Vehicle industry
-
2030 నాటికి మూడవ స్థానానికి
న్యూఢిల్లీ: భారత వాహన పరిశ్రమ 2030 నాటికి ప్రపంచంలో మూడవ స్థానానికి ఎగబాకుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాహనాలు, విడిభాగాల తయారీని పెంపొందించేందుకు ఉద్ధేశించిన రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) వంటి పథకాలు ఇందుకు దోహదం చేస్తాయని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివరించింది. ‘పీఎల్ఐ కోసం దరఖాస్తు చేసే కంపెనీలు పరిశ్రమ వృద్ధిలో కీలకంగా వ్యవహరించనున్నాయి. వాహన పరిశ్రమ మద్దతు, వృద్ధి లేకుండా దేశంలో అధునాతన ఆటోమోటివ్ సాంకేతికత, ఉత్పత్తుల స్థానికీకరణ, అభివృద్ధి లక్ష్యం సాధ్యం కాదు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రధాన స్తంభాలలో వాహన పరిశ్రమ ఒకటి. దేశీయ స్థూల ఉత్పత్తిలో ఈ రంగం వాటా 1992–93లో 2.77 శాతమే. ఇప్పుడు ఏకంగా ఇది 7.1 శాతానికి ఎగసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.9 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తోంది. వాహన రంగంలో ద్విచక్ర వాహనాలు 77 శాతం, ప్యాసింజర్ కార్లు 18 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్యాసింజర్ కార్లలో చిన్న, మధ్యస్థాయి కార్లదే సింహ భాగం. 2024 డిసెంబర్ నాటికి ఆటోమొబైల్ రంగం రెండింతలై రూ.15 లక్షల కోట్లకు చేరుకోవాలన్నది భారత్ లక్ష్యం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రూపంలో ఈ రంగంలోకి 2000 ఏప్రిల్ నుంచి 2022 సెపె్టంబర్ మధ్య 33.77 బిలియన్ డాలర్ల నిధులు వెల్లువెత్తాయి. ఈ కాలంలో భారత్ అందుకున్న మొత్తం ఎఫ్‌డీఐల్లో వీటి వాటా 5.48 శాతం’ అని తెలిపింది. -
6 నెలల్లో 20 లక్షల వాహన విక్రయాలు
ముంబై: ఈ ఏడాది ప్రథమార్ధం వాహన పరిశ్రమకు అత్యుత్తమంగా నిలిచింది. ప్యాసింజర్ విభాగంలో మొత్తం 20 లక్షల వాహనాలు విక్రమయ్యాయి. ఇక నెలవారీగా జూన్ ఆటోమొబైల్ పరిశ్రమకు పెద్దగా కలిసిరాలేదు. మొత్తం 3.37 లక్ష వాహన అమ్మకాలు జరిగాయి. ఏడాది ఇదే నెలలో సరఫరా చేసిన 3.21 లక్షల వాహనాలతో పోలిస్తే ఇది 1.9% మాత్రమే అధికంగా ఉంది. కార్ల తయారీ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటార్.. అమ్మకాల్లో ఓ మోస్తరు వృద్ధి నమోదైంది. ► మారుతి సుజుకీ జూన్‌లో మొత్తం 1,33,027 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల విక్రయాలతో పోలి్చతే కేవలం ఎనిమిది శాతం (1,22,685 యూనిట్లు) వృద్ధి నమోదైంది. వడ్డీ రేట్లు అధికంగా ఉండటంతో పాటు రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చన్న అంచనాలు విక్రయాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ► హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాల్లో కేవలం 2 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. కంపెనీ ఈ కాలంలో 50,001 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ► టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎంజీ మోటార్, టాటా మోటార్స్ విక్రయాలు వరుసగా 19%, 14%, ఒక శాతం పెరగగా కియా, హోండా కార్ల విక్రయాలు మాత్రం వరుసగా 19%, 35% మేరకు క్షీణించాయి. -
‘ఆటో’కు తీరని చిప్ చిక్కులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో వాహనాల పరిశ్రమకు మొదలైన సెమీ కండక్టర్ల కష్టాలు ఇంకా పూర్తిగా తీరలేదు. గతంతో పోలిస్తే తీవ్రత కొంత తగ్గినా ఇప్పటికీ చిప్‌ల కొరత వెన్నాడుతూనే ఉంది. దీంతో ఆర్డర్లు పుష్కలంగా ఉన్నా ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకోలేకపోతున్నాయి. ఫలితంగా పెండింగ్ ఆర్డర్లు పేరుకుపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆటోమొబైల్ కంపెనీలు దాదాపుగా ఇవే విషయాలను ప్రస్తావించాయి. రెండో త్రైమాసికంతో పోలి స్తే మూడో క్వార్టర్లో పరికరాల సరఫరాపరమైన సమస్య స్వల్పంగా పెరిగిందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐఎల్) పేర్కొంది. క్యూ3లో దా దాపు 46,000 వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయినట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ పరికరాల లభ్యతపై స్పష్టత లేకపోవడంతో ఉత్పత్తి ప్రణాళికలు వేసుకోవడం సవాలుగా మారిందని ఎంఎస్ఐఎల్ వివరించింది. దీనితో మూడో త్రైమాసికం ఆఖరు నాటికి 3,63,000 వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని.. వీటిలో 1,19,000 ఆర్డర్లు ఇటీవల ప్రవేశపెట్టిన మోడల్స్వే ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అదే పరిస్థితిలో మరిన్ని సంస్థలు .. మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం తెలంగాణ, మహారాష్ట్రలో దాదాపు రూ. 11,000 కోట్లతో పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించినప్పటికీ ప్రస్తుతమున్న ప్లాంట్ల సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలే ఇందుకు కారణమని కంపెనీ ఈడీ రాజేశ్ జెజూరికర్ వెల్లడించారు. స్కార్పియో, ఎక్స్‌యూవీ700 వంటి వాహనాల తయారీలో దాదాపు 200 రకాల సెమీకండక్టర్ చిప్స్ అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంఅండ్ఎం వద్ద 2,66,000 వాహనాలకు ఆర్డర్లు ఉన్నాయి. ఇక చిప్లపరమైన సవాళ్లు 2023లో కూడా కొనసాగవచ్చని జేఎల్ఆర్ పేర్కొంది. చిప్‌ల సరఫరాను మెరుగుపర్చుకునే దిశ గా మంచి పురోగతే సాధించామని .. అయినప్పటికీ కొన్ని సవాళ్లు నెలకొన్నాయని తెలిపింది. చైనాలో మళ్లీ కోవిడ్ ప్రబలడం, మార్కెట్లో అధిక రేట్లకు చిప్‌లు కొనాల్సి వస్తుండటం తదితర సవాళ్లు ఉన్న ట్లు వివరించింది. 2023లో డిమాండ్ సానుకూలంగానే ఉంటుందని భావిస్తున్నామని అయితే వాహనాలను ఎంత మేరకు అందించగలమనేది చిప్‌ల సరఫరా అంశమే నిర్దేశిస్తుందని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఎండీ పియుష్ ఆరోరా తెలిపారు. -
మారుతీ మినీ ఎస్యూవీ.. ఎస్–ప్రెసో
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ మినీ ఎస్యూవీ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్), ఎస్–ప్రెసోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మినీ ఎస్యూవీ ధరలు రూ.3.69 లక్షల నుంచి రూ.4.91 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్ ధరలు)లో ఉన్నాయి. స్టాండర్డ్‌తో సహా మొత్తం నాలుగు వేరియంట్లు, ఆరు రంగుల్లో ఈ కారు లభ్యమవుతోంది. రెనో క్విడ్, డాట్సన్ రెడీ–గో, మారుతీ సుజుకీ కంపెనీకే చెందిన ఆల్టో కే10 కార్లకు ఈ ఎస్–ప్రెసో గట్టి పోటీనిస్తుందని అంచనా. ఎనిమిదవ బీఎస్–సిక్స్ మారుతీ మోడల్ మారుతీ కంపెనీ ఐదవ తరం హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ కారు లీటర్‌కు 21.7 కిమీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ ఎమ్డీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. బీఎస్(భారత్ స్టేజ్)–సిక్స్ పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1 లీటర్ కే10 పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారును తయారు చేశామని పేర్కొన్నారు. తమ కంపెనీ నుంచి బీఎస్–సిక్స్ ఇంజిన్‌తో వస్తున్న ఎనిమిదవ మోడల్ ఇదని తెలిపారు. ఈ కారు మాన్యువల్(5 గేర్లు), ఆటో గేర్ షిఫ్ట్(ఏజీఎస్) ఆప్షన్లలో లభిస్తుందని తెలిపారు. వివిధ భద్రతా ఫీచర్లతో ఈ కారును రూపొందించామని చెప్పారు. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ (యాంటీ–లాక్బ్రేకింగ్ సిస్టమ్) లిమిటర్స్, రియర్ పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్, హైస్పీడ్ వారి్నంగ్ అలర్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు.. తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ట్విన్ చాంబర్ హెడ్‌ల్యాంప్స్, సిగ్నేచర్ సి షేప్డ్ టెయిల్ ల్యాంప్స్, బాడీ కలర్డ్ బంపర్స్, ఓఆర్వీఎమ్స్ వంటి ఫీచర్లున్నాయని తెలిపారు. ఇక ఇంటీరియర్ విషయానికొస్తే, ఆడియో, వాయిస్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 7–అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌్రస్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. రూ. 640 కోట్ల పెట్టుబడులు... ఈ కారు తయారీలో స్థానిక విడిభాగాలను 98 శాతం మేర ఉపయోగించామని అయుకవ చెప్పారు. ఈ కారు అభివృద్ధి కోసం రూ.640 కోట్లు ఇన్వెస్ట్ చేశామని తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతమున్న మందగమనం తాత్కాలికమేనని భావిస్తున్నామని చెప్పారు. మార్కెట్ సెంటిమెంట్‌ను మార్చడానికి ఎస్–ప్రెసో తోడ్పడగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కాంపాక్ట్ కార్లకే మొగ్గు.... ఇటీవలి కాలంలో వినియోగదారులు కాంపాక్ట్ కార్ల కొనుగోలుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఆయుకవ చెప్పారు. ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్లో తాజా డిజైన్‌తో కూడిన కారు అవసరం ఉందని, దీని కోసమే ఎస్–ప్రెసో కారును అందుబా టులోకి తెచ్చామని వివరించారు. తర్వాతి తరం కాంపాక్ట్ కార్ల డిజైన్‌కు ఎస్–ప్రెసో దారి చూపుతుందని తెలిపారు. ఎరెనా రిటైల్ నెట్వర్క్ ద్వారా ఈ కార్లను విక్రయిస్తామని పేర్కొన్నారు. -
రోడ్లపై కార్ల జోరు!
న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ జోరుమీదుంది. జూన్ నెలలో ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 38 శాతం వృద్ధి నమోదయ్యింది. అటుఇటుగా గత పదేళ్లలో ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ సమాఖ్య (సియామ్) తాజా గణాంకాల ప్రకారం.. ♦ దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) అమ్మకాలు 1,99,036 యూనిట్ల నుంచి 2,73,759 యూనిట్లకు పెరిగాయి. 2009 డిసెంబర్ నాటి 50 శాతం వృద్ధి తర్వాత ఇదే అత్యంత వేగవంతమైన నెలవారీ వృద్ధి. ♦ దేశీ కార్ల విక్రయాలు 34.21 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,37,012 యూనిట్ల నుంచి 1,83,885 యూనిట్లకు పెరిగాయి. ♦ ‘జీఎస్టీ అమలు నేపథ్యంలో ధరల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో ప్రజలు గతేడాది ఇదే నెలలో కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. దీనివల్ల ప్రస్తుతం వృద్ధి రేటు పెరిగింది’ అని సియా మ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథూర్ తెలిపారు. ♦ యుటిలిటీ వెహికల్స్, వ్యాన్ల విక్రయాల్లో వరుసగా 47.11 శాతం, 35.64 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦ మారుతీ సుజుకీ దేశీ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 44.4 శాతం వృద్ధితో 1,34,036 యూనిట్లకు, హ్యుందాయ్ మోటార్ విక్రయాలు 20.79 శాతం వృద్ధితో 45,371 యూనిట్లకు పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు 11.89 శాతం వృద్ధితో 18,092 యూనిట్లకు, టాటా మోటార్స్ పీవీ అమ్మకాలు 56.75 శాతం వృద్ధితో 20,610 యూనిట్లకు ఎగశాయి. ♦ మొత్తం టూవీలర్ విక్రయాల్లో 22.28 శాతం వృద్ధి నమోదయ్యింది. 18,67,884 యూనిట్లకు పెరిగాయి. ♦ మోటార్ సైకిల్ అమ్మకాలు 24.32 శాతం వృద్ధితో 11,99,332 యూనిట్లకు ఎగశాయి. హీరో మోటొకార్ప్ దేశీ మోటార్ సైకిల్ విక్రయాలు 16.56 శాతం పెరిగాయి. 6,26,194 యూనిట్లుగా నమోదయ్యాయి. హోండా మోటార్ సైకిల్ అమ్మకాలు 19.89 శాతం వృద్ధితో 1,74,276 యూనిట్లకు పెరిగాయి. బజాజ్ ఆటో విక్రయాలు ఏకంగా 85.87 శాతం వృద్ధితో 2,00,949 యూనిట్లకు ఎగశాయి. ♦ స్కూటర్ విక్రయాలు 20.96 శాతం వృద్ధితో 6,01,761 యూనిట్లకు చేరాయి. హోండా మోటార్‌సైకిల్ దేశీ స్కూటర్ అమ్మకాలు 33.29 శాతం వృద్ధి చెందాయి. 3,61,236 యూనిట్లుగా నమోదయ్యాయి. టీవీఎస్ మోటార్స్ విక్రయాలు 14.84 శాతం వృద్ధితో 99,107 యూనిట్లకు పెరిగాయి. హీరో మోటొకార్ప్ స్కూటర్ అమ్మకాలు 15.53 శాతం క్షీణతతో 63,755 యూనిట్లకు తగ్గాయి. ♦ వాణిజ్య వాహన అమ్మకాలు 41.72 శాతం వృద్ధితో 80,624 యూనిట్లకు ఎగశాయి. -
కారు.. బైక్ రయ్రయ్
న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ జోరు మీదుంది. భారత్‌లో ప్యాసింజర్ వాహన విక్రయాలు మే నెలలో దాదాపు ఏకంగా 20 శాతంమేర ఎగశాయి. యుటిలిటీ వెహికల్స్, కార్లు, వ్యాన్ల విభాగాల్లోని బలమైన అమ్మకాలు దీనికి ప్రధాన కారణం. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరుసగా రెండో నెలలోనూ వాహన అమ్మకాల్లో బలమైన వృద్ధి కనిపించింది. ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య ‘సియామ్’ తాజా గణాంకాల ప్రకారం. ⇒ ప్యాసింజర్ వాహన (పీవీ) అమ్మకాలు మే నెలలో 19.65% వృద్ధితో 2,51,764 యూనిట్ల నుంచి 3,01,238 యూనిట్లకు ఎగశాయి. దేశీ కార్ల విక్రయాలు కూడా 19.64% పెరిగాయి. ఇవి 1,66,732 యూనిట్ల నుంచి 1,99,479 యూనిట్లకు చేరాయి. యుటిలిటీ వాహన (యూవీ) అమ్మకాలు 17.53 శాతం వృద్ధితో 82,086 యూనిట్లకు, వ్యాన్ల విక్రయాలు 29.54 శాతం వృద్ధితో 19,673 యూనిట్లకు పెరిగాయి. పీవీ వాహన ఎగుమతులు కూడా 3.45% వృద్ధితో 59,648 యూనిట్లకు చేరాయి. ⇒ ‘విక్రయాల కోణంలో చూస్తే పరిశ్రమ సరైన దారిలో వెళ్తుంది. అన్ని విభాగాల్లోనూ బలమైన విక్రయాలు నమోదయ్యాయి’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు. కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ సహా చాలా అంశాలు పీవీ విభాగంలో విక్రయాల వృద్ధికి కారణంగా నిలిచాయని పేర్కొన్నారు. జీఎస్టీ అమలు వల్ల ధరల పెరుగుదల నేపథ్యంలో గతేడాది ‘ఏప్రిల్–మే’లో అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడిందని గుర్తుచేశారు. మారుతీ @ 1,61,497 యూనిట్లు మారుతీ సుజుకీ దేశీ ప్యాసింజర్ వాహన విక్రయాలు 23.99% వృద్ధితో 1,61,497 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్ అమ్మకాల్లో 7.14% వృద్ధి నమోదయ్యింది. 45,008 యూనిట్లకు చేరాయి. మహీంద్రా విక్రయాలు 1.63% వృద్ధితో 20,621 యూనిట్లకు, టాటా మోటార్స్ పీవీ విక్రయాలు 53.63% వృద్ధితో 19,202 యూనిట్లకు పెరిగాయి. టూవీలర్ అమ్మకాలు 9 శాతం అప్ మొత్తం టూవీలర్ విక్రయాల్లో 9.19 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 16,94,323 యూనిట్ల నుంచి 18,50,093 యూనిట్లకు పెరిగాయి. మోటార్‌సైకిల్ అమ్మకాలు 15.16 శాతం వృద్ధితో 12,21,559 యూనిట్లకు చేరాయి. మార్కెట్ లీడర్ హీరో మోటొకార్ప్ దేశీ మోటార్‌సైకిల్ విక్రయాల్లో 17.46 శాతం వృద్ధి కనిపించింది. ఇవి 6,37,203 యూనిట్లకు పెరిగాయి. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) అమ్మకాలు 8.91 శాతం వృద్ధితో 1,91,920 యూనిట్లకు, బజాజ్ ఆటో మోటార్‌సైకిల్ విక్రయాలు 23.01 శాతం వృద్ధితో 1,92,543 యూనిట్లకు ఎగిశాయి. స్కూటర్ డీలా... స్కూటర్ విక్రయాలు 1.4 శాతం క్షీణతతో 5,63,326 యూనిట్ల నుంచి 5,55,467 యూనిట్లకు తగ్గాయి. గత 15 నెలల కాలంలో స్కూటర్ విక్రయాలు తగ్గడం ఇదే తొలిసారి. చివరిగా 2017 జనవరిలో స్కూటర్ అమ్మకాల్లో 14.5 శాతం క్షీణత నమోదయ్యింది. మార్కెట్ లీడర్ హెచ్ఎంఎస్ఐ దేశీ స్కూటర్ విక్రయాలు 2.09 శాతం క్షీణతతో 3,27,167 యూనిట్లకు తగ్గాయి. టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు 8.87 శాతం వృద్ధితో 90,737 యూనిట్లకు పెరిగాయి. హీరో మోటొకార్ప్ స్కూటర్ విక్రయాలు ఏకంగా 21.49 శాతం క్షీణతతో 55,398 యూనిట్లకు తగ్గాయి. మరోవైపు వాణిజ్య వాహన అమ్మకాలు 43.06 శాతం వృద్ధితో 76,478 యూనిట్లకు ఎగశాయి. -
వాహన పరిశ్రమకు ’స్క్రాప్’ బూస్ట్
* వినూత్న పాలసీకి కేంద్రం కసరత్తు * కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడి న్యూఢిల్లీ: దేశ ఆటో పరిశ్రమకు ఊపునిచ్చే వినూత్న పథక ప్రకటనకు కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ ఆదివారం తెలిపిన సమాచారం ప్రకారం- కాలుష్య కారకమైన పాతవాహనాలను అప్పగిస్తే- ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఉద్దేశించిన కొత్త ‘స్క్రాప్’ పథకం ముసాయిదా సిద్ధమయ్యింది. సంబంధిత వర్గాల సలహాలు, సూచనల కోసం ఈ ముసాయిదాను మరో వారం రోజుల్లో మంత్రిత్వశాఖ వెబ్సైట్లో ఉంచుతున్నట్లు మంత్రి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయా అంశాల ప్రాతిపదికన ముసాయిదాను ఆమోదం నిమిత్తం ఆర్థిక మంత్రిత్వశాఖ ముందు ఉంచుతామని తెలిపారు. ఇక్కడ ఆమోదం లభించిన వెంటనే ఈ విధానం కేబినెట్ ముందుకు వెళుతుంన్నారు. రానున్న ఐదేళ్లలో ఆటో పరిశ్రమ 4 రెట్లు పెరిగి రూ.20 లక్షల కోట్ల స్థాయికి చేరుకునేలా ముసాయిదా రూపకల్పన జరిగినట్లు వెల్లడించారు. ప్రపంచ అత్యుత్తమ కార్ల ఎగుమతుల విషయంలో భారత్ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకునే శక్తిసామర్థ్యాలను సముపార్జించుకుంటున్నట్లు వెల్లడించారు. కాలుష్య కారక తమ పాతవాహనాన్ని అప్పగించి కొత్త వాహన కొనుగోలుపై ఎక్సైజ్ సుంకంపై 50% రిబేట్ ఇచ్చే అంశం ముసాయిదాలో ఉన్నట్లు తెలిపారు. -
వడ్డీరేట్లను తగ్గించాలి
వాహన పరిశ్రమ డిమాండ్ న్యూఢిల్లీ: ప్రయాణికుల కార్ల అమ్మకాలు గత ఏడాది 2 శాతం వృద్ధి సాధించాయి. ఎక్సైజ్ సుంకం రాయితీల కారణంగా 2014లో తొమ్మిది నెలల పాటు ధరలు తగ్గాయని, ఫలితంగా కార్ల అమ్మకాలు 2 శాతం పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ(సియామ్) తెలిపింది. ఈ సుంకం రాయితీలను ప్రభుత్వం ఉపసంహరించినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు 1 శాతం వృద్ధి సాధిస్తాయని అంచనాలున్నాయని సియామ్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ చెప్పారు. అమ్మకాలు 4 శాతం వరకూ పెరగగలవన్న అంచనాలను గతంలో వెల్లడించామని వివరించారు. ఎక్సైజ్ సుంకం పెంపు ప్రభావం కొంత ప్రతికూలంగానే ఉంటుందని సుగతోసేన్ వెల్లడించారు. అయితే చిన్న కార్ల సెగ్మెంట్‌పై ఎక్కువగా ప్రభావం ఉంటుందని వివరించారు. ఈ సెగ్మెంట్లో పోటీ తీవ్రంగా ఉండడమే దీనికి కారణమని వెల్లడించారు. సుంకం పెంచుతారనే అంచనాలతో పలువురు గత నెలలోనే వాహనాలను కొనుగోలు చేశారని, ఫలితంగా జనవరి, ఫిబ్రవరిల్లో అమ్మకాలు తగ్గుతాయని వివరించారు. వడ్డీరేట్లను తగ్గిస్తే, ఎక్సైజ్ పెంపు భారం కొంతవరకైనా తగ్గుతుందని పేర్కొన్నారు. వాహన పరిశ్రమపై పన్నుల భారం కూడా అధికంగానే ఉందని, దీనిని తొలగించాల్సి ఉందని ఆయన సూచించారు. వాహనాల విక్రయాలకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం...., * 2013లో 18,06,965ఉన్న ప్రయాణికుల కార్ల అమ్మకాలు 2014లో 2.4 శాతం వృద్ధితో 18,51,475కు పెరిగాయి. * 2013లో కార్ల అమ్మకాలు 10 శాతం క్షీణించాయి. 11 ఏళ్ల తర్వాత కార్ల అమ్మకాలు తగ్గడం ఇదే మొదటిసారి. * 2013లో 1,02,75,001 గా ఉన్న మోటార్ సైకిళ్ల అమ్మకాలు గత ఏడాదిలో 6 శాతం వృద్ధితో 1,09,13,003కు పెరిగాయి. * వాణిజ్య వాహనాల అమ్మకాలు 12 శాతం క్షీణించి 6,06,232కు తగ్గాయి. ఆర్థిక కార్యకలాపాలు ఇంకా పుంజుకోలేనందున ఈ సెగ్మంట్ అమ్మకాలు ఇంకా క్షీణపథంలోనే ఉన్నాయి. -
కొత్త ఏడాదిలో 20 వేల కోట్ల పెట్టుబడులు
వాహన కంపెనీల ఉత్సాహం న్యూఢిల్లీ: వాహన పరిశ్రమ కొత్త ఏడాదిలో కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా ప్రవేశిస్తోంది. మరో పది రోజుల్లో ముగుస్తున్న 2014 ఏడాది ఆశించిన విధంగా లేనప్పటికీ, వివిధ వాహన కంపెనీలు కొత్త ఏడాదిలో రూ.20,500 కోట్లు (సుమారుగా 500 కోట్ల డాలర్ల) వరకూ పెట్టుబడులు పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో తదితర సంస్థలు ఇప్పటికే తమ పెట్టుబడుల ప్రణాళికలను వెల్లడించాయి.కొత్త ఉత్పత్తులు, మార్కెటింగ్ కోసం మారుతీ సుజుకీ వచ్చే ఏడాది రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. మహారాష్ట్రలోని చకన్ ప్లాంట్ విస్తరణ నిమిత్తం మహీంద్రా కంపెనీ ఏడేళ్లలో రూ.4,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నది. మహారాష్ట్రలోని ప్లాంట్ల విస్తరణ కోసం బజాజ్ ఆటో రూ.2,000 పెట్టుబడులు పెడుతోంది. ఇక ఫోక్స్‌వ్యాగన్ సంస్థ భారత్‌లో తన వ్యాపార విస్తరణ కోసం రూ.800 కోట్లు వ్యయం చేయనున్నది. కొత్త హ్యాచ్‌బాక్‌ను, ఎస్‌యూవీని, హ్యాచ్బాక్ల కోసం ఈ కంపెనీ ఈ స్థాయి పెట్టుబడులు పెడుతోంది. హీరో మోటోకార్ప్ కంపెనీ విస్తృతంగా విదేశీ మార్కెట్లలో విస్తరించనున్నది. అమెరికా, బ్రెజిల్, యూరప్ దేశాలతో పాటు స్వదేశంలోని ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం విస్తరణ కోసం ఈ కంపెనీ రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. భారత్‌లో రెండు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నది. 2020 కల్లా 50కు పైగా దేశాల్లో 20కి పైగా అసెంబ్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని హీరో మోటోకార్ప్ లక్ష్యంగా పెట్టుకుంది. హీరో మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ గుజరాత్లో రూ.1,100 కోట్ల పెట్టుబడులతో స్కూటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది చివరి కల్లా ఇది ఉత్పత్తి ప్రారంభించవచ్చు. ఇవే కాకుండా వివిధ వాహన విడిభాగాల కంపెనీలు కూడా భారీ పెట్టుబడులతో రానున్నాయి.