా ఉంది. వచ్చే వారం జిట్ రిపోర్టుపై పాకిస్తాన్ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.