pharmaceuticals
-
ఇంజీనస్తో రెడ్డీస్ లైసెన్సింగ్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూఎస్ కంపెనీ ఇంజీనస్ ఫార్మాస్యూటికల్స్‌తో లైసెన్సింగ్ ఒప్పందం చేసుకున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తెలిపింది. ఇందులో భాగంగా క్యాన్సర్ చికిత్సలో వాడే సైక్లోఫాస్ఫామైడ్ ఇంజెక్షన్ ను యూఎస్ మార్కెట్లో రెడ్డీస్ విక్రయించనుంది. అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్లో 50% ఇంజీనస్కు చెల్లిస్తుంది. ఇక్వియా గణాంకాల ప్రకారం 2024 మార్చితో ముగిసిన 12 నెలల్లో ఇంజీనస్ తయారీ సైక్లోఫాస్ఫామైడ్ ఇంజెక్షన్ అమ్మకాల విలువ యూఎస్‌లో 51.8 మిలియన్ డాలర్లు నమోదైంది. -
వచ్చే ఫిబ్రవరిలో 21వ బయో ఏసియా సదస్సు
సాక్షి, హైదరాబాద్: బయో ఏసియా 21వ వార్షిక సదస్సు తేదీలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రకటించారు. హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ఈ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో జరుగుతుందన్నారు. ‘డేటా అండ్ ఏఐ–రీడిఫైనింగ్ పాజిబిలిటీస్’అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు. హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, బయో టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్‌లో డేటా ఆధారిత సాంకేతికత, కృత్రిమ మేధస్సు పోషించే పాత్రపై 2024 బయో ఏసియా సదస్సులో చర్చిస్తారన్నారు. అన్ని రంగాల్లో డిజిటల్ ఆవిష్కరణల ఫలితాల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్ సంగమం ద్వారా అద్భుత ఫలితాలు సాధించే అవకాశముందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోగ్యరక్షణ రంగంలో ఆవిష్కరణ శకం నడుస్తున్న ప్రస్తుత సమయంలో బయో ఏసియా సదస్సుకు అత్యంత ప్రాధాన్యం ఉందని కేటీఆర్ వెల్లడించారు. ప్రగతిభవన్‌లో బయో ఏసియా తేదీల ప్రకటన కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే వివేకానంద, బీఆర్ఎస్ సోషల్ మీడియా కనీ్వనర్లు మన్నె క్రిషాంక్, పాటిమీది జగన్మోహన్రావు, వై.సతీశ్‌రెడ్డి, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. -
దగ్గు సిరప్ కంపెనీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి... ఉత్పత్తికి చెక్!
చిన్నారులను మింగేసిని దగ్గు సిరప్ కంపెనీ మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌లో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. డబ్ల్యూహెచ్‌వో గాంబియాలో దాదాపు 66 మంది చిన్నారులు బారత్ తయారు చేసిన సిరప్ వల్లే చనిపోయారని పేర్కొనడంతో హర్యానా ప్రభుత్వం ఆ ఉత్పత్తులను నిలిపేసినట్లు తెలిపింది. అంతేగా ఆ కంపెనీ సంబంధించి మూడు జౌషధాలను పరీక్షల నిమిత్తం కలకత్తాలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబ్‌కి పంపారు. ఆ పరీక్ష నివేదికల తదనంతరం సదరు కంపెనీపై చర్యలు తీసుకుంటానని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. ఐతే కేంద్ర హర్యానా రాష్ట్ర జౌషధ విభాగా సంయుక్త తనిఖీల్లో ఔషధ తయారీలో దాదాపు 12 లోపాలను గుర్తించడంతోనే ఉత్పత్తిని నిలిపేసినట్లు చెప్పారు. ఈ మేరకు కంపెనీకి జారీ చేసిన షోకాజ్ నోటీస్‌లో...కంపెనీ ఔషధాలను తయారు చేయడానికి, పరీక్షించడానికి ఉపయోగించిన పరికరాలు, సాధనాల సమాచారానికి సంబంధించిన పుస్తకాన్ని నివేదించడంలో విఫలమైంది. అలాగే సిరప్ తయారీలో వాడిన రసాయనాల బ్యాచ్‌కి సంబంధించి సమాచారం కూడా పేర్కొనలేదు. సిరప్ తయారీ, ప్రక్రియ పద్ధతులను నివేదించడంలో విఫలం. అలాగే సిరప్కి సంబంధించి పరీక్షల నివేదికనను అందించలేకపోయింది. అంతేగాదు తయారి తేదీకి, ఉత్పత్తి అనుమతించిన తేదీకి చాలా వ్యత్యాసం ఉందంటూ పలు లోపాలను లేవనెత్తింది. ఈ మేరకు హర్యాన స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్ షోకాజ్ నోటీస్‌కి ప్రతిస్పందించేందుకు సదరు కంపెనీకి సుమారు 7 రోజుల వ్యవధి ఇచ్చింది. సదరు కంపెనీపైన వచ్చిన ఆరోపణలు నిజమైతే గనుక కంపెనీ తయారీ లైసెన్సు రద్దు చేయడమే గాక తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. (చదవండి: చిన్నారులను మింగేసిన దగ్గు మందు... సంచలన విషయాలు) -
స్వాతిముత్యం: ఆరోగ్యం ఆనందం
చాలామంది వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని రెండు ప్రపంచాలు చేసుకుంటారు. సరిహద్దులు గీసుకుంటారు. స్వాతి పిరామల్‌కు మాత్రం అలాంటి సరిహద్దులు లేవు. తనకు వైద్యరంగం అంటే ఎంత ఇష్టమో, ఇష్టమైన వంటకాలను చేయడం అంటే కూడా అంతే ఇష్టం. స్వాతి ఆధ్వర్యంలో జరిగే బోర్డ్ మీటింగ్‌లలో హాట్ హాట్ చర్చలే కాదు, ఆమె వండిన హాట్ హాట్ వంటకాలు కూడా దర్శనమిస్తాయి. ‘ఉరుకులు, పరుగులు వద్దు. కూల్‌గా, నవ్వుతూ పనిచేద్దాం’ అని తరచు చెప్పే శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త స్వాతి పిరామల్ తాజాగా ఫ్రాన్స్ అత్యున్నత పౌరపురస్కారం ‘ది షెవాలియే డి లా లీజియన్ దానర్ ఆర్ నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్’ అందుకున్నారు. అంతగా పరిచయం అక్కర్లేని పేరు స్వాతి పిరామల్. సంప్రదాయ గుజరాతీ కుటుంబానికి చెందిన స్వాతి తొలిసారి అడుగుపెట్టింది మాత్రం తనకు ఎంతమాత్రం పరిచయం లేని రంగంలోకి! ఆస్ట్రేలియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నికోలస్ లేబోరేటరీస్ కొనుగోలు చేసినప్పుడు తనకు, భర్త అజయ్ పిరామల్‌కు బొత్తిగా ఏమీ తెలియదు. తన చేతిలో మాత్రం ఎంబీబీయస్ డిగ్రీ ఉంది. నడుస్తూ నడుస్తూనే, ప్రయాణిస్తూనే ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. రాత్రనకా, పగలనకా కష్టపడ్డారు. ఆ కష్టం వృథా పోలేదు. అనతి కాలంలోనే కంపెనీ అగ్రస్థానంలోకి వెళ్లింది. ఈ రంగానికి సంబంధించిన పనితీరు విషయానికి వస్తే ‘ఇలాగే’ అన్నట్లుగా ఉండేది. ‘ఇలా కూడా చేయవచ్చు’ అని కూల్‌గా నిరూపించింది స్వాతి పిరామల్. ‘వ్యక్తిగత, వృత్తిజీవితాలకు మధ్య ఉండే సరిహద్దు రేఖను స్వాతి చెరిపేశారు’ అనే మాట వినబడుతుంటుంది. అయితే ఈ కామెంట్‌ను ఆమె ప్రశంసగానే స్వీకరిస్తుంది. ఇంట్లో వంట చేస్తూనే, టీ తయారు చేస్తూనే క్లయింట్స్‌తో స్వాతి మాట్లాడే దృశ్యం సా«ధారణం. చాలా సందర్భాల్లో క్లయింట్స్ ఆమె ఆతిథ్యం స్వీకరిస్తూనే వ్యాపార విషయాలు మాట్లాడుతుంటారు. ఈ దృశ్యాన్ని చూస్తుంటే స్వాతి తన బంధువులు, స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్నట్లు అనిపిస్తుంది తప్ప క్లయింట్స్‌తో కలిసి బిజినెస్ విషయాలు చర్చిస్తున్నట్లుగా ఉండదు! ‘ఔషధాలను అమ్మడానికి మాత్రమే మా పని పరిమితమైనది కాదు. సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ముందు జాగ్రత్తలు సూచించి, ఆచరించేలా చేయడం కూడా’ అంటుంది స్వాతి పిరామల్. ఇండియా అపెక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ తొలి మహిళా ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించిన స్వాతి పిరామల్ సైన్స్, ఔషధరంగాల్లో సేవలు, భారత్–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేస్తున్న కృషికి తాజాగా ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం అందుకుంది. ‘మీ ఖాతాలో ఇన్ని విజయాలు ఉన్నాయి కదా, మీరు ఏ విజయాన్ని చూసి ఎక్కువ గర్వపడతారు?’ అని అడిగితే – ‘ఏదీ లేదు’ అని గలగలమని నవ్వుతుంది స్వాతి. మనం ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే ఇలా అంటుంది... ‘నా మనవరాలు తన రిపోర్ట్ కార్డ్‌తో నవ్వుతూ నా వైపు పరుగెత్తుకు వస్తున్న దృశ్యాన్ని చూస్తున్నప్పుడు, ఈ ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్నట్లు గర్వపడతాను’. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పిరామల్ గ్రూప్ వైస్–చైర్పర్సన్ స్వాతి పిరామల్ ఎన్నో విజయాలు దక్కించుకున్న పారిశ్రామికవేత్త మాత్రమే కాదు. ‘సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్న వ్యక్తి. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టక ముందు మెడికల్ స్కూల్ ఫ్రెండ్స్‌తో కలిసి ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించేది. ఆరోగ్య విషయాలపై వీధి నాటికలు తయారు చేసి ఫ్రెండ్స్‌తో కలిసి వాటిలో నటించేది. ప్రస్తుతం ‘పిరామల్ ఫౌండేషన్’ తరపున సామాజికసేవా కార్యక్రమాలు చేపడుతోంది. ‘ప్రజల ఆరోగ్యం, ఆవిష్కరణలు, కొత్త ఔషధాలపైనే నా ప్రధాన దృష్టి’ అని చెబుతుంది స్వాతి పిరామల్. -
లాజిస్టిక్స్‌కు సానుకూలం..
ముంబై: లాజిస్టిక్స్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం మేర వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. అయితే చమురు, కమోడిటీల ధరలు పెరుగుతున్న దృష్ట్యా ఈ రంగంలోని కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి ఉంటుందని పేర్కొంది. లాజిస్టిక్స్ రంగంపై ఒక నివేదికను ఇక్రా గురువారం విడుదల చేసింది. 2021–22లో ఈ రంగంలో వృద్ధి కరోనా ముందు నాటితో పోలిస్తే 14–17 శాతం అధికంగా ఉంటుందని తెలిపింది. మధ్య కాలానికి ఆదాయంలో వృద్ధి అన్నది ఈ కామర్స్, ఎఫ్ఎంసీజీ, రిటైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ నుంచి వస్తుందని పేర్కొంది. జీఎస్టీ, ఈవేబిల్లు అమలు తర్వాత లాజిస్టిక్స్ సేవల్లో సంస్థాగత వాటా పెరుగుతున్నట్టు వివరించింది. బహుళ సేవలను ఆఫర్ చేస్తుండడం కూడా ఆదరణ పెరగడానికి కారణంగా పేర్కొంది. పైగా ఈ రంగంలోని చిన్న సంస్థలతో పోలిస్తే పెద్ద సంస్థలకు ఉన్న ఆర్థిక సౌలభ్యం దృష్ట్యా, వాటికి ఆదరణ పెరుగుతోందని.. ఈ రంగంలో రానున్న రోజుల్లో మరింత వ్యాపారం సంస్థాగతం వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. క్రమంగా పెరుగుతున్న డిమాండ్ కొన్ని నెలలుగా రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నట్టు ఇక్రా తెలిపింది. పలు రంగాల్లో డిమాండ్ పుంజుకోవడం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. కరోనా మూడో విడత వేగంగా సమసిపోవడంతో ఆంక్షలను ఎత్తేయడం కలిసి వచ్చినట్టు వివరించింది. కమోడిటీల ధరలు పెరిగిపోవడం, రవాణా చార్జీలన్నవి స్వల్పకాలంలో సమస్యలుగా ప్రస్తావించింది. వినియోగ డిమాండ్‌పై మార్జిన్లు ఆధారపడి ఉంటాయని అంచనా వేసింది. ‘‘త్రైమాసికం వారీగా లాజిస్టిక్స్ రంగం ఆదాయం 2021–22 రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి వెళ్లింది. పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం కలిసొచ్చింది’’అని ఇక్రా తన నివేదికలో తెలిపింది. 2022 జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈవే బిల్లుల పరిమాణం, ఫాస్టాగ్ వసూళ్లలో స్థిరత్వం ఉన్నట్టు ఇక్రా నివేదిక వివరించింది. -
లేడీబాస్.. మెగా డీల్
న్యూఢిల్లీ: లేడీబాస్ కిరన్ మజుందార్‌షా నేృతృత్వంలోని ఔషధాలు, ఆరోగ్య సేవల రంగంలో దూసుకెళ్తోన్న బయోకాన్ భారీ డీల్‌కు తెరలేపింది. యూఎస్‌కు చెందిన హెల్త్‌కేర్ కంపెనీ వయాట్రిస్ బయోసిమిలర్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు బయోకాన్ బయోలాజిక్స్ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ.25,140 కోట్లు. ఇందులో నగదుతోపాటు బయోకాన్ బయోలాజిక్స్కు చెందిన రూ.7,550 కోట్ల విలువైన కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్‌ను వయాట్రిస్‌కు జారీ చేస్తారు. కంపెనీలో ఇది 12.9 శాతం ఈక్విటీకి సమానం. రెండు కంపెనీల డైరెక్టర్ల బోర్డు ఈ లావాదేవీని ఆమోదించింది. 2022 జూలై–డిసెంబర్ మధ్య డీల్ పూర్తి కానుంది. ఒప్పందంలో భాగంగా వయాట్రిస్ అంతర్జాతీయ బయోసిమిలర్స్ వ్యాపారాన్ని బయోకాన్ బయోలాజిక్స్ దక్కించుకుంటుంది. దానితో పాటు లైసెన్స్ పొందిన బయోసిమిలర్స్ ఆస్తుల పోర్ట్‌ఫోలియో కూడా చేజిక్కించుకుంటుంది. రెండేళ్లలో ఐపీవోకు..: ఈ వ్యూహాత్మక కలయిక రెండు భాగస్వాముల పరిపూర్ణమైన సామర్థ్యాలు, బలాలను ఒకచోట చేర్చుతుందని బయోకాన్ బయోలాజిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ఈ సందర్భంగా తెలిపారు. ‘యూఎస్, యూరప్‌లోని అభివృద్ధి చెందిన మార్కెట్లలో బయోకాన్ బయోలాజిక్స్ ఒక బలమైన వాణిజ్య వేదికను పొందేందుకు, ప్రపంచ బ్రాండ్‌ను నిర్మించేందుకు, సంస్థ ప్రయాణాన్ని వేగిరం చేయడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. బయోకాన్ బయోలాజిక్స్ రెండేళ్లలో ఐపీవోకు రానుంది. తాజా డీల్‌తో కంపెనీ విలువ రూ.60,400 కోట్లకు చేరుతుంది. ఐపీవో చాలా ఆకర్షణీయమైన స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాం. వాటాదార్లకు భారీగా విలువను సృష్టించబోతోంది. వయాట్రిస్ డీల్‌తో బయోసిమిలర్స్ రంగంలో బయోకాన్ బయోలాజిక్స్ లీడర్‌గా మారడానికి సహాయపడుతుంది. 2020–21లో రూ.2,900 కోట్ల ఆదాయం ఆర్జించాం’ అని వివరించారు. సుమారు రూ.7,550 కోట్లు.. వయాట్రిస్ బయోసిమిలర్స్ ఆదాయం వచ్చే ఏడాది సుమారు రూ.7,550 కోట్లు ఉంటుందని అంచనా. ఈ డీల్ కారణంగా బయోకాన్ ప్రస్తుత శ్రేణి వాణిజ్యీకరించిన ఇన్సులిన్లు, ఆంకాలజీ, ఇమ్యునాలజీ బయోసిమిలర్స్తోపాటు అభివృద్ధిలో ఉన్న అనేక ఇతర బయోసిమిలర్స్ ఆస్తులతో కూడిన సమగ్ర పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండటానికి సాయపడుతుంది. ప్రస్తుతం 20 బయోసిమిలర్స్ పోర్ట్‌ఫోలియోను బయోకాన్ ఖాతాలో ఉంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ లైఫ్ సైన్సెస్‌తో గతంలో ప్రకటించిన భాగస్వామ్యం ద్వారా వ్యాక్సిన్ పోర్ట్‌ఫోలియో సైతం తన ఖాతాకు జోడించింది. అంతర్జాతీయ బయోసిమిలర్స్ రంగంలో ధరల ఒత్తిడిని తగ్గించడంలో ఈ డీల్ సహాయపడుతుందని బయోకాన్ బయాలాజిక్స్ ఎండీ అరుణ్ చందవర్కర్ తెలిపారు. -
రాజ్యసభ ఎంపీ మహేంద్రప్రసాద్ కన్నుమూత
న్యూఢిల్లీ: జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్రప్రసాద్ (81) ఢిల్లీలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతికి ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సంతాపం ప్రకటించారు. అరిస్టో ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడైన మహేంద్రప్రసాద్‌కు పార్లమెంట్ సభ్యుల్లో అత్యంత ధనికుల్లో ఒకరిగా పేరుంది. మహేంద్ర బిహార్ నుంచి 7 పర్యాయాలు రాజ్యసభకు, ఒక విడత లోక్‌సభకు ఎన్నికయ్యారు. (చదవండి: చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు) -
ఫార్మా సిటీతో కాలుష్యం? చిరుతలు, అరుదైన పక్షుల ఉనికి కనుమరుగు!
సాక్షి,హైదరాబాద్: మహా నగరానికి ఆనుకొని ముచ్చర్లలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఫార్మాసిటీతో సమీప భవిష్యత్‌లో కాలుష్యం పంజా విసరడం ఖాయమని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ప్రాంతంలో అరుదైన వృక్ష, జంతు జాలం మనుగడకు ఫార్మాసిటీ ప్రశ్నార్థకంగా మార్చేస్తుందని వెల్లడైంది. ప్రధానంగా ఈ ప్రాంతంలోని చిరుతలు, అరుదైన పక్షుల ఉనికి కనుమరుగవుతుందని తేలింది. ► ప్రభుత్వం సుమారు 19 వేల ఎకరాల్లో నిర్మించతలపెట్టిన ఫార్మాసిటీ పరిధిలో వృక్ష, జంతుజాలం ఉనికి, మనుగడ అన్న అంశంపై ఇటీవల ర్యాప్టర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. ► ఈ సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం సిద్ధం చేసిన పర్యావరణ ప్రభావ నివేదిక సైతం లోపభూయిష్టంగా ఉందని ఈ సంస్థ ఆక్షేపించడం గమనార్హం. తమ అధ్యయన వివరాలను సర్కారు ఏర్పాటు చేసిన పర్యావరణ మదింపు సంఘం (ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీ)కి సైతం సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ► ప్రధానంగా మద్దివెన్ను, కడ్తాల్, తిప్పారెడ్డిపల్లి రిజర్వు ఫారెస్టుల ఉనికిని ఫార్మాసిటీ ప్రశ్నార్థకంగా మార్చేస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ అభయారణ్యాలలో అరుదైన వృక్ష జాతులు, క్షీరదాలు, పక్షులున్నాయి. ఇందులో ప్రధానంగా అంతరించిపోయే ప్రమాదం ఉన్న పక్షి ఎల్లో ధ్రోటెడ్ బుల్బుల్ అనే పక్షి మనుగడం కష్టతరమవుతుందని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది. ► ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థ విడుదల చేసిన రెడ్‌లిస్ట్‌లో ఈ పక్షి ఉందని తెలిపింది. ఇక ఈ ప్రాంతంలో విస్తరించిన కొండల్లో చిరుత పులులకు ఆవాసాలున్నాయని, వీటికి ఆహారం,తాగునీటి వసతి కూడా ఇక్కడ ఉందని, ఫార్మాసిటీ ఏర్పాటుతో వీటి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొంది. పంటలకూ గడ్డుకాలమే.. ఫార్మాసిటీ ఏర్పాటుతో సుమారు 11 వేల ఎకరాల్లో విస్తరించిన విభిన్న పంటలు, అడవులు, వృక్ష, జంతుజాలం మనుగడ ప్రశ్నార్థకం కానుందని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది. వైట్ రంప్డ్ వల్చర్స్, స్నేక్ ఈగల్, సర్కేటస్ గాలికస్, వైట్ ఐ బజార్డ్, బుటాస్టర్ టేసా, షిక్రా, బ్లాక్షోల్డర్డ్ కైట్, ప్యాలిడ్ హ్యారియర్ వంటి పక్షులు అంతర్థానమవుతాయని ఈ అధ్యయనం తెలిపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ ప్రభావ నివేదిక లోపభూయిస్టంగా ఉందని సంస్థ ప్రతినిధి ప్రణయ్ జువ్వాది తెలిపారు. -
భారత్ తయారీకి ‘పీఎల్ఐ’ బూస్ట్
న్యూఢిల్లీ: దేశంలో టెలికం, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్, జౌళి, ఫుడ్ ప్రాసెసింగ్సహా పదమూడు కీలక తయారీ పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చేందుకు ప్రకటించిన ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇవ్వనుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తయారీ రంగం ఉత్పత్తి వచ్చే ఐదేళ్లలో 520 బిలియన్ డాలర్లకు (డాలర్ మారకంలో రూపాయి విలువ 73గా చూస్తే, దాదాపు 37,96,000 కోట్లు) చేరుతుందన్ని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తయారీ రంగం ఉత్పత్తి దాదాపు 380 బిలియన్ డాలర్లు. దిగుమతులపై ఆధాపడ్డాన్ని తగ్గించడం, ఎగుమతుల పెంపు లక్ష్యంగా మొత్తం 13 రంగాలకు రానున్న ఐదేళ్ల కాలంలో రూ.1.97 లక్షల కోట్ల ప్రయోజనాలు కల్పించడం పీఎల్ఐ పథకంలో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. పీఎల్ఐ స్కీమ్‌పై పారిశ్రామిక, అంతర్జాతీయ వాణిజ్య శాఖ (డీపీఐఐటీ), నీతి ఆయోగ్ నిర్వహించిన ఒక వెబినార్‌ను ఉద్దేశించి ప్రధాని శుక్రవారం చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ► భారీ వృద్ధే ప్రధాన లక్ష్యంగా కేంద్రం తయారీ రంగంలో భారీ సంస్కరణలను తీసుకువస్తోంది. వచ్చే ఐదేళ్లకు పీఎల్ఐకి ఈ ఏడాది బడ్జెట్లో రూ.2 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. ► ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారుకూడా పీఎల్ఐ స్కీమ్ వల్ల ప్రయోజనం పొందుతారు. అలాగే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. ► మౌలిక వనరులకు సంబంధించి సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. వ్యాపార పరిస్థితులు మరింత మెరుగుపడ్డానికి తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. పరిశ్రమల రవాణా వ్యయాలు గణనీయంగా తగ్గడానికి కృషి జరుగుతోంది. ► వివిధ స్థాయిల్లో ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రోత్సాహానికి కేంద్రం గడచిన ఆరు, ఏడు సంవత్సరాల్లో పలు విజయవంతమైన చర్యలను తీసుకుంది. ► పలు విభాగాల్లో నియంత్రణా పరమైన క్లిష్టతలను సైతం ప్రభుత్వం తగ్గిస్తోంది. ► అలాగే విభిన్న రంగాల్లో అత్యాధునిక సాంకేతికను ప్రవేశపెట్టడానికి తగిన చొరవలను, నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటోంది. చిరుధాన్యాల సంవత్సరం... మనకు ఒక అవకాశం 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలన్న భారత్ తీర్మానానికి ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవ ఆమోదముద్ర వేయడాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది భారత్ రైతులకు ఒక మంచి అవకాశమని ఆయన అన్నారు. ఆరోగ్య సంరక్షణలో చిరుధాన్యాల విలువను తెలియజేడానికి ప్రపంచవ్యాప్త ప్రచారం ప్రారంభించాలని ఆయన పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. ఈ తరహా ప్రచారం భారత్ రైతులకు ప్రయోజనం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. వృద్ధే బడ్జెట్ లక్ష్యం: వివేక్ దేవ్రాయ్ వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ వృద్ధే లక్ష్యంగా రూపొందిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ పేర్కొన్నారు. అలాగే పన్ను రేట్లు స్థిరంగా కొనసాగుతాయని కూడా సంకేతాలు ఇచ్చిందని వివరించారు. వినియోగం, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయాల పెంపు లక్ష్యంగా సంస్కరణలపై 2021–22 బడ్జెట్ దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ బీఎఫ్ఎస్ఐ అండ్ ఫిన్‌టెక్ సదసు 2021ని ఉద్ధేశించి ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 11 శాతంగా నమోదవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్షీణత 8 శాతంగా ఉంటుందని అంచనా. ఎగుమతుల పెంపు ప్రభుత్వం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. వాస్తవిక వృద్ధిని అందించే రంగాల్లో ఎగుమతులు ఒకటి. అయితే ఎగుమతుల పెరుగుదల ఇంకా అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ఫైనాన్షియల్ రంగం ‘నెమ్మది’: చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యం ఇదే సమావేశంలో మాట్లాడుతూ, భారత్ ఫైనాన్షియల్ రంగం తన పూర్తి స్థామర్థ్యం మేరకు పురోగమించడం లేదని అన్నారు. ఒక రకంగా చాలా నెమ్మదిగా నడుస్తోందన్నారు. ఉదాహరణకు ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌లో బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రపంచంలో 55వ ర్యాంకులో ఉందన్నారు. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అవినాశ్ గుప్తా మాట్లాడుతూ, భారత్‌ను వృద్ధి బాటలో సంఘటితంగా ముందుకు నడిపించడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రత్యేకించి లాక్డౌన్ పరిస్థితుల్లో డిజిటల్ టెక్నాలజీ కీలకపాత్ర మరువలేనిదన్నారు. డిజిటల్ లావాదేవీల పరిమాణం 2020 ఏప్రిల్– 2021 మార్చి 1 మధ్య రూ.4,525 కోట్లకు చేరిందని అన్నారు. -
డాక్టర్ రెడ్డీస్‌పై సైబర్ దాడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ సైబర్ దాడికి గురైంది. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగిందని కంపెనీ వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన కంపెనీ బృందం రంగంలోకి దిగింది. అన్ని డేటా సెంటర్ సర్వీసులను వేరుచేసింది. అలాగే అంతర్జాతీయంగా కొన్ని తయారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసినట్టు సమాచారం. ఘటనకు కారణాలను తెలుసుకునేందుకు ఐటీ నెట్వర్క్ సిస్టమ్‌ను సంస్థ సమీక్షిస్తోంది.యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డం, బ్రెజిల్, రష్యాతోపాటు భారత్‌లోని ప్లాంట్లపై ఈ సైబర్ దాడి ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో రష్యా తయారీ కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్–వి రెండు, మూడవ దశ మానవ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ ఇటీవలే అనుమతి పొందిన నేపథ్యంలో కంపెనీ సర్వర్లపై ఈ దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎటువంటి ప్రభావం లేదు.. సైబర్ అటాక్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అన్ని డేటా సెంటర్ సర్వీసులను ఐసోలేట్ చేశామని బీఎస్ఈకి సంస్థ వెల్లడించింది. 24 గంటల్లో అన్ని సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తాము భావిస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముకేశ్ రాథి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై పెద్దగా ఎటువంటి ప్రభావం లేదని స్పష్టం చేశారు. ఔషధ రంగంలో మార్కెట్ విలువ పరంగా భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ రెండవ స్థానంలో ఉంది. సంస్థ దేశంలో 17 తయారీ ప్లాంట్లు, ఆరు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. విదేశాల్లో ఆరు తయారీ ప్లాంట్లు, మూడు ఆర్అండ్డీ సెంటర్లు ఉన్నాయి. కాగా, గురువారం డాక్టర్ రెడ్డీస్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.46 శాతం (రూ.23.30) తగ్గి రూ.5,023.60 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో షేరు ధర రూ.4,832.40కి చేరి తిరిగి పుంజుకుంది. సైబర్ సెక్యూరిటీకి కంపెనీల ప్రాధాన్యం: సిస్కో బెంగళూరు: కరోనా వైరస్ పరిణామాలతో వర్క్ ఫ్రం హోమ్ విధానానికి మళ్లుతున్న నేపథ్యంలో కంపెనీలకు సైబర్ సెక్యూరిటీపరమైన సవాళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో వీటిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. సిస్కో నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కరోనా వైరస్ మహమ్మారి సమస్యలు ప్రారంభమైనప్పట్నుంచీ సైబర్ దాడులు జరగడం లేదా హెచ్చరికలు వచ్చిన ఉదంతాలు 25 శాతం పైగా పెరిగాయని సుమారు 73 శాతం దేశీ సంస్థలు వెల్లడించాయి. సుమారు మూడింట రెండొంతుల సంస్థలు (65 శాతం) రిమోట్ వర్కింగ్‌కు వీలుగా పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ చర్యలు తీసుకున్నాయి. ఐటీ రంగంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించే 3,000 పైచిలుకు సంస్థలపై సిస్కో ఈ సర్వే నిర్వహించింది. ప్రస్తుతం రిమోట్ వర్కింగ్ విధానం మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు పటిష్టమైన సైబర్‌సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయని, క్లౌడ్ సెక్యూరిటీపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని సిస్కో ఇండియా డైరెక్టర్ రామన్ తెలిపారు. -
గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా అమ్మకం!
హైదరాబాద్: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు కేకేఆర్, బెయిన్ క్యాపిటల్, బ్లాక్‌స్టోన్ రేసులో ఉన్నట్టు సమాచారం. కంపెనీ నుంచి నిష్క్రమించాలన్న ప్రణాళికను ప్రమోటర్లు పునరుద్ధరించారని, మెజారిటీ వాటాను ప్రీమియం వాల్యుయేషన్‌తో విక్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గ్రాన్యూల్స్ ఇండియాలో ఈ ఏడాది జూన్ నాటికి ప్రమోటర్లకు 42.13 శాతం వాటా ఉంది. కాగా, ప్రతిపాదిత వాటా కొనుగోలుకై నాన్ బైండింగ్ బిడ్లను మూడు సంస్థలు దాఖలు చేసినట్టు సమాచారం. కొనుగోలుదార్ల వేటకై ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన కొటక్ మహీంద్రా క్యాపిటల్‌ను కంపెనీ ప్రమోటర్లు నియమించారు. వాటాల విక్రయంపై మీడియాలో వస్తున్న ఊహాగానాలపై స్పందిం^è లేమని గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్స్ ఈడీ ప్రియాంక చిగురుపాటి స్పష్టం చేశారు. అయితే ఫార్మా రంగంలో ఈ స్థాయి డీల్స్ సహజమని, దీంతో ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ ఆసక్తి చూపుతున్నాయని ఒక కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ డీల్‌ను వేదికగా చేసుకుని మరింత విస్తరణకు ఆస్కారం ఉంటుందనేది ఆలోచన అని ఆయన అన్నారు. మూడు సంస్థలూ పోటీపడితే బిడ్డింగ్ వార్‌కు అవకాశం ఉంది. ప్రమోటర్లు తమ వాటా విక్రయానికి ఫార్మా రంగంలో వాల్యుయేషన్స్, వారసత్వ ప్రణాళిక సమస్యలు కారణంగా తెలుస్తోంది. 2019 నవంబరులోనూ ప్రమోటర్లు తమ వాటాను అమ్మాలని భావించారు. తాజా వార్తల నేపథ్యంలో గ్రాన్యూల్స్ షేరు ధర శుక్రవారం 4.20 శాతం అధికమై రూ.375.75 వద్ద స్థిరపడింది. -
కరోనా టెస్ట్ కిట్ల ‘కొనుగోల్‌మాల్’!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ పరీక్షలకు ఉపయోగించే ‘యాంటీ బాడీ టెస్ట్ కిట్ల’ కోసం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) మార్చి 25వ తేదీన బిడ్డింగ్‌లకు ఆహ్వానించింది. విదేశాల్లో మాత్రమే దొరికే ఈ కిట్ల సరఫరా కోసం బిడ్డింగ్ వేసే కంపెనీలకు ‘దిగుమతి లైసెన్స్’ ఉండాలనే షరతును విధించలేదు. దాంతో దిగుమతి లైసెన్స్‌లేని ఢిల్లీకి చెందిన ‘ఆర్క్ ఫార్మాష్యూటికల్స్’ కంపెనీతోపాటు చైనా నుంచే కాకుండా యూరప్ నుంచి కూడా మందులను, వైద్య పరికరాలను దిగుమతి చేసుకునే లైసెన్స్ ఉన్న కొన్ని కంపెనీలు బిడ్డింగ్ వేశాయి. భారత వైద్య పరిశోధనా మండలి మార్చి 27వ తేదీన ఆశ్చర్యంగా 30 కోట్ల రూపాయల విలువైన ‘టెస్ట్ కిట్ల’ను సరఫరా చేయాల్సిందిగా ‘ఆర్క్ ఫార్మాష్యూటికల్స్’కు అప్పగించింది. ఈ వ్యవహారం ఒకానొక దశలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడంతో పలు రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. కిట్‌కు 600 రూపాయల చొప్పున చైనాకు చెందిన ‘గ్వాంజౌ వాండ్ఫో బయోటెక్’ తయారు చేసిన టెస్ట్ కిట్లను సరఫరా చేస్తామని ఆర్క్ ఫార్మాష్యూటికల్స్ కంపెనీ, భారత వైద్య పరిశోధనా మండలితో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆర్క్ ఫార్మా ష్యూటికల్స్కు దిగుమతి లైసెన్స్ లేకపోవడమే కాకుండా చైనా కంపెనీతో ఎలాంటి ఒప్పందం లేదు. గ్వాంజౌ అనే చైనా కంపెనీతో చెన్నైకి చెందిన ‘మ్యాట్రిక్స్ ప్రైవేటు లిమిటెడ్’ కంపెనీకి ఒప్పందం ఉంది. ఆ కంపెనీకి దిగుమతి లైసెన్స్ ఉంది. కనీసం మ్యాట్రిక్స్తోని ఆర్క్ ఫార్మాష్యూటికల్స్‌కు ఎలాంటి ఒప్పందం లేదు. మ్యాట్రిక్స్‌కు ఆలిండియా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోన్న ఢిల్లీలోని ‘రేర్ మెటబాలిక్స్ లైవ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీతో కరోనా టెస్ట్ కిట్ల సరఫరాకు ‘ఆర్క్ ఫార్మాష్యూటికల్స్’ ఒప్పందం చేసుకుంది. దీంతో చైనా నుంచి మ్యాట్రిక్స్ కంపెనీ 245 రూపాయల చొప్పున కిట్లను దిగుమతి చేసుకొని రేర్ మెటబాలిక్స్కు సరఫరా చేయగా, ఆ కంపెనీ వాటిని 420 రూపాయలకు చొప్పున ఆర్క్ ఫార్మాష్యూటికల్స్‌కు సరఫరా చేసింది. ఆ కంపెనీ భారత వైద్య పరిశోధనా మండలితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వాటిని 600 రూపాయలకు సరఫరా చేసింది. ఇంతవరకు లావాదేవీలు గుట్టు చప్పుడు కాకుండా జరిగాయి. (వైరస్ మూలాలపై గందరగోళం..) ఆ తర్వాత 50 వేల కిట్లను సరఫరా చేసేందుకు మ్యాట్రిక్స్ కంపెనీ నేరుగా తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఐసీఎంఆర్‌కు సరఫరా చేసినట్లుగా డిస్ట్రిబ్యూటర్లుగా తమకు వాటా ఇవ్వాలంటూ ఆర్క్ ఫార్మాష్యూటికల్స్, రేర్ మెటబాలిక్స్ మ్యాట్రిక్స్‌ను డిమాండ్ చేశాయి. అందుకు ఆ కంపెనీ అంగీకరించక పోవడంతో రెండు కంపెనీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. అక్కడ 245 రూపాయల కిట్లు, 420 రూపాయలుగా మారడం, ఆ తర్వాత 600 రూపాయలుగా మారిన బాగోతం వెలుగులోకి వచ్చింది. కోర్టు విచారణ జరిగి ఏప్రిల్ 17వ తేదీ నాటికి ఐసీఎంఆర్‌కు 2.76 లక్షల కిట్లు సరఫరాకాగా, ఇంకా 2.34 లక్షల కిట్లను సరఫరా చేయాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న వాటిని 420 రూపాయల చొప్పునే సరఫరా చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. కరోనా టెస్ట్ కిట్లను తయారుచేసే చైనాకు చెందిన ‘గెటైన్ బయోటెక్ ఇన్కార్పొరేషన్’ కంపెనీతో ఢిల్లీకి చెందిన ‘సోవర్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీకి ఒప్పందం ఉండడమే కాకుండా ఆ కంపెనీకి ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ మంజూరు చేసిన దిగుమతి లైసెన్స్ కూడా ఉంది. ‘600 రూపాయలకు తక్కువగా కిట్ల సరఫరాకు ఐసీఎంఆర్‌లో బిడ్లను దాఖలు చేశాం. మమ్మల్ని కాదని ఆర్క్ ఫార్మాష్యూటిక్స్కు ఎలా బిడ్డింగ్ ఖరారు చేశారో మాకు అర్థం కావడం లేదు’ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ విజేంద్ర జైస్వాల్ మీడియా ముందు వాపోయారు. (మాస్క్ మాటున నిశ్శబ్దంగా ఏడ్చాను) చెన్నైలోని ‘ట్రివిట్రాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్’ కంపెనీకి కరోనా కిట్లను తయారు చేసే మూడు చైనా కంపెనీలతో ఒప్పందం ఉండడంతోపాటు దిగుమతి ఒప్పందం ఉంది. ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తుందనడానికి గుర్తుగా ఆ కంపెనీకి ‘యూరోపియన్ సర్టిఫికేషన్’ కూడా ఉంది. తాము కూడా 600 రూపాయలకు లోపే బిడ్డింగ్ వేశామని, అయినా తమకు రాలేదని, ఈ విషయమై ఐసీఎంఆర్ అధికారులను అడిగితే వారి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని కంపెనీ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్కే వేలు మీడియా ముందు ఆరోపించారు. కరోనాలో కొత్తగా ఆరు లక్షణాలు -
చైనా–పాక్‌లు మారేదెన్నడు?
చైనా గనుక తన ఔషధాల ఎగుమతిని నిలిపివేస్తే, అమెరికా ఈ కరోనా వైరస్ అంటువ్యాధితో నాశనమైపోతుంది. చాలా రోజులుగా వస్తువుల తయారీ పనుల్ని చైనాకి ఔట్‌సోర్స్ చేస్తోన్న ప్రపంచం ఇప్పుడు దాని ఫలితాలను ఎదుర్కొంటోంది. ప్రపంచం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటంటే చైనా మీద అతిగా ఆధారపడటాన్ని తగ్గించాలి. ఇది కేవలం కీలకమైన ఔషధాలు, వైద్యపరికరాల కోసం మాత్రమే కాదు, ఇతర రకాల వస్తుతయారీ పంపిణీ వ్యవస్థలతో ముడిపడిన అన్నిటికీ వర్తిస్తుంది. దీనికి ఎంతో సమయం పట్టవచ్చు. విపరీతమైన ఖర్చు కావచ్చు. కానీ ప్రత్యేకించి ఇట్లాంటి ప్రాణాంతకమైన సందర్భాలలో చైనాకు బందీగా దొరికిపోకుండా ఉండటానికి అది పనికొస్తుంది. కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధి మునుపటి తరాలు ఎన్నడూ ఎదుర్కోని సవాళ్లను అంతర్జాతీయ సమాజం ముందుంచుతోంది. కానీ మునుపటి సవాళ్లలాగే ఇది కూడా బలహీనపడుతుంది. అయితే ఈ వ్యాధి మిగిల్చి వెళ్లే అనేక జ్ఞాపకాల్లో రెండు మాత్రం ప్రత్యేకంగా మిగిలిపోతాయి. ఒకటి.. మొత్తం సంక్షోభం ప్రారంభమైన మనకు ఉత్తరాన ఉండే పొరుగుదేశం చైనా.. మరొకటి ఏదంటే సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ భారత్‌పై విమర్శలు గుప్పించకుండా ఉండలేని.. మనకు పశ్చిమాన ఉండే పొరుగుదేశం పాకిస్తాన్. మార్చి 22న చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఇలా ట్వీట్ చేశారు: ‘మేడిన్ చైనావన్నీ అంటువ్యాధులు కలిగిం చేట్లయితే, చైనా ఫేస్‌మాస్కులు వాడొద్దు, చైనా పీపీఈలు వాడొద్దు, చైనాలో తయారైన వెంటిలేటర్లు వాడొద్దు. ఇలాగైతేనే మీరు వైరస్ తగలకుండా ఉండగలుగుతారు. ‘ఈ ప్రపంచ సంక్షోభానికి తన చర్యలే కారణమైన చైనా (ప్రపంచానికి ఇంకా వాస్తవం తెలియవలసే ఉంది) ప్రదర్శించిన ఈ అహంకారం ప్రపంచం పట్ల ఆ దేశానికున్న అలక్ష్యాన్ని చూపుతోంది. చాలా రోజులుగా వస్తువుల తయారీ పనుల్ని చైనాకి ఔట్‌సోర్స్ చేస్తోన్న ప్రపంచం ఇప్పుడు దాని ఫలితాలను ఎదుర్కొంటోంది. అమెరికాతో సహా ఎన్నో దేశాలు సాధారణ వైద్య పరికరాలు, ఔషధాల కోసం చైనామీద ఆధారపడి వున్నాయి. అమెరికా తనకు తక్షణ అవసరంగా ఉన్న ఈ ఔషధాలు, వైద్య పరికరాలు దొరక్క ప్రాణాంతకమైన నష్టాన్ని అనుభవిస్తోంది. చైనా అధికార వార్తా ఏజెన్సీ జిన్ హువాను ఉటంకిస్తూ ది న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకారం, చైనా గనుక తన ఔషధాల ఎగుమతిని నిలిపివేస్తే, అమెరికా ఈ కరోనా వైరస్ అంటువ్యాధితో నాశనమైపోతుంది. దీన్నించి ప్రపంచం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటంటే చైనా మీద అతిగా ఆధారపడటాన్ని తగ్గించాలి. ఇది కేవలం కీలకమైన ఔషధాలు, వైద్యపరికరాల కోసం మాత్రమే కాదు, ఇతర రకాల వస్తుతయారీ పంపిణీవ్యవస్థలతో ముడిపడిన అన్నిటికీ వర్తిస్తుంది. దీనికి ఎంతో సమయం పట్టవచ్చు. విపరీతమైన ఖర్చు కావచ్చు. కానీ ప్రత్యేకించి ఇట్లాంటి ప్రాణాంతకమైన సందర్భాలలో చైనాకు బందీగా దొరికిపోకుండా ఉండటానికి అది పనికొస్తుంది. ఒక దేశ సూక్ష్మమైన మౌలిక సదుపాయాల వ్యవస్థను ప్రభావితం చేయగల 5జి లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో హువై లాంటి చైనా కంపెనీలను కలుపుకొని పోకపోవడం కూడా ప్రపంచానికి మేలుకొలుపు కావాలి. అయితే వైద్య పరికరాల గురించి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి పలికిన ప్రగల్భాలు ఉత్త అబద్ధాలని స్పెయిన్, చెక్ రిపబ్లిక్, ఉక్రెయిన్, ఫిలిప్పైన్స్, నెదర్ల్యాండ్స్, టర్కీల నుండి వస్తున్న వార్తలు నిరూపిస్తున్నాయి. చైనా పంపిణీ చేసిన టెస్ట్ కిట్లు 30 శాతం మాత్రమే కచ్చితమైన ఫలి తాలు ఇస్తున్నాయనీ, ఒక సందర్భంలో వాడేసిన మాస్కులు కూడా పంపినట్టుగానూ కొన్ని కథనాలు చెపుతున్నాయి. చివరగా ఈ ప్రాణాంతకమైన వైరస్‌ను ప్రపంచానికి వ్యాపించేలా చేసిన పరిణామాలను చైనా ఎదుర్కోక తప్పదు. వూహాన్లో ఈ వైరస్ ఎలా ప్రారంభమయిందో ఇంకా చర్చించవలసి ఉన్నప్పటికీ దీని వ్యాప్తి జరిగిన తీరులో ఏ సందేహమూ లేదు. మనుషులలో ఒకరి నుంచి ఒకరికి ఇది వ్యాప్తి చెందుతుందని తెలిసికూడా వూహాన్‌తో సహా మరి కొన్ని ప్రదేశాల నుంచి సుమారు 70 లక్షల మందిని విదేశాలకు ప్రయాణించడానికి చైనా అనుమతిం చింది. ఇది నేరపూరిత చర్య. దీనికి చైనాను బాధ్యురాలిగా నిలబెట్టాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఎన్ని లంచాలు మేపినా, ఎంత సమాచారాన్ని తొక్కిపెట్టినా జవాబుదారీతనం నుంచి చైనా తప్పించుకోలేదు. ఇక మన పశ్చిమాన ఉన్న పొరుగుదేశం పాకిస్తాన్ దానిలో అదే ఒక సమాఖ్య. ఫిబ్రవరి 25న మొదటి కేసు నమోదయినప్పటినించీ ఇప్పటికి 2400 కేసులకు ఆ సంఖ్య పెరిగింది. ప్రపంచమంతా ఈ వ్యాధిమీద పోరాడుతున్న సమయంలో జరిగిన సార్క్ దేశాల వీడియో కాన్ఫరెన్సులో పాకిస్తాన్ ప్రతినిధి జమ్మూ కశ్మీర్లో అమలులో ఉన్న నిర్బంధం గురించి ప్రస్తావన తెచ్చారు. పాక్ విదేశాంగ శాఖ, విదేశాంగ మంత్రి కూడా దీని గురించే పలు సందర్భాలలో పదే పదే ప్రస్తావించారు. అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పుగా పరిణమించిన జమ్మూ కశ్మీర్ వ్యవహారాల పట్ల అత్యవసరమైన, అవశ్యమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భద్రతామండలి అధ్యక్ష స్థానంలో ఉన్న చైనాను పాకిస్తాన్ లిఖితపూర్వకంగా కూడా కోరింది. అయితే ఈ ‘అత్యవసరమైన’ వినతిని స్వీకరించడానికి చైనా తిరస్కరించడం పాకిస్తాన్‌కు ఆశాభంగం కలిగించింది. దీనికంటే ముందు పాకిస్తాన్ తన ఇంటిని తాను చక్కబెట్టుకోవాల్సి ఉంది. ‘ఆజాద్‘ జమ్మూ కశ్మీర్, గిల్గిత్–బాల్టిస్తాన్‌లో కేసుల సంఖ్య దాదాపు 200కు చేరింది. మీడియా కథనాల ప్రకారం పంజాబ్‌లో కరోనా పాజిటివ్ వచ్చినవారిని ఈ ప్రాంతంలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని పాకిస్తాన్ ఆర్మీ యోచిస్తుందని తెలి యడం అశుభసూచకం. పాకిస్తాన్ స్పందించిన తీరులో ప్రత్యేకించి నాలుగు అంశాలు గమనించ దగినవి. వైరస్ గనక వ్యాపిస్తే అక్కడ ఉన్న పడకలు, ఎన్–95 మాస్కులు, ఇంటెన్సివ్ కేర్ వార్డుల కొరత, తఫతాన్ లాంటి క్వారంటైన్ కేంద్రాల్లోని గుబులుపుట్టించే పరిస్థితుల వల్ల మొత్తం ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతుంది. ‘మా దగ్గర కనీసం రేబిస్ వ్యాక్సిన్ కూడా లేదు. అలాంటిది వేలాదిమంది రోగులు కరోనా చికిత్స కోసం వస్తే ఏం చేయాలి?‘ అని ఒక డాక్టర్ వాపోయినట్టుగా ఒక మీడియా కథనం. వరుస ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి కేటాయించిన అరకొర నిధుల ఫలితం ఇది. అట్లాగే అధికార స్థానంలో ఎవరు ఉన్నారో కూడా తెలియని సందిగ్ధం నెలకొనివుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న కారణంగా ఇమ్రాన్ ఖాన్ లాక్‌డౌన్‌ను తిరస్కరించారు. కానీ, పీపీపీ అధికారంలో ఉన్న సింధ్ సహా కొన్ని రాష్ట్రాలు విభిన్న స్థాయిల్లో లాక్‌డౌన్‌ను అమలుచేశాయి. పంజాబ్, కేపీకే, బలూచిస్తాన్ దీన్ని అనుసరిం చాయి. రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలయ్యేలా పనిచేస్తామని సైన్యం సంకేతమిచ్చింది. అంటే ఎవరు అధికారంలో ఉన్నట్టు? మూడవది, ఇట్లాంటి క్లిష్టమైన సందర్భంలో కూడా దేశాన్ని ఏకీకృతం చేయగలిగే నాయకత్వ పటిమను ఇమ్రాన్‌ఖాన్ ప్రదర్శించలేకపోయాడు. పైగా ప్రతిపక్షాల మీద నిత్యం కయ్యానికి కాలుదువ్వే వైఖరితో వ్యవహరిస్తున్నాడు. పార్లమెంటు నాయకులకు ఉద్దేశించిన ఒక వీడియో కాన్ఫరెన్సులో ఆయన ప్రసంగించిన తర్వాత అందులో పాల్గొన్నవారి అభిప్రాయాలు వినకుండానే ఆఫ్‌లైన్ అయ్యాడు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడంలో వారి సలహాలను తీసుకోవటం పట్ల ఆయనకు ఆసక్తి లేదు. నాలుగవది, ఇస్లామ్‌ను సంరక్షించే చివరి దేశం తనే అని పాకిస్తాన్ నమ్మకం. సౌదీ అరేబియా, ఇరాన్ లాంటి ఇతర ముస్లిం దేశాలు సమూహాలుగా జనం పోగయ్యే అన్ని మతపరమైన కార్యక్రమాలను నిషేధిస్తే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ’నియమిత సంఖ్య’లో మసీదులలో ప్రార్థనలకు అనుమతినిచ్చింది. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ కొండవాలున ప్రమాదపుటంచున నిలుచుని వుంది. అది జమ్మూకశ్మీర్ గురించి రోదనా గానాలు చేయడం మాని తన పరిస్థితులను చక్కదిద్దుకోవాలి. (ది ట్రిబ్యూన్ సౌజన్యంతో) -తిలక్ దేవశర్ వ్యాసకర్త జాతీయ భద్రత సలహా మండలి సభ్యుడు -
70 వేల కోట్లకు లైఫ్ సైన్సెస్, ఫార్మా!
సాక్షి, హైదరాబాద్: రానున్న పదేళ్లలో లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, దాని అనుబంధ రంగాలను రూ.70 వేల కోట్ల పరిశ్రమగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రస్తుతం ఈ రంగాలకు సంబంధించిన పెట్టుబడుల వాటా సుమారు రూ.35 వేల కోట్ల మేర ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఫార్మా, బయోటెక్, మెడికల్ డివైజెస్ తయారీ రంగా ల్లో వచ్చే దశాబ్దకాలంలో ఈ వాటాను రెండిం తలు చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని కోసం కొత్త పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపై పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న ఫార్మా ఉత్పత్తుల్లో రాష్ట్రం వాటా సుమారు 35 నుంచి 40 శాతం వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఫార్మా రంగాన్ని మరింత విస్తరించేందుకు టీఎస్ఐఐసీ ద్వారా చేపట్టిన ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’(హెచ్పీసీ)ని వీలైనంత త్వరగా పట్టాలు ఎక్కించేందుకు పరిశ్రమల శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద సమీకృత ఫార్మా పార్క్‌గా పేర్కొంటున్న హెచ్‌పీసీని దశలవారీగా అభివృద్ధి చేయడం ద్వారా రూ.64 వేల కోట్ల పెట్టుబడితో 5.6 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి దక్కుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో హెచ్‌పీసీలో బాహ్య మౌలిక వసతుల కోసం రూ.1,318 కోట్లు, అంతర్గత మౌలిక వసతుల కోసం రూ.2,100 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆసియాలో అతిపెద్ద జీనోమ్ వ్యాలీ.. లైఫ్ సైన్సెస్, బయోటెక్ రంగంలో పరిశోధన, అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆసియాలో అతిపెద్దదైన జీనోమ్ వ్యాలీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. సైన్స్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ (స్టెమ్) రంగాలకు చెందిన నిపుణుల కొరత లేకపోవడంతో జీనోమ్ వ్యాలీ కార్యకలాపాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ప్రముఖ పరిశోధన సంస్థలు, అన్ని హంగులతో కూడిన పరిశోధన శాలలు, లైఫ్ సైన్సెస్ రంగ అభివృద్ధికి వీలుగా ప్రభుత్వ అనుకూల విధానాలతో ఈ రంగానికి తెలంగాణ కేంద్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌కు చెందిన జురోంగ్ కన్సల్టెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జీనోమ్ వ్యాలీ 2.0 పేరిట జీనోమ్ వ్యాలీ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జీనోమ్ వ్యాలీలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్న సంస్థలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మెడికల్డివైజెస్ పార్కుపై భారీఆశలు.. వైద్య ఉపకరణాలను విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. దేశీయంగా మెడికల్ డివైజెస్ తయారీని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం సుల్తాన్‌పూర్‌లో ‘మెడికల్ డివైజెస్ పార్కు’ ఏర్పాటు చేసింది. తొలి దశలో 250 ఎకరాల్లో టీఎస్ఐఐసీ నేతృత్వంలో ఈ పార్కును అభివృద్ధి చేస్తుం డగా.. 22 పరిశ్రమలు తమ యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి. తొలి దశలో రూ.980 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే మెడికల్ డివైజెస్ పరిశ్రమల ద్వారా 4 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కుతుందని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. సుల్తాన్ పూర్ మెడికల్ డివైజెస్ పార్కు వచ్చే ఐదేళ్లలో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ తయారీ హబ్‌గా మారుతుందని పరిశ్రమల శాఖ భావిస్తోంది. -
గడ్డినీ తినేశారు..
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యుల అక్రమాల చిట్టాలో పశువులు తినే గడ్డీ చేరిపోయింది. రైతులకు దక్కాల్సిన రాయితీలను అడ్డదారిలో ఆయన కుమార్తె కాజేసిన చిల్లర వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కోడెల శివప్రసాద్ కుమార్తెకు ఔషధాల తయారీ కంపెనీతోపాటు సాయికృప అనే ఓ సంస్థ ఉంది. కరవు కాలంలో పశువులకు సైలేజీ (మాగుడు) గడ్డి పంపిణీ చేయడం ఈ కంపెనీ ఉద్దేశాలలో ఒకటి. పచ్చి గడ్డిని కోసి శుద్ధి చేసి కార్బోహైడ్రేట్లను సేంద్రియ ఆమ్లాలుగా మార్పు చేసి పోషక విలువలకు ఎటువంటి నష్టం లేకుండా తిరిగి మేతగా ఉపయోగిస్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఈ సంస్థ సైలేజీ గడ్డి పంపిణీకి పశు సంవర్థక శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట, నకరికల్లు, రొంపిచర్ల తదితర ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలోని కొన్ని గ్రామాలకు గడ్డి సరఫరా చేసే బాధ్యత స్వీకరించి నిధులు కాజేసేందుకు పథక రచన చేసింది. భారీ ఇండెంట్‌తో ఖజానాకు చిల్లు నిబంధల ప్రకారం ఒక్కో గ్రామంలో 5 ఎకరాల్లో సైలేజీ గడ్డి పెంపకానికి తొలుత అనుమతి ఇచ్చినా, ఆ తర్వాత ఈ నిబంధనను మార్చేస్తూ పశు సంవర్థక శాఖ డైరెక్టర్ సోమశేఖర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ గడ్డి పెంపకానికి ఒప్పందం కుదుర్చుకున్న రైతులకు పశు సంవర్థక శాఖ ఎకరానికి రూ.10 వేలు కౌలు ఇస్తుంది. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం కూడా రూ.11 నుంచి 12 వేల వరకు కరవు పనుల కింద ఇచ్చేది. పంపిణీ కంపెనీలు సైలేజీ యంత్రం ద్వారా 50 కిలోల నుంచి గరిష్టంగా 400 కిలోల వరకు గాలి చొరబడడానికి వీలు లేకుండా గడ్డిని చుట్ట చుట్టి మోపు (బేల్స్)గా తయారు చేస్తాయి. ఈ గడ్డికి కిలో రూ.6.80 చొప్పున (రవాణా, లోడింగ్, అన్లోడింగ్ కలుపుకుంటే కేజీ రూ.9 నుంచి రూ.11 వరకు) ప్రభుత్వం పశు సంవర్థక శాఖతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కంపెనీలకు ఇస్తుంది. ఇందులో లబ్ధిదారుడు భరించాల్సింది కిలో గడ్డికి రూ.2 మాత్రమే. ఈ నేపథ్యంలో అప్పట్లో గుంటూరు జిల్లా జేడీ రజనీ కుమార్, డైరెక్టర్ సోమశేఖర రావు సత్తెనపల్లి నియోజకవర్గానికి 200 టన్నులతో ఇండెంట్ ప్రారంభించి 500, 1000, 1500 టన్నులకు పెంచి కోడెల కుమార్తె కంపెనీ సాయికృపకు ఇచ్చారు. ఒక్క 2017–18లోనే ఈ సంస్థ 20 వేల టన్నుల గడ్డిని రైతులకు పంపిణీ చేసినట్టు లెక్కలు చూపి కోట్లాది రూపాయలు కాజేసినట్టు తేలింది. తమకింకా 2,800 టన్నులకు బిల్లులు రావాల్సి ఉందని పశు సంవర్థక శాఖకు లేఖ రాయడం విజిలెన్స్ విభాగం దృష్టికి రావడంతో విషయం బయటకు పొక్కింది. లబ్ధిదారు నుంచి కిలో గడ్డికి రూ.2 చొప్పున వసూలు చేయాల్సిన మొత్తాన్ని కోడెల ఆయా గ్రామాల్లోని అనుచరులతో కట్టించి.. ఆ గడ్డి రవాణా, లోడింగ్, అన్లోడింగ్ కూడా వారే చేసినట్లు రాతకోతలు పూర్తి చేసే వారని సమాచారం. -
రెండో రోజూ లాభాల బాట
సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. డిసెంబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో స్టాక్‌సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో 391 పాయింట్ల వరకూ ఎగసిన సెన్సెక్స్ సగం వరకూ లాభాలను పోగొట్టుకొని చివరకు 157 పాయింట్ల లాభంతో 35,807 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 10,780 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం క్షీణించినా, ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ సందర్భంగా లాభాల స్వీకరణ చోటు చేసుకున్నా, మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. ముడి చమురు ధరలు మరింతగా దిగిరావడం కలసివచ్చింది. సగం తగ్గిన లాభాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు, అమెరికా అధ్యక్షుడి మధ్య ఉన్న ఉద్రిక్తతలు సడలడంతో అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలపడింది. అమెరికా వినియోగదారుల వినియోగ గణాంకాలు అంచనాలను మించడంతో బుధవారం అమెరికా స్టాక్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో గురువారం ఆసియా మార్కెట్లు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఈ జోష్‌తో మన మార్కెట్ కూడా భారీ లాభాల్లోనే ఆరంభమైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 391 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. అయితే ట్రేడింగ్ చివర్లో బ్యాంక్, వాహన, లోహ, ఫార్మా రంగ షేర్లలో అమ్మకాలు జరగడంతో లాభాలు సగానికి తగ్గాయి. టాటా గ్రూప్‌ను దాటేసిన హెచ్డీఎఫ్సీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా గ్రూప్‌ను హెచ్డీఎఫ్సీ గ్రూప్ దాటేసింది. హెచ్డీఎఫ్సీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.40లక్షల కోట్లకు చేరింది. ఇది టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ కంటే రూ.1,000 కోట్లకుపైగా అదనం. దీంతో దేశంలో అత్యధిక మార్కెట్ క్యాప్ గల గ్రూప్‌గా హెచ్డీఎఫ్సీ గ్రూప్ అవతరించింది. హెచ్డీఎఫ్సీ గ్రూప్‌లో ఐదు కంపెనీలు ఉండగా, టాటా గ్రూప్‌లో 30 వరకూ కంపెనీలున్నాయి. ఒక ఎనిమిది కంపెనీల షేర్ల తప్ప మిగిలిన అన్ని టాటా గ్రూప్ కంపెనీల షేర్లు ఈ ఏడాది బాగా పతనమయ్యాయి. అత్యధిక మార్కెట్ క్యాప్ కంపెనీగా ఉన్న టీసీఎస్ మార్కెట్ క్యాప్ మొత్తం టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్‌లో మూడింట రెండు వంతులు ఉంటుంది. -
ఆన్లైన్లో ఔషధ విక్రయాలకు నిబంధనలు
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఔషధాల విక్రయానికి సంబంధించి పాటించాల్సిన నియంత్రణలపై కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను రూపొందించింది. వీటిని ఇప్పటికే ప్రచురించినట్లు, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్‌లో ఈ మేరకు సవరణలు చేయనున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయా లోక్‌సభకు తెలిపారు. ఈ ముసాయిదా ప్రకారం.. రిజిస్టర్డ్ ఫార్మసిస్టు పేరు, వారి రిజిస్ట్రేషన్ నంబరు, వారు నమోదు చేయించుకున్న ఫార్మసీ కౌన్సిల్ పేరు మొదలైనవన్నీ కూడా ఈ–ఫార్మసీలు తమ పోర్టల్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఔషధ రంగాలో పారదర్శకతను తీసుకురావడమే ఈ నిబంధనల లక్ష్యమని తెలిపారు. -
గుడం వఆయుర్ ఫ్యాక్ట్స్ మధురౌషధం
ప్రకృతి సంపదను ఆరోగ్యం కోసం ఆహారంగా, ఔషధాలుగా మలచుకోవడం ఆయుర్వేద శాస్త్ర విశిష్టత. ఆరు రుచులలోనూ (తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు) మధుర రసానిదే అగ్రస్థానం. కొన్ని పదార్థాలు నాలుకకు తగలగానే తీపి స్ఫురిస్తుంది. కొన్నింటిలో తీపి అంతర్లీనంగా అనురసంగా ఉంటుంది. బయటకు గట్టిగా కర్రలా ఉన్నా, నిలువెల్లా మధుర ద్రవానికి పట్టుకొమ్మ ‘చెరకు’. దీనిని సంస్కృతంలో ‘ఇక్షు’ అంటారు. ఇక్షురసం నుంచి బెల్లం (గుడం) తయారుచేసే ప్రక్రియ చాలాకాలంగా ఉంది. రకరకాల ఔషధాల తయారీలో, పలు వంటకాలలో బెల్లానికి ప్రాముఖ్యతను ఇవ్వటం ఆయుర్వేదంలో స్పష్టంగా ఉంది. సితా (పటిక బెల్లం), ఖండ శర్కర (ఇసుక వలె అతి సన్నగా ఉన్న పంచదార), మధుశర్కరా (తేనె నుంచి తయారైన పంచదార) ద్రవ్యాల ప్రయోజనాల గూర్చి భావప్రకాశ సంహితలో కనిపిస్తుంది. కాని వీటి తయారీ విధానం గురించి వివరణ కపడదు. రసాయనిక పదార్థాల సమ్మేళనంతో ఆధునిక వ్యాపార పోకడలతో తయారుచేస్తున్న పంచదారకు, నాటి సహజ సిద్ధమైన ‘శర్కర’ కు చాలా తేడా ఉంది. ఈనాటి పంచదారలో పోషకాలు శూన్యం, హానికరం. నాటి శర్కరలు, విశేషించి గుడం (బెల్లం) అమోఘమైన పోషకాహారం. చెరకు బెల్లం సశాస్త్రీయ వివరాలు చెరకు రసం: శరీరానికి చలవ చేస్తుంది. వీర్యవర్ధకం. కఫకరం. కాచిన చెరకు రసం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. కడుపునొప్పిని పోగొడుతుంది. మలమూత్రాలను సాఫీగా జారీ చేస్తుంది. చెరకు (చెఱకు) బెల్లం గుణాలు: తియ్యగా, జిగురుగా (స్నిగ్ధం) ఉంటుంది. వాతహరం. కొంతవరకు వేడిని తగ్గిస్తుంది. శర్కరంత చలువ చేయదు. మూత్రాన్ని సాఫీగా చేసి, మూత్రవికారాలను తగ్గిస్తుంది. కఫాన్ని తగ్గిస్తుంది. క్రిములను నాశనం చేస్తుంది. కొవ్వును పెంచుతుంది.(ఇక్షో రసో యస్సపక్వో జాయతే... సగుడౌ... వృష్యో గురుః స్నిగ్ధో వాతఘ్నో మూత్ర శోధనః‘ నాతి పిత్త హరో మేదః కఫ కృమి బలప్రదః) కొత్త బెల్లం: జఠరాగిన్ని పెంచుతుంది కాని కఫాన్ని, కృములను కలుగచేస్తుంది. దగ్గు, ఆయాసం (కాస, శ్వాస) లను పెంచుతుంది. (గుడో నవః కఫ శ్వాస కాస కృమి కరో అగ్నికృత్) పాత బెల్లం: చాలా మంచిది. తేలికగా జీర్ణమై శరీరాన్ని తేలికపరుస్తుంది. వేడిని తగ్గించి కొవ్వును కరిగిస్తుంది. జఠరాగ్నిని పెంచి పుష్టిని కలిగిస్తుంది. రక్త దోషాలను పోగొడుతుంది, వాతరోగాలను తగ్గిస్తుంది. గుడో జీర్ణ లఘుః పథ్యో న అభిష్యంది అగ్ని పుష్టికృత్‘ పిత్తఘ్నోమధురో వృష్యో వాతఘ్నో అసృక్ ప్రసాదనః మత్స్యండీ: చెరకు రసాన్ని ఒక పద్ధతిలో వేడి చేస్తూ బెల్లాన్ని తయారుచేసేటప్పుడు, చివరన కొంచెం ద్రవాంశలు మిగిలిపోతాయి. దానినే మత్స్యండీ అంటారు. ఇది చాలా బలకరం, మృదురేచకం, రక్తశోధకం, వీర్యవర్ధకం.మత్స్యండీ భేదినీ బల్యా బృంహణీ వృష్యా రక్త దోషాపహాః స్మృతాఆధునిక జీవరసాయన పోషక వివరాలు: తాటిబెల్లం, ఖర్జూర బెల్లం, కొబ్బరి బెల్లాలు కూడా తయారీలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం చెరకు బెల్లం వాడకమే ఎక్కువ. 100 గ్రాముల బెల్లంలో ప్రొటీన్లు 0.4 శాతం, కొవ్వులు 0. 1 శాతం, మినరల్స్ 0. 6 శాతం, శర్కరలు (కార్బోహైడ్రేట్లు) 95 శాతం, క్యాల్షియం – 80 శాతం, ఫాస్ఫరస్ 40 శాతం, ఐరన్ 2.64 శాతం, క్యాలరీలు 383 ఉంటాయి. తయారీలో ఆసక్తికర అంశాలు: రిఫైన్డ్, డిస్టిలేషన్ చేయకుండా ఉన్నది మంచి బెల్లం. దీంట్లో కెమికల్స్ వాడకపోవడం వలన అన్ని పోషక ఖనిజాలు (ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్) భద్రంగా ఉంటాయి. మట్టిరంగు వంటి నలుపు రంగులో ఉండే బెల్లం ఉత్తమం. దీంట్లో విటమిన్లు, ఫైబర్ కూడా ఉంటాయి. కనుక ఆరోగ్యకరం. ఆర్గానిక్ బెల్లం (జాగరీ): ఇది మరింత శ్రేష్ఠం. చెరకును పండించినప్పుడు కృత్రిమ రసాయనిక ఎరువులు గాని, క్రిమిసంహారక మందులు గాని వాడరు. బెల్లం తెల్లగా లేక ఎర్రగా రంగు రావడం కోసం కెమికల్స్ వాడరు. కనుక పసుపు మిశ్రిత మట్టిరంగులో చూర్ణం రూపంలో ఉంటుంది. సుక్రోజ్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. పొటాషియం, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు వార్ధక్యాన్ని దూరం చేయటానికి ఉపకరిస్తాయి. కల్తీ బెల్లాలు: నిగనిగలాడే ఎరుపు, తెలుపు, పసుపు రంగులు విరజిమ్మటం కోసం హానికర కెమికల్స్, తీపిని అధికం చేసే కెమికల్స్, నిల్వ ఉండటానికి కెమికల్స్ అధిక మోతాదులో కలుపుతారు. అసలైన మట్టిరంగు కంటె, ఈ ఆకర్షిత రంగు బెల్లానికి అమాయక వినియోగదారులు బలైపోతున్నారు. దీనికంటె అనర్థం ‘పంచదార’ తయారీ. అందులో మితిమీరిన తెలుపు, తీపి మినహా పోషకవిలువలు శూన్యం. ఇది గమనించాలి. బ్రౌన్ సుగర్లో బ్లీచింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు నయం. బజారులో లభించే ‘తెల్లటి’ తళుకులీనే పంచదార (సుగర్) తయారీలో ఆకర్షణార్థమై కొన్ని వందల రసాయనిక పదార్థాలు వాడతారు. అవన్నీ విషతుల్యాలని గుర్తుంచుకోవాలి. ఔషధ గుణాలు: బెల్లాన్ని శుంఠి (శొంఠి)తో కలిపి సేవిస్తే సమస్త రోగాలు తగ్గిపోతాయి. అల్లంతో కలిపి సేవిస్తే కఫవ్యాధులు హరిస్తాయి. కరక్కాయ చూర్ణంతో కలిపి సేవిస్తే అన్ని పిత్తరోగాలు ఉపశమిస్తాయి. ఇది మూలవ్యాధికి మంచి మందు. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
మైలాన్ నాసిక్ ప్లాంటుకు ఎఫ్‌డీఏ వార్నింగ్!
న్యూఢిల్లీ: ఫార్మా సంస్థ మైలాన్కి చెందిన నాసిక్ ప్లాంట్‌లో ఔషధాల తయారీలో ప్రమాణాల ఉల్లంఘనకు గాను అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ వార్నింగ్ లెటర్ జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్ 5–14 మధ్యలో నాసిక్ ప్లాంటులో ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా నాణ్యత ప్రమాణాల నియంత్రణలో వైఫల్యాలు, డేటా అనుసంధానంలో లోపాలు మొదలైనవి గుర్తించినట్లు మైలాన్ ఫార్మా ప్రెసిడెంట్ రాజీవ్ మాలిక్‌కు పంపిన లేఖలో పేర్కొంది. తయారైన ఔషధాల నాణ్యతపై వీటి ప్రభావాలు ఎలా ఉండవచ్చు, తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలు మొదలైన వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా కంపెనీకి సూచించింది. ప్రమాణాలు పూర్తి స్థాయిలో పాటిస్తున్నట్లు నిర్ధారణ అయ్యే దాకా కొత్త ఔషధాల దరఖాస్తులకు అనుమతులు నిలిపివేసే అవకాశముందని, నాసిక్ ప్లాంటులో తయారయ్యే ఉత్పత్తుల దిగుమతులపైనా ఆంక్షలు విధించవచ్చని పేర్కొంది. -
సిప్లా చేతికి... హెటిరో యూఎస్ వ్యాపారం?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగంలో మరో భారీ డీల్‌కు తెరలేచింది. ఏపీఐ, ఫినిష్డ్ డోసేజెస్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ హెటిరోకు చెందిన అమెరికా వ్యాపారాన్ని ఫార్మా సంస్థ సిప్లా కొనుగోలు చేస్తోందని సమాచారం. వార్తా సంస్థ సీఎన్‌బీసీ-టీవీ18 కథనం ప్రకారం హెటిరో యూఎస్ వ్యాపారం కాంబర్ ఫార్మాస్యూటికల్స్ పేరుతో జరుగుతోంది. యూఎస్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న జనరిక్ కంపెనీల్లో ఇది ఒకటి. ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఓరల్ సొల్యూషన్స్‌ను తయారు చేస్తోంది. ఈ కంపెనీని రూ.3,250-3,575 కోట్లు వెచ్చించి సిప్లా దక్కించుకుంటోంది. డీల్‌లో భాగంగా కాంబర్కు చెందిన తయారీ యూనిట్లు కూడా సిప్లా పరం కాబోతున్నాయి. కాంబర్ ఫార్మాస్యూటికల్స్ ద్వారా హెటిరోకు ఏటా రూ.1,625 కోట్ల ఆదాయం వస్తోంది. -
అరబిందో అనుబంధ కంపెనీ ఎరిస్ ఫార్మా చేతికి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా.. అనుబంధ కంపెనీ అయిన అరబిందో ఫార్మా (ఆస్ట్రేలియా) ప్రొప్రైటరీ లిమిటెడ్‌లో ఉన్న మొత్తం వాటాను ఎరిస్ ఫార్మా ఆస్ట్రేలియాకు విక్రయించింది. ఎంత మొత్తానికి ఈ డీల్ కుదిరిందీ వెల్లడించలేదు. అనుబంధ కంపెనీ ఎటువంటి లాభాలను అరబిందోకు అందించడం లేదు. ఎస్, ఈయూతోపాటు అభివృద్ధి చెందుతున్న ముఖ్యమైన దేశాలవైపు దృష్టిసారించేందుకే వ్యూహాత్మకంగా వాటా విక్రయించినట్టు కంపెనీ తెలిపింది. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మార్కెట్లకై ఎరిస్ కోసం ఔషధాల తయారీ, సరఫరాను కొన్నేళ్లపాటు అరబిందో కొనసాగిస్తుంది. -
ఈ గిరి.. ఔషధనగరి
ముచ్చర్లకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఔషధాల తయారీకి కందుకూరు మండలం ముచ్చర్ల కేంద్రబిందువు కానుంది. బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీల స్థాపనతో ఈ ప్రాంతం మందు బిళ్లలకు చిరునామాగా మారనుంది. ఈ ప్రాంతంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా ఫార్మారంగ దిగ్గజాలను వెంటబెట్టుకొని ముచ్చర్లలో స్థలపరిశీలన జరుపుతుండడం పారిశ్రామికవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశంలోనే 20 మంది అగ్రశ్రేణి ఫార్మా కంపెనీల అధినేతలు నాలుగు హెలికాప్టర్లలో రానుండడంతో జిల్లా యంత్రాంగం ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు 10వేల ఎకరాల్లో ప్రతిపాదిస్తున్న ఫార్మా సిటీ స్థలాన్ని విహంగ వీక్షణం చేయడమేగాకుండా.. నేలపైకి దిగి ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు జిల్లా యంత్రాంగం నాలుగు హెలిప్యాడ్లను కూడా నిర్మించింది. భూ లభ్యత, విమానాశ్రయల, ఔటర్‌రింగ్‌రోడ్డు, తదితర విశిష్టతను విశదీకరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. సీఎం హోదాలో పారిశ్రామికవేత్తలతో స్థల పరిశీలనకు రావడం తొలిసారి కావడం.. నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన అనంతరం ఈ పర్యటన జరుగుతుండడంతో ప్రభుత్వం కూడా ఫార్మాసిటీతో పెట్టుబడులు రాబట్టడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఫార్మాసిటీ భూములను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల బృందం స్వయంగా పరిశీలించింది. పదివేల ఎకరాల్లో ఫార్మాసిటీ! రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పదివేల ఎకరాల్లో సర్వే నిర్వహించి భూములను పరిశీలించనున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అనువుగా ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 288లో 2,747 భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 2,139.34 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండగా, మిగతా దాంట్లో 381.32 ఎకరాలు పట్టా భూములు కాగా, 225 ఎకరాలు నిరుపేదలకు అసైన్డ్ చేయడంతో ప్రస్తుతం వారి సాగుబడిలో ఉంది. మీర్ఖాన్పేటలోని సర్వే నం.112, 120లో 1,277 ఎకరాలను ఫార్మాసిటీకి ప్రతిపాదనలు రూపొందించింది. అదేవిధంగా యాచారం మండలం తాడిపర్తి, కుర్మిద్ద పరిధిలోని రిజర్వ్‌ఫారెస్ట్ భూములు సహా రంగారెడ్డి జిల్లా పరిధిలోని దాదాపు ఏడున్నర వేల ఎకరాలు ఫార్మాసిటీకి కేటాయించే అవకాశం ఉంది. పాలమూరులో మరో రెండున్నర వేల ఎకరాలు.. ఫార్మా కంపెనీలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫార్మాసిటీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పెద్దఎత్తున భూముల అవసరం ఉండడంతో రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో ఏడున్నర వేల ఎకరాలను గుర్తించిన అధికారులు.. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలంలోని కడ్తాల్ సమీపంలో సర్వేనంబర్ 265లో మరో 1600 ఎకరాల భూమిని గుర్తించారు. కడ్తాల్ బ్లాక్‌లోని దాదాపు వెయ్యి ఎకరాల అటవీ భూములను ఫార్మాసిటీకి కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలో రెండు జిల్లాల పరిధిలో దాదాపు పదివేల ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం ప్రతిపాదించారు. అన్నీ సక్రమంగా జరిగితే ఫార్మాసిటీ ఏర్పాటుకు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు వేదిక కానున్నాయి. పరిమిత సంఖ్యలోనే.. బుధవారం సీఎం కేసీఆర్ నిర్వహించే ఫార్మాసిటీ ఏరియల్ సర్వే ప్రక్రియ అంతా కీలక అధికారుల కనుసన్నల్లోనే జరుగనుంది. ఈ క్రమంలో ఫార్మా ప్రముఖులు, ఉన్నతాధికారులు సైతం పరిమిత సంఖ్యలోనే హాజరుకానున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రికి మాత్రమే ఆహ్వానం పలికిన ప్రభుత్వం.. ఈ కార్యక్రమానికి మీడియాను సైతం దూరంగా ఉంచింది. తద్వారా పారిశ్రామికవేత్తలతో జరిపే చర్చలు బయటకు పొక్కకుండా గోప్యత ప్రదర్శించాలని నిర్ణయించింది. సీఎం రాక కోసం ముమ్మర ఏర్పాట్లు.. కందుకూరు: సీఎం కేసీఆర్ తోపాటు ఫార్మా సంస్థల అధినేతలు మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ పరిధి లో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వ భూములను పరిశీలించడానికి బుధవారం విచ్చేయనుండటంతో అధికార యంత్రాంగం మంగళవారం ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఏరియల్ వీక్షణం అనంతరం నేరు గా ఆ భూముల్లో దిగడానికి అనువుగా ఆర్అండ్బీ ఎస్ఈ ఆశారాణి ఆధ్వర్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన నాలుగు హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. రాకపోకలకు అనుకూలంగా ఫార్మేషన్ రోడ్డు, భోజన వసతి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం ఆ భూములకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించడంతోపాటు అతిథులు కూర్చొని మాట్లాడుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో.. ఉదయం నుంచే ఆయా శాఖల ముఖ్యఅధికారులు పనులను పర్యవేక్షిస్తుండగా.. సాయంత్రం కలెక్టర్ శ్రీధర్, జేసీ చంపాలాల్ అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ యాదగిరిరెడ్డి, తహసీల్దార్ సుశీల తదితర అధికారులను పనుల తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. ఉదయం స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి అధికారులకు సూచనలు చేశారు. ఆయనతోపాటు ఎంపీపీ అనేగౌని అశోక్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి, స్థానిక సర్పంచ్‌లు కాస నర్సింహ, గోవర్థన్ నాయక్ పాల్గొన్నారు. పరిశీలనకు వచ్చిన హెలికాప్టర్.. కాగా సీఎం పర్యటనకోసం ఇక్కడ నిర్మించిన హెలిప్యాడ్‌ను పరిశీలించడానికి మంగళవారం సాయంత్రం ట్రయల్ హెలికాప్టర్ వచ్చింది. సైబరాబాద్ కమిషనర్ పర్యవేక్షణ.. సీఎం పర్యటనకు సంబంధించిన బందోబస్తు నిర్వహణను సైబరాబాద్ కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు జాయింట్ కమినర్ శశిధర్‌రెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ రవివర్మ, ఏసీపీ నారాయణగౌడ్ ఉన్నారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించారు. డాగ్ స్క్యాడ్, బాంబ్ స్క్వాడ్‌తో హెలిప్యాడ్లతో పాటు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.