సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ పరీక్షలకు ఉపయోగించే ‘యాంటీ బాడీ టెస్ట్ కిట్ల’ కోసం భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) మార్చి 25వ తేదీన బిడ్డింగ్‌లకు ఆహ్వానించింది. విదేశాల్లో మాత్రమే దొరికే ఈ కిట్ల సరఫరా కోసం బిడ్డింగ్ వేసే కంపెనీలకు ‘దిగుమతి లైసెన్స్’ ఉండాలనే షరతును విధించలేదు. దాంతో దిగుమతి లైసెన్స్‌లేని ఢిల్లీకి చెందిన ‘ఆర్క్ ఫార్మాష్యూటికల్స్’ కంపెనీతోపాటు చైనా నుంచే కాకుండా యూరప్ నుంచి కూడా మందులను, వైద్య పరికరాలను దిగుమతి చేసుకునే లైసెన్స్ ఉన్న కొన్ని కంపెనీలు బిడ్డింగ్ వేశాయి. భారత వైద్య పరిశోధనా మండలి మార్చి 27వ తేదీన ఆశ్చర్యంగా 30 కోట్ల రూపాయల విలువైన ‘టెస్ట్ కిట్ల’ను సరఫరా చేయాల్సిందిగా ‘ఆర్క్ ఫార్మాష్యూటికల్స్’కు అప్పగించింది.
ఈ వ్యవహారం ఒకానొక దశలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడంతో పలు రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. కిట్‌కు 600 రూపాయల చొప్పున చైనాకు చెందిన ‘గ్వాంజౌ వాండ్‌ఫో బయోటెక్’ తయారు చేసిన టెస్ట్ కిట్లను సరఫరా చేస్తామని ఆర్క్ ఫార్మాష్యూటికల్స్ కంపెనీ, భారత వైద్య పరిశోధనా మండలితో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆర్క్ ఫార్మా ష్యూటికల్స్‌కు దిగుమతి లైసెన్స్ లేకపోవడమే కాకుండా చైనా కంపెనీతో ఎలాంటి ఒప్పందం లేదు. గ్వాంజౌ అనే చైనా కంపెనీతో చెన్నైకి చెందిన ‘మ్యాట్రిక్స్ ప్రైవేటు లిమిటెడ్’ కంపెనీకి ఒప్పందం ఉంది. ఆ కంపెనీకి దిగుమతి లైసెన్స్ ఉంది. కనీసం మ్యాట్రిక్స్‌తోని ఆర్క్ ఫార్మాష్యూటికల్స్‌కు ఎలాంటి ఒప్పందం లేదు.
మ్యాట్రిక్స్‌కు ఆలిండియా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోన్న ఢిల్లీలోని ‘రేర్ మెటబాలిక్స్ లైవ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీతో కరోనా టెస్ట్ కిట్ల సరఫరాకు ‘ఆర్క్ ఫార్మాష్యూటికల్స్’ ఒప్పందం చేసుకుంది. దీంతో చైనా నుంచి మ్యాట్రిక్స్ కంపెనీ 245 రూపాయల చొప్పున కిట్లను దిగుమతి చేసుకొని రేర్ మెటబాలిక్స్‌కు సరఫరా చేయగా, ఆ కంపెనీ వాటిని 420 రూపాయలకు చొప్పున ఆర్క్ ఫార్మాష్యూటికల్స్‌కు సరఫరా చేసింది. ఆ కంపెనీ భారత వైద్య పరిశోధనా మండలితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వాటిని 600 రూపాయలకు సరఫరా చేసింది. ఇంతవరకు లావాదేవీలు గుట్టు చప్పుడు కాకుండా జరిగాయి. (వైరస్ మూలాలపై గందరగోళం..)
ఆ తర్వాత 50 వేల కిట్లను సరఫరా చేసేందుకు మ్యాట్రిక్స్ కంపెనీ నేరుగా తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఐసీఎంఆర్‌కు సరఫరా చేసినట్లుగా డిస్ట్రిబ్యూటర్లుగా తమకు వాటా ఇవ్వాలంటూ ఆర్క్ ఫార్మాష్యూటికల్స్, రేర్ మెటబాలిక్స్ మ్యాట్రిక్స్‌ను డిమాండ్ చేశాయి. అందుకు ఆ కంపెనీ అంగీకరించక పోవడంతో రెండు కంపెనీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. అక్కడ 245 రూపాయల కిట్లు, 420 రూపాయలుగా మారడం, ఆ తర్వాత 600 రూపాయలుగా మారిన బాగోతం వెలుగులోకి వచ్చింది. కోర్టు విచారణ జరిగి ఏప్రిల్ 17వ తేదీ నాటికి ఐసీఎంఆర్‌కు 2.76 లక్షల కిట్లు సరఫరాకాగా, ఇంకా 2.34 లక్షల కిట్లను సరఫరా చేయాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న వాటిని 420 రూపాయల చొప్పునే సరఫరా చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే.
కరోనా టెస్ట్ కిట్లను తయారుచేసే చైనాకు చెందిన ‘గెటైన్ బయోటెక్ ఇన్‌కార్పొరేషన్’ కంపెనీతో ఢిల్లీకి చెందిన ‘సోవర్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీకి ఒప్పందం ఉండడమే కాకుండా ఆ కంపెనీకి ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ మంజూరు చేసిన దిగుమతి లైసెన్స్ కూడా ఉంది. ‘600 రూపాయలకు తక్కువగా కిట్ల సరఫరాకు ఐసీఎంఆర్‌లో బిడ్లను దాఖలు చేశాం. మమ్మల్ని కాదని ఆర్క్ ఫార్మాష్యూటిక్స్‌కు ఎలా బిడ్డింగ్ ఖరారు చేశారో మాకు అర్థం కావడం లేదు’ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ విజేంద్ర జైస్వాల్ మీడియా ముందు వాపోయారు. (మాస్క్ మాటున నిశ్శబ్దంగా ఏడ్చాను)
చెన్నైలోని ‘ట్రివిట్రాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్’ కంపెనీకి కరోనా కిట్లను తయారు చేసే మూడు చైనా కంపెనీలతో ఒప్పందం ఉండడంతోపాటు దిగుమతి ఒప్పందం ఉంది. ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తుందనడానికి గుర్తుగా ఆ కంపెనీకి ‘యూరోపియన్ సర్టిఫికేషన్’ కూడా ఉంది. తాము కూడా 600 రూపాయలకు లోపే బిడ్డింగ్ వేశామని, అయినా తమకు రాలేదని, ఈ విషయమై ఐసీఎంఆర్ అధికారులను అడిగితే వారి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని కంపెనీ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్‌కే వేలు మీడియా ముందు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment