
బాలీవుడ్ సినిమా ప్రేక్షకలోకానికి ఆషికి అనే సినిమా ఓ గొప్ప ప్రేమ కావ్యం. ఆ సినిమా విజయం ఎంత గొప్పది అంటే.. ఆ సినిమా పేరు గుర్తుకురాగానే ఆ సినిమాలో జీవించిన నటీనటులు కళ్ల ముందు సిసలైన ప్రేమ చిహ్నాల్లా మెరుస్తారు. ఆ సినిమా, ఆడియో ఆల్బమ్ వయసు పాతికేళ్లు కానీ... ఇప్పటికీ ఆ పాటల్ని వినకుండా ఉండలేని ప్రేక్షక–ప్రేమాభిమానులు ఎందరో..
నటీ నటులు అనుఅగర్వాల్, రాహుల్ రాయ్‌లతో సహా ఆ చిత్రంలో పాలు పంచుకున్న ఎందరికో ఆషికి తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చింది.
అంత చరిత్ర ఉన్న ఆషికికి ఇప్పటికే ఒక సీక్వెల్ వచ్చి విజయవంతం అయింది. ఇప్పుడు మరోసారి ఆ సినిమాకి సీక్వెల్ తయారవుతోంది. ఈ ఆషికి 3(Aashiqui 3 Movie )లో బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి ఎదిగిన శ్రీలీల(sreeleela) నటిస్తోంది. ఈ నేపధ్యంలోనే తొలి ఆషికి సినిమా కధానాయిక నటి అను అగర్వాల్(Anu Agarwal), తన ఆలోచనలను పంచుకున్నారు. తనకు ఆషికి లో పాత్ర ఎంతగా మనసుకు హత్తుకు పోయిందో వెల్లడించారు. ఆషికి అనేది కేవలం తెరపై నటించిన మరో పాత్ర మాత్రమే కాదని– అది తన హృదయ స్పందన అని ఆమె పేర్కొన్నారు.
తాను ఆషికీలో తొలిసారి భాగంగా మారినప్పుడు ఆ సమయంలో అది అంత గొప్ప చిత్రం కాదనీ. అప్పటికి దర్శకుడు మహేష్ భట్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకోలేదనీ, తన మొదటి మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టిన ఒక ఆర్ట్ హౌస్ డైరెక్టర్. మాత్రమే నని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆషికి నేను పనిచేసిన ఓ చిత్రం మాత్రమే కాదు, ఇది నన్ను నేను రూపొందించడంలో నన్ను నేను నిర్మించుకోవడంలో సహాయపడింది. అది నా వ్యక్తిగత జీవితంపై ఎంతో ప్రభావం చూపింది.‘ అంటూ ఉద్విగ్నంగా చెప్పారు.
అటువంటి ఐకానిక్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎంపికైనందుకు కృతజ్ఞత కలిగి ఉండాలని ఆషికి 3 నటీనటులకు ఆమె సూచించారు. ‘ఇది అహంకారంతో చెబుతున్నది కాదు, ఆషికీ సిరీస్‌లో చేరిన ఎవరైనా ఓ ఘనమైన వారసత్వంలో భాగమవుతున్నారు. ఆ వారసత్వంలోకి అడుగుపెట్టిన మరు క్షణమే, సగం విజయం సాధిస్తారు. ప్రేక్షకులు మిమ్మల్ని ఆషికి వారసులుగా చూసేందుకు వస్తారు. అందుకే నటీనటులు తమకు లభించిన అవకాశం పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఆ వారసత్వాన్ని గొప్ప గౌరవంగా భావించాలి.‘ అంటూ ఆమె ఉద్భోధించారు. ప్రేమ అనేది విశ్వవ్యాప్తం కాలాతీతం అని అను అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రేమ చిత్రణ సమకాలీన సున్నితత్వాలకు అనుగుణంగా ఉండవచ్చు, అయితే ప్రేమను నిర్వచించే ప్రాథమిక భావోద్వేగాలు అనుభవాలు ఎల్లప్పుడూ అలాగే ఉంటాయని తాను నమ్ముతానంది.
ఆషికి తర్వాత పొడగరి సుందరి, డస్కీ బ్యూటీగా 1990 ప్రాంతంలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న అనుఅగర్వాల్ 1999 ప్రాంతంలో అనూహ్యంగా ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై వెండితెరకు దూరమయ్యారు. కొన్నేళ్లపాటు చికిత్స తర్వాత ప్రస్తుతం కోలుకున్నప్పటికీ..సినిమాల్లో ఇంకా అవకాశాలు రావడం లేదు. ఆమె తమిళ దర్శకుడు మణిరత్నం దొంగ దొంగ చిత్రంలో కొంచెం నీరు కొంచెం నిప్పు పాట ద్వారా దక్షిణాది ప్రేక్షకులకూ చిరపరిచితమయ్యారు.