swach bharat
-
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దూకుడు
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖ నగరం దూసుకుపోతోంది. కీలకమైన ప్రజాభిప్రాయ సేకరణలో నగరవాసులు స్పందన అదిరిపోతోంది. రాష్ట్రంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఏడు రెట్లు అధికంగా స్పందించి పాయింట్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గురువారం వరకూ 72 వేల మంది వైజాగ్ వాసులు ఫీడ్ బ్యాక్ ఇవ్వడం విశేషం విశాఖసిటీ: సుందర నగరి.. సిటీ ఆఫ్ డెస్టినీ.. ఇలా ఎన్నో పేర్లను సంపాదించుకున్న విశాఖ మహా నగరం.. స్వచ్ఛత విషయంలోనూ పరుగులెడుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో మొదటి రెండేళ్లూ టాప్ 5లో చోటు దక్కించుకున్న విశాఖ.. ఈసారీ అదే జోరు కొనసాగిస్తోంది. ప్రజలే కీలక పాత్ర పోషించాల్సిన తరుణంలో వైజాగ్ వాసులు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్ర భాగాన నిలబెట్టేందుకు విశేషంగా స్పందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేస్తోంది. నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్తశుద్ధి నిర్వహణ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు నగరాల్ని ఎంపిక చేస్తోంది. మొత్తం 500 పట్టణాలు, నగరాల మధ్య ఈ పోటీ సాగుతోంది. తొలి ఏడాదైన 2016లో ఐదో స్థానంలో నిలిచిన విశాఖపట్నం.. 2017లో మరింత స్ఫూర్తితో మూడో స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది మాత్రం మొదట్లో ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. కానీ.. లవ్ వైజాగ్ నినాదంతో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారానికి నగర వాసులు విశేషంగా స్పందిస్తున్నారు. ర్యాంకుల్లో కీలకమైన ప్రజల ఫీడ్ బ్యాక్ అంశంలో స్పందన అద్భుతంగా ఉంది. గురువారం నాటికి 72,100 మంది వైజాగ్ ప్రజలు ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొదటి స్థానంలో.. ప్రస్తుత లెక్కల ప్రకారం గ్రేటర్ విశాఖ ఫీడ్ బ్యాక్ విషయంలో అందనంత ఎత్తులో ఉంది. ఈ విభాగంలో విజయవాడ 12,106 మంది, తిరుపతిలో 17,425 మంది, రాజమండ్రిలో 15,549 మంది, కాకినాడలో 10,012 మంది మాత్రమే స్పందించారు. వీరికి ఏడు రెట్లు అధికంగా విశాఖ వాసులు తమ ఫీడ్ బ్యాక్ ను అందించడంపై గ్రేటర్ వాసుల్లో ఆనందం రెట్టింపైంది. సిటిజన్ ఫీడ్ బ్యాక్‌కు ఈ ర్యాంకుల్లో 35 శాతం మార్కులు(1400 మార్కులు) లభిస్తాయి. స్వచ్ఛతా యాప్ వినియోగం ద్వారా 4,000 మార్కులు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు విభాగాల్లోనూ జీవీఎంసీ దూసుకుపోతోంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విషయంలో జీవీఎంసీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. 15 లక్షల బల్క్ ఎస్ఎంఎస్లు ద్వారా నగర వాసుల్ని అప్రమత్తం చేస్తూ, ఫీడ్ బ్యాక్ కోరుతోంది. అదే విధంగా వీడియో సందేశాలనూ కొన్ని మొబైల్స్‌కు పంపిస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రాధాన్యతను వివరిస్తోంది. దీనికితోడు 1969 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కానీ, స్వచ్ఛ సర్వేక్షణ్ వెబ్సైట్, స్వచ్ఛతా యాప్ ద్వారా కానీ ఫీడ్ బ్యాక్ అందించవచ్చని సమాచారం చేరవేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు స్పందించి తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. రోజుకు 4వేల మంది స్పందన స్వచ్ఛ సర్వేక్షణ్ పీపుల్స్ ఫీడ్ బ్యాక్‌లో నగర వాసుల స్పందన చాలా బాగుంది. రోజుకు సుమారు 3 వేల నుంచి 4 వేల మంది వరకూ ఫీడ్ బ్యాక్ అందిస్తున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం. దీంతో పాటు విద్యార్థుల్లో అవగాహన కోసం కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ప్రచారం చేపడుతున్నాం. నిర్ణీత సమయంలో 2 లక్షల మంది వరకూ ఫీడ్ బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నాం. – హరినారాయణన్, జీవీఎంసీ కమిషనర్ -
'నీ భార్యను అమ్మి.. మరుగుదొడ్డి కట్టు..'
పాట్నా: స్వచ్ఛభారత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా మేజిస్ట్రేట్(డీఎమ్) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన డీఎమ్ కన్వాల్ తనూజ్ గ్రామస్ధులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సూచించారు. మరుగుదొడ్డి లేకపోతే కలిగే నష్టాలను గురించి వారికి వివరించారు. ఇంతలో ఓ గ్రామస్ధుడు లేచి మరుగుదొడ్డి నిర్మించడానికి డబ్బు లేదని చెప్పాడు. దానికి స్పందించిన కన్వాల్.. డబ్బు లేకపోతే నీ భార్యను అమ్ముకోవాలని, ఆ డబ్బుతో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అందరికీ చెబుతున్నా వినండి.. మీ భార్యల గౌరవం కంటే కాపాడుకోవాలంటే మరుగుదొడ్డి తప్పక నిర్మించుకోవాలి. మీ భార్యల విలువ రూ.12 వేలు కన్నా తక్కువని అనుకుంటే మరుగుదొడ్డిని నిర్మించుకోవద్దు లేదా మరుగుదొడ్డి నిర్మించుకోండి' అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ముందుగా డబ్బు మంజూరు చేస్తే వాటిని వేరే అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని అన్నారు. దీంతో ఒక్కసారిగా సమావేశ స్ధలంలో గంభీర వాతావరణం ఏర్పడింది. డీఎమ్ పద్దతి సరిగా లేదంటూ గ్రామస్ధులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. -
మన నగరం – మన బాధ్యత
శ్రీకాకుళం అర్బన్ : స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మన నగరం – మన బాధ్యత కార్యక్రమం ద్వారా నగరాన్ని బహిరంగ మల విసర్జన రహిత నగరంగా చేయాలని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ పీఏ శోభ కోరారు. శ్రీకాకుళంలోని నగరసంస్థకార్యాలయంలో జన్మభూమి కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మున్సిపల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులతో ఆమె శనివారం సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో గల 36 వార్డుల్లో బహిరంగ మల విసర్జనను నిర్మూలించి మన నగరాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. నగరంలో 29,681 ఇళ్లకు మరుగుదొడ్లు ఉన్నాయని, ఇంకా సుమారు 2070 ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 1878 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం దరఖాస్తులు రాగా వాటిలో 1332 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. మిగిలినవి ఈ నెలాఖరులోపున పూర్తి చేస్తామని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్థలం లేని వారికి కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మించి అప్పగిస్తామన్నారు. రాబోయే 20 రోజుల్లో నగరంలో పూర్తిగా బహిరంగ మల విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు... ఈ నెల 6వ తేదీ నుంచి 15 వరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఇందులో భాగంగా కార్పొరేషన్ పరిధిలో నాలుగు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కార్పొరేషన్ పరిధిలోని అన్ని వార్డులలో ర్యాలీలను కమిటీల పర్యవేక్షణలో నిర్వహిస్తామన్నారు. మీడియా సాయంతో బహిరంగ మల విసర్జనపై అనర్థాలను వివరిస్తామన్నారు. నాగావళి నదీతీరం వెంబడి మల విసర్జన నిరోధించేందుకు గస్తీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరంలో ఉన్న 13 సులభ్ కాంప్లెక్స్‌లను బాగు చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ నగరంలో బహిరంగ మల విసర్జన నిర్మూలనతో పాటు దోమల నిర్మూలనకు ఫాగింగ్ చేయడం, పందుల సంచారాన్ని నిరోధించడం చేయాలన్నారు. మురుగు కాల్వలపై పలకలు వేయించాలన్నారు. రూ.5కోట్లతో నాగావళి నదీతీరాన్ని పార్కులుగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు. చెత్తను ఎవరి ఇంటి వద్ద వారు చెత్త బుట్టల్లో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేసేలా చూడాలన్నారు. ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. -
స్వచ్ఛ భారత్ వైపు ఇందూరు పయనం!
♦ 2012 బేస్‌లైన్ సర్వే ఆధారంగా కార్యక్రమం ♦ ఇప్పటికే ఓడీఎఫ్ గ్రామాలుగా 65 గుర్తింపు ♦ రెండు రోజుల జాతీయ సదస్సుకు కలెక్టర్ ♦ ఛత్తీస్‌గఢ్‌లో కలెక్టర్ యోగితారాణా సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిజామాబాద్‌ను పూర్తి పారిశుధ్య జిల్లాగా రూపొందించేందుకు చేపట్టిన చర్యలు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, ఉద్యోగులు సమష్టిగా గ్రామ పంచాయతీలను యూనిట్లుగా తీసుకొని ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు వినియోగంపై కూడా కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న రూ.12 వేల యూనిట్ విలువతోనే నిర్ణీత కొలతలతో మరుగుదొడ్డి నిర్మాణంతోపాటు స్నానపు గదులను కూడా మంజూరు చేయటంపై గ్రామీణ కుటుంబాలు స్వచ్ఛభారత్ అమలులో భాగస్వాములవుతున్నాయి. మరుగుదొడ్ల వాడకంపై ఆసక్తిని పెంచి, పరిశుభ్రంగా ఉంచుకునేందుకు బకెట్లు, ఫినారుుల్, బ్రేష్లను అందించేందుకు ప్రతి లబ్ధిదారుల నుంచి రూ.900లు సేకరించి గ్రామ జ్యోతి కమిటీలలో జమ చేశారు. అలాగే గ్రామాలను, ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు ఇంటింటికీ మ్యాజిక్ సోక్పిట్లు, చేతిపంపుల వద్ద కమ్యూనిటీ సోక్ పిట్లు మంజూరు చేసి ఇళ్లలో వాడుకొని వదిలివేసిన నీటిని ఇంకిపోయే విధంగా చేయడంతోపాటు ఇళ్లలో ఉన్న చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డంపింగ్ యార్డులను చేపట్టడం జరిగింది. ఇళ్లలోని చెత్తను తొలగించేందుకు రిక్షాలను గ్రామ పంచాయతీలకు అందచేస్తున్నారు. -
‘స్వచ్ఛ దుబ్బాక’కు జై..
‘స్వచ్ఛత’ వైపు సర్పంచ్‌లు సంకల్ప సాధన మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన ఫలితాన్నిచ్చిన కృషి పలు గ్రామాల్లో వంద శాతం పూర్తి స్వచ్ఛ భారత్... స్వచ్ఛ తెలంగాణ ప్రేరణగా.. ‘స్వచ్ఛ దుబ్బాక’కు నడుం బిగించారు సర్పంచ్‌లు. సంపూర్ణ పారిశుద్ధ్యంలో భాగంగా గ్రామ గ్రామాన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా వీరంతా ప్రజలను చైతన్యవంతులను చేశారు. మరుగుదొడ్లను నిర్మించి వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ‘బహిరంగ మలమూత్ర విసర్జన వద్దు... మరుగుదొడ్డితోనే మేలు’ అనే ఉద్దేశాన్ని తెలియజేసి సఫలీకృతులయ్యారు సర్పంచ్‌లు. ఫలితంగా పలు గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్లను నిర్మించుకొని ఆదర్శంగా నిలిచి ‘స్వచ్ఛ దుబ్బాక’కు జై.. కొట్టారు. - దుబ్బాక నా కల ఫలించింది.. ప్రజలు నన్ను ఆదరించి గెలిపించినందుకు వారికి ఏదో చేయలన్నా తపన నాలో ఉండింది. అత్యధిక శాతం గ్రామస్తులు వ్యక్తిగత మరుగుదొడ్లు లేక బహిర్భూమికి వెళ్లేవారు. బహిరంగ మల మూత్ర విసర్జన చేయడం వల్ల అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. దీన్ని నివారించడానికి గ్రామంలో చాటింపు చేయించా. మరుగుదొడ్లు లేని వారు వెంటనే నిర్మించుకోవడానికి ప్రభుత్వం కూడా మంచి అవకాశం ఇచ్చింది. మరుగుదొడ్ల నిర్మించుకునే వారికి ప్రభుత్వం రూ.12 వేలు ఇస్తానని ప్రకటించింది. మరుగుదొడ్డి లేని వాళ్లంతా సహకరించారు. 450 కుటుంబాలకు పూర్తి స్థాయిలో మరుగుదొడ్లను నిర్మించి ఇచ్చాం. ఇప్పుడెవరూ బహిర్భూమికి వెళ్లడం లేదు. గ్రామమే ఆరోగ్యవంతంగా తయారైంది. - బొల్లి మాధవి చంద్రం, సర్పంచ్, గాజులపల్లి, దౌల్తాబాద్ ప్రజల సహకారంతోనే... గోవర్ధనగిరి గ్రామంలో అన్ని వర్గాల ప్రజల సహకారంతోనే వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే ఇలాంటి అద్భుతాలు సాధించవచ్చు. గ్రామ జనాభా 1,077, ఓటర్లు 650, కుటుంబాలు 225 ఉన్నాయి. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి కట్టించాం. చెంబులు పట్టుకుని బయటకు పోవడం లేదు. ప్రజలకు ఎంతో కొంత సేవ చేసిన తృప్తి మిగిలింది. - తోయేటి ఎల్లం, సర్పంచ్, గోవర్ధనగిరి, తొగుట కష్టానికి ఫలితం... దోమలు, ఈగల స్వైర విహారం. వాంతులు, విరేచనాలతో చిన్నాపెద్దలు ఆసుపత్రులకు వెళ్లడం నిత్యకృత్యమైంది. వెంటాడుతున్న సమస్యకు పరిష్కార మార్గాన్ని గ్రామస్తులతో కలిసి కనుగొన్నాం. బల్వంతాపూర్ గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న బీసీ కాలనీ, పద్మశాలీ వాడ, నర్లెంగడ్డ, చెప్యాల వాడ, ఒడ్డెర కాలనీల్లో రోజుకో గ్రామ సభలు పెట్టాం. అధికారులు, ప్రజల సహకారంతో గ్రామంలో 352 కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించి వంద శాతం పూర్తి చేశాం. ఇప్పుడు స్థానికంగా ఆరోగ్య సమస్యలు తగ్గాయి. - కొంగరి కనకవ్వ రాజయ్య, సర్పంచ్ బల్వంతాపూర్ వంద శాతానికి రెండు అడుగులే... చెంబులు, బుర్రలు పట్టుకుని చిన్నాపెద్ద బయటకు వెళ్తుండడంతో ఎంతో బాధపడ్డా. ఈ పరిస్థితిని మార్చలేమా? అని ఆలోచించా. ఆ వెంటనే కొత్త ఆ లోచనకు కార్యరూపం దాల్చా. ఈ విషయమై స్థాని కులతో చర్చించగా సానుకూలంగా స్పందించారు. అక్బర్‌పేటలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. పంచాయతీలో 185 కుటుంబాలున్నాయి. కేవలం రెండు మరుగుదొడ్లు నిర్మిస్తే లక్ష్యాన్ని చేరవచ్చు. ప్రజలు, అధికారుల సహకారంతో నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం. - తిప్పరబోయిన రాములు, సర్పంచ్, అక్బర్పేట, మిరుదొడ్డి సంతోషంగా ఉంది... ఎన్నో ఏళ్లుగా మరుగుదొడ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ వచ్చారు. మరుగుదొడ్లు లేకపోవడంతో ఇంటికి చుట్టాలు రావడం కూడా మానేశారు. ఒకానొక దశలో పెళ్లిళ్లకు పిల్లలను ఇవ్వకుండా తిరిగి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. గత పాలకులు కూడా పట్టించుకోలేదు. నన్ను గెలిపించినందుకు ఏదో ఒకటి చేయాలన్నా ఆలోచన నాకొచ్చింది. నా మాటకు గ్రామస్తులంతా కలిసి కట్టుగా నిలబడ్డారు. నాకెంతో సంతోషమనిపించింది - బెదరబోయిన నాగభూషణం, సర్పంచ్, ఇబ్రహీంపూర్, చేగుంట -
స్వచ్ఛ భారత్ విజయానికి అందరూ కృషి చేయాలి
-
మన దేశం చెత్తగా ఉండాలా?
మన దేశం శుభ్రంగా ఉండాలా.. చెత్తగా ఉండాలా మీరే చెప్పండి అని ప్రధాని నరేంద్రమోదీ మథుర వాసులను ప్రశ్నించారు. తన ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా మథురలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి విశేషంగా చెప్పారు. ఆయనేమన్నారంటే.. మన దేశం శుభ్రంగా ఉండాలా.. చెత్తగా ఉండాలా? ఇంటి చుట్టూ చెత్త ఉండటం వల్లే రోగాలు వస్తాయి. దాంతో పిల్లాడు చనిపోతే.. కుటుంబం మొత్తం బాధపడుతుంది ప్రతియేటా ఒక్కో కుటుంబానికి చెత్త వల్ల 7వేలరూపాయల వైద్యఖర్చులు అవుతున్నాయని ప్రపంచబ్యాంకు చెప్పింది అందుకే మనం చెత్తను మన పరిసరాల నుంచి దూరం చేయాలి. 125 కోట్ల మంది దేశవాసులు ఈ ప్రతిజ్ఞ చేయాలి ఈ పని కష్టమే గానీ, ప్రతి ఒక్కరూ చేయాలి. మన భారతమాత చెత్తమయం అయిపోకూడదు. మన గంగామాత, యమునా మాత చెత్తతో నిండిపోకూడదు ఈ పనులన్నీ చేయడానికే వచ్చాం.. చేసి తీరుతాం. అందుకు మీ సహకారం కావాలి, మీ ఆశీస్సులు కావాలి. మా ఆశీస్సులు ఉంటే అన్ని పనులూ చేస్తాం. పేదలకు నివసించడానికి పక్కా ఇళ్లు కావాలా.. వద్దా? వాటిలో కరెంటు, సెప్టిక్ లెట్రిన్లు ఉండాలా.. అక్కర్లేదా? రాబోయే ఏడేళ్లలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇలాంటి సౌకర్యాలతో కూడిన సొంత ఇల్లు ఉండాలని సంకల్పం పెట్టుకున్నాను. -
స్వచ్ఛభారత్‌కు ‘తమ్ముళ్ల’ తూట్లు
కావలి : స్వచ్ఛభారత్ నినాదంతో దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని అందుకు కేంద్రం సహాయం చేస్తుందని విస్తృత ప్రచారం నిర్వహించారు. అయితే ప్రధాని లక్ష్యానికి తెలుగు తమ్ముళ్లు తూట్లు పొడుస్తూ తమకు జైకొట్టిన వారు, తమ అనుచరులకే స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్లను మంజూరు చేయిస్తున్న పరిస్థితి కావలి మున్సిపాలిటీలో నెలకొంది. వాటి ఎంపిక బాధ్యత మెప్మా, మున్సిపల్ అధికారులపై ఉండగా వారు తెలుగుతమ్ముళ్లు అనుగ్రహించిన వారికే మరుగుదొడ్లను కేటాయించారు. పట్టణంలోని 25వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నెల్లూరు సీతారామమ్మ మరుగుదొడ్లు లేని 132 మంది దరఖాస్తులు జన్మభూమిలో ఇచ్చారు. వాటిని అన్లైన్లో కూడా పెట్టారు. ఆధార్ కార్డు నెంబర్లను కూడా తీసుకున్నారు. తీరా చూస్తే ఆ వార్డులో ఒక్క మరుగుదొడ్డి కూడా మంజూరు కాలేదు. 21, 38 వవార్డుల్లో కూడా ఇదే పరిస్థితి ఆయావార్డుల కౌన్సిలర్లు శ్రీలత, మాల్యాద్రిలు పేర్కొంటున్నారు. పట్టణంలో సుమారు మూడు వేలకు పైగా మరుగుదొడ్లు మంజూరైతే సగభాగం ఉన్న వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్ల వార్డులకు కేటాయింపులు చేయకుండా తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇంత అన్యాయమా 25వ వార్డులో 130 మంది వరకు మరుగుదొడ్లకు దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా మంజూరు చేయకపోవడం అన్యాయం. - నెల్లూరు సీతారామమ్మ,25వ వార్డు కౌన్సిలర్. ప్రధాని నినాదానికి తూట్లు పొడుస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ నినాదానికి తెలుగు తమ్ముళ్లు తూట్లు పొడుస్తున్నారు. వారి ఇష్టానుసారం మరుగుదొడ్లు మంజూరు చేయడం సరికాదు. - కేతిరెడ్డి శ్రీలత, 21వ వార్డు కౌన్సిలర్ -
గాంధీజయంతి సెలవును రద్దుచేసిన కేంద్రం
దేశాన్ని పరిశుభ్రంగా మార్చడానికి చేపట్టిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమం కోసం కేంద్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా ఆరోజు సెలవును రద్దుచేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వేటికీ ఆరోజు సెలవు ఉండబోదు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ అక్టోబర్ రెండోతేదీన ప్రారంభిస్తారు. స్వయంగా తాను సైతం ఆరోజు చీపురు పట్టుకుని శుభ్రపరుస్తానని మోదీ ఇంతకుముందే చెప్పారు. ఆ రోజు కార్యక్రమంలో పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కార్పొరేట్ కార్యాలయాలు కూడా పాల్గొంటాయి. ఇండియా గేట్ వద్ద మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బాపూజీ 150వ జయంతి సందర్భంగా ఈ భారీ కార్యక్రమం చేపట్టారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితర సెలబ్రిటీలు కూడా ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.