sarveksan swachha
-
చెత్త ఇలా.. సర్వేక్షణ్ ర్యాంకు ఎలా?
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుకు దేశంలోని నాలుగు వేల నగరాలతో పోటీ పడుతున్న విజయవాడ నగర పాలక సంస్థకు మరోసారి ర్యాంకు సాధించిపెట్టాలని అధికారులు తాపత్రయ పడుతున్నారు. అయితే క్షేత్రస్థాయి పరిశీలన తూతూమంత్రంగా మారింది. ఓడీఎఫ్ (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ–బహిరంగ మల, మూత్ర విసర్జన) రహిత నగరంగా తీర్చిదిద్దామని చెబుతున్న పాలకులు, అధికారులు వాటిని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన నమ్మా టాయిలెట్లు, స్మార్ట్ టాయిలెట్ల నిర్వాహణ సక్రమంగా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. పటమట(విజయవాడ తూర్పు): విజయవాడలో 2900 మంది కార్మికులు.. 380 డంబర్బిన్లు, 206 కంపోస్ట్ బిన్లు.. 58 భారీ వాహనాలు.. 10 చిన్నతరహా వాహనాలు.. ప్రతినిత్యం నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే 550 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించేందుకు.. కంపోస్ట్ చేసేందుకు 24 గంటలు పనిచేసే యంత్రాంగం.. స్వచ్చ భారత్ నినాదంతో చెత్త రహిత నగరంగా మార్చేందకు కార్పొరేషన్ ఉన్నతాధికారులు ప్రతినిత్యం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నప్పటికీ పారిశుద్ధ్యం నిర్వహణ విధానంలో వెలితి కన్పిస్తూనే ఉంటుంది. నగరంలోని అత్యధికంగా జనాభా నివసించే ప్రాంతాలైన వాగుసెంటర్, అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం, డాబాకొట్ల సెంటర్, గుణదల, సీతారాంపురం, పటమట దర్శిపేట, రామలింగేశ్వరనగర్ తదితర ప్రాంతాల్లో ఎక్కడవేసిన చెత్త అక్కడే ఉంటోంది. డంపర్బిన్లు చెత్తతో నిండి రోడ్లపైకి, డ్రెయినేజీల్లోకి చెత్త వెళుతోందని స్థానికులు వాపోతున్నారు. కాల్వల వెంబడి టన్నుల కొద్ది చెత్త దర్శనమిస్తోంది.చాలా వరకు పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉన్నతాధికారులు పరిశీలనకు వచ్చినప్పుడుమాత్రమే విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సర్వేక్షణ్ సర్వే జరిగేదిలా.. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు సాధించడం వల్ల నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు సమకూరతాయి. 2018 స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో విజయవాడ నగర పాలక సంస్థ 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల విభాగంలో మొదటి ర్యాంకు సాధించింది. ఈ ర్యాంకును వచ్చే సంవత్సరంలో కూడా సాధించాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరో 15 రోజుల్లో సర్వే ప్రారంభం అవుతోంది. ఈ సారి సర్వే కఠినతరం గతంలో మాదిరిలా కాకండా ఈ సారి కఠినమైన మార్పులతో సర్వే జరగనుంది. గతంలో ర్యాంకు సాధనకు 4000 మార్కులు కాగా ఈ సారి 5000 మార్కులు నిర్ణయించారు. అత్యధికంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఓడీఎఫ్‌పై దృష్టి సారించనుంది. సర్వేక్షణ్ పరిశీలకులు నగరంలో పర్యటించి డైరెక్ట్ అబ్జర్వేషన్ ద్వారా 1250 మార్కులు, సర్వీస్ లెవల్ ప్రాసెస్‌కు 1250, ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్, ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్ 5 శాతం అంటే 250 మార్కులు ఈ కేటగిరీకి కేటాయించనున్నారు. స్టార్ రేటింగ్, సర్టిఫికేషన్‌కు 20 శాతం మార్కులు కేటాయించాల్సి ఉంది. వీటితోపాటు నగరంలోని మౌలిక వసతులు, సుందరీకరణ, రహదార్ల నిర్మాణం, పన్నుల చెల్లింపులు తదితర అంశాలు కూడా అంతర్గతంగా పరిశీలిస్తారు. వీటికితోడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వినియోగం, పథకాల అమలు తదితర అంశాలను కూడా పరిశీలనకు తీసుకుంటారు. పూర్తికాని స్ట్రామ్‌వాటర్ డ్రెయిన్ పనులుకేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద స్ట్రామ్‌వాటర్ డ్రెయిన్ పనులకు రూ. 440 కోట్ల నిధులను 2016లో కేటాయించి విడుదల చేసింది. ఇప్పటివరకు నగరంలో 150 కిలోమీటర్లు కూడా పూర్తవలేదు.దీనికితోడు 440 కిలోమీటర్ల దూరా నికి వీఎంసీ 300 కిలోమీటర్ల దూరం కుదించి నిధులను దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రభావం ర్యాంకుపై పడనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పారిశుద్ధ్యం మెరుగుదలకు చర్యలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుదలకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి చోటా సెగ్రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాం. తడిచెత్త, పొడిచెత్త వేరుచేయని వారి నుంచి చెత్త సేకరణ చేయడంలేదు. పబ్లిక్ ప్రాంతాల్లో చెత్త వేస్తే వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తున్నాం. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. – అర్జునరావు, సీఎంఓహెచ్ -
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దూకుడు
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖ నగరం దూసుకుపోతోంది. కీలకమైన ప్రజాభిప్రాయ సేకరణలో నగరవాసులు స్పందన అదిరిపోతోంది. రాష్ట్రంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఏడు రెట్లు అధికంగా స్పందించి పాయింట్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గురువారం వరకూ 72 వేల మంది వైజాగ్ వాసులు ఫీడ్ బ్యాక్ ఇవ్వడం విశేషం విశాఖసిటీ: సుందర నగరి.. సిటీ ఆఫ్ డెస్టినీ.. ఇలా ఎన్నో పేర్లను సంపాదించుకున్న విశాఖ మహా నగరం.. స్వచ్ఛత విషయంలోనూ పరుగులెడుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో మొదటి రెండేళ్లూ టాప్ 5లో చోటు దక్కించుకున్న విశాఖ.. ఈసారీ అదే జోరు కొనసాగిస్తోంది. ప్రజలే కీలక పాత్ర పోషించాల్సిన తరుణంలో వైజాగ్ వాసులు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్ర భాగాన నిలబెట్టేందుకు విశేషంగా స్పందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేస్తోంది. నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్తశుద్ధి నిర్వహణ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు నగరాల్ని ఎంపిక చేస్తోంది. మొత్తం 500 పట్టణాలు, నగరాల మధ్య ఈ పోటీ సాగుతోంది. తొలి ఏడాదైన 2016లో ఐదో స్థానంలో నిలిచిన విశాఖపట్నం.. 2017లో మరింత స్ఫూర్తితో మూడో స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది మాత్రం మొదట్లో ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. కానీ.. లవ్ వైజాగ్ నినాదంతో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారానికి నగర వాసులు విశేషంగా స్పందిస్తున్నారు. ర్యాంకుల్లో కీలకమైన ప్రజల ఫీడ్ బ్యాక్ అంశంలో స్పందన అద్భుతంగా ఉంది. గురువారం నాటికి 72,100 మంది వైజాగ్ ప్రజలు ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొదటి స్థానంలో.. ప్రస్తుత లెక్కల ప్రకారం గ్రేటర్ విశాఖ ఫీడ్ బ్యాక్ విషయంలో అందనంత ఎత్తులో ఉంది. ఈ విభాగంలో విజయవాడ 12,106 మంది, తిరుపతిలో 17,425 మంది, రాజమండ్రిలో 15,549 మంది, కాకినాడలో 10,012 మంది మాత్రమే స్పందించారు. వీరికి ఏడు రెట్లు అధికంగా విశాఖ వాసులు తమ ఫీడ్ బ్యాక్ ను అందించడంపై గ్రేటర్ వాసుల్లో ఆనందం రెట్టింపైంది. సిటిజన్ ఫీడ్ బ్యాక్‌కు ఈ ర్యాంకుల్లో 35 శాతం మార్కులు(1400 మార్కులు) లభిస్తాయి. స్వచ్ఛతా యాప్ వినియోగం ద్వారా 4,000 మార్కులు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు విభాగాల్లోనూ జీవీఎంసీ దూసుకుపోతోంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విషయంలో జీవీఎంసీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. 15 లక్షల బల్క్ ఎస్ఎంఎస్లు ద్వారా నగర వాసుల్ని అప్రమత్తం చేస్తూ, ఫీడ్ బ్యాక్ కోరుతోంది. అదే విధంగా వీడియో సందేశాలనూ కొన్ని మొబైల్స్‌కు పంపిస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రాధాన్యతను వివరిస్తోంది. దీనికితోడు 1969 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కానీ, స్వచ్ఛ సర్వేక్షణ్ వెబ్సైట్, స్వచ్ఛతా యాప్ ద్వారా కానీ ఫీడ్ బ్యాక్ అందించవచ్చని సమాచారం చేరవేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు స్పందించి తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. రోజుకు 4వేల మంది స్పందన స్వచ్ఛ సర్వేక్షణ్ పీపుల్స్ ఫీడ్ బ్యాక్‌లో నగర వాసుల స్పందన చాలా బాగుంది. రోజుకు సుమారు 3 వేల నుంచి 4 వేల మంది వరకూ ఫీడ్ బ్యాక్ అందిస్తున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం. దీంతో పాటు విద్యార్థుల్లో అవగాహన కోసం కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ప్రచారం చేపడుతున్నాం. నిర్ణీత సమయంలో 2 లక్షల మంది వరకూ ఫీడ్ బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నాం. – హరినారాయణన్, జీవీఎంసీ కమిషనర్ -
ప్రజల మద్దతుతోనే స్వచ్ఛత
స్వచ్ఛ సర్వేక్షణ్’ కార్యక్రమంలో వెంకయ్య సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ కార్యక్రమాలు ప్రజల మద్దతుతోనే విజయవంతమవుతా యని, కేవలం పీఎం, సీఎం, మంత్రుల వల్ల పరివర్తన రాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. దీన్ని గుర్తించే ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్‌ను రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చార న్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్.. వావ్ హైదరాబాద్’ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... రాజకీయ నాయకులు పారదర్శకతతో ఉంటే ప్రజలు మద్దతిస్తారన్నారు. నిధుల కోసం ప్రభుత్వాలపై ఆధారపడకుండా స్థానిక సంస్థలే సమకూర్చుకోవాలని, అందుకు గానూ పన్నులు వేయడం అవసరమన్నారు. అయితే... సదుపాయాలు కల్పించాక జరిమా నాలు వేస్తే ఫర్వాలేదు కానీ, అవి లేకుండానే వేస్తే సమయం వచ్చినప్పుడు ప్రజలు రాజకీయ నాయకులకు ఫైన్లు వేస్తారన్నారు. తాత్కాలిక దృష్టితో కాకుండా 25 సంవ త్సరాలకు సరిపడా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు. స్వచ్ఛాగ్రహిలు కావాలి... ‘స్వచ్ఛ కార్యక్రమం కోసం నాడు స్వాతంత్య్ర సమయంలో సత్యాగ్రహం మాదిరిగా నేడు ప్రజలంతా స్వచ్ఛాగ్రహిలుగా మారాలి. చెత్త తొలగించే పని కూడా ప్రభుత్వానిదేనని భావించరాదు. స్వచ్ఛభారత్‌కు బాగా కృషి చేసే కార్పొరేటర్లకు 10శాతం నిధుల్ని ప్రోత్సా హకంగా ఇస్తాం. పనిచేయని వారికి 10 శాతం తగ్గిస్తాం’ అని వెంకయ్యనాయుడు చెప్పారు. మార్పు అంటే కేవలం మ్యాపుల్ని మార్చడం కాదని, ప్రక్షాళన చేయడమని, ప్రధాని మోదీ ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారన్నారు. తొలుత మనసులు పరిశుభ్రమైతే.. తర్వాత భాగ్య నగరం శుభ్రమవుతుందన్నారు. జనాకర్షక పథకాలతో సమస్యలు పరిష్కారం కావని, ప్రజల శక్తిసామర్థా్థ్యలను వినియోగించి ఉత్పాదక శక్తి పెంచాలని పిలుపునిచ్చారు. మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... చెత్త నుంచి విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించేలా సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. కార్పొరేట్ సంస్థల విరాళాలు.. స్వచ్ఛ కార్యక్రమాల అమలుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రామ్కీ సంస్థ రూ.2 కోట్లు, కామినేని కోటి రూపాయల విరాళాలు అందజేశాయి. ఈసారి టాప్–5లో... రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... స్వచ్ఛభారత్ స్ఫూర్తితో స్వచ్ఛహైదరాబాద్ అమలుకు ఏ నగరం చేయని విధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత ఏడాది స్వచ్ఛ ర్యాంకుల్లో 19 స్థానంలో ఉన్న హైదరాబాద్ ఈసారి తొలి ఐదు స్థానాల్లో నిలవగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.తెలంగాణలోని 73 యూఎల్బీల్లో నూ స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టామన్నారు. సమావేశంలో పలువురు మంత్రులు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.