Drug Manufacturing Companies
-
మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఈ కంపెనీలకు కొత్త రూల్స్!
ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ సంవత్సరం కొత్త తయారీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, కంపెనీల ఉత్పత్తులను పరీక్షించి అవన్నీ సంతృప్తికరమైన ఫలితాలను పొందిన తరువాత మాత్రమే ప్రొడక్షన్, మార్కెట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫార్మా కంపెనీల మెటీరియల్స్, మెషీన్లు, ప్రాసెస్ వంటివన్నీ కూడా తప్పకుండా కొత్త ప్రమాణాలను అనుకూలంగానే ఉండాలని భారత ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల నాణ్యతకు తయారీదారు బాధ్యత వహించాలని పేర్కొంది. 50 బిలియన్ల పరిశ్రమ ప్రతిష్టతను కాపాడటానికి కర్మాగారాల పరిశీలనను మోదీ ప్రభుత్వం వేగవంతం చేసింది. కంపెనీల ఉత్పత్తులు నాణ్యమైనవిగా ఉన్నప్పుడు రోగులు ప్రమాదంలో పడే అవకాశం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థల ఉత్పత్తులను నిశితంగా పరీక్షించి, సంతృప్తికరమైన ఫలితాలను పొందినప్పుడే మార్కెట్ చేసుకోవాలని ఆదేశించారు. 2022 డిసెంబర్ నుంచి సుమారు 162 ఫార్మా కంపెనీలలో ఇన్కమింగ్ ముడి పదార్థాల టెస్టింగ్ లేకపోవడాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన అంతర్జాతీయ ఔషధాల తయారీ ప్రమాణాలను కలిగి ఉన్న కంపెనీలు భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి: 17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ పెద్ద ఔషధ తయారీదారులు ఆరు నెలల్లోగా, చిన్న పరిశ్రమలు 12 నెలల్లోగా కొత్త ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ గడువు పెంచాలని, ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న కంపెనీలు ఈ కొత్త నిబంధనలను అనుసరించాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఖర్చు తీవ్రత ఎక్కువైతే దాదాపు సగం కంపెనీలు క్లోజ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. -
ఔషధ రంగ ప్రక్షాళనే మందు!
ఒంట్లో నలతగా ఉండటం మొదలుకొని ఎలాంటి అనారోగ్య సమస్యలొచ్చినా వైద్యుణ్ణి సంప్రదించటం, తగిన మందు వాడి ఉపశమనం పొందటం సర్వసాధారణం. కానీ ‘కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందాన’ ఔషధాలుంటే జనం ప్రాణాలు గాల్లో దీపంగా మిగిలిపోయినట్టే. ఔషధ సంస్థలన్నిటినీ అనలేంగానీ కొన్ని సంస్థలు అందరి కళ్లూ కప్పి నాసిరకం ఔషధాల ఎగుమతులతో లాభాలు గడించేందుకు తహతహలాడుతున్న తీరువల్ల మన దేశం పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటున్నాయి. ఈ విషయంలో పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం సంకల్పించటం సంతోషించదగ్గ విషయం. ఇకపై ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో మంచి విధానాలు (జీఎంపీ) పాటిస్తున్నట్టు ధ్రువపడితేనే ఆ ఉత్పత్తులను విడుదల చేయటానికి అంగీకరించాలనీ, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయాలనీ కేంద్రం నిర్ణయించింది. ఫార్మా ఉత్పత్తుల్లో మన దేశం విశ్వగురు అయిందని రెండు నెలలక్రితం కేంద్ర ఇంధన శాఖ సహాయమంత్రి భగవత్ కూబా ఘనంగా ప్రకటించారు. కానీ ఇక్కడినుంచి ఎగుమతవుతున్న ఔషధాల వాడకంవల్ల పదులకొద్దీమంది మృత్యువాత పడిన ఉదంతాలు ఆ ఘనతను కాస్తా హరిస్తు న్నాయి. నిరుడు ఆఫ్రికా ఖండ దేశం గాంబియాలో దగ్గుమందు సేవించి 70 మంది పసిపిల్లలు మరణించగా, ఉజ్బెకిస్తాన్‌లో 19 మంది పిల్లలు చనిపోయారు. భారత్ నుంచి వచ్చిన కొన్ని ఔషధాల ప్రమాణాలు సక్రమంగా లేవని అమెరికా కూడా ప్రకటించింది. ఔషధాల్లో మోతాదుకు మించి రసాయనాలున్నాయని కొన్నిసార్లు, నిర్దేశిత ప్రమాణాల్లో లేవని కొన్నిసార్లు ఫిర్యాదు లొస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పంపిన ఔషధాలు పంపినట్టు వెనక్కొస్తున్నాయి. నిజానికి గాంబియాకు ఎగుమతయిన దగ్గు మందు మన దేశంలో విక్రయానికి పనికిరాదని నిషేధించారు! అయినా అది నిరాటంకంగా గాంబియాకు చేరుకుంది. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపమే ఈ దుఃస్థితికి కారణం. దీన్ని ఎంత త్వరగా సరిదిద్దితే అంత మంచిది. ఔషధాల్లో వినియోగించే ముడి పదార్థాలు ప్రామాణికమైనవి అవునో కాదో, అవి నిర్దేశించిన పాళ్లలో ఉన్నాయో లేదో తనిఖీ చేయటం, రోగంనుంచి ఉపశమనమిస్తుందని చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆ ఉత్పత్తి ఉందో లేదో నిర్ధారించటం నియంత్రణ వ్యవస్థల పని. అలాంటి సంస్థలు మన దేశంలో 38 వరకూ ఉన్నాయి. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)తో పాటు రాష్ట్రాల్లో పలుచోట్ల ఔషధ పరీక్ష కేంద్రాలు(సీడీఎల్) ఉన్నాయి. కానీ ఏదీ సక్రమంగా అమలు కావటం లేదని పలుమార్లు రుజువైంది. గాంబియాలోనూ, ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్‌లోనూ పసివాళ్ల ప్రాణాలు తీసిన దగ్గు, జలుబు మందులను హరియాణాలోని మైడెన్ ఔషధ సంస్థ ఉత్పత్తి చేసింది. ఈ సంస్థ తరచు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. తమ ఫ్యాక్టరీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉందని తన వెబ్సైట్లో ఆ సంస్థ ఘనంగా ప్రకటించుకున్నా అదంతా ఉత్తదేనని తేలింది. అయినా ఏ నియంత్రణ విభాగం ఆ ఔషధ సంస్థపై చర్య తీసుకోలేకపోయింది. ఇప్పుడు కొత్తగా అమల్లోకి తెస్తామంటున్న జీఎంపీ అయినా సక్రమంగా అమలు చేయగలిగితే మంచిదే. ఉత్పాదక ప్రక్రియ సక్రమంగా లేకపోతే ఆ ఉత్పత్తులు కాస్తా కొద్ది రోజుల్లోనే దెబ్బతింటాయి. ఔషధాలు రోగం తగ్గించకపోయినా ఎంతోకొంత సరిపెట్టుకోవచ్చుగానీ ప్రాణాలే తీస్తే?! అసలే పౌష్టికాహార లోపం, వాతావరణ కాలుష్యం, విషాహారం తదితరాలు జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. చివరకు ఔషధాలు సైతం ఈ జాబితాలో చేరితే ఇక చెప్పేదేముంది? వాస్తవానికి ఎగుమతి చేసే ఔషధాలకు జీఎంపీ విధానం ఎప్పటినుంచో అమలులో ఉంది. కానీ దాన్ని అమలు చేయటంలోనే అడుగడుగునా నిర్లక్ష్యం కనబడుతోంది. ఔషధాలు ఎగుమతి చేయ దల్చుకున్న ప్రతి దేశమూ తమ ఔషధ సంస్థలు నిర్దిష్టమైన ప్రమాణాలు అమలు చేస్తున్నట్టు నిర్ధారించుకోవాలని గాంబియా విషాద ఉదంతం తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు నెలల క్రితం తెలిపింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ముడి పదార్థాల నాణ్యత మొదలు కొని కర్మాగారంలోని పరిసరాలు, యంత్రాలు, సిబ్బంది పాటించే పరిశుభ్రత వరకూ సమస్తం సరిగా ఉన్నాయో లేదో చూడటం ఈ మార్గదర్శకాల సారాంశం. ఉత్పత్తి ప్రక్రియలోని ప్రతి దశలోనూ పాటించే విధానాలను నమోదు చేసేందుకు అవసరమైన నమూనాను ఎవరికి వారు రూపొందించుకోవాలనీ, పకడ్బందీ తనిఖీలతో ఇవన్నీ సక్రమంగా అమలయ్యేలా ఎప్పటికప్పుడు చూడాలనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. కేంద్రం ప్రకటించబోయే జీఎంపీ ఇకపై మన దేశంలో విక్రయించే ఔషధాలకు కూడా వర్తిస్తుందంటున్నారు. మంచిదే. అయితే ఎగుమతయ్యే ఔషధాల విషయంలో చూపిన అలసత్వమే ఇక్కడా కనబడితే అనుకున్న లక్ష్యం నెరవేరదు. కర్మా గారం దాటి బయటికొచ్చే ప్రతి ఔషధమూ అత్యంత ప్రామాణికమైనదన్న విశ్వాసం రోగుల్లో కలగాలి. ఔషధాల తనిఖీ విధానంలో మార్పులు తెస్తే తప్ప దీన్ని సాధించటం కష్టం. మన దేశంలో ఔషధ తయారీ సంస్థలు దాదాపు 30,000 వరకూ ఉన్నాయి. వీటిని సక్రమంగా తనిఖీ చేయాలంటే ఇప్పుడున్న సిబ్బంది ఏమాత్రం సరిపోరు. కనుక కొత్త నియామకాలపై కూడా దృష్టి పెట్టాలి. అలాగే చాలా ఫార్మా సంస్థలు తమ ఉత్పత్తుల ప్రయోగ ఫలితాల వివరాలను బహిరంగపరచటం లేదు. ఏమాత్రం పారదర్శకత పాటించని ఇలాంటి ధోరణులే కొంప ముంచుతున్నాయి. ఔషధ రంగాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తేనే ఈ పరిస్థితి మారుతుంది. -
కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో జకోవిచ్..!
Djokovic Holds Major Stake In Firm Developing Covid Drug: వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనకుండా గెంటి వేయబడ్డ ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. ఔషధ తయారీ రంగంలోకి అడుగుపెట్టాడని తెలుస్తోంది. అతడికి కోవిడ్ విరుగుడు మందు తయారు చేసే సంస్థలో భారీ వాటా ఉన్నట్లు.. సదరు కంపెనీ సీఈఓనే స్వయంగా వెల్లడించాడు. డానిష్‌కు చెందిన క్వాంట్ బయోరెస్ అనే కోవిడ్ ఔషధ తయారీ సంస్థలో జకో, అతని భార్యకు 80 శాతం వాటా ఉన్నట్లు సంస్థ సీఈఓ ఇవాన్ తెలిపాడు. త్వరలో తమ ఔషధంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నాడు. అయితే, ఈ వార్తలపై జకోవిచ్ స్పందించాల్సి ఉంది. కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందకు అనుమతి లభించక పోవడంతో.. 21వ గ్రాండ్‌స్లామ్ గెలిచే అవకాశాన్ని జకోవిచ్ చేజార్చుకున్నాడు. మరోవైపు అతను వ్యాక్సిన్ వేసుకోకపోతే ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా అడనిచ్చేది లేదని ఫ్రెంచ్ అధికారులు సైతం స్పష్టం చేశారు. దీంతో జకో వ్యాక్సిన్ వేసుకుంటాడా లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకింది. చదవండి: ప్రిక్వార్టర్స్‌లో సింధు -
మోడెర్నావ్యాక్సిన్ : 10 కోట్ల డోసులకు డీల్
వాషింగ్టన్ : కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో అమెరికా మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనాకు కచ్చితమైన వ్యాక్సిన్ తమదేనని చెప్పుకుంటున్న అమెరికా కంపెనీ మోడెర్నాతో ఈ ఒప్పందాన్నిచేసుకుంది. 100 మిలియన్ మోతాదుల కోవిడ్ -19 ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను తయారు చేసి పంపిణీ చేసేలా డీల్ కుదుర్చుకుంది. మోడెర్నా వ్యాక్సిన్ 100 మిలియన్ల మోతాదుల తయారు, పంపిణీకి ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించారు. 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరిందని, టీకాకు అనుమతి లభించిన వెంటనే 100 మిలియన్ మోతాదులను వేగంగా ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. (వ్యాక్సిన్ : ఇన్ఫీ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు) దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నతరుణంలో అనేక కంపెనీల నుండి వందల మిలియన్ల మోతాదులకు ఒప్పందాలు కుదుర్చుకుంది ట్రంప్ సర్కార్. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంలో భాగంగా తాజాగా మరో డీల్ సాధించడం విశేషం. వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందున్న అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా ‘ఎంఆర్ఎన్ఏ1273’ పేరుతో తీసుకొస్తున్న తమ వ్యాక్సిన్ చివరి దశ పరీక్షలను సెప్టెంబరులో పూర్తి చేయబోతున్నామని ఇటీవల ప్రకటించిన సంగతి తె లిసిందే. -
దేశవ్యాప్తంగా బ్రాండెడ్ ఔషధాల ధరలకు రెక్కలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బ్రాండెడ్ ఔషధాల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలతోనే ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో తాజాగా ధరలు పెరగడం పేదలకు భారం కానుంది. గడచిన రెండేళ్లలో ముడి సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఔషధాల ధరల పెంపునకు అనుమతి కోరుతూ ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలన్నీ ఇప్పటికే ఎన్పీపీఏ (నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ)కి లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా వినియోగించే ఔషధాల ధరలు పెరగనున్నట్టు ఎన్పీపీఏ వర్గాలు తెలిపాయి. బీసీజీ వ్యాక్సిన్‌తో పాటు, విటమిన్–సీ, క్లోరోక్విన్, మెట్రొనిడజోల్ వంటి ప్రధానమైన 21 రకాల మందుల ధరలు మోత మోగనున్నాయి. దీంతో ఎన్పీపీఏ డిసెంబర్ మొదటి వారంలో సమావేశం నిర్వహించింది. త్వరలోనే పెరిగిన మందుల ధరలను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలకు 30 శాతం నుంచి 50 శాతం వరకూ ధర పెరగనుంది. అయితే ప్రజా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని అసాధారణంగా ధరలు పెంచబోమని ఎన్పీపీఏ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ మండలి కార్యాలయాలకు ఉత్తర్వులు అందాయి. బీసీజీ వ్యాక్సిన్ ప్రభావం తీవ్రంగా.. బీసీజీ వ్యాక్సిన్ ధర భారీగా పెరగనుంది. బిడ్డ పుట్టగానే టీబీ లేదా క్షయ రాకుండా ఈ వ్యాక్సిన్ వేస్తారు. మన రాష్ట్రంలో ఏటా 6.50 లక్షల మంది శిశువులు జన్మిస్తున్నారు. వీళ్లందరికీ బీసీజీ వ్యాక్సిన్ వేయాల్సిందే. దీంతోపాటు మలేరియా మందులు, యాంటీ బాక్టీరియల్‌కు వాడే మెట్రోనిడజోల్ వంటి మందుల ధరలు పెరగడం వల్ల దీని ప్రభావం ప్రభుత్వంపై తీవ్రంగా పడనుంది. మన రాష్ట్రంలో ఇలా పెరిగిన మందుల వల్ల ఏటా రూ.120 కోట్ల వరకూ అదనంగా రోగులపై భారం పడే అవకాశాలున్నట్టు ఔషధ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్టెంట్ రేట్లు తగ్గించినా... గుండెకు వేసే స్టెంట్ రేట్లు విచ్చలవిడిగా పెరిగిన నేపథ్యంలో వీటిని కూడా ఎన్పీపీఏ ధరల నియంత్రణలోకి తెచ్చింది. ఒక్కో స్టెంట్‌ను రూ.30 వేలకు మించి అమ్మకూడదని నిబంధన విధించింది. ఇదివరకు స్టెంట్ వేస్తే రూ. 1.50 లక్షలు వ్యయం అయ్యేది. కానీ ఇప్పుడు కూడా అంతే ధరకు వేస్తున్నారు. అంటే స్టెంట్ రేటు తగ్గినా ప్రొసీజర్ రేట్లు ఎక్కువ వేసి ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. ఆస్పత్రి చార్జీలు తమ పరిధిలోకి రావని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే స్టెంట్ల ధరలు తగ్గించినా రోగులపై భారం తగ్గడం లేదు. ఇలా 870 రకాల మందులు ధరల నియంత్రణ పరిధిలో ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు మందులు విక్రయిస్తున్న ఉత్పత్తి సంస్థలపై ఔషధ నియంత్రణ శాఖ దాడులు చేసి ఆయా మందులను సీజ్ చేసింది. అలయెన్స్ బయోటిక్స్, డిజిటల్ విజన్, సెంచురీ డ్రగ్స్ వంటి ఉత్పత్తి సంస్థలు తయారు చేసిన మందులు నిర్ణయించిన ధరకంటే ఎక్కువకు అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో అధికారులు ఆ మందులను సీజ్ చేశారు. ఉత్పత్తిదారులపైనా కేసులు నమోదు చేసినట్టు ఔషధ నియంత్రణ శాఖ కృష్ణా జిల్లా అధికారి రాజభాను ‘సాక్షి’కి తెలిపారు. ధరలు పెరిగే ఔషధాల్లో కొన్ని.. -
గడ్డినీ తినేశారు..
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యుల అక్రమాల చిట్టాలో పశువులు తినే గడ్డీ చేరిపోయింది. రైతులకు దక్కాల్సిన రాయితీలను అడ్డదారిలో ఆయన కుమార్తె కాజేసిన చిల్లర వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కోడెల శివప్రసాద్ కుమార్తెకు ఔషధాల తయారీ కంపెనీతోపాటు సాయికృప అనే ఓ సంస్థ ఉంది. కరవు కాలంలో పశువులకు సైలేజీ (మాగుడు) గడ్డి పంపిణీ చేయడం ఈ కంపెనీ ఉద్దేశాలలో ఒకటి. పచ్చి గడ్డిని కోసి శుద్ధి చేసి కార్బోహైడ్రేట్లను సేంద్రియ ఆమ్లాలుగా మార్పు చేసి పోషక విలువలకు ఎటువంటి నష్టం లేకుండా తిరిగి మేతగా ఉపయోగిస్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఈ సంస్థ సైలేజీ గడ్డి పంపిణీకి పశు సంవర్థక శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట, నకరికల్లు, రొంపిచర్ల తదితర ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలోని కొన్ని గ్రామాలకు గడ్డి సరఫరా చేసే బాధ్యత స్వీకరించి నిధులు కాజేసేందుకు పథక రచన చేసింది. భారీ ఇండెంట్‌తో ఖజానాకు చిల్లు నిబంధల ప్రకారం ఒక్కో గ్రామంలో 5 ఎకరాల్లో సైలేజీ గడ్డి పెంపకానికి తొలుత అనుమతి ఇచ్చినా, ఆ తర్వాత ఈ నిబంధనను మార్చేస్తూ పశు సంవర్థక శాఖ డైరెక్టర్ సోమశేఖర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ గడ్డి పెంపకానికి ఒప్పందం కుదుర్చుకున్న రైతులకు పశు సంవర్థక శాఖ ఎకరానికి రూ.10 వేలు కౌలు ఇస్తుంది. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం కూడా రూ.11 నుంచి 12 వేల వరకు కరవు పనుల కింద ఇచ్చేది. పంపిణీ కంపెనీలు సైలేజీ యంత్రం ద్వారా 50 కిలోల నుంచి గరిష్టంగా 400 కిలోల వరకు గాలి చొరబడడానికి వీలు లేకుండా గడ్డిని చుట్ట చుట్టి మోపు (బేల్స్)గా తయారు చేస్తాయి. ఈ గడ్డికి కిలో రూ.6.80 చొప్పున (రవాణా, లోడింగ్, అన్లోడింగ్ కలుపుకుంటే కేజీ రూ.9 నుంచి రూ.11 వరకు) ప్రభుత్వం పశు సంవర్థక శాఖతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కంపెనీలకు ఇస్తుంది. ఇందులో లబ్ధిదారుడు భరించాల్సింది కిలో గడ్డికి రూ.2 మాత్రమే. ఈ నేపథ్యంలో అప్పట్లో గుంటూరు జిల్లా జేడీ రజనీ కుమార్, డైరెక్టర్ సోమశేఖర రావు సత్తెనపల్లి నియోజకవర్గానికి 200 టన్నులతో ఇండెంట్ ప్రారంభించి 500, 1000, 1500 టన్నులకు పెంచి కోడెల కుమార్తె కంపెనీ సాయికృపకు ఇచ్చారు. ఒక్క 2017–18లోనే ఈ సంస్థ 20 వేల టన్నుల గడ్డిని రైతులకు పంపిణీ చేసినట్టు లెక్కలు చూపి కోట్లాది రూపాయలు కాజేసినట్టు తేలింది. తమకింకా 2,800 టన్నులకు బిల్లులు రావాల్సి ఉందని పశు సంవర్థక శాఖకు లేఖ రాయడం విజిలెన్స్ విభాగం దృష్టికి రావడంతో విషయం బయటకు పొక్కింది. లబ్ధిదారు నుంచి కిలో గడ్డికి రూ.2 చొప్పున వసూలు చేయాల్సిన మొత్తాన్ని కోడెల ఆయా గ్రామాల్లోని అనుచరులతో కట్టించి.. ఆ గడ్డి రవాణా, లోడింగ్, అన్లోడింగ్ కూడా వారే చేసినట్లు రాతకోతలు పూర్తి చేసే వారని సమాచారం. -
దేశీ ఫార్మా దిగ్గజాలకు భారీ షాక్
న్యూఢిల్లీ/ వాషింగ్టన్: భారతీయ దిగ్గజ ఫార్మా కంపెనీలకు భారీ షాక్ తగిలింది. అనుచితంగా ధరల పెంపునకు కుట్ర పన్నారంటూసన్ పార్మా, డా. రెడ్డీస్ తదితర ఏడు భారతీయ కంపెనీలతో పాటు 20 ఫార్మా కంపెనీలపై అమెరికాలో ఆరోపణలు చెలరేగాయి. అమెరికాలోని 40 రాష్ట్రాలతో పాటు, యాంటీ ట్రస్ట్ విభాగం కేసులను ఫైల్ చేశాయి. అంతేకాదు ఈ ఫార్మా సంస్థలకు చెందిన అయిదుగురు కీలక ఉద్యోగులను కూడా ఈ కేసులో చేర్చింది. 20 ఔషధ సంస్థలు వేర్వేరు మందుల ధరల్లో దాదాపు 400 శాతానికి పైగా పెంపునకు కుట్ర పన్నాయని ఆరోపించింది. అందరికీ అవసరమైన మందుల ధరలకు కంపెనీలు ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నాయంటూ అమెరికాలోని 40కి పైగా రాష్ట్రాలు ఔషధ కంపెనీలపై మే 10వ తేదీన తేదీన కేసులు వేశాయి. డయాబెటిస్, క్యాన్సర్, హెచ్ఐవీ, మూర్ఛ వ్యాధి మందులు సహా సుమారు వెయ్యి రకాల ఔషధాల ధరలను నిర్ణయించడంలో 20 ఫార్మా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, కుట్రపూరితంగా ధరలను పెంచుతున్నాయనంటూ అభియోగాలు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థల్లో దేశీయంగా అరబిందో, గ్లెన్‌మార్క్, లుపిన్, వర్క్‌హాడ్, జైడస్ ఫార్మతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ మందుల తయారీ కంపెనీ టెవా ఫార్మాస్యూటికల్స్ కూడా ఉండటం గమనార్హం. అమెరికన్ల జీవితాలతో ఆటలాడుతూ జనరిక్ మందుల తయారీ రంగంలోని కొందరు వందల కోట్ల డాలర్ల కుంభకోణానికి తెరతీశారనడానికి తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని కనెక్టికట్ అటార్నీ జనరల్ విలియమ్ టోంగ్ టోంగ్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ధరల దందాకు సంబంధించిన ఈమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్ రికార్డుల సాక్ష్యాలు తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన వివరించారు. 2013 జులై, 2015 జనవరి మధ్య పదుల సంఖ్యలో మందుల ధరలను అమాంతంగా పెంచేందుకు కంపెనీలు కుట్రకు పాల్పడ్డాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా 2013, 2014 జులై మధ్య కాలంలో 1200 జనరిక్ మందుల విలువ 448 శాతం పెరిగిందన్నారు. హెల్త్ కేర్ రంగంలో అమెరికాలో ఇది భారీ కుంభకోణమని ఆరోపించారు. అమెరికాలో వైద్య ఖర్చులు, మందుల ధరలు ఎందుకింత ఎక్కువగా ఉన్నాయన్న అంశంపై జరిగిన పరిశోధనలో ఈ స్కాం బయటపడిందన్నారు. కాగా తాజా ఆరోపణలపై స్పందించిన టెవా ఈ ఆరోపణలను ఖండించింది. అలాగే ఇవి నిరాధారమైన ఆరోపణలన్నీ, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని సన్ ఫార్మా ప్రకటించింది. దీంతో మంగళవారం నాటి మార్కెట్లో హెల్త్ కేర్ సెక్టార్ 4 శాతం కుప్పకూలింది. సోమవారం సన్‌ఫార్మ ఏకంగా 21 శాతం పతనమైంది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా కంపెనీలు ఇంకా దీనిపై స్పందించలేదు. -
హైదరాబాద్‌లో ‘సెక్స్ డ్రగ్’ కలకలం
సాక్షి, సిటీబ్యూరో: నగర శివార్లలోని నాచారంలోని ఓ కర్మాగారంపై జరిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారుల దాడులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బెంగళూరులో బుధవారం చిక్కిన కేటమైన్ తయారీ, విక్రయ ద్వయం ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ యూనిట్ అధికారులు గురువారం ఈ దాడులు చేశారు. నాచారంలోని ‘ఇంకెమ్’ సంస్థను సైతం సీజ్ చేసినట్లు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సెక్స్ డ్రగ్‌గానూ పిలిచే కేటమైన్ వాడకంతో గుర్రాలతో పాటు మనుషులకూ సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నాచారంలో సెక్స్ డ్రగ్ కంపెనీ సీజ్ చేశారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే ఇది కేవలం సెక్స్ డ్రగ్ మాత్రమే కాదని అధికారులు చెబుతున్నారు. బెంగళూరులోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) యూనిట్‌కు మంగళవారం ఓ సమాచారం అందింది. ‘అక్కడి మెజిస్టిక్ థియేటర్ సమీపంలో ఓ ట్రాలీలో గన్నీ బ్యాగ్ ఉందని, అందులో నిషేధిత మాదక ద్రవ్యమైన కేటమైన్‌ను విక్రయిస్తున్నారనేది’ దాని సారాంశం. వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం ఆ ప్రాంతంలో దాడి చేయగా దీనిని పసిగట్టిన విక్రేత, ఖరీదు చేసే వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. తన కారులో దూసుకుపోయిన విక్రేత అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఎన్సీబీ అధికారులపై దాడికి సైతం వెనుకాడలేదు. కారు నంబర్‌తో పాటు వివిధ ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన ఎన్సీబీ అధికారులు నిందితుడిని బెంగళూరులోని కెంగేరి శాటిలైట్ టౌన్ ప్రాంతానికి చెందిన శివరాజ్‌గా గుర్తించారు. బుధవారం అతడి ఇంటిపై దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి ఇంట్లో ఉన్న 26 కేజీల కేటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే దీని తయారీ యంత్రం ఉండటాన్ని చూసిన ఎన్సీబీ అధికారులు కంగుతిన్నారు. సాధారణంగా ఎవరూ ఇలాంటి యంత్రాలను ఇళ్లల్లో ఉంచుకోరు. సైకోటోపిక్ సబ్‌స్టాన్సెస్ కేటగిరీలోకి వచ్చే కేటమైన్‌ను కొన్ని రసాయనాలను వినియోగించి తయారు చేస్తారు. మూసి ఉన్న గదిలో ఇలాంటి యంత్రాన్ని ఉంచి, రసాయనాలను ప్రాసెసింగ్ చేసి కేటమైన్ తయారు చేయడం రిస్క్‌తో కూడుకున్న విషయం. ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ విస్పోటనం జరిగే ప్రమాదం ఉంది. జనావాసాల మధ్య ఉన్న ఇలాంటి యూనిట్‌ను గుర్తించడం దేశంలో తొలిసారని ఎన్సీబీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే శివరాజ్‌కు దీని తయారీలో ఉన్న అనుభవం నేపథ్యంలోనే పకడ్బందీగా ఈ దందా చేస్తున్నాడని తేల్చారు. ఇతడిచ్చిన సమాచారంతో డ్రగ్‌ను హోల్‌సేల్‌గా ఖరీదు చేసుకుని వెళ్లడానికి వచ్చిన చెన్నైకు చెందిన జె.కన్నన్ను సైతం ఎన్సీబీ యూనిట్ పట్టుకుంది. మైసూర్‌కు చెందిన శివరాజ్ తన భార్య, కుమార్తెతో కలిసి మూడేళ్ల క్రితం బెంగళూరుకు వలసవచ్చాడు. కేటమైన్ తయారీ యూనిట్ ఉన్న ఇంట్లోనే వీరితో కలిసి ఉంటున్నాడు. ఇతడి విచారణలో హైదరాబాద్ లింకులు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని నాచారంలో ఉన్న ఇంకెమ్ సంస్థలోనూ ఇలాంటి మరో తయారీ యంత్రం ఉందని చెప్పడంతో బెంగళూరు అధికారులు హైదరాబాద్ యూనిట్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన నాచారం వెళ్లిన హైదరాబాద్ టీమ్ ఇంకెమ్ సంస్థలో ఉన్న యంత్రాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు దాన్ని సీజ్ చేసింది. ఇంకెమ్ నిర్వాహకుడిగా భావిస్తున్న ఓ వ్యక్తినీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. గుట్టుగా..ఐదేళ్లుగా.. మల్లాపూర్: నాచారం పారిశ్రామిక వాడలో ఇంకెమ్ కెమికల్ ల్యాబ్ పేరుతో వెంకటేష్ అనే వ్యక్తి ఏకంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఐదేళ్లుగా గుట్టుగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. ‘సెక్స్ డ్రగ్’గా పేర్కొనే ఈ ‘కెటామిన్’ మాదకద్రవ్యాన్ని బెంగుళూరు, గోవా తదితర ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్ వాడిన వారు పైశాచిక ఆనందంతో మృగాళ్లాలా ప్రవర్తిస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. బెంగళూరులో డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు కెటమిన్ డ్రగ్స్‌తో పట్టుబడ్డ ముఠా ఇచ్చిన సమాచారంతో కర్ణాటక పోలీసులు గురువారం రాత్రి నాచారం పోలీసులతో కలిసి ఇ–కెమ్ కెమికల్ ల్యాబ్ పరిశ్రమపై దాడి చేశారు. ఈ సందర్భంగా ముడి సరుకుతోపాటు, పలు కీలకపైన ఫార్ములాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిర్వాహకుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
హైదరాబాద్‌లో అక్రమంగా సెక్స్ డ్రగ్స్ తయారీ
హైదరాబాద్: నగరంలో లైంగిక సామర్ధ్యాన్ని పెంపొందించే మందుల్ని అక్రమంగా తయారు చేస్తోన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కెటమైన్ అనే మత్తు మందును ఐదేళ్లుగా ఇంతం ల్యాబ్ తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బెంగుళూరులో ఇద్దరు వ్యక్తులు పట్టుబడటంతో హైదరాబాద్‌లోని ఇంతం ల్యాబ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మందులు మహిళలపై వాడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అలాగే బెంగుళూరులో పట్టుబడిన ముఠా నుంచి కీలక సమాచారాన్ని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు రాబట్టారు. ఆ ముఠా ఇచ్చిన సమాచారంతో నాచారంలో ఉన్న ఇంతం ల్యాబ్‌లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. క్షుణ్ణంగా సోదాలు నిర్వహించిన అనంతరం ఇంతం ల్యాబ్‌ను డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఐదు గంటల పాటు అపస్మారక స్థితిలో ఉంటారని అధికారులు చెబుతున్నారు. మనిషిలో సెక్స్ హార్మోన్లు పెరిగేలా మందులు తయారు చేస్తోన్నట్లు తమ విచారణలో వెల్లడైందని, దీనికి సంబంధించి ఇంతం ల్యాబ్ యజమాని వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. -
మాయదారి మందుల్లో మనమే నెం.1
సాక్షి, అమరావతి: ప్రాణాలు నిలబెట్టాల్సిన మందుల వల్లే ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్లయినా ఉండటం లేదు. నాలుగున్నరేళ్లుగా నకిలీ మందులు, నాసిరకం మందులు విచ్చలవిడిగా వినియోగంలోకి వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఎక్కడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల చర్యలు లేవు. మందుల షాపుల్లో అటుంచితే ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా అయ్యే మందులు మరీ దారుణంగా ఉన్నట్టు ఔషధ నియంత్రణ శాఖ పరిశీలనలో వెల్లడైంది. జాతీయ స్థాయిలో సగటున 4 శాతం నాసిరకం మందులు వినియోగంలో ఉండగా, ఏపీలో 5.1 శాతం నకిలీ, నాసిరకం మందులు వినియోగంలో ఉన్నాయి. దీనివల్ల పేద, సామాన్య ప్రజలకు జబ్బులు నయం కాకపోగా, కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో నాసిరకం మందులు, నకిలీ మందుల విషయంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. 2018 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 2700కు పైగా నమూనాలు సేకరించి ల్యాబ్‌లో పరిశీలిస్తే అందులో 133 నాసిరకమైనవిగా తేలాయి. ఇది 5 శాతం కంటే ఎక్కువ. జాతీయ సగటు 4 శాతంగా ఉంది. కేరళలో 3, కర్ణాటక 4, తమిళనాడు 4.1 నాసిరకం మందులు వినియోగంలో ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో మరీ నాసిరకం.. ఆరు నెలల క్రితం గోవా యాంటీబయోటిక్స్ కంపెనీ సరఫరా చేసిన యాంటీబయోటిక్ ఇంజక్షన్లు వాడగానే శ్రీకాకుళం రిమ్స్‌లో ముగ్గురు మృతి చెందారు. దీనిపై విచారణకు ఆదేశించినప్పటికీ తరువాత ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. తాజాగా ఈ నెల 9న తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం పోతనపల్లిలో మడకం గంగయ్య అనే వ్యక్తి నులిపురుగుల నివారణ మాత్రలు మింగి మృతి చెందాడు. అదే జిల్లా వీఆర్ పురం మండలం వడ్డిగూడెం పాఠశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ మాత్రలు మింగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదాహరణలు మచ్చుకు కొన్ని మాత్రమే. అసలు ప్రభుత్వాసుపత్రుల్లో ఏ మందులు పనిచేస్తున్నాయో, ఏవి పనిచేయడంలేదో అర్థం కాని పరిస్థితి. మందులు ఉత్పత్తి కాగానే వాటిని ముందుగా ల్యాబొరేటరీకి పంపించి నాణ్యతను నిర్ధారించాక ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేయాలి. కానీ ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసి, రోగులు వినియోగించిన తరువాత ల్యాబొరేటరీకి పంపిస్తున్న దుస్థితి నెలకొంది. రాజకీయ నాయకులవైతే శాంపిళ్లు కూడా తీసుకోరు మన రాష్ట్రంలో మందుల నాణ్యతా నిర్ధారణకు రాజకీయ ఒత్తిళ్లు అడ్డొస్తున్నాయి. కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతల మందులను కనీసం నమూనాలు సేకరించేందుకు కూడా ఔషధ నియంత్రణ అధికారులు భయపడుతున్నారు. ఉదాహరణకు గతేడాది స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూతురు విజయలక్ష్మి డైరెక్టర్‌గా ఉన్న ‘సేఫ్’ ఫార్ములేషన్స్ సంస్థ కొన్ని పశువులకు సంబంధించిన మందులు తయారు చేసింది. ఈ మందులు నాసిరకం అని వెటర్నరీ డాక్టర్లు నివేదికలు ఇచ్చినా ఔషధ నియంత్రణ అధికారులు స్పందించలేదు. మరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తయారు చేసిన మందుల పరిస్థితీ ఇంతే. ఇలాంటి మందులు చాలానే ఉన్నాయి. -
డగ్స్ కేసులో 11మంది పై కేసులు నమోదు
-
ఆన్లైన్లో డ్రగ్స్ లైసెన్స్: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం ముందువరుసలో ఉందని వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. సరళతర వాణిజ్య విధానంలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలో సేవలను ఆన్లైన్ ద్వారా అందించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటికే ఈ–ఔషధి, ఈహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ వంటిని ప్రారంభిం చామని, తాజాగా డ్రగ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానాన్ని లక్ష్మారెడ్డి శుక్రవారం సచివాలయంలో ప్రారంభించారు. ఆన్లైన్ డ్రగ్ లైసెన్స్ విధానంతో ఎన్నో ఉపయోగాలున్నా యని, జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఔషధాల తయారీ దారులు, రిటైల్, హోల్‌సేల్ డీలర్లు ఇక నుంచి ఆన్లైన్లోనే అనుమతులు పొందొచ్చని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో తొలి సారిగా వైద్య విద్య పరిశోధన కోసం ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించిందన్నారు. దీనికోసం ప్రత్యేకంగా మెరిట్(మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఇన్ తెలంగాణ) పేరుతో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో 165 పడకలతో ఐసీయూ, అత్యాధునిక ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వెరికోస్ వీన్స్ (నరాలు ముడత పడటం) వ్యాధికి ఇకపై ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తామని తెలిపారు. -
ఆన్లైన్లో ఔషధ విక్రయం ప్రాణాంతకం!
విచ్చలవిడిగా లభించే మత్తు, నిద్ర మాత్రలు.. - యువత పెడదారి పట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు - ఆన్లైన్ ఔషధాల సరఫరా హానికరమని వెల్లడి - అమెరికా వంటి దేశాల్లో విటమిన్లు, సాధారణ మాత్రలే ఆన్లైన్లో సాక్షి, హైదరాబాద్: నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్ పరికరాల వంటి వస్తువుల్లా ఔషధాలను ఆన్లైన్లో విక్రయించడం వల్ల అనేక అనర్థాలు పొంచివున్నాయని నిపుణులు అంటున్నారు. ఒక్కోసారి రోగులకు ప్రాణాంతకం కానుందని హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్లో ఔషధాలను విక్రయించే పద్ధతికి కేంద్రం అనుమతిస్తున్న నేపథ్యంలో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ రెండ్రోజుల కింద దేశవ్యాప్తంగా మెడికల్ షాపులను బంద్ చేశారు. సామాన్య రోగులకు ఈ పద్ధతి అందుబాటులో ఉండే వ్యవహారం కాదని పేర్కొంటున్నారు. మరోవైపు చిన్నపాటి మందుల దుకాణాల ఉనికి ప్రశ్నార్థకం కానుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం మందులు అంటగట్టే ప్రమాదం.. డాక్టర్ రాసిన చీటీలోని మెడిసిన్స్‌ను ఆన్లైన్లో కొన్నట్లయితే అవి డాక్టర్ రాసిన కంపెనీకి చెందినవే కావొచ్చు.. కాకపోవచ్చు. ఆన్లైన్ దుకాణాదారులు తమకు చౌకగా లభించే నాసిరకం ఫార్మసీ కంపెనీల మందులను సొంత లాభం కోసం కట్టబెట్టవచ్చు. ఆన్లైన్లో ఇలాంటివి విక్రయిస్తే రోగులు నష్టపోతారు. ఒక్కోసారి ప్రాణహాని జరిగే ప్రమాదముంది. డాక్టర్ రాసినవి కాకుండా వేరే మెడిసిన్ ఇస్తే అవి రియాక్షన్‌కు దారితీసి వికటించే ప్రమాదముంది. అందుకు ఆన్లైన్ మందుల అమ్మకం దారులు ఎలాంటి జవాబు దారీత నం, బాధ్యత వహించరు. ఎలాంటి పర్యవేక్షణకు తావు లేని ఆన్లైన్ అమ్మకాల వల్ల మత్తు మందులు, నిద్రమాత్రలను యువత విచక్షణ రహితంగా ఆర్డర్ చేస్తే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అనేక మందుల దుకాణదారులు ఔషధాలతోపాటు సంబంధిత ఉత్పత్తులను కూడా విక్రయిస్తున్నాయి. వాటినీ ఇష్టారాజ్యంగా అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తారు. అంతేకాదు వైద్యుడు చీటీ రాసినా ఆన్లైన్లో ఆర్డర్ వల్ల ప్రిస్కిప్షన్‌కు సాధికారత ఉండదు. దీనివల్ల మందుల చీటీ ఉంటేనే ఔషధాలు విక్రయించాలన్న కేంద్రం స్ఫూర్తి దెబ్బతింటుంది. అమెరికా వంటి దేశాల్లోనూ ఆన్లైన్లో కేవలం పారాసిటమాల్, విటమిన్ వంటి ట్యాబ్లెట్లనే విక్రయిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. డిస్కౌంట్ ప్రచారాలతో ప్రమాదం.. ఆన్లైన్ విక్రయాలు జరిపే కొన్ని మెడికల్ దుకా ణదారులు ఇంత బిల్లు చేస్తే డిస్కౌంట్లు ఇస్తామని, కొన్ని మెడికల్ టెస్టులు ఉచితంగా ఇస్తామని అంటున్నాయి. కొన్ని వస్తువులు ఉచితంగా ఇస్తామంటూ ప్రజల్ని ఆకట్టుకోవాలని చూ స్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విషపూరితమైన ఔషధాలకు ఇటువంటి ప్రకటనలు అనైతికమని చెబుతున్నారు. ఆన్లైన్లో మెడిసిన్స్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండవని చెబుతున్నారు. ఆర్డర్ చేసిన వెంటనే మందులు వచ్చే అవకాశం లేకపోవడంతో ఆరోగ్యం విషమించే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కార్పొరేట్ మెడికల్ షాపులతో ఇప్పటికే చిన్న మెడికల్ దుకాణాలు తుడిచి పెట్టుకుపోతున్నాయి. ఇక ఆన్లైన్ విక్రయాలు కూడా తోడైతే వాటి ఉనికే ప్రశ్నార్థకం కానుంది. యువతకు హాని ఆన్లైన్లో ఔషధాల విక్రయాల వల్ల మత్తు మందులు, నిద్ర మాత్రలు కూడా విచ్చలవిడిగా దొరికే పరిస్థితి రానుంది. దీంతో వాటికి బానిసై పోయిన వారు ముఖ్యంగా యువతీ యువకులు శారీరకంగా మానసికంగా సామాజికంగా నష్టపోతారు. అందువల్ల ఆన్లైన్లో మెడిసిన్ విక్రయాలు నిలిపేయాలి. – వేణుగోపాల్‌శర్మ, రాష్ట్ర కెమిస్ట్, డ్రగ్గిస్ట్ సంఘం ప్రతినిధి అత్యంత ప్రమాదకరం ఆన్లైన్లో మందుల విక్రయం అత్యంత ప్రమాదకరం. మందుల చీటీ లేకుండా కొనుగోలు చేయడమే తప్పు. అలాంటిది ఆన్లైన్ అనేది అందుకు విరుద్ధం. పైగా రోగి తనకు ఇష్టమైన, ఇష్టమైనన్ని మెడిసిన్స్ కొని వాడితే అది ప్రాణాంతకం కూడా అవుతుంది. అమెరికా వంటి దేశాల్లో డాక్టర్ మందుల చీటీ లేకుండా మందులు ఇవ్వరు. – డాక్టర్ శివరామకృష్ణ, ఖమ్మం -
మత్తు మందిచ్చి బాలికపై అత్యాచారం
లంగర్‌హౌస్(హైదరాబాద్): మత్తుమందు ఇచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. టోలిచౌకి మిరాజ్ కాలనీకి చెందిన బాలిక(15) టోలిచౌకిలోని సీఫా ఎలైట్ షోరూంలో పని చేస్త్తోంది. నౌనంబర్ హుడా కాలనీకి చెందిన హమీద్(26) అదే షోరూంలో సేల్స్ మెన్‌గా పనిచేస్తున్నాడు. ఓకే షోరూంలో పని చేస్తున్న వీరు స్నేహితులు కావడంతో రెండు రోజుల క్రితం హమీద్ ఆ బాలికను నానల్‌నగర్ వద్ద కలవాలని ఫోన్ చేశాడు. సమీపంలో తనకు కొద్దిగా పని ఉందని, ఆ తర్వాత షోరూంకు కలసి వెళ్దామని ఆమెతో నమ్మబలికాడు. దీంతో ఆ బాలిక నానల్‌నగర్‌కు రాగా ద్విచక్ర వాహనంపై గండిపేట్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికకు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన బాలికపై అత్యాచారానికి పాల్పడాడు. తెలివి వచ్చిన తర్వాత ఆమె తనపై జరిగిన అఘాయిత్యంపై హమీద్‌ను నిలదిసింది. దీంతో అతను బాలికపై చేయిచేసుకున్నాడు. దీంతో బాధితురాలు మళ్లీ స్పృహ కోల్పోవడంతో భయపడ్డ హమీద్ కిషన్ బాగ్‌లో ఉండే తెలిసిన వైద్యుని వద్దకు తీసుకువచ్చి చికిత్స చేయించాడు. అనంతరం ఆమె ఇంటి సమీపంలో దింపి వెళ్లాడు. మరుసటి రోజు పూర్తిగా మత్తునుంచి తేరుకున్న ఆమె తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబసభ్యులకు తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికకు వైద్య పరిక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంగళవారం హమీద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ప్రజల ప్రాణాలతో చెలగాటం
* పులుమామిడి సబ్ సెంటర్లో కాలం చెల్లిన మాత్రల పంపిణీ * తీవ్ర ఇబ్బందికి గురైన రోగి * పట్టించుకోని అధికారులు నవాబుపేట: అధికారుల నిర్లక్ష్యం జనాల పాలిట శాపంగా మారుతోంది. మండల పరిధిలోని పులుమామిడి గ్రామ సబ్ సెంటర్లో ఓ ఏఎన్ఎం కాలం చెల్లిన మందుల పంపిణీ చేసింది. దీంతో ఓ రోగి తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పులుమామిడి గ్రామానికి చెందిన టి. వెంకటేషంగౌడ్‌కు ఉదయం 11 గంటల సమయంలో కడుపునొప్పి వ చ్చింది. దీంతో ఆయన గ్రామంలోని ప్రభుత్వ సబ్ సెంటర్‌కు వెళ్లాడు. విధుల్లో ఉన్న ఏఎన్ఎం స్రవంతికి విషయాన్ని చెప్పాడు. దాంతో ఆమె కొన్ని మాత్రలు వెంకటేశంగౌడ్‌కు ఇచ్చింది. మాత్రలు వేసుకుంటే నొప్పి తగ్గిపోతుందని చెప్పింది. ఇంటికి వెళ్లిన ఆయన మాత్రలు వేసుకోగా నొప్పి తగ్గలేదు. మరింత తీవ్రమైంది. దీంతో వెంకటేశంగౌడ్ మాత్రలను గ్రామానికి చెందిన పలువురికి చూపించి అవి కాలం చెల్లినవి (జూన్ 2014 ఎక్స్పైరీ డేట్)గా గుర్తించాడు. ఆయన తిరిగి సబ్ సెంటర్‌కు వెళ్లగా అక్కడ ఏఎన్ఎం స్రవంతి లేదు. అక్కడి నుంచి నవాబుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన వెంకటేశంగౌడ్ విషయం డాక్టర్ సందీప్‌కుమార్‌కు చెప్పాడు. మొదట్లో సరిగా స్పందించని డాక్టర్.. వెంకటేషంగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సర్దిచెప్పాడు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. వెంకటేషంగౌడ్ కంటే ముందు అదే గ్రామానికి చెందిన కె.జయమ్మ కీళ్ల నొప్పులతో సబ్ సెంటర్‌కు వెళ్లగా ఆమెకు కూడా కాలం చెల్లిన మందులు ఇచ్చారని స్థానికులు ఆరోపించారు. ఈ విషయమై డాక్టర్ సందీప్‌కుమార్‌ను ఫోన్లో సంప్రదించే యత్నం చేయగా ఆయన స్పందించలేదు. -
డీల్ విలువ రూ.19,200 కోట్లు..
న్యూఢిల్లీ: దేశంలో మరో మెగా ఫార్మా డీల్‌కు తెరలేచింది. అగ్రగామి ఫార్మా కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మాస్యూటికల్స్... మరో దిగ్గజ కంపెనీ ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్‌ను చేజిక్కించుకుంది. ఇరు కెంపెనీలు ఈ విషయాన్ని సోమవారం సంయుక్తంగా ప్రకటించాయి. పూర్తిగా స్టాక్స్ కేటాయింపు రూపంలో జరగనున్న ఈ ఒప్పందం విలువ 320 కోట్ల డాలర్లు(దాదాపు రూ.19,200 కోట్లు). ఈ డీల్ పూర్తయితే తమ ఉమ్మడి కంపెనీ... దేశంలో నంబర్ వన్ ఫార్మా కంపెనీ కానుందని సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ పేర్కొన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద స్పెషాలిటీ జెనరిక్స్ తయారీ సంస్థగా ఆవిర్భవించనుందని కూడా వెల్లడించాయి. ఇరు కంపెనీల మొత్తం ఆదాయం దాదాపు 420 కోట్ల డాలర్లు(సుమారు రూ.25,000 కోట్ల పైచిలుకే)గా అంచనా. జపాన్‌కు చెందిన దైచీ శాంక్యో మెజారిటీ వాటాదారుగా ఉన్న ర్యాన్‌బాక్సీ ఇటీవల కాలంలో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్ఎఫ్డీఏ) నుంచి నిషేధాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా, గడిచిన రెండేళ్లలో దేశంలో చోటుచేసుకున్న రెండో అతిపెద్ద కొనుగోలు డీల్‌గా ఇది నిలుస్తుండటం గమనార్హం. ప్రతిపాదిత డీల్‌కు సన్ ఫార్మా డెరైక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇరు కంపెనీల బోర్డులు డీల్‌కు షేర్‌హోల్డర్ల అనుమతి కోసం సిఫార్సు చేశాయి. ఒప్పందం స్వరూపం ఇదీ... ప్రతిపాదిత డీల్ ప్రకారం.. ఒక్కో ర్యాన్‌బాక్సీ షేరుకి 0.8 సన్‌ఫార్మా షేరును కేటాయించనున్నారు. అంటే ప్రతి ర్యాన్‌బాక్సీ వాటాదారులకు ప్రతి 5 షేర్లకు... 4 సన్ ఫార్మా షేర్లు లభిస్తాయన్న మాట. ర్యాన్‌బాక్సీ షేరు విలువ రూ.457 చొప్పున ఈ డీల్ కుదుర్చుకున్నట్లు లెక్క. గడిచిన 30 రోజుల సగటు షేరు ధరపై 18 శాతం అధిక మొత్తానికి... 60 రోజుల సగటు ధరపై 24.3 శాతం ప్రీమియంను సన్ ఫార్మా ఆఫర్ చేసినట్లవుతుంది. అయితే, 2008లో ర్యాన్‌బాక్సీలో 63.4 శాతం మేర వాటాను జపాన్ ఫార్మా దిగ్గజం దైచీ శాంక్యో సుమారు 460 కోట్ల డాలర్లకు(అప్పటి కరెన్సీ విలువ ప్రకారం దాదాపు రూ.22,000 కోట్లు) కొనుగోలు చేయడం విశేషం. ఒక్కో షేరుకి సుమారు రూ.737 చొప్పున చెల్లించింది. తద్వారా ర్యాన్‌బాక్సీ ప్రమోటర్లు మాల్విందర్ సింగ్, శివీందర్ సింగ్‌లు సంస్థ నుంచి వైదొలిగారు. కాగా, అప్పటి డీల్ ప్రకారం చూస్తే... ఇప్పుడు దైచీ శాంక్యోకు ర్యాన్‌బాక్సీలో ఉన్న వాటాకు చాలా తక్కువ మొత్తమే లభిస్తోంది. సన్ ఫార్మా ప్రమోటర్లకు ప్రస్తుతం ఆ కంపెనీలో 63.7 శాతం వాటా ఉంది. షేర్ల కేటాయింపు కారణంగా ఈ డీల్ పూర్తయితే సన్ ఫార్మాలో దైచీ శాంక్యో రెండో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తుంది. సన్ ఫార్మాకు ఏంటి ప్రయోజనం... ర్యాన్‌బాక్సీని సొంతం చేసుకోవడం వల్ల సన్ ఫార్మాకు ప్రపంచవ్యాప్తంగా అయిదు ఖండాల్లోనూ 65 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం దక్కుతుంది. 47 తయారీ ప్లాంట్లు ఈ ఉమ్మడి సంస్థ చేతిలో ఉంటాయి. ప్రపంచ స్పెషాలిటీ, జనరిక్ ఔషధ ఉత్పత్తుల మార్కెట్లో గణనీయమైన వాటాను సన్ ఫార్మా చేజిక్కించుకోగలుగుతుంది. దీంతోపాటు 629 కొత్త ఔషధ దరఖాస్తులు(ఆండాస్) కూడా లభిస్తాయి. గతంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న ఫార్మా కంపెనీలను తక్కువ మొత్తాలకు చేజిక్కించుకుని వాటిని లాభాల బాటలోకి తీసుకొచ్చిన అనుభవం, సామర్థ్యం సన్‌ఫార్మా సొంతం. అమెరికాకు చెందిన కరా కో ఫార్మా, ఇజ్రాయెల్ సంస్థ టారో ఫార్మాలను ఇదే విధంగా దక్కించుకుని గాడిలో పెట్టగలిగింది. ఇప్పుడు ర్యాన్‌బాక్సీ డీల్‌కు కూడా సన్ ఫార్మా చాలా తక్కువే చెల్లిస్తోందనేది విశ్లేషకులు అభిప్రాయం. -
ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు అపారం
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: దేశంలో ఔషధాల తయారీ రంగం ఎంతగానో విస్తరిస్తున్నదని, అయితే విద్యా సంస్థలు - కంపెనీల మధ్య అవగాహన లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఉద్యోగావకాశాలు వుండటం లేదని పలువురు ఫార్మారంగ నిపుణులు పేర్కొన్నారు. శేరిగూడ సమీపంలోని శ్రీఇందు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో శుక్రవారం ఁఫార్మా ఇగ్నైట్-14* నిర్వహించారు. కార్యక్రమానికి ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.ధర్మదాత, మెడిస్ ఫార్మసీ మేనేజింగ్ డెరైక్టర్ బి.డి.ఎల్.నాగేశ్వరరావు, నియోనాటల్ స్పెషలిస్ట్ డాక్టర్ శశి కుప్పల ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. బీఫార్మసీ, ఫార్మాడీ, ఎమ్ ఫార్మసీ వంటి కోర్సులు అభ్యసించిన వారికి ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయని వారన్నారు. ఫార్మా కోర్సులు అందజేస్తున్న విద్యాసంస్థలు ముందస్తుగా కంపెనీలతో అవగాహన ఏర్పర్చుకుంటే ఆశించిన స్థాయిలో విద్యార్థులకు ఉపాధి లభిస్తుందన్నారు. విద్యా సంస్థల ప్రతినిధులు, కంపెనీల నిర్వాహకులు ఈ విషయంపై దృష్టి సారించి యువతకు ఫార్మా విభాగంలో ఉజ్వల భవిష్యత్‌ను అందించాలని నిపుణులు సూచించారు. అనంతరం విద్యార్థులకు పలు అంశాల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఆర్.వెంకట్రావు, ప్రిన్సిపాల్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్ ఫ్యాక్టరీలు నిర్మిస్తే తీవ్రనష్టం
తల్లాడ, న్యూస్‌లైన్: మండలంలోని అన్నారుగూడెం ఇండస్ట్రీయల్ పార్క్‌లో విషతుల్యమైన డ్రగ్ ఫ్యాక్టరీలు నిర్మిస్తే నాలుగు గ్రామాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుం దని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగరావు అన్నారు. డ్రగ్ ఫ్యాక్టరీలు నిర్మించవద్దని తల్లాడ రింగ్ సెంటర్లో అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వరుణ్ ల్యాబరేటరీస్, ఎస్ఆర్ లైఫ్ సైన్స్ ఆధ్వర్యంలో రెండు డ్రగ్ ఫ్యాక్టరీల నిర్మాణానికి గత నెలలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేస్తే నాలుగు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారని, అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోం దని అన్నారు. డ్రగ్ ప్యాక్టరీలు నిర్మాణం వల్ల పదికిలో మీటర్ల దూరం వరకు కాలుష్య ప్రబలి నీరు కలుషితమౌతుందన్నా రు. పర్యావరణ, ఆరోగ్య శాఖ అధికారులు కల్పించుకొని ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, తాళ్ల జోసఫ్, మారెల్లి మల్లిఖార్జున్‌రావు, సీపీఎం నాయకులు దొడ్డా శ్రీను, పులి వెంకటనరసయ్య, గోవింద్ శ్రీను, కోసూరి వెంకటేశ్వరరావు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, డి.శ్రీనివాసరావు, ఉంగరాల వెంకటేశ్వర్లు, గుంటుల్లి వెంకటయ్య పాల్గొన్నారు. -
డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మించొద్దు
తల్లాడ, న్యూస్‌లైన్: మండలంలోని అన్నారుగూడెం ఏపీఐఐసీ స్థలంలో డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని నాలుగు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ లైఫ్ సెన్సైస్, వరుణ్ కంపెనీల ఆధ్వర్యంలో అన్నారుగూడెంలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం బుధవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ బాబురావు సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించగా అన్నారుగూడెం, గోపాలపేట, నరసింహారావుపేట, బాలప్పేట గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా వచ్చి అడ్డుకున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే కాలుష్య ప్రభావం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని అన్నారు. గో బ్యాక్ డ్రగ్ ఫ్యాక్టరీ అంటూ నినాదాలు చేస్తూ సభావేదిక వద్దకు వచ్చారు. తొలుత సభలోని స్థానికేతరులను బయటకు పంపించాలని పట్టుబట్టారు. ఫ్యాక్టరీ బాధిత ప్రజలకే మాట్లాడే ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అందుకు అధికారులు అంగీకరించడంతో వైఎస్సార్సీపీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు మాట్లాడారు. అన్నారుగూడెంలో డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మిస్తే ఆ కాలుష్యం పది కిలోమీటర్ల పరిధిలో ప్రజలకు నష్టం కలిగిస్తుందని అన్నారు. ముఖ్యంగా నాలుగు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఈ ప్రాంతంలో కాటన్ పార్క్ పేరుతో భూములు సేకరించి డ్రగ్ ఫ్యాక్టరీ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు గోవింద్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని రైతులకు అవసరమైన జిన్నింగ్ మిల్ నిర్మిస్తామని చెప్పి రైతుల నుంచి 48 ఎకరాలు సేకరిస్తే చివరకు అది రైతులకు నష్టం కలిగించేదిగా తయారైందని అన్నారు. భూములిచ్చిన రైతులను ప్రభుత్వం ఆదుకోక పోవటంతో దివాళా తీశారన్నారు. సీపీఎం డివిజన్ కమిటీ సభ్యులు దొడ్డా శ్రీనువాసరావు మాట్లాడుతూ అన్నారుగూడెంలో డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మిస్తే క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, కాళ్లవాపు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే భయంలో ప్రజలు ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు ఉపయోగపడే మిల్లుని నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రజల నిరసనల మధ్య ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమం అసంపూర్తిగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ శ్రీనివాసనాయక్, కాలుష్య నియంత్రణ ఈఈ ఎం.నారాయణ, తహశీల్దార్ టి.సుదర్శన్‌రావు, ఈఓఆర్డీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.