
‘స్వచ్ఛ దుబ్బాక’కు జై..
‘స్వచ్ఛత’ వైపు సర్పంచ్‌లు
సంకల్ప సాధన మరుగుదొడ్ల
నిర్మాణంపై అవగాహన ఫలితాన్నిచ్చిన కృషి
పలు గ్రామాల్లో వంద శాతం పూర్తి
స్వచ్ఛ భారత్... స్వచ్ఛ తెలంగాణ ప్రేరణగా.. ‘స్వచ్ఛ దుబ్బాక’కు నడుం బిగించారు సర్పంచ్‌లు. సంపూర్ణ పారిశుద్ధ్యంలో భాగంగా గ్రామ గ్రామాన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా వీరంతా ప్రజలను చైతన్యవంతులను చేశారు. మరుగుదొడ్లను నిర్మించి వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ‘బహిరంగ మలమూత్ర విసర్జన వద్దు... మరుగుదొడ్డితోనే మేలు’ అనే ఉద్దేశాన్ని తెలియజేసి సఫలీకృతులయ్యారు సర్పంచ్‌లు. ఫలితంగా పలు గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్లను నిర్మించుకొని ఆదర్శంగా నిలిచి ‘స్వచ్ఛ దుబ్బాక’కు జై.. కొట్టారు.
- దుబ్బాక
నా కల ఫలించింది..
ప్రజలు నన్ను ఆదరించి గెలిపించినందుకు వారికి ఏదో చేయలన్నా తపన నాలో ఉండింది. అత్యధిక శాతం గ్రామస్తులు వ్యక్తిగత మరుగుదొడ్లు లేక బహిర్భూమికి వెళ్లేవారు. బహిరంగ మల మూత్ర విసర్జన చేయడం వల్ల అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. దీన్ని నివారించడానికి గ్రామంలో చాటింపు చేయించా. మరుగుదొడ్లు లేని వారు వెంటనే నిర్మించుకోవడానికి ప్రభుత్వం కూడా మంచి అవకాశం ఇచ్చింది. మరుగుదొడ్ల నిర్మించుకునే వారికి ప్రభుత్వం రూ.12 వేలు ఇస్తానని ప్రకటించింది. మరుగుదొడ్డి లేని వాళ్లంతా సహకరించారు. 450 కుటుంబాలకు పూర్తి స్థాయిలో మరుగుదొడ్లను నిర్మించి ఇచ్చాం. ఇప్పుడెవరూ బహిర్భూమికి వెళ్లడం లేదు. గ్రామమే ఆరోగ్యవంతంగా తయారైంది.
- బొల్లి మాధవి చంద్రం, సర్పంచ్, గాజులపల్లి, దౌల్తాబాద్
ప్రజల సహకారంతోనే...
గోవర్ధనగిరి గ్రామంలో అన్ని వర్గాల ప్రజల సహకారంతోనే వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే ఇలాంటి అద్భుతాలు సాధించవచ్చు. గ్రామ జనాభా 1,077, ఓటర్లు 650, కుటుంబాలు 225 ఉన్నాయి. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి కట్టించాం. చెంబులు పట్టుకుని బయటకు పోవడం లేదు. ప్రజలకు ఎంతో కొంత సేవ చేసిన తృప్తి మిగిలింది.
- తోయేటి ఎల్లం, సర్పంచ్, గోవర్ధనగిరి, తొగుట
కష్టానికి ఫలితం...
దోమలు, ఈగల స్వైర విహారం. వాంతులు, విరేచనాలతో చిన్నాపెద్దలు ఆసుపత్రులకు వెళ్లడం నిత్యకృత్యమైంది. వెంటాడుతున్న సమస్యకు పరిష్కార మార్గాన్ని గ్రామస్తులతో కలిసి కనుగొన్నాం. బల్వంతాపూర్ గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న బీసీ కాలనీ, పద్మశాలీ వాడ, నర్లెంగడ్డ, చెప్యాల వాడ, ఒడ్డెర కాలనీల్లో రోజుకో గ్రామ సభలు పెట్టాం. అధికారులు, ప్రజల సహకారంతో గ్రామంలో 352 కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించి వంద శాతం పూర్తి చేశాం. ఇప్పుడు స్థానికంగా ఆరోగ్య సమస్యలు తగ్గాయి. - కొంగరి కనకవ్వ రాజయ్య, సర్పంచ్ బల్వంతాపూర్
వంద శాతానికి రెండు అడుగులే...
చెంబులు, బుర్రలు పట్టుకుని చిన్నాపెద్ద బయటకు వెళ్తుండడంతో ఎంతో బాధపడ్డా. ఈ పరిస్థితిని మార్చలేమా? అని ఆలోచించా. ఆ వెంటనే కొత్త ఆ లోచనకు కార్యరూపం దాల్చా. ఈ విషయమై స్థాని కులతో చర్చించగా సానుకూలంగా స్పందించారు. అక్బర్‌పేటలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. పంచాయతీలో 185 కుటుంబాలున్నాయి. కేవలం రెండు మరుగుదొడ్లు నిర్మిస్తే లక్ష్యాన్ని చేరవచ్చు. ప్రజలు, అధికారుల సహకారంతో నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం.
- తిప్పరబోయిన రాములు, సర్పంచ్, అక్బర్‌పేట, మిరుదొడ్డి
సంతోషంగా ఉంది...
ఎన్నో ఏళ్లుగా మరుగుదొడ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ వచ్చారు. మరుగుదొడ్లు లేకపోవడంతో ఇంటికి చుట్టాలు రావడం కూడా మానేశారు. ఒకానొక దశలో పెళ్లిళ్లకు పిల్లలను ఇవ్వకుండా తిరిగి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. గత పాలకులు కూడా పట్టించుకోలేదు. నన్ను గెలిపించినందుకు ఏదో ఒకటి చేయాలన్నా ఆలోచన నాకొచ్చింది. నా మాటకు గ్రామస్తులంతా కలిసి కట్టుగా నిలబడ్డారు. నాకెంతో సంతోషమనిపించింది
- బెదరబోయిన నాగభూషణం, సర్పంచ్, ఇబ్రహీంపూర్, చేగుంట