టెక్స్‌టైల్స్ రంగానికి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద.. 61 ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి రూపంలో రూ.19,077 కోట్ల పెట్టుబడులు రానున్నట్టు ప్రకటించింది. ఫలితంగా రూ.1,84,917 కోట్ల టర్నోవర్ నమోదు అవుతుందని.. 2.40 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. పీఎల్‌ఐ కింద మొత్తం 67 ప్రతిపాదనలు అందాయని టెక్స్‌టైల్స్ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ వెల్లడించారు. గిన్ని ఫిలమెంట్స్, కింబర్లీ క్లార్క్, అరవింద్ తదితర కంపెనీల ప్రతిపాదనలు ఆమోదం పొందిన వాటిల్లో ఉన్నాయి. పీఎల్‌ఐ పథకం కింద ఎంఎంఎఫ్ (మానవ తయారీ) వ్రస్తాలు, ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్, టెక్నికల్ టెక్స్‌టైల్స్ ఉత్పత్తులు తదితర వాటి తయారీపై ఐదేళ్ల కాలంలో రూ.10,683 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం లోగడే ప్రకటించడం గమనార్హం. దేశీయంగా టెక్స్‌టైల్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎగుమతులను మరింత విస్తరించుకోవడం ఈ పథకం లక్ష్యాలుగా ఉన్నాయి.
పార్ట్–2 కింద ఎక్కువ దరఖాస్తులు
మొత్తం 67 దరఖాస్తుల్లో పార్ట్1 కింద 15 రాగా, పార్ట్2 కింద 52 వచ్చాయి. పార్ట్1 కింద కనీసం రూ.300 కోట్లను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పీఎల్‌ఐ కింద ప్రోత్సాహకాలు పొందాలంటే రూ.600 కోట్ల టర్నోవర్ నమోదు చేయాలి. పార్ట్2 కింద కనీస పెట్టుబడి పరిమితి రూ.100 కోట్లు. కనీసం రూ.200 కోట్ల టర్నోవర్ నమోదు చేస్తే ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. గిన్ని ఫిలమెంట్స్, అవ్‌గోల్ ఇండియా, గోవా గ్లాస్ ఫైబర్, హెచ్‌పీ కాటన్ టెక్స్‌టైల్స్ మిల్స్, కింబర్లీ క్లార్క్ ఇండియా, మధుర ఇండ్రస్టియల్ టెక్స్‌టైల్స్, ఎంసీపీఐ ప్రైవేటు లిమిటెడ్, ప్రతిభ సింటెక్స్, షాహి ఎక్స్‌పోర్ట్స్, ట్రిడెంట్, డోనియర్ ఇండస్ట్రీస్, గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, అరవింద్ లిమిటెడ్ ఉన్నాయి. ఇందులో అరవింద్ లిమిటెడ్ రూ.170 కోట్లు, గిన్ని ఫిలమెంట్స్ రూ.180 కోట్లు, గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్ రూ.143 కోట్లు, కింబర్లీ క్లార్క్ ఇండియా రూ.308 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఆమోదం పొందిన 61 ప్రతిపాదనల్లో ఏడు విదేశీ కంపెనీలకు సంబంధించి ఉన్నాయి.
మరిన్ని ఎగుమతులు..
అంతర్జాతీయంగా మానవ తయారీ ఫైబర్, టెక్నికల్ టెక్స్‌టైల్స్‌లో భారత వాటా పెరిగేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని యూపీ సింగ్ తెలిపారు. టెక్నికల్ టెక్స్‌టైల్స్ ఎగుమతులను 2 బిలియన్ డాలర్ల నుంచి 8–10 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని అనుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టెల్స్ పార్క్స్ (మిత్రా) పథకం గురించి సింగ్ మాట్లాడుతూ.. 13 రాష్ట్రాల నుంచి 17 ప్రతిపాదనలు వచి్చనట్టు చెప్పారు. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి నాలుగు, కర్ణాటక నుంచి రెండు ఉన్నట్టు పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయా రాష్ట్రాలకు బృందాలను పంపిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పథకం కింద ఏడు పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వీటి కోసం రాష్ట్రాల ఎంపికకు ప్రత్యేక విధానాన్ని అనుసరించనున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment