16వ ఆర్థిక సంఘానికి స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీల నేతల వినతి.. ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతో వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధుల భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణ, గ్రామాల్లో మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయం పెంచాలని స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం సోమవారం ప్రజాభవన్‌లో సమావేశమైంది.
ఈ సందర్భంగా కేంద్రం గ్రాంట్లు, రుణాలు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్రానికి అందిస్తున్న నిధులు, స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం అందిస్తున్న గ్రాంట్లు తదితర అంశాలను అరవింద్ పనగరియా వివరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, నాయకులు, వాణిజ్య సంస్థలతో చర్చించారు. ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లతో బృందం సమావేశమైంది.
ఈ భేటీలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్, పీర్జాదిగూడ మేయర్ అమర్‌సింగ్, బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కౌన్సిల్స్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజుతోపాటు 17 మున్సిపాలిటీల సభ్యులు పాల్గొన్నారు. ఈ భేటీకి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, సీడీఎంఏ గౌతం హాజరయ్యారు.
అనంతరం గ్రామ పంచాయతీల మాజీ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలతో కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సభ్యులు సంకెపల్లి సు«దీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్, మల్కుడ్ రమేశ్, కార్యదర్శి స్మితా సబర్వాల్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సాయం పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. అనంతరం వ్యాపార వాణిజ్య సంస్థలైన అలీఫ్, ఫిక్కీ, సీఐఐ ప్రతినిధులతో ఆర్థిక సంఘం భేటీ అయింది.
ఆర్థికంగా తోడ్పడాలన్న పార్టీల ప్రతినిధులు
ఆర్థిక సంఘం బృందంతో వివిధ పార్టీల ప్రతినిధులు సమావేశమయ్యారు. కాంగ్రెస్ నుంచి సిరిసిల్ల రాజయ్య, టి. రామ్మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ తరఫున టి. హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వివేకానంద, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాసం వెంకటేశ్వర్లు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ సహా ఇతర పార్టీల నుంచి కూడా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాలకు ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధుల గురించి సిరిసిల్ల రాజయ్య, టి. రామ్మోహన్‌రెడ్డి ఆర్థిక సంఘం బృందానికి వివరించారు.
కేంద్రం గ్రాంట్ల రూపంలో విరివిగా సాయం అందించాలని కోరారు. మరోవైపు హరీశ్‌రావు ఈ భేటీలో స్పందిస్తూ కేంద్రానికి వచ్చే ఆదాయంలో 20 శాతాన్ని సర్‌చార్జీలు, సెస్సుల రూపంలో సమకూర్చుకుంటున్నా ఆ డబ్బును వాటా ప్రకారం రాష్ట్రాలకు పంచట్లేదని పేర్కొన్నారు. పాతబస్తీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని అక్బరుద్దీన్ కోరారు.
పన్నుల వాటా పెంచాలని కోరాం: హరీశ్‌రావు
రాష్ట్రాలకు పన్నుల వాటా 41 శాతానికి బదులు 31 శాతమే వస్తోందని.. దీన్ని సవరించి 50 శాతం పన్నుల వాటాను రాష్ట్రాలకు ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని కోరినట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ప్రజాభవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్నేతర ఆదాయంలోనూ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని.. స్థానిక సంస్థల గ్రాంట్‌ను 50 శాతానికి పెంచాలని కోరామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు రూ. 40 వేల కోట్లు, పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా కోసం కూడా విజ్ఞప్తి చేశామన్నారు.
పన్ను ఎక్కువగా చెల్లిస్తున్న రాష్ట్రాలకు మద్దతివ్వండి: ఈటల
ఉమ్మడి ఏపీలో తెలంగాణకు 2.9 శాతం పన్నుల వాటా వస్తే.. 15వ ఆర్థిక సంఘం నాటికి 2.43 వాటా వచ్చిందని.. ఇప్పుడది 2.1 శాతంగా మారిందని 16వ ఆర్థిక సంఘానికి తెలియజేసినట్లు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజాభవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్ను ఎక్కువ చెల్లిస్తున్న రాష్ట్రాలకు మద్దతివ్వాలని కోరినట్లు చెప్పారు. కాగా, పురపాలక పనుల్లో జీఎస్టీని మినహాయించాలని కోరినట్లు రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్స్ చైర్మన్, చౌటుప్పల్ చైర్‌పర్సన్ వెన్‌రెడ్డి రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment