రేవంత్‌కు పీసీసీ పగ్గాలు..! | BJP May Invite Revanth Reddy In Telangana | Sakshi
Sakshi News home page

రేవంత్‌కు పీసీసీ పగ్గాలు..!

Published Sat, Nov 14 2020 6:08 PM | Last Updated on Sun, Nov 15 2020 6:11 PM

BJP May Invite Revanth Reddy In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దుబ్బాకలో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో పీసీసీ మార్పు అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. సీనియర్ల నుంచి పార్టీ కార్యకర్తలు సైతం ఉత్తమ్‌ను తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. విజయశాంతి, మధుయాష్కీ, జంగారెడ్డి లాంటి నేతలు నిరసన స్వరం వినిపించారు. రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని మార్చకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఎంపీ రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్‌ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం డిమాండ్‌ చేస్తోంది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై దూకుడుగా వ్యవహరిస్తూ.. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న రేవంత్‌కు పార్టీ పగ్గాల అప్పగిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే హస్తం పార్టీలోని ఓ వర్గం మాత్రం రేవంత్‌ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 

రాష్ట్రంలో బలోపేతం దిశగా బీజేపీ అడుగులు
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో రాజధాని మరోసారి రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికలను అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. డిసెంబర్‌ మొదటి వారంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తులపై పార్టీలు ప్రధానంగా దృష్టిసారించాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌-ఎంఐఎం ఓ అవగహనకు రాగా.. కలిసి పోటీచేస్తాయా లేక విడివిడిగా చేస్తాయా అనేది ఇంకా తేలాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తొలివిడత చర్చలు జరిపారు. మరోవైపు వామపక్షాలతో కలిసి నడిచేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ఇక దుబ్బాక విజయంతో అనుహ్యంగా రేసులోకి వచ్చిన బీజేపీ.. ఏకంగా మేయర్‌ పీఠంపై కన్నేసింది. 70 స్థానాలే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. రాజధాని పరిధిలో జరితున్న ఎన్నికలు కావడంతో టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ సైతం అంతే దూకుడుగా వ్యవహరిస్తోంది. 

జీహెచ్‌ఎంసీపై కాషాయదళం కన్ను
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని కాషాయదళం ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీలోని సీనియర్లను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి డీకే అరుణ వంటి జనాధారణ నాయకులను చేర్చుకున్న బీజేపీ.. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు జరపాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతిని బీజేపీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం ఆమెతో చర్చలు జరిపారు. పార్టీలో చేరితే పెద్ద పదవినే కట్టబెడాతమని హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే బీజేపీ ఆఫర్‌పై ఆలోచనలలో పడిన రాములమ్మ.. కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల లోపు పార్టీలో చేరతారని, ఈ మేరకు ఢిల్లీ పర్యటనకు షెడ్యూల్‌ కూడా ఖరారైనట్లు బీజేపీ నేతల ద్వారా తెలుస్తోంది. ఆమెతో పాటు మరికొందరి నేతలపై కూడా ఢిల్లీ పెద్దలు గాలం వేసినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement