సాక్షి,హైదరాబాద్: మహా నగరానికి ఆనుకొని ముచ్చర్లలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఫార్మాసిటీతో సమీప భవిష్యత్‌లో కాలుష్యం పంజా విసరడం ఖాయమని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ప్రాంతంలో అరుదైన వృక్ష, జంతు జాలం మనుగడకు ఫార్మాసిటీ ప్రశ్నార్థకంగా మార్చేస్తుందని వెల్లడైంది. ప్రధానంగా ఈ ప్రాంతంలోని చిరుతలు, అరుదైన పక్షుల ఉనికి కనుమరుగవుతుందని తేలింది.
► ప్రభుత్వం సుమారు 19 వేల ఎకరాల్లో నిర్మించతలపెట్టిన ఫార్మాసిటీ పరిధిలో వృక్ష, జంతుజాలం ఉనికి, మనుగడ అన్న అంశంపై ఇటీవల ర్యాప్టర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది.
► ఈ సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం సిద్ధం చేసిన పర్యావరణ ప్రభావ నివేదిక సైతం లోపభూయిష్టంగా ఉందని ఈ సంస్థ ఆక్షేపించడం గమనార్హం. తమ అధ్యయన వివరాలను సర్కారు ఏర్పాటు చేసిన పర్యావరణ మదింపు సంఘం (ఎన్విరాన్‌మెంట్ అసెస్‌మెంట్ కమిటీ)కి సైతం సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
► ప్రధానంగా మద్దివెన్ను, కడ్తాల్, తిప్పారెడ్డిపల్లి రిజర్వు ఫారెస్టుల ఉనికిని ఫార్మాసిటీ ప్రశ్నార్థకంగా మార్చేస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ అభయారణ్యాలలో అరుదైన వృక్ష జాతులు, క్షీరదాలు, పక్షులున్నాయి. ఇందులో ప్రధానంగా అంతరించిపోయే ప్రమాదం ఉన్న పక్షి ఎల్లో ధ్రోటెడ్ బుల్‌బుల్ అనే పక్షి మనుగడం కష్టతరమవుతుందని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది.
► ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థ విడుదల చేసిన రెడ్‌లిస్ట్‌లో ఈ పక్షి ఉందని తెలిపింది. ఇక ఈ ప్రాంతంలో విస్తరించిన కొండల్లో చిరుత పులులకు ఆవాసాలున్నాయని, వీటికి ఆహారం,తాగునీటి వసతి కూడా ఇక్కడ ఉందని, ఫార్మాసిటీ ఏర్పాటుతో వీటి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొంది.
పంటలకూ గడ్డుకాలమే..
ఫార్మాసిటీ ఏర్పాటుతో సుమారు 11 వేల ఎకరాల్లో విస్తరించిన విభిన్న పంటలు, అడవులు, వృక్ష, జంతుజాలం మనుగడ ప్రశ్నార్థకం కానుందని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది. వైట్ రంప్‌డ్ వల్చర్స్, స్నేక్ ఈగల్, సర్కేటస్ గాలికస్, వైట్ ఐ బజార్డ్, బుటాస్టర్ టేసా, షిక్రా, బ్లాక్‌షోల్డర్డ్ కైట్, ప్యాలిడ్ హ్యారియర్ వంటి పక్షులు అంతర్థానమవుతాయని ఈ అధ్యయనం తెలిపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ ప్రభావ నివేదిక లోపభూయిస్టంగా ఉందని సంస్థ ప్రతినిధి ప్రణయ్ జువ్వాది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment