
సగటు మనిషితో పోలిస్తే సెలబ్రిటీలకు మరింత సామాజిక బాధ్యత ఉంటుంది. లక్షలాది మందిని ప్రభావితం చేయగలిగిన సినిమా నటీనటులు ఆ సామాజిక బాధ్యతను గుర్తించి మసలుకోవడాన్ని దురదృష్టవశాత్తూ మనం అరుదుగానే చూస్తుంటాం. తరచుగా సోషల్ మీడియాను తమ సినిమాల ప్రచారానికో, మరోరకమైన సంపాదనకో వాడుకునే సెలబ్రిటీలు సామాజిక సమస్యలపై స్పందించడం తక్కువే. కాలుష్యం వంటి సమస్యలపై తాము స్పందిస్తే ప్రభుత్వాలకు తమ మీద కోపం వస్తుందనే భయపడేవారే ఎక్కువ. ఇలాంటి వారి మధ్య అరుదుగా కొందరు మాత్రం తమదైన శైలిని నిలబెట్టుకుంటారు.
ప్రముఖ హిందీ నటుడు స్టాండ్–అప్ కమెడియన్‌గానూ పేరొందిన వీర్ దాస్(Vir Das ) ఇటీవల ముంబై నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై తరచుగా పోస్ట్‌ల ద్వారా తన ఆందోళన తెలియజేస్తున్నాడు. ఆ పోస్ట్స్ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఆయన తాజాగా సోషల్ మీడియా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ముంబై నగరంలో శ్వాస పీల్చడం అంటే సిగరెట్ తాగడంతో సమానం అని అన్నారు.
‘నేను సరదా కోసం లేదా సోషలైజింగ్‌లో భాగంగా సంవత్సరానికి కేవలం పదిహేను రోజులు మాత్రమే సిగరెట్ తాగుతాను. కానీ మిగిలిన రోజులు కూడా పొగ తాగుతున్నట్టే ఉంది ఎందుకంటే నేను శ్వాస పీల్చుకునేది ముంబైలో కదా. అదే రుచి. ఈ రోజు ముంబై ఒక మార్ల్‌బోరో లైట్‘ అని వీర్ ఇన్‌స్ట్రాగామ్‌లో రాశాడు. తాను పీల్చుకునే శ్వాస తాను తాగే సిగిరెట్ బ్రాండ్ మార్ల్‌బరో లైట్ ఒకేలా ఉన్నాయనే అర్ధం వచ్చేలా ఆయన ఈ పోస్ట్ చేశాడు.
అయితే ముంబై మహానగరంలో కనుమరుగవుతున్న గాలి నాణ్యతపై వీర్ దాస్ ఆందోళన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో, అతను ఇన్‌స్ట్రాగామ్‌లో కూడా విపులంగా పోస్ట్ పెట్టాడు, ‘ఇప్పుడు ఉదయం7:30 గంటలు... ఈ సమయంలో గాలి నాణ్యత ఎక్యుఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 170. ఇది పిల్లలు పాఠశాలకు పెద్దవాళ్లు వాకింగ్‌లకు వెళుతున్న సమయం. ప్రభుత్వం ఏదైనా కఠినంగా చేయకపోతే, వారసత్వంగా కాలుష్యం మాత్రమే మన జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఇప్పుడే పుట్టిన తరంతో పాటు వృద్ధాప్యంలో ఉన్న వారిపై కూడా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుందని మనం గ్రహించాలి. దీన్ని అడ్డుకోవడానికి ‘కొన్ని కఠినమైన విధాన నిర్ణయాలు జరగాలి. అలాంటి నిర్ణయాలు బహుశా స్వల్పకాలంపాటు మనల్ని తీవ్ర అసంతృప్తికి గురిచేయవచ్చు. కొత్త విమానాశ్రయాలు కొత్త వంతెనలు వచ్చేటప్పుడు కూడా మనం నసపెడతాం, కానీ చివరికి అది విలువైనదే అవుతుంది.
గాలి మీ ఆదాయ స్థితిని పట్టించుకోదు, గాలి మతపరమైనది కాదు, గాలి దేశభక్తి కాదు, గాలి ఓటు వేయదు, కానీ సరిదిద్దాల్సింది ఏదైనా ఉందీ అంటే అది గాలి మాత్రమే’’ అంటూ ఆయన రాశారు. ఈ పోస్ట్ సాధారణ నెటిజన్స్‌తో పాటు పలువురు సహచర నటీనటులను కూడా ఆకర్షించింది. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా(Sonakshi Sinha ) తదితరులు తన ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో రీపోస్ట్ చేస్తూ వీర్‌తో ఏకీభవించారు.
Comments
Please login to add a commentAdd a comment