
రాధికా ఆప్టే.. అందం, నటనతో ఆకట్టుకునే నటి. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో తన ప్రతిభను చాటుతూ, 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 2019లో విడుదలైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.
ఫ్రెండ్ కోసం పెళ్లికూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చే హీరోలు తెలుగు తెర మీద చాలా మందినే చూశాం. ఈ సినిమాలో హీరో మాత్రం పెళ్లికూతురిని కిడ్నాప్ చేసేది ఫ్రెండ్ కోసం కాదు డబ్బు కోసం. జై (దేవ్ పటేల్) అనే లండన్ వాసి పాకిస్తాన్ లోని లాహోర్ సమీపంలో ఉన్న యోంగానాబాద్ అనే గ్రామానికి చేరుకుంటాడు. అంతకు ముందే తనను ఎవరూ గుర్తించకుండా, సిమ్ కార్డులు, కార్లు మార్చుకుంటూ అక్కడ దాకా వస్తాడు. ఆ తర్వాత రెండు గన్స్ ను కొనుగోలు చేస్తాడు. ఆ గ్రామానికి వచ్చాక పెళ్లికి రెడీ అవుతున్న సమీరా (రాధికా ఆప్టే) అనే యువతిని కిడ్నాప్ చేస్తాడు. ఆ క్రమంలో అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డ్‌ని హత్య చేయాల్సి వస్తుంది. ఆమెను దేశం దాటించి తీసుకువెళ్లడానికి ముందు...ఆమె ప్రేమికుడు దీపేశ్ (జిమ్ సర్భ్) తనతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఈ పనిచేయించాడనే విషయం జై బయటపెడతాడు.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి మారుపేర్లతో , దొంగ పాస్‌పోర్ట్‌లతో ఇండియాకు వస్తారు. అయితే సెక్యూరిటీ గార్డ్ హత్య కారణంగా ఈ కిడ్నాప్ రెండు దేశాల మీడియాలో వైరల్ అవుతుంది, దాంతో సమీరా ప్రేమికుడు దీపేశ్ భయపడతాడు, సమీరాను తిరిగి పాకిస్తాన్ కు పంపేయమని దేవ్‌ని కోరతాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు సన్నిహితంగా గడిపిన జై, సమీరా మధ్య అనుబంధం పెరుగుతుంది. ముఖ్యంగా సమీరా అతనిపై మోజుపడుతుంది. వారిద్దరూ శారీరకంగా ఒకటవుతారు. అదే సమయంలో దీపేశ్ దగ్గర ఖరీదైన వజ్రాలు ఉన్నాయని తెలుసుకున్న జై, వాటిని పొందేందుకు ప్రయత్నిస్తాడు. రకరకాల మలుపుల మధ్య సాగే ఈ లవ్–క్రైమ్–రొమాంటిక్ కథ చివరికి ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది.
జై పాత్రలో మిస్టీరియస్ ప్రొఫెషనల్ కిల్లర్‌గా జై పూర్తి గా మెప్పిస్తాడు. బోల్డ్ సీన్లకు పెట్టింది పేరైన రాధికా ఆప్టే(తెలుగులో లెజెండ్‌లో బాలకృష్ణ సరసన హీరోయిన్) ఈ సినిమా హాలీవుడ్ రూపకర్తల సమర్పణలో రావడంతో...పూర్తి స్థాయి హాలీవుడ్ హీరోయిన్‌లా రెచ్చిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్లలో ఆమె దాదాపు పూర్తి న్యూడ్‌గా కనిపించడం విశేషం.
హాలీవుడ్ చిత్రం చేసినప్పటికీ మన ఇండియన్ హీరోయిన్లు మరెవ్వరూ ఈ స్థాయిలో బోల్డ్ సీన్స్ చేసి ఉండరు... సమీరా పాత్ర భావోద్వేగాలను కూడా బాగా ప్రదర్శించింది. ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ మరో ఆకర్షణ. పాకిస్తాన్, ఇండియా మధ్య ప్రయాణం, మారుమూల ప్రాంతాల చిత్రీకరణ బాగా చూపించారు. సంగీత పరంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ మూమెంట్లను ఎలివేట్ చేస్తుంది. అక్కడక్కడా సాగదీసినట్టు అనిపించినా.. ఆ ఫీలింగ్ ముదరకముందే ఆసక్తికరమైన మలుపులు పేర్చుకుంటూ రావడం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు. ఐఎమ్‌డిబి 6.0 రేటింగ్ ఇచ్చిన ఈ సినిమా ఓ కాలక్షేపం యాక్షన్, థ్రిల్లర్, లవ్, రొమాంటిక్ సీన్లను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది. చూడాలనుకున్నవారు నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.