న్యూఢిల్లీ: భారత వాహన పరిశ్రమ 2030 నాటికి ప్రపంచంలో మూడవ స్థానానికి ఎగబాకుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాహనాలు, విడిభాగాల తయారీని పెంపొందించేందుకు ఉద్ధేశించిన రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) వంటి పథకాలు ఇందుకు దోహదం చేస్తాయని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివరించింది. ‘పీఎల్‌ఐ కోసం దరఖాస్తు చేసే కంపెనీలు పరిశ్రమ వృద్ధిలో కీలకంగా వ్యవహరించనున్నాయి.
వాహన పరిశ్రమ మద్దతు, వృద్ధి లేకుండా దేశంలో అధునాతన ఆటోమోటివ్ సాంకేతికత, ఉత్పత్తుల స్థానికీకరణ, అభివృద్ధి లక్ష్యం సాధ్యం కాదు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రధాన స్తంభాలలో వాహన పరిశ్రమ ఒకటి. దేశీయ స్థూల ఉత్పత్తిలో ఈ రంగం వాటా 1992–93లో 2.77 శాతమే. ఇప్పుడు ఏకంగా ఇది 7.1 శాతానికి ఎగసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.9 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తోంది. వాహన రంగంలో ద్విచక్ర వాహనాలు 77 శాతం, ప్యాసింజర్ కార్లు 18 శాతం వాటా కలిగి ఉన్నాయి.
ప్యాసింజర్ కార్లలో చిన్న, మధ్యస్థాయి కార్లదే సింహ భాగం. 2024 డిసెంబర్ నాటికి ఆటోమొబైల్ రంగం రెండింతలై రూ.15 లక్షల కోట్లకు చేరుకోవాలన్నది భారత్ లక్ష్యం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రూపంలో ఈ రంగంలోకి 2000 ఏప్రిల్ నుంచి 2022 సెపె్టంబర్ మధ్య 33.77 బిలియన్ డాలర్ల నిధులు వెల్లువెత్తాయి. ఈ కాలంలో భారత్ అందుకున్న మొత్తం ఎఫ్‌డీఐల్లో వీటి వాటా 5.48 శాతం’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment