
సౌమ్య స్వామినాథన్ సిఫార్సు
న్యూఢిల్లీ: ఢిల్లీ వంటి నగరాల్లో వాయు కాలుష్యం నుంచి పిల్లలను రక్షించేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్, శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ సూచించారు. ప్రస్తుతం ఆరోగ్యశాఖ సలహాదారుగా ఉన్న ఆమె.. వాయు కాలుష్యంపై భారత్ తగినంత డేటాను సేకరించిందని, చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
‘పెద్దలకంటే పిల్లలు వేగంగా శ్వాస తీసుకుంటారు. అలాగే వారు చిన్నగా ఉండటం వల్ల నేలకు దగ్గరగా ఉండటంతో గాలిలోని దుమ్ము, ధూళి, కాలుష్యం వారిని తొందరగా చేరుతుంది. తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇంటి తరువాత పిల్లలు ఎక్కువసేపు గడిపేది పాఠశాలల్లోనే. కాబట్టి కచ్చితంగా ప్రభుత్వ, ప్రైవేట్‌పాఠశాల్లో ప్యూరిఫయర్లను ఏర్పాటు చేసి గాలి నాణ్యతను మెరుగుపరచాలి’ అని ఆమె సూచించారు.
అయితే బయోమాస్ స్థానంలో ఎల్పీజీని తీసుకొచ్చి, ఇప్పటికే ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు కొంత మేర ప్రయోజనం చేకూరుస్తున్నాయని స్వామినాథన్ తెలిపారు. నగరాల్లో ప్రజారవాణాను విస్తరించాలని, మితిమీరిన కార్ల వినియోగంపై జరిమానాలు విధించాలని, పారిశ్రామిక కాలుష్య చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆమె పేర్కొన్నారు. చట్టాలు, నిబంధనలు తీసుకొస్తే సరిపోదని, వాటిని కఠినంగా అమలు చేయాలన్నారు.
డబ్ల్యూహెచ్‌ఓ పరిమితుల కంటే అధికం.. ఢిల్లీలో గాలి నాణ్యత తరచూ దెబ్బతింటోంది. శీతాకాలంలో ఇది మరింత ప్రమాదకర స్థాయిలను చేరుతుంది. గాలి కాలుష్యం పిల్లల్లో అభ్యాస నైపుణ్యాన్ని ప్రభావితం చేస్తోంది, తద్వారా విద్యా వ్యవస్థకు నష్టం వాటిల్లుతోంది. దీనిపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక స్విస్‌ఎయిర్ టెక్నాలజీ సంస్థ ఐక్యూయిర్ మంగళవారం ప్రకటించిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని 10 అత్యంత కాలుష్య నగరాల్లో ఆరు భారత్‌లోనే ఉన్నాయి. ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమని, భారత్ ఐదో అత్యంత కాలుష్య దేశమని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ –2024 తెలిపింది. 2023తో పోలిస్తే ఢిల్లీలో వాయుకాలుష్యం 2024లో బాగా పెరిగింది. ఒక్క ఢిల్లీనే కాదు.. భారత్‌లోని 35 శాతం నగరాల్లో కాలుష్యం డబ్ల్యూహెచ్‌ఓ పరిమితుల కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment