మన నగరం – మన బాధ్యత | plans for swach srikakulam | Sakshi
Sakshi News home page

మన నగరం – మన బాధ్యత

Published Sat, Sep 3 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

plans for swach srikakulam

శ్రీకాకుళం అర్బన్‌ : స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా మన నగరం – మన బాధ్యత కార్యక్రమం ద్వారా నగరాన్ని బహిరంగ మల విసర్జన రహిత నగరంగా చేయాలని శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ పీఏ శోభ కోరారు. శ్రీకాకుళంలోని నగరసంస్థకార్యాలయంలో జన్మభూమి కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మున్సిపల్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయులతో ఆమె శనివారం సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్‌ పరిధిలో గల 36 వార్డుల్లో బహిరంగ మల విసర్జనను నిర్మూలించి మన నగరాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు అందరూ కృషి చేయాలన్నారు.
 
నగరంలో 29,681 ఇళ్లకు మరుగుదొడ్లు ఉన్నాయని, ఇంకా సుమారు 2070 ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 1878 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం దరఖాస్తులు రాగా వాటిలో 1332 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. మిగిలినవి ఈ నెలాఖరులోపున పూర్తి చేస్తామని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్థలం లేని వారికి కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మించి అప్పగిస్తామన్నారు. రాబోయే 20 రోజుల్లో నగరంలో పూర్తిగా బహిరంగ మల విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు...  ఈ నెల 6వ తేదీ నుంచి 15 వరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఇందులో భాగంగా కార్పొరేషన్‌ పరిధిలో నాలుగు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
 ఈ నెల 6వ తేదీ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని వార్డులలో ర్యాలీలను కమిటీల పర్యవేక్షణలో నిర్వహిస్తామన్నారు. మీడియా సాయంతో బహిరంగ మల విసర్జనపై అనర్థాలను వివరిస్తామన్నారు. నాగావళి నదీతీరం వెంబడి మల విసర్జన నిరోధించేందుకు గస్తీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరంలో ఉన్న 13 సులభ్‌ కాంప్లెక్స్‌లను బాగు చేస్తామని పేర్కొన్నారు. 
 
ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ నగరంలో బహిరంగ మల విసర్జన నిర్మూలనతో పాటు దోమల నిర్మూలనకు ఫాగింగ్‌ చేయడం, పందుల సంచారాన్ని నిరోధించడం చేయాలన్నారు. మురుగు కాల్వలపై పలకలు వేయించాలన్నారు. రూ.5కోట్లతో నాగావళి నదీతీరాన్ని పార్కులుగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు. చెత్తను ఎవరి ఇంటి వద్ద వారు చెత్త బుట్టల్లో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేసేలా చూడాలన్నారు. ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement