
సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. డిసెంబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో స్టాక్‌సూచీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో 391 పాయింట్ల వరకూ ఎగసిన సెన్సెక్స్ సగం వరకూ లాభాలను పోగొట్టుకొని చివరకు 157 పాయింట్ల లాభంతో 35,807 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 10,780 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం క్షీణించినా, ఎఫ్ అండ్ ఓ ఎక్స్‌పైరీ సందర్భంగా లాభాల స్వీకరణ చోటు చేసుకున్నా, మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. ముడి చమురు ధరలు మరింతగా దిగిరావడం కలసివచ్చింది.
సగం తగ్గిన లాభాలు
అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు, అమెరికా అధ్యక్షుడి మధ్య ఉన్న ఉద్రిక్తతలు సడలడంతో అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలపడింది. అమెరికా వినియోగదారుల వినియోగ గణాంకాలు అంచనాలను మించడంతో బుధవారం అమెరికా స్టాక్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో గురువారం ఆసియా మార్కెట్లు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఈ జోష్‌తో మన మార్కెట్ కూడా భారీ లాభాల్లోనే ఆరంభమైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 391 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. అయితే ట్రేడింగ్ చివర్లో బ్యాంక్, వాహన, లోహ, ఫార్మా రంగ షేర్లలో అమ్మకాలు జరగడంతో లాభాలు సగానికి తగ్గాయి.
టాటా గ్రూప్‌ను దాటేసిన
హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా గ్రూప్‌ను హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ దాటేసింది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.40లక్షల కోట్లకు చేరింది. ఇది టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ కంటే రూ.1,000 కోట్లకుపైగా అదనం. దీంతో దేశంలో అత్యధిక మార్కెట్ క్యాప్ గల గ్రూప్‌గా హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ అవతరించింది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌లో ఐదు కంపెనీలు ఉండగా, టాటా గ్రూప్‌లో 30 వరకూ కంపెనీలున్నాయి. ఒక ఎనిమిది కంపెనీల షేర్ల తప్ప మిగిలిన అన్ని టాటా గ్రూప్ కంపెనీల షేర్లు ఈ ఏడాది బాగా పతనమయ్యాయి. అత్యధిక మార్కెట్ క్యాప్ కంపెనీగా ఉన్న టీసీఎస్ మార్కెట్ క్యాప్ మొత్తం టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్‌లో మూడింట రెండు వంతులు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment