సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యుల అక్రమాల చిట్టాలో పశువులు తినే గడ్డీ చేరిపోయింది. రైతులకు దక్కాల్సిన రాయితీలను అడ్డదారిలో ఆయన కుమార్తె కాజేసిన చిల్లర వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కోడెల శివప్రసాద్ కుమార్తెకు ఔషధాల తయారీ కంపెనీతోపాటు సాయికృప అనే ఓ సంస్థ ఉంది. కరవు కాలంలో పశువులకు సైలేజీ (మాగుడు) గడ్డి పంపిణీ చేయడం ఈ కంపెనీ ఉద్దేశాలలో ఒకటి.
పచ్చి గడ్డిని కోసి శుద్ధి చేసి కార్బోహైడ్రేట్లను సేంద్రియ ఆమ్లాలుగా మార్పు చేసి పోషక విలువలకు ఎటువంటి నష్టం లేకుండా తిరిగి మేతగా ఉపయోగిస్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఈ సంస్థ సైలేజీ గడ్డి పంపిణీకి పశు సంవర్థక శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట, నకరికల్లు, రొంపిచర్ల తదితర ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలోని కొన్ని గ్రామాలకు గడ్డి సరఫరా చేసే బాధ్యత స్వీకరించి నిధులు కాజేసేందుకు పథక రచన చేసింది.
భారీ ఇండెంట్‌తో ఖజానాకు చిల్లు
నిబంధల ప్రకారం ఒక్కో గ్రామంలో 5 ఎకరాల్లో సైలేజీ గడ్డి పెంపకానికి తొలుత అనుమతి ఇచ్చినా, ఆ తర్వాత ఈ నిబంధనను మార్చేస్తూ పశు సంవర్థక శాఖ డైరెక్టర్ సోమశేఖర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ గడ్డి పెంపకానికి ఒప్పందం కుదుర్చుకున్న రైతులకు పశు సంవర్థక శాఖ ఎకరానికి రూ.10 వేలు కౌలు ఇస్తుంది. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం కూడా రూ.11 నుంచి 12 వేల వరకు కరవు పనుల కింద ఇచ్చేది. పంపిణీ కంపెనీలు సైలేజీ యంత్రం ద్వారా 50 కిలోల నుంచి గరిష్టంగా 400 కిలోల వరకు గాలి చొరబడడానికి వీలు లేకుండా గడ్డిని చుట్ట చుట్టి మోపు (బేల్స్)గా తయారు చేస్తాయి.
ఈ గడ్డికి కిలో రూ.6.80 చొప్పున (రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్ కలుపుకుంటే కేజీ రూ.9 నుంచి రూ.11 వరకు) ప్రభుత్వం పశు సంవర్థక శాఖతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కంపెనీలకు ఇస్తుంది. ఇందులో లబ్ధిదారుడు భరించాల్సింది కిలో గడ్డికి రూ.2 మాత్రమే. ఈ నేపథ్యంలో అప్పట్లో గుంటూరు జిల్లా జేడీ రజనీ కుమార్, డైరెక్టర్ సోమశేఖర రావు సత్తెనపల్లి నియోజకవర్గానికి 200 టన్నులతో ఇండెంట్ ప్రారంభించి 500, 1000, 1500 టన్నులకు పెంచి కోడెల కుమార్తె కంపెనీ సాయికృపకు ఇచ్చారు. ఒక్క 2017–18లోనే ఈ సంస్థ 20 వేల టన్నుల గడ్డిని రైతులకు పంపిణీ చేసినట్టు లెక్కలు చూపి కోట్లాది రూపాయలు కాజేసినట్టు తేలింది.
తమకింకా 2,800 టన్నులకు బిల్లులు రావాల్సి ఉందని పశు సంవర్థక శాఖకు లేఖ రాయడం విజిలెన్స్ విభాగం దృష్టికి రావడంతో విషయం బయటకు పొక్కింది. లబ్ధిదారు నుంచి కిలో గడ్డికి రూ.2 చొప్పున వసూలు చేయాల్సిన మొత్తాన్ని కోడెల ఆయా గ్రామాల్లోని అనుచరులతో కట్టించి.. ఆ గడ్డి రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్ కూడా వారే చేసినట్లు రాతకోతలు పూర్తి చేసే వారని సమాచారం.
గడ్డినీ తినేశారు..
Published Sun, Aug 25 2019 5:13 AM | Last Updated on Sun, Aug 25 2019 5:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment