స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దూకుడు | Referendum collection for swach sarvekshan visakhapatnam | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దూకుడు

Published Fri, Feb 9 2018 10:47 AM | Last Updated on Fri, Feb 9 2018 10:47 AM

Referendum collection for swach sarvekshan visakhapatnam - Sakshi

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖ నగరం దూసుకుపోతోంది. కీలకమైన ప్రజాభిప్రాయ సేకరణలో నగరవాసులు స్పందన అదిరిపోతోంది. రాష్ట్రంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఏడు రెట్లు అధికంగా స్పందించి పాయింట్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గురువారం వరకూ 72 వేల మంది వైజాగ్‌ వాసులు ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వడం విశేషం

విశాఖసిటీ: సుందర నగరి.. సిటీ ఆఫ్‌ డెస్టినీ.. ఇలా ఎన్నో పేర్లను సంపాదించుకున్న విశాఖ మహా నగరం.. స్వచ్ఛత విషయంలోనూ పరుగులెడుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో మొదటి రెండేళ్లూ టాప్‌ 5లో చోటు దక్కించుకున్న విశాఖ.. ఈసారీ అదే జోరు కొనసాగిస్తోంది. ప్రజలే కీలక పాత్ర పోషించాల్సిన తరుణంలో వైజాగ్‌ వాసులు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్ర భాగాన నిలబెట్టేందుకు విశేషంగా స్పందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు ప్రదానం చేస్తోంది. నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్తశుద్ధి నిర్వహణ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు నగరాల్ని ఎంపిక చేస్తోంది.

మొత్తం 500 పట్టణాలు, నగరాల మధ్య ఈ పోటీ సాగుతోంది. తొలి ఏడాదైన 2016లో ఐదో స్థానంలో నిలిచిన విశాఖపట్నం..  2017లో మరింత స్ఫూర్తితో మూడో స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది మాత్రం మొదట్లో ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. కానీ.. లవ్‌ వైజాగ్‌ నినాదంతో జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారానికి నగర వాసులు విశేషంగా స్పందిస్తున్నారు. ర్యాంకుల్లో కీలకమైన ప్రజల ఫీడ్‌ బ్యాక్‌ అంశంలో స్పందన అద్భుతంగా ఉంది. గురువారం నాటికి 72,100 మంది వైజాగ్‌ ప్రజలు ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో మొదటి స్థానంలో..
ప్రస్తుత లెక్కల ప్రకారం గ్రేటర్‌ విశాఖ ఫీడ్‌ బ్యాక్‌ విషయంలో అందనంత ఎత్తులో ఉంది. ఈ విభాగంలో విజయవాడ 12,106 మంది, తిరుపతిలో 17,425 మంది, రాజమండ్రిలో 15,549 మంది, కాకినాడలో 10,012 మంది మాత్రమే స్పందించారు. వీరికి ఏడు రెట్లు అధికంగా విశాఖ వాసులు తమ ఫీడ్‌ బ్యాక్‌ ను అందించడంపై గ్రేటర్‌ వాసుల్లో ఆనందం రెట్టింపైంది. సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌కు ఈ ర్యాంకుల్లో 35 శాతం మార్కులు(1400 మార్కులు) లభిస్తాయి. స్వచ్ఛతా యాప్‌ వినియోగం ద్వారా 4,000 మార్కులు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు విభాగాల్లోనూ జీవీఎంసీ దూసుకుపోతోంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విషయంలో జీవీఎంసీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. 15 లక్షల బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు ద్వారా నగర వాసుల్ని అప్రమత్తం చేస్తూ, ఫీడ్‌ బ్యాక్‌ కోరుతోంది. అదే విధంగా వీడియో సందేశాలనూ కొన్ని మొబైల్స్‌కు పంపిస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్‌ ప్రాధాన్యతను వివరిస్తోంది. దీనికితోడు 1969 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా కానీ, స్వచ్ఛ సర్వేక్షణ్‌ వెబ్‌సైట్, స్వచ్ఛతా యాప్‌ ద్వారా కానీ ఫీడ్‌ బ్యాక్‌ అందించవచ్చని సమాచారం చేరవేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు స్పందించి తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు.

రోజుకు 4వేల మంది స్పందన
స్వచ్ఛ సర్వేక్షణ్‌ పీపుల్స్‌ ఫీడ్‌ బ్యాక్‌లో నగర వాసుల స్పందన చాలా బాగుంది. రోజుకు సుమారు 3 వేల నుంచి 4 వేల మంది వరకూ ఫీడ్‌ బ్యాక్‌ అందిస్తున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం. దీంతో పాటు విద్యార్థుల్లో అవగాహన కోసం కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ప్రచారం చేపడుతున్నాం. నిర్ణీత సమయంలో 2 లక్షల మంది వరకూ ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తారని ఆశిస్తున్నాం.
– హరినారాయణన్, జీవీఎంసీ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement