
కెరీర్‌ను అందుకునే క్రమంలో బహుశా అతను సాధించినన్న రికార్డ్స్ మరే హీరో సాధించి ఉండడు. అత్యంత పిన్న వయసులో నటుడు, అత్యంత పిన్న వయసు హీరో, అత్యంత పిన్న వయసు స్టార్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తొలి సినిమా హీరో... హిందీ, తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ..అన్ని భాషల్లోనూ స్వల్ప వ్యవధిలోనే 280 చిత్రాలు చేసిన హీరో...పాతికేళ్ల వయసులోనే ఇన్ని సాధించాడంటే ఇప్పుడెలా ఉండాలి? ఏభై ఏళ్ల వయసులో ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి? ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలి? కానీ అడ్రెస్ కూడా లేకుండా పోవడం ఏమిటి?
అది 90వ దశకం.. భారతీయ సినీ పరిశ్రమకు ఒక మార్పు కాలం. ప్రధాన సినిమాలల్లో స్థిరపడిన తారల వయసు ముదిరిపోతుండగా, వారి స్థానాన్ని భర్తీ చేయడానికి యువ నటీనటులను పెద్ద సంఖ్యలో పరిచయం చేసిన కాలం. అలా తెరపైకి వచ్చిన యువతలో, అప్పుడే 15ఏళ్ల వయసులో హీరోగా అడుగుపెట్టిన ఒక యువ నటుడు ప్రత్యేకంగా నిలిచాడు అతడే హరీష్ కుమార్ (Harish Kumar), తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన హరీష్.

బాలనటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించిన హరీష్, కొన్ని హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించాడు. ఆ తర్వాత 1988లో, కేవలం 13ఏళ్ల వయసులోనే హీరో పాత్రలు పోషించడం మొదలుపెట్టాడు. దివంగత నిర్మాత రామానాయుడు 1990లో తీసిన ‘ప్రేమ ఖైదీ‘ తెలుగు సినిమాతో అప్పటి యూత్‌ని ఒక ఊపు ఊపాడు. తరువాతి ఏడాది, ఈ సినిమా హిందీ రీమేక్ లో కూడా నటించాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ తొలి సినిమా విజయం సాధించింది. హరీష్–కరిష్మా కపూర్ (అప్పుడు ఇద్దరికీ 16ఏళ్లు) జోడీ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది.
తర్వాతి కాలంలో, ‘తిరంగా‘, ‘కాలేజ్ బుల్లోడు‘ వంటి విజయవంతమైన చిత్రాల్లో హరీష్ నటించాడు. ఆ సమయానికి, హరీష్‌ను హిందీ తెలుగు సినిమాల్లో ఉన్న అత్యుత్తమ యువ నటుల్లో ఒకరిగా గుర్తించారు. కొందరు ఆయనను షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తదనంతర స్టార్‌గా కూడా భావించారు. కానీ తర్వాత తర్వాత హరీష్‌కు పూర్తిస్థాయి హీరోగా అవకాశాలు రాకున్నా మంచి పాత్రలే వచ్చాయి. టాప్ స్టార్స్ అయిన రజనీకాంత్, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నానా పాటేకర్, గోవిందా ల చిత్రాల్లో హరీష్ రెండవ హీరో, చిన్న పాత్రలకే పరిమితం అయ్యాడు.

‘ద జెంటిల్మన్‘, ‘కూలీ నం.1‘, ‘హీరో నం.1‘ వంటి హిట్ చిత్రాల్లో నటించాక, 2001 ప్రాంతంలో అకస్మాత్తుగా తెరమరుగైన హరీష్... తిరిగి పదేళ్ల తర్వాత తెరపై కనిపించాడు. ఓ పుష్కర కాలం క్రితం ‘నాటీ ః 40‘, ‘చార్ దిన్ కి చాంద్ని‘ వంటి ఫ్లాప్ చిత్రాలతో తిరిగి సినిమాల్లో ప్రయత్నించాడు.ఆ తర్వాత ఏడేళ్ల క్రితం‘ఆ గయా హీరో‘ అనే చిత్రంలో గోవిందాతో కలిసి చివరిసారి తెరపై కనిపించాడు. ఏమైందో తెలీదు గానీ హరీష్ సినిమా జర్నీ ఎంత ఉధృతంగా మొదలైందో అంతే అకస్మాత్తుగా ముగిసింది.
అందగాడని, ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు అని, డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేస్తాడని మంచి పేరు తెచ్చుకున్న హరీష్..సినిమా కెరీర్‌ను వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులే నాశనం చేశాయని అంటారు. ఆయన ప్రేమ, పెళ్లి కూడా ఆయన సమస్యలకు కారణం అని కూడా కొందరు చెబుతారు.
అయితే కొంత కాలం క్రితం ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సినీ రంగం విడిచిపెట్టడానికి గల అసలు కారణం గురించి మాట్లాడాడు. చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో గాయపడిన తాను సంవత్సరాల తరబడి చికిత్స చేయించుకోకపోవడం వల్ల, సీరియస్ బ్యాక్ ప్రాబ్లెమ్‌కి గురయ్యాడని చెప్పారు. ‘ లంబార్ వెరిబ్రా ఎల్3 ఎల్5 ప్రాంతాల్లో స్లిప్డ్ డిస్క్ ఏర్పడింది. దీనివల్ల నడక కూడా కష్టమైంది. ఆ సమయంలో నేను చాలా నిర్లక్ష్యంగా ఉండి, గాయాన్ని గుర్తించలేకపోయాను. ఆపరేషన్ కూడా చేయించుకోవాలనుకోలేదు,‘ అని హరీష్ చెప్పాడు.
చివరికి చికిత్స తీసుకున్న తరువాత, నెలల తరబడి మంచం మీద ఉండాల్సి వచ్చిందని, ఆ లోపు పరిశ్రమ తనను దాటి వెళ్లిపోయిందని హరీష్ తెలిపారు. ‘డాక్టర్ మొదట రెండేళ్ల పాటు పని చేయకూడదని చెప్పాడు. ఆ తర్వాత అలా అలా తెలియకుండానే పరిశ్రమ నుంచి మాయం అయ్యాను,‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హరీష్ ప్రశాంత జీవితం గడుపుతున్నాడు. ‘నేను ఇంకా భారత్‌లోనే ఉన్నాను – చెన్నై, హైదరాబాద్, ముంబైలలో ఎక్కువగా ఉంటాను. సినిమా రంగం విడిచిన విషయం చాలా వ్యక్తిగతమైనది. దీనిపై ఎక్కువగా మాట్లాడాలని ఇష్టం లేదు,‘ అని హరీష్ స్పష్టం చేశాడు.