గుడం  వఆయుర్‌ ఫ్యాక్ట్స్‌ మధురౌషధం | Ayurvedic specialization of diet and medicines for health | Sakshi
Sakshi News home page

గుడం  వఆయుర్‌ ఫ్యాక్ట్స్‌ మధురౌషధం

Published Sat, Nov 3 2018 12:38 AM | Last Updated on Sat, Nov 3 2018 12:38 AM

Ayurvedic specialization of diet and medicines for health - Sakshi

ప్రకృతి సంపదను ఆరోగ్యం కోసం ఆహారంగా, ఔషధాలుగా మలచుకోవడం ఆయుర్వేద శాస్త్ర విశిష్టత. ఆరు రుచులలోనూ  (తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు) మధుర రసానిదే అగ్రస్థానం. కొన్ని పదార్థాలు నాలుకకు తగలగానే తీపి స్ఫురిస్తుంది. కొన్నింటిలో తీపి అంతర్లీనంగా అనురసంగా ఉంటుంది. బయటకు గట్టిగా కర్రలా ఉన్నా, నిలువెల్లా మధుర ద్రవానికి పట్టుకొమ్మ ‘చెరకు’. దీనిని సంస్కృతంలో ‘ఇక్షు’ అంటారు. ఇక్షురసం నుంచి బెల్లం (గుడం) తయారుచేసే ప్రక్రియ చాలాకాలంగా ఉంది. రకరకాల ఔషధాల తయారీలో, పలు వంటకాలలో బెల్లానికి ప్రాముఖ్యతను ఇవ్వటం ఆయుర్వేదంలో స్పష్టంగా ఉంది. సితా (పటిక బెల్లం), ఖండ శర్కర (ఇసుక వలె అతి సన్నగా ఉన్న పంచదార), మధుశర్కరా (తేనె నుంచి తయారైన పంచదార) ద్రవ్యాల ప్రయోజనాల గూర్చి భావప్రకాశ సంహితలో కనిపిస్తుంది. కాని వీటి  తయారీ విధానం గురించి వివరణ కపడదు. రసాయనిక పదార్థాల సమ్మేళనంతో ఆధునిక వ్యాపార పోకడలతో తయారుచేస్తున్న పంచదారకు, నాటి సహజ సిద్ధమైన ‘శర్కర’ కు చాలా తేడా ఉంది. ఈనాటి పంచదారలో పోషకాలు శూన్యం, హానికరం. నాటి శర్కరలు, విశేషించి గుడం (బెల్లం) అమోఘమైన పోషకాహారం. 

చెరకు బెల్లం సశాస్త్రీయ వివరాలు
చెరకు రసం: శరీరానికి చలవ చేస్తుంది. వీర్యవర్ధకం. కఫకరం. కాచిన చెరకు రసం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. కడుపునొప్పిని పోగొడుతుంది. మలమూత్రాలను సాఫీగా జారీ చేస్తుంది.
చెరకు (చెఱకు) బెల్లం గుణాలు: తియ్యగా, జిగురుగా (స్నిగ్ధం) ఉంటుంది. వాతహరం. కొంతవరకు వేడిని తగ్గిస్తుంది. శర్కరంత చలువ చేయదు. మూత్రాన్ని సాఫీగా చేసి, మూత్రవికారాలను తగ్గిస్తుంది.  కఫాన్ని తగ్గిస్తుంది. క్రిములను నాశనం చేస్తుంది. కొవ్వును పెంచుతుంది.(ఇక్షో రసో యస్సపక్వో జాయతే... సగుడౌ... వృష్యో గురుః స్నిగ్ధో వాతఘ్నో మూత్ర శోధనః‘ నాతి పిత్త హరో మేదః కఫ కృమి బలప్రదః)
కొత్త బెల్లం: జఠరాగిన్ని పెంచుతుంది కాని కఫాన్ని, కృములను కలుగచేస్తుంది. దగ్గు, ఆయాసం (కాస, శ్వాస) లను పెంచుతుంది. (గుడో నవః కఫ శ్వాస కాస కృమి కరో అగ్నికృత్‌)
పాత బెల్లం: చాలా మంచిది. తేలికగా జీర్ణమై శరీరాన్ని తేలికపరుస్తుంది. వేడిని తగ్గించి కొవ్వును కరిగిస్తుంది. జఠరాగ్నిని పెంచి పుష్టిని కలిగిస్తుంది. రక్త దోషాలను పోగొడుతుంది, వాతరోగాలను తగ్గిస్తుంది.
గుడో జీర్ణ లఘుః పథ్యో న అభిష్యంది అగ్ని పుష్టికృత్‌‘
పిత్తఘ్నోమధురో వృష్యో వాతఘ్నో అసృక్‌ ప్రసాదనః

మత్స్యండీ:  చెరకు రసాన్ని ఒక పద్ధతిలో వేడి చేస్తూ బెల్లాన్ని తయారుచేసేటప్పుడు, చివరన కొంచెం ద్రవాంశలు మిగిలిపోతాయి. దానినే మత్స్యండీ అంటారు. ఇది చాలా బలకరం, మృదురేచకం, రక్తశోధకం, వీర్యవర్ధకం.మత్స్యండీ భేదినీ బల్యా బృంహణీ వృష్యా
రక్త దోషాపహాః స్మృతాఆధునిక జీవరసాయన పోషక వివరాలు: తాటిబెల్లం, ఖర్జూర బెల్లం, కొబ్బరి బెల్లాలు కూడా తయారీలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం చెరకు బెల్లం వాడకమే ఎక్కువ. 100 గ్రాముల బెల్లంలో ప్రొటీన్లు 0.4 శాతం, కొవ్వులు 0. 1 శాతం, మినరల్స్‌ 0. 6 శాతం, శర్కరలు (కార్బోహైడ్రేట్లు) 95 శాతం, క్యాల్షియం – 80 శాతం, ఫాస్ఫరస్‌ 40 శాతం, ఐరన్‌ 2.64 శాతం, క్యాలరీలు 383 ఉంటాయి.
తయారీలో ఆసక్తికర అంశాలు: రిఫైన్డ్, డిస్టిలేషన్‌ చేయకుండా ఉన్నది మంచి బెల్లం. దీంట్లో కెమికల్స్‌ వాడకపోవడం వలన అన్ని పోషక ఖనిజాలు (ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్‌) భద్రంగా ఉంటాయి. మట్టిరంగు వంటి నలుపు రంగులో ఉండే బెల్లం ఉత్తమం. దీంట్లో విటమిన్లు, ఫైబర్‌ కూడా ఉంటాయి. కనుక ఆరోగ్యకరం.
ఆర్గానిక్‌ బెల్లం (జాగరీ): ఇది మరింత శ్రేష్ఠం. చెరకును పండించినప్పుడు కృత్రిమ రసాయనిక ఎరువులు గాని, క్రిమిసంహారక మందులు గాని వాడరు. బెల్లం తెల్లగా లేక ఎర్రగా రంగు రావడం కోసం కెమికల్స్‌ వాడరు. కనుక పసుపు మిశ్రిత మట్టిరంగులో చూర్ణం రూపంలో ఉంటుంది. సుక్రోజ్, యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. పొటాషియం, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు వార్ధక్యాన్ని దూరం చేయటానికి ఉపకరిస్తాయి.

కల్తీ బెల్లాలు: నిగనిగలాడే ఎరుపు, తెలుపు, పసుపు రంగులు విరజిమ్మటం కోసం హానికర కెమికల్స్, తీపిని అధికం చేసే కెమికల్స్, నిల్వ ఉండటానికి కెమికల్స్‌ అధిక మోతాదులో కలుపుతారు. అసలైన మట్టిరంగు కంటె, ఈ ఆకర్షిత రంగు బెల్లానికి అమాయక వినియోగదారులు బలైపోతున్నారు. దీనికంటె అనర్థం ‘పంచదార’ తయారీ. అందులో మితిమీరిన తెలుపు, తీపి మినహా పోషకవిలువలు శూన్యం. ఇది గమనించాలి. బ్రౌన్‌ సుగర్‌లో బ్లీచింగ్‌ తక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు నయం. బజారులో లభించే ‘తెల్లటి’ తళుకులీనే పంచదార (సుగర్‌) తయారీలో ఆకర్షణార్థమై కొన్ని వందల రసాయనిక పదార్థాలు వాడతారు. అవన్నీ విషతుల్యాలని గుర్తుంచుకోవాలి.
ఔషధ గుణాలు: బెల్లాన్ని శుంఠి (శొంఠి)తో కలిపి సేవిస్తే సమస్త రోగాలు తగ్గిపోతాయి. అల్లంతో కలిపి సేవిస్తే కఫవ్యాధులు హరిస్తాయి. కరక్కాయ చూర్ణంతో కలిపి సేవిస్తే అన్ని పిత్తరోగాలు ఉపశమిస్తాయి. ఇది మూలవ్యాధికి మంచి మందు. 
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement