
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాలు, వాహన విడిభాగాల తయారీ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం జోష్ నింపింది. వచ్చే అయిదేళ్లలో రూ.42,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేయగా.. ఏకంగా రూ.67,690 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు రావడం విశేషం. పీఎల్‌ఐ పథకం కింద మొత్తం 115 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. పథకం, మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 23న ప్రకటించింది. వచ్చిన దరఖాస్తుల్లో 85 కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటిలో చాంపియన్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 18 సంస్థలు, కంపోనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 67 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండు విభాగాల్లోనూ రెండు కంపెనీలు ఎంపికైనట్టు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
విదేశీ కంపెనీలు సైతం..
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఎంపికైన కంపెనీల జాబితాలో భారత్‌తోపాటు రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యూఎస్, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, నెదర్లాండ్స్ కంపెనీలు ఉండడం గమనార్హం. అంచనాలను మించి పెట్టుబడి ప్రతిపాదనలు రావడం ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా భారత పురోగతికి నిదర్శనమని ప్రభుత్వం తెలిపింది. ఆత్మనిర్భర్ ప్రణాళికలో భాగంగా భారతీయ తయారీదార్లను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడం, పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతుల పెంపు, భారత్‌ను ప్రపంచ సరఫరా వ్యవస్థలో భాగం చేయడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వివిధ రంగాలలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment