చైనా–పాక్‌లు మారేదెన్నడు? | Tilak Devasher Writes Guest Column About China Pharmaceutical Exports | Sakshi
Sakshi News home page

చైనా–పాక్‌లు మారేదెన్నడు?

Published Wed, Apr 8 2020 12:17 AM | Last Updated on Wed, Apr 8 2020 8:10 AM

Tilak Devasher Writes Guest Column About China Pharmaceutical Exports - Sakshi

చైనా గనుక తన ఔషధాల ఎగుమతిని నిలిపివేస్తే, అమెరికా ఈ కరోనా వైరస్‌ అంటువ్యాధితో నాశనమైపోతుంది. చాలా రోజులుగా వస్తువుల తయారీ పనుల్ని చైనాకి ఔట్‌సోర్స్‌ చేస్తోన్న ప్రపంచం ఇప్పుడు దాని ఫలితాలను ఎదుర్కొంటోంది. ప్రపంచం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటంటే చైనా మీద అతిగా ఆధారపడటాన్ని తగ్గించాలి. ఇది కేవలం కీలకమైన ఔషధాలు, వైద్యపరికరాల కోసం మాత్రమే కాదు, ఇతర రకాల వస్తుతయారీ పంపిణీ వ్యవస్థలతో ముడిపడిన అన్నిటికీ వర్తిస్తుంది. దీనికి ఎంతో సమయం పట్టవచ్చు. విపరీతమైన ఖర్చు కావచ్చు. కానీ ప్రత్యేకించి ఇట్లాంటి ప్రాణాంతకమైన సందర్భాలలో చైనాకు బందీగా దొరికిపోకుండా ఉండటానికి అది పనికొస్తుంది.

కరోనా వైరస్‌ సాంక్రమిక వ్యాధి మునుపటి తరాలు ఎన్నడూ ఎదుర్కోని సవాళ్లను అంతర్జాతీయ సమాజం ముందుంచుతోంది. కానీ మునుపటి సవాళ్లలాగే ఇది కూడా బలహీనపడుతుంది. అయితే ఈ వ్యాధి మిగిల్చి వెళ్లే అనేక జ్ఞాపకాల్లో రెండు మాత్రం ప్రత్యేకంగా మిగిలిపోతాయి. ఒకటి.. మొత్తం సంక్షోభం ప్రారంభమైన మనకు ఉత్తరాన ఉండే పొరుగుదేశం చైనా.. మరొకటి ఏదంటే సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ భారత్‌పై విమర్శలు గుప్పించకుండా ఉండలేని.. మనకు పశ్చిమాన ఉండే పొరుగుదేశం పాకిస్తాన్‌. మార్చి 22న చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఇలా ట్వీట్‌ చేశారు: ‘మేడిన్‌ చైనావన్నీ అంటువ్యాధులు కలిగిం చేట్లయితే, చైనా ఫేస్‌మాస్కులు వాడొద్దు, చైనా పీపీఈలు వాడొద్దు, చైనాలో తయారైన వెంటిలేటర్లు వాడొద్దు. ఇలాగైతేనే మీరు వైరస్‌ తగలకుండా ఉండగలుగుతారు. ‘ఈ ప్రపంచ సంక్షోభానికి తన చర్యలే కారణమైన చైనా (ప్రపంచానికి ఇంకా వాస్తవం తెలియవలసే ఉంది) ప్రదర్శించిన ఈ అహంకారం ప్రపంచం పట్ల ఆ దేశానికున్న అలక్ష్యాన్ని చూపుతోంది.

చాలా రోజులుగా వస్తువుల తయారీ పనుల్ని చైనాకి ఔట్‌సోర్స్‌ చేస్తోన్న ప్రపంచం ఇప్పుడు దాని ఫలితాలను ఎదుర్కొంటోంది. అమెరికాతో సహా ఎన్నో దేశాలు సాధారణ వైద్య పరికరాలు, ఔషధాల కోసం చైనామీద ఆధారపడి వున్నాయి. అమెరికా తనకు తక్షణ అవసరంగా ఉన్న ఈ ఔషధాలు, వైద్య పరికరాలు దొరక్క ప్రాణాంతకమైన నష్టాన్ని అనుభవిస్తోంది. చైనా అధికార వార్తా ఏజెన్సీ జిన్‌ హువాను ఉటంకిస్తూ ది న్యూయార్క్‌ టైమ్స్‌లో ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకారం, చైనా గనుక తన ఔషధాల ఎగుమతిని నిలిపివేస్తే, అమెరికా ఈ కరోనా వైరస్‌ అంటువ్యాధితో నాశనమైపోతుంది.

దీన్నించి ప్రపంచం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటంటే చైనా మీద అతిగా ఆధారపడటాన్ని తగ్గించాలి. ఇది కేవలం కీలకమైన ఔషధాలు, వైద్యపరికరాల కోసం మాత్రమే కాదు, ఇతర రకాల వస్తుతయారీ పంపిణీవ్యవస్థలతో ముడిపడిన అన్నిటికీ వర్తిస్తుంది. దీనికి ఎంతో సమయం పట్టవచ్చు. విపరీతమైన ఖర్చు కావచ్చు. కానీ ప్రత్యేకించి ఇట్లాంటి ప్రాణాంతకమైన సందర్భాలలో చైనాకు బందీగా దొరికిపోకుండా ఉండటానికి అది పనికొస్తుంది. ఒక దేశ సూక్ష్మమైన మౌలిక సదుపాయాల వ్యవస్థను ప్రభావితం చేయగల 5జి లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో హువై లాంటి చైనా కంపెనీలను కలుపుకొని పోకపోవడం కూడా ప్రపంచానికి మేలుకొలుపు కావాలి.

అయితే  వైద్య పరికరాల గురించి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి పలికిన ప్రగల్భాలు ఉత్త అబద్ధాలని స్పెయిన్, చెక్‌ రిపబ్లిక్, ఉక్రెయిన్, ఫిలిప్పైన్స్, నెదర్‌ల్యాండ్స్, టర్కీల నుండి వస్తున్న వార్తలు నిరూపిస్తున్నాయి. చైనా పంపిణీ చేసిన టెస్ట్‌ కిట్లు 30 శాతం మాత్రమే కచ్చితమైన ఫలి తాలు ఇస్తున్నాయనీ, ఒక సందర్భంలో వాడేసిన మాస్కులు కూడా పంపినట్టుగానూ కొన్ని కథనాలు చెపుతున్నాయి.
చివరగా ఈ ప్రాణాంతకమైన వైరస్‌ను ప్రపంచానికి వ్యాపించేలా చేసిన పరిణామాలను చైనా ఎదుర్కోక తప్పదు. వూహాన్‌లో ఈ వైరస్‌ ఎలా ప్రారంభమయిందో ఇంకా చర్చించవలసి ఉన్నప్పటికీ దీని వ్యాప్తి జరిగిన తీరులో ఏ సందేహమూ లేదు. మనుషులలో ఒకరి నుంచి ఒకరికి ఇది వ్యాప్తి చెందుతుందని తెలిసికూడా వూహాన్‌తో సహా మరి కొన్ని ప్రదేశాల నుంచి సుమారు 70 లక్షల మందిని విదేశాలకు ప్రయాణించడానికి చైనా అనుమతిం చింది. ఇది నేరపూరిత చర్య. దీనికి చైనాను బాధ్యురాలిగా నిలబెట్టాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఎన్ని లంచాలు మేపినా, ఎంత సమాచారాన్ని తొక్కిపెట్టినా జవాబుదారీతనం నుంచి చైనా తప్పించుకోలేదు.

ఇక మన పశ్చిమాన ఉన్న పొరుగుదేశం పాకిస్తాన్‌ దానిలో అదే ఒక సమాఖ్య. ఫిబ్రవరి 25న మొదటి కేసు నమోదయినప్పటినించీ ఇప్పటికి 2400 కేసులకు ఆ సంఖ్య పెరిగింది. ప్రపంచమంతా ఈ వ్యాధిమీద పోరాడుతున్న సమయంలో జరిగిన సార్క్‌ దేశాల వీడియో కాన్ఫరెన్సులో పాకిస్తాన్‌ ప్రతినిధి జమ్మూ కశ్మీర్‌లో అమలులో ఉన్న నిర్బంధం గురించి ప్రస్తావన తెచ్చారు. పాక్‌ విదేశాంగ శాఖ, విదేశాంగ మంత్రి కూడా దీని గురించే పలు సందర్భాలలో పదే పదే ప్రస్తావించారు. అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పుగా పరిణమించిన జమ్మూ కశ్మీర్‌ వ్యవహారాల పట్ల అత్యవసరమైన, అవశ్యమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భద్రతామండలి అధ్యక్ష స్థానంలో ఉన్న చైనాను పాకిస్తాన్‌ లిఖితపూర్వకంగా కూడా కోరింది. అయితే ఈ ‘అత్యవసరమైన’ వినతిని స్వీకరించడానికి చైనా తిరస్కరించడం పాకిస్తాన్‌కు ఆశాభంగం కలిగించింది.

దీనికంటే ముందు పాకిస్తాన్‌ తన ఇంటిని తాను చక్కబెట్టుకోవాల్సి ఉంది. ‘ఆజాద్‌‘ జమ్మూ కశ్మీర్, గిల్‌గిత్‌–బాల్టిస్తాన్‌లో కేసుల సంఖ్య దాదాపు 200కు చేరింది. మీడియా కథనాల ప్రకారం పంజాబ్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చినవారిని ఈ ప్రాంతంలోని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని పాకిస్తాన్‌ ఆర్మీ యోచిస్తుందని తెలి యడం అశుభసూచకం. పాకిస్తాన్‌ స్పందించిన తీరులో ప్రత్యేకించి నాలుగు అంశాలు గమనించ దగినవి. వైరస్‌ గనక వ్యాపిస్తే అక్కడ ఉన్న పడకలు, ఎన్‌–95 మాస్కులు, ఇంటెన్సివ్‌ కేర్‌ వార్డుల కొరత, తఫతాన్‌ లాంటి క్వారంటైన్‌ కేంద్రాల్లోని గుబులుపుట్టించే పరిస్థితుల వల్ల మొత్తం ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతుంది. ‘మా దగ్గర కనీసం రేబిస్‌ వ్యాక్సిన్‌ కూడా లేదు. అలాంటిది వేలాదిమంది రోగులు కరోనా చికిత్స కోసం వస్తే ఏం చేయాలి?‘ అని ఒక డాక్టర్‌ వాపోయినట్టుగా ఒక మీడియా కథనం. వరుస ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి కేటాయించిన అరకొర నిధుల ఫలితం ఇది.

అట్లాగే అధికార స్థానంలో ఎవరు ఉన్నారో కూడా తెలియని సందిగ్ధం నెలకొనివుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న కారణంగా ఇమ్రాన్‌ ఖాన్‌ లాక్‌డౌన్‌ను తిరస్కరించారు. కానీ, పీపీపీ అధికారంలో ఉన్న సింధ్‌ సహా కొన్ని రాష్ట్రాలు విభిన్న స్థాయిల్లో లాక్‌డౌన్‌ను అమలుచేశాయి. పంజాబ్, కేపీకే, బలూచిస్తాన్‌ దీన్ని అనుసరిం చాయి. రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమలయ్యేలా పనిచేస్తామని సైన్యం సంకేతమిచ్చింది. అంటే ఎవరు అధికారంలో ఉన్నట్టు?

మూడవది, ఇట్లాంటి క్లిష్టమైన సందర్భంలో కూడా దేశాన్ని ఏకీకృతం చేయగలిగే నాయకత్వ పటిమను ఇమ్రాన్‌ఖాన్‌ ప్రదర్శించలేకపోయాడు. పైగా ప్రతిపక్షాల మీద నిత్యం కయ్యానికి కాలుదువ్వే వైఖరితో వ్యవహరిస్తున్నాడు. పార్లమెంటు నాయకులకు ఉద్దేశించిన ఒక వీడియో కాన్ఫరెన్సులో ఆయన ప్రసంగించిన తర్వాత అందులో పాల్గొన్నవారి అభిప్రాయాలు వినకుండానే ఆఫ్‌లైన్‌ అయ్యాడు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడంలో వారి సలహాలను తీసుకోవటం పట్ల ఆయనకు ఆసక్తి లేదు. నాలుగవది, ఇస్లామ్‌ను సంరక్షించే చివరి దేశం తనే అని పాకిస్తాన్‌ నమ్మకం. సౌదీ అరేబియా, ఇరాన్‌ లాంటి ఇతర ముస్లిం దేశాలు సమూహాలుగా జనం పోగయ్యే అన్ని మతపరమైన కార్యక్రమాలను నిషేధిస్తే పాకిస్తాన్‌ ప్రభుత్వం మాత్రం ’నియమిత సంఖ్య’లో మసీదులలో ప్రార్థనలకు అనుమతినిచ్చింది. నిజం చెప్పాలంటే పాకిస్తాన్‌ కొండవాలున ప్రమాదపుటంచున నిలుచుని వుంది. అది జమ్మూకశ్మీర్‌ గురించి రోదనా గానాలు చేయడం మాని తన పరిస్థితులను చక్కదిద్దుకోవాలి.
(ది ట్రిబ్యూన్‌ సౌజన్యంతో)


-తిలక్‌ దేవశర్‌
వ్యాసకర్త జాతీయ భద్రత సలహా మండలి సభ్యుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement