న్యూఢిల్లీ: దేశంలో టెలికం, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్, జౌళి, ఫుడ్ ప్రాసెసింగ్‌సహా పదమూడు కీలక తయారీ పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చేందుకు ప్రకటించిన ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇవ్వనుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తయారీ రంగం ఉత్పత్తి వచ్చే ఐదేళ్లలో 520 బిలియన్ డాలర్లకు (డాలర్ మారకంలో రూపాయి విలువ 73గా చూస్తే, దాదాపు 37,96,000 కోట్లు) చేరుతుందన్ని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తయారీ రంగం ఉత్పత్తి దాదాపు 380 బిలియన్ డాలర్లు. దిగుమతులపై ఆధాపడ్డాన్ని తగ్గించడం, ఎగుమతుల పెంపు లక్ష్యంగా మొత్తం 13 రంగాలకు రానున్న ఐదేళ్ల కాలంలో రూ.1.97 లక్షల కోట్ల ప్రయోజనాలు కల్పించడం పీఎల్‌ఐ పథకంలో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. పీఎల్‌ఐ స్కీమ్‌పై పారిశ్రామిక, అంతర్జాతీయ వాణిజ్య శాఖ (డీపీఐఐటీ), నీతి ఆయోగ్ నిర్వహించిన ఒక వెబినార్‌ను ఉద్దేశించి ప్రధాని శుక్రవారం చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు..
► భారీ వృద్ధే ప్రధాన లక్ష్యంగా కేంద్రం తయారీ రంగంలో భారీ సంస్కరణలను తీసుకువస్తోంది. వచ్చే ఐదేళ్లకు పీఎల్‌ఐకి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది.
► ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారుకూడా పీఎల్‌ఐ స్కీమ్ వల్ల ప్రయోజనం పొందుతారు. అలాగే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి.
► మౌలిక వనరులకు సంబంధించి సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. వ్యాపార పరిస్థితులు మరింత మెరుగుపడ్డానికి తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. పరిశ్రమల రవాణా వ్యయాలు గణనీయంగా తగ్గడానికి కృషి జరుగుతోంది.
► వివిధ స్థాయిల్లో ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రోత్సాహానికి కేంద్రం గడచిన ఆరు, ఏడు సంవత్సరాల్లో పలు విజయవంతమైన చర్యలను తీసుకుంది.
► పలు విభాగాల్లో నియంత్రణా పరమైన క్లిష్టతలను సైతం ప్రభుత్వం తగ్గిస్తోంది.
► అలాగే విభిన్న రంగాల్లో అత్యాధునిక సాంకేతికను ప్రవేశపెట్టడానికి తగిన చొరవలను, నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటోంది.
చిరుధాన్యాల సంవత్సరం... మనకు ఒక అవకాశం
2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలన్న భారత్ తీర్మానానికి ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవ ఆమోదముద్ర వేయడాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది భారత్ రైతులకు ఒక మంచి అవకాశమని ఆయన అన్నారు. ఆరోగ్య సంరక్షణలో చిరుధాన్యాల విలువను తెలియజేడానికి ప్రపంచవ్యాప్త ప్రచారం ప్రారంభించాలని ఆయన పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. ఈ తరహా ప్రచారం భారత్ రైతులకు ప్రయోజనం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.
వృద్ధే బడ్జెట్ లక్ష్యం: వివేక్ దేవ్‌రాయ్
వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ వృద్ధే లక్ష్యంగా రూపొందిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్‌రాయ్ పేర్కొన్నారు. అలాగే పన్ను రేట్లు స్థిరంగా కొనసాగుతాయని కూడా సంకేతాలు ఇచ్చిందని వివరించారు. వినియోగం, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయాల పెంపు లక్ష్యంగా సంస్కరణలపై 2021–22 బడ్జెట్ దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ బీఎఫ్‌ఎస్‌ఐ అండ్ ఫిన్‌టెక్ సదసు 2021ని ఉద్ధేశించి ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 11 శాతంగా నమోదవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్షీణత 8 శాతంగా ఉంటుందని అంచనా. ఎగుమతుల పెంపు ప్రభుత్వం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. వాస్తవిక వృద్ధిని అందించే రంగాల్లో ఎగుమతులు ఒకటి. అయితే ఎగుమతుల పెరుగుదల ఇంకా అనిశ్చితిని ఎదుర్కొంటోంది.
ఫైనాన్షియల్ రంగం ‘నెమ్మది’: చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్
చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యం ఇదే సమావేశంలో మాట్లాడుతూ, భారత్ ఫైనాన్షియల్ రంగం తన పూర్తి స్థామర్థ్యం మేరకు పురోగమించడం లేదని అన్నారు. ఒక రకంగా చాలా నెమ్మదిగా నడుస్తోందన్నారు. ఉదాహరణకు ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌లో బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రపంచంలో 55వ ర్యాంకులో ఉందన్నారు. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అవినాశ్ గుప్తా మాట్లాడుతూ, భారత్‌ను వృద్ధి బాటలో సంఘటితంగా ముందుకు నడిపించడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రత్యేకించి లాక్‌డౌన్ పరిస్థితుల్లో డిజిటల్ టెక్నాలజీ కీలకపాత్ర మరువలేనిదన్నారు. డిజిటల్ లావాదేవీల పరిమాణం 2020 ఏప్రిల్– 2021 మార్చి 1 మధ్య రూ.4,525 కోట్లకు చేరిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment