న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో వాహనాల పరిశ్రమకు మొదలైన సెమీ కండక్టర్ల కష్టాలు ఇంకా పూర్తిగా తీరలేదు. గతంతో పోలిస్తే తీవ్రత కొంత తగ్గినా ఇప్పటికీ చిప్‌ల కొరత వెన్నాడుతూనే ఉంది. దీంతో ఆర్డర్లు పుష్కలంగా ఉన్నా ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకోలేకపోతున్నాయి. ఫలితంగా పెండింగ్ ఆర్డర్లు పేరుకుపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆటోమొబైల్ కంపెనీలు దాదాపుగా ఇవే విషయాలను ప్రస్తావించాయి.
రెండో త్రైమాసికంతో పోలి స్తే మూడో క్వార్టర్‌లో పరికరాల సరఫరాపరమైన సమస్య స్వల్పంగా పెరిగిందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐఎల్) పేర్కొంది. క్యూ3లో దా దాపు 46,000 వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయినట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ పరికరాల లభ్యతపై స్పష్టత లేకపోవడంతో ఉత్పత్తి ప్రణాళికలు వేసుకోవడం సవాలుగా మారిందని ఎంఎస్‌ఐఎల్ వివరించింది. దీనితో మూడో త్రైమాసికం ఆఖరు నాటికి 3,63,000 వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని.. వీటిలో 1,19,000 ఆర్డర్లు ఇటీవల ప్రవేశపెట్టిన మోడల్స్‌వే ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.
అదే పరిస్థితిలో మరిన్ని సంస్థలు ..
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం తెలంగాణ, మహారాష్ట్రలో దాదాపు రూ. 11,000 కోట్లతో పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించినప్పటికీ ప్రస్తుతమున్న ప్లాంట్ల సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలే ఇందుకు కారణమని కంపెనీ ఈడీ రాజేశ్ జెజూరికర్ వెల్లడించారు. స్కార్పియో, ఎక్స్‌యూవీ700 వంటి వాహనాల తయారీలో దాదాపు 200 రకాల సెమీకండక్టర్ చిప్స్ అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంఅండ్‌ఎం వద్ద 2,66,000 వాహనాలకు ఆర్డర్లు ఉన్నాయి.
ఇక చిప్‌లపరమైన సవాళ్లు 2023లో కూడా కొనసాగవచ్చని జేఎల్‌ఆర్ పేర్కొంది. చిప్‌ల సరఫరాను మెరుగుపర్చుకునే దిశ గా మంచి పురోగతే సాధించామని .. అయినప్పటికీ కొన్ని సవాళ్లు నెలకొన్నాయని తెలిపింది. చైనాలో మళ్లీ కోవిడ్ ప్రబలడం, మార్కెట్లో అధిక రేట్లకు చిప్‌లు కొనాల్సి వస్తుండటం తదితర సవాళ్లు ఉన్న ట్లు వివరించింది. 2023లో డిమాండ్ సానుకూలంగానే ఉంటుందని భావిస్తున్నామని అయితే వాహనాలను ఎంత మేరకు అందించగలమనేది చిప్‌ల సరఫరా అంశమే నిర్దేశిస్తుందని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఎండీ పియుష్ ఆరోరా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment