70 వేల కోట్లకు లైఫ్‌ సైన్సెస్, ఫార్మా!  | TS Government Estimate To RS 70000 Crore Investment From Life Sciences And Pharma | Sakshi
Sakshi News home page

70 వేల కోట్లకు లైఫ్‌ సైన్సెస్, ఫార్మా! 

Published Mon, Nov 4 2019 4:24 AM | Last Updated on Mon, Nov 4 2019 4:32 AM

TS Government Estimate To RS 70000 Crore Investment From Life Sciences And Pharma - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న పదేళ్లలో లైఫ్‌ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, దాని అనుబంధ రంగాలను రూ.70 వేల కోట్ల పరిశ్రమగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రస్తుతం ఈ రంగాలకు సంబంధించిన పెట్టుబడుల వాటా సుమారు రూ.35 వేల కోట్ల మేర ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఫార్మా, బయోటెక్, మెడికల్‌ డివైజెస్‌ తయారీ రంగా ల్లో వచ్చే దశాబ్దకాలంలో ఈ వాటాను రెండిం తలు చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని కోసం కొత్త పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపై పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న ఫార్మా ఉత్పత్తుల్లో రాష్ట్రం వాటా సుమారు 35 నుంచి 40 శాతం వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఫార్మా రంగాన్ని మరింత విస్తరించేందుకు టీఎస్‌ఐఐసీ ద్వారా చేపట్టిన ‘హైదరాబాద్‌ ఫార్మాసిటీ’(హెచ్‌పీసీ)ని వీలైనంత త్వరగా పట్టాలు ఎక్కించేందుకు పరిశ్రమల శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద సమీకృత ఫార్మా పార్క్‌గా పేర్కొంటున్న హెచ్‌పీసీని దశలవారీగా అభివృద్ధి చేయడం ద్వారా రూ.64 వేల కోట్ల పెట్టుబడితో 5.6 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి దక్కుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో హెచ్‌పీసీలో బాహ్య మౌలిక వసతుల కోసం రూ.1,318 కోట్లు, అంతర్గత మౌలిక వసతుల కోసం రూ.2,100 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఆసియాలో అతిపెద్ద జీనోమ్‌ వ్యాలీ..
లైఫ్‌ సైన్సెస్, బయోటెక్‌ రంగంలో పరిశోధన, అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆసియాలో అతిపెద్దదైన జీనోమ్‌ వ్యాలీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. సైన్స్‌ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ (స్టెమ్‌) రంగాలకు చెందిన నిపుణుల కొరత లేకపోవడంతో జీనోమ్‌ వ్యాలీ కార్యకలాపాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ప్రముఖ పరిశోధన సంస్థలు, అన్ని హంగులతో కూడిన పరిశోధన శాలలు, లైఫ్‌ సైన్సెస్‌ రంగ అభివృద్ధికి వీలుగా ప్రభుత్వ అనుకూల విధానాలతో ఈ రంగానికి తెలంగాణ కేంద్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌కు చెందిన జురోంగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో జీనోమ్‌ వ్యాలీ 2.0 పేరిట జీనోమ్‌ వ్యాలీ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జీనోమ్‌ వ్యాలీలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్న సంస్థలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

మెడికల్‌డివైజెస్‌ పార్కుపై భారీఆశలు..
వైద్య ఉపకరణాలను విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. దేశీయంగా మెడికల్‌ డివైజెస్‌ తయారీని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం సుల్తాన్‌పూర్‌లో ‘మెడికల్‌ డివైజెస్‌ పార్కు’ ఏర్పాటు చేసింది. తొలి దశలో 250 ఎకరాల్లో టీఎస్‌ఐఐసీ నేతృత్వంలో ఈ పార్కును అభివృద్ధి చేస్తుం డగా.. 22 పరిశ్రమలు తమ యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి. తొలి దశలో రూ.980 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే మెడికల్‌ డివైజెస్‌ పరిశ్రమల ద్వారా 4 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కుతుందని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. సుల్తాన్‌ పూర్‌ మెడికల్‌ డివైజెస్‌ పార్కు వచ్చే ఐదేళ్లలో దేశంలోనే అతిపెద్ద మెడికల్‌ డివైజెస్‌ తయారీ హబ్‌గా మారుతుందని పరిశ్రమల శాఖ భావిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement