Anu Agarwal
-
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
బాలీవుడ్ సినిమా ప్రేక్షకలోకానికి ఆషికి అనే సినిమా ఓ గొప్ప ప్రేమ కావ్యం. ఆ సినిమా విజయం ఎంత గొప్పది అంటే.. ఆ సినిమా పేరు గుర్తుకురాగానే ఆ సినిమాలో జీవించిన నటీనటులు కళ్ల ముందు సిసలైన ప్రేమ చిహ్నాల్లా మెరుస్తారు. ఆ సినిమా, ఆడియో ఆల్బమ్ వయసు పాతికేళ్లు కానీ... ఇప్పటికీ ఆ పాటల్ని వినకుండా ఉండలేని ప్రేక్షక–ప్రేమాభిమానులు ఎందరో..నటీ నటులు అనుఅగర్వాల్, రాహుల్ రాయ్‌లతో సహా ఆ చిత్రంలో పాలు పంచుకున్న ఎందరికో ఆషికి తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చింది.అంత చరిత్ర ఉన్న ఆషికికి ఇప్పటికే ఒక సీక్వెల్ వచ్చి విజయవంతం అయింది. ఇప్పుడు మరోసారి ఆ సినిమాకి సీక్వెల్ తయారవుతోంది. ఈ ఆషికి 3(Aashiqui 3 Movie )లో బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి ఎదిగిన శ్రీలీల(sreeleela) నటిస్తోంది. ఈ నేపధ్యంలోనే తొలి ఆషికి సినిమా కధానాయిక నటి అను అగర్వాల్(Anu Agarwal), తన ఆలోచనలను పంచుకున్నారు. తనకు ఆషికి లో పాత్ర ఎంతగా మనసుకు హత్తుకు పోయిందో వెల్లడించారు. ఆషికి అనేది కేవలం తెరపై నటించిన మరో పాత్ర మాత్రమే కాదని– అది తన హృదయ స్పందన అని ఆమె పేర్కొన్నారు.తాను ఆషికీలో తొలిసారి భాగంగా మారినప్పుడు ఆ సమయంలో అది అంత గొప్ప చిత్రం కాదనీ. అప్పటికి దర్శకుడు మహేష్ భట్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకోలేదనీ, తన మొదటి మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టిన ఒక ఆర్ట్ హౌస్ డైరెక్టర్. మాత్రమే నని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆషికి నేను పనిచేసిన ఓ చిత్రం మాత్రమే కాదు, ఇది నన్ను నేను రూపొందించడంలో నన్ను నేను నిర్మించుకోవడంలో సహాయపడింది. అది నా వ్యక్తిగత జీవితంపై ఎంతో ప్రభావం చూపింది.‘ అంటూ ఉద్విగ్నంగా చెప్పారు.అటువంటి ఐకానిక్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎంపికైనందుకు కృతజ్ఞత కలిగి ఉండాలని ఆషికి 3 నటీనటులకు ఆమె సూచించారు. ‘ఇది అహంకారంతో చెబుతున్నది కాదు, ఆషికీ సిరీస్‌లో చేరిన ఎవరైనా ఓ ఘనమైన వారసత్వంలో భాగమవుతున్నారు. ఆ వారసత్వంలోకి అడుగుపెట్టిన మరు క్షణమే, సగం విజయం సాధిస్తారు. ప్రేక్షకులు మిమ్మల్ని ఆషికి వారసులుగా చూసేందుకు వస్తారు. అందుకే నటీనటులు తమకు లభించిన అవకాశం పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఆ వారసత్వాన్ని గొప్ప గౌరవంగా భావించాలి.‘ అంటూ ఆమె ఉద్భోధించారు. ప్రేమ అనేది విశ్వవ్యాప్తం కాలాతీతం అని అను అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రేమ చిత్రణ సమకాలీన సున్నితత్వాలకు అనుగుణంగా ఉండవచ్చు, అయితే ప్రేమను నిర్వచించే ప్రాథమిక భావోద్వేగాలు అనుభవాలు ఎల్లప్పుడూ అలాగే ఉంటాయని తాను నమ్ముతానంది.ఆషికి తర్వాత పొడగరి సుందరి, డస్కీ బ్యూటీగా 1990 ప్రాంతంలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న అనుఅగర్వాల్ 1999 ప్రాంతంలో అనూహ్యంగా ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై వెండితెరకు దూరమయ్యారు. కొన్నేళ్లపాటు చికిత్స తర్వాత ప్రస్తుతం కోలుకున్నప్పటికీ..సినిమాల్లో ఇంకా అవకాశాలు రావడం లేదు. ఆమె తమిళ దర్శకుడు మణిరత్నం దొంగ దొంగ చిత్రంలో కొంచెం నీరు కొంచెం నిప్పు పాట ద్వారా దక్షిణాది ప్రేక్షకులకూ చిరపరిచితమయ్యారు. -
సహజీవనం నా జీవితాన్ని నాశనం చేసింది: ప్రముఖ నటి
బాలీవుడ్ నటి అను అగర్వాల్ గురించి చాలామందికి తెలియదు. టాలీవుడ్లో దొంగ దొంగది సినిమాలో అలరించింది. అయితే అనుకోని అంతకుముందే ఆషికి సినిమాతో బాలీవుడ్లో ఫేమ్ సాధించింది. ఆమె నటించిన ఆషికి సూపర్‌హిట్‌గా నిలిచింది. రోడ్డు ప్రమాదంతో కోమాలోకి వెళ్లిడంతో కెరీర్ బ్రేక్ పడింది. తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ వ్యక్తితో తాను సహజీవనం చేసినట్లు వెల్లడించింది. అయితే దానివల్ల తన వ్యక్తిగత జీవితం నాశమైందని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అను అగర్వాల్ మాట్లాడుతూ..'నేను ఓ వ్యక్తితో సహజీవనం చేశా. అయితే అతని తల్లి కూడా మాతో నివసించింది. ఆమె కూడా నన్ను అంగీకరించింది. కానీ ఆమె స్నేహితులు నా గురించి చెడుగా చెప్పారు. అంతేకాకుండా పత్రికల్లో నా గురించి వ్రాసిన విషయాలను నమ్మారు. దీంతో నా జీవితం నాశనమైంది. ఆ సమయంలో నన్ను నేను రక్షించుకోవడానికి నాకు ఎలాంటి మార్గాలు లేవు. అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదు. దీంతో నా వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయా'. అని అన్నారు. అను బాలీవుడ్ అరంగేట్రం: 1990లో తన తొలి బాలీవుడ్ చిత్రం ఆషికి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమాతో అను ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత నటించిన గజబ్ తమాషా, జనమ్ కుండ్లీ, కింగ్ అంకుల్, రిటర్న్ ఆఫ్ జ్యువెల్ థీఫ్ చిత్రాల్లో నటించింది. ఊహించని రోడ్డు ప్రమాదంతో సినిమాలకు దూరమైంది. 1999లో జరిగిన ఓ ప్రమాదం ఆమె జీవితాన్ని కుదిపేసింది. దాదాపు నెల రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం అను అగర్వాల్ ఫౌండేషన్‌ను నడుపుతూ, యోగా క్లాసులు నిర్వహిస్తోంది. -
ఆషికీ: ప్రేమకథకు పాతికేళ్లు...
ఆల్‌టైమ్ హిట్ ‘ఆషికి’ ఎందరి జీవితాలను నిలబెట్టిందో చెప్పలేము. అందులో హీరోగా నటించిన రాహుల్ రాయ్, హీరోయిన్గా నటించిన అనూ అగర్వాల్, సంగీతం అందించిన నదీమ్-శ్రావణ్, పాడిన కుమార్ షానూ వీళ్లందరూ రాత్రికి రాత్రి సూపర్‌స్టార్స్ అయ్యారు. ఈ సినిమాను నిర్మించిన గుల్షన్ కుమార్‌కు ఈ సినిమా తెచ్చి పెట్టిన సంపద సామాన్యమైనది కాదు. కేవలం లక్ష రూపాయల ఖర్చుతో తయారైన పాటలు ఆ రోజుల్లో అతడికి కోట్లు సంపాదించి పెట్టాయి. ఇప్పటికీ సంపాదించి పెడుతున్నాయి. చరిత్రలో ఒక సినిమా తన సంగీతంతో ఎంత సంపాదించవచ్చు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. గుల్షన్ కుమార్ టి- సిరీస్ ద్వారా ఆడియో క్యాసెట్ల రంగంలో సంచలనం సృష్టించడంతో పాటు కొత్త గొంతులను పరిచయం చేయడంలో కూడా ముందుండేవాడు. పాత పాటలను రీమిక్స్ చేసి సొంత ఆల్బమ్స్ తయారు చేసి విడుదల చేసుకోవచ్చు అని ఎప్పుడైతే తెలిసిందో రఫీ, కిశోర్, ముఖేష్ వంటి గొంతులను పోలినవారిని వెతకడం మొదలుపెట్టాడు గుల్షన్ కుమార్. ఆ వెతుకులాటలో భాగంగా కలకత్తాకు చెందిన కుమార్ షాను దొరికాడు. నదీమ్-శ్రావణ్‌లతో కొన్ని బాణీలు చేయించి గీతకారుడు సలీమ్ చేత పాటలు రాయించి కుమార్ షాను గొంతులో రికార్డు చేయించి ఒక కొత్త ఆల్బమ్ విడుదల చేయాలని గుల్షన్‌కుమార్ ఆలోచన. అయితే అప్పుడే దర్శకుడు మహేష్ భట్ ఆ పాటలు విని ఈ పాటల ఆధారంగా ఒక సినిమా తీస్తాను అని ఆషికి తీశాడు. ఇందుకు పూర్తిగా కొత్త ముఖాలనే ఎంచుకున్నాడు. రాహుల్ రాయ్, అనూ అగర్వాల్, దీపక్ తిజోరి వంటి కొత్తవాళ్లతో వచ్చినా సరే కథాబలం, పాటల బలం, హీరో హీరోయిన్ల ప్రెజెన్స్ సినిమాను సూపర్ హిట్ చేశాయి. బాగా డబ్బున్న కుర్రాడైన రాహుల్ రాయ్ అనాథ అయిన అనూ అగర్వాల్ ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకోవడం కథ. ఈ సీదాసాదా కథను మంచి మంచి పాటలతో నింపి చెప్పడం వల్ల కథనం ఆసక్తికరంగా మారింది. ఇందులోని ప్రతీ పాటా హిట్టే. జానే జిగర్ జానెమన్ మై దునియా భులాదూంగా నజర్కే సామ్నే జిగర్ కే పాస్ తూ మేరీ జిందగీ హై బస్ ఏక్ సనమ్ చాహియే ఆషికీ కే లియే... 1990 ఆగస్టు మూడోవారంలో రిలీజైన సినిమా దేశమంతా దుమారం రేపింది. ప్రతి ఇంటా ప్రతి బండిలో ఆఖరికి ప్రతి లారీలో కూడా ఇవే పాటలు వినిపించేవి. ఇందులో పాడిన అనురాధా పౌడ్వాల్ ఆ రోజుల్లో లతా మంగేష్కర్‌కు గట్టి పోటీగా నిలిచింది. అయితే ఈ సినిమా వల్ల లబ్ధి పొందిన వారు ఆ తర్వాత జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. నదీమ్-శ్రావణ్లలో నదీమ్ హత్యకు గురయ్యాడు. గుల్షన్ కుమార్ కూడా హత్యకు గురయ్యాడు. అనూ అగర్వాల్ పెద్ద కార్ యాక్సిడెంట్‌కు లోనయ్యి ముఖం అంద వికారంగా మారడంతో సినిమాలకే దూరమయ్యింది. తనకు వెన్నుదన్నుగా నిలిచిన గుల్షన్ కుమార్ మరణం వల్ల అనురాధా పౌడ్వాల్ కెరీర్లో వెనుకబడింది. రాహుల్ రాయ్ ఒకటి రెండు సినిమాల్లో మెరిసినా తర్వాత రాణించలేకపోయాడు. అయినప్పటికీ ‘ఆషికి’ ఒక గొప్ప ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలయ్యి 25 ఏళ్లు నిండిన సందర్భంగా గుల్షన్ కుమార్‌కు నివాళిగా ఈ సినిమాలోని ‘ధీరే ధీరే సే’ పాటను పాప్ గాయకుడు హనీ సింగ్ చేత రీమిక్స్ చేసి హృతిక్ రోషన్, సోనమ్ కపూర్ల మీద చిత్రించి ప్రత్యేక ఆల్బమ్‌గా విడుదల చేశారు. ఆ పాట చాలామందికి నచ్చుతోంది. అయితే పాత ఆషికీ మీద ఉన్న అభిమానంతో ఈ కొత్తపాటను ఈసడించుకుంటున్నవాళ్లు కూడా ఉన్నారు. ఆషికీని గుర్తు చేస్తూ ఇటీవల వచ్చిన ఆషికీ 2 కూడా హిట్ అయిన సంగతి తెలిసిందే. -
'నేను మళ్లీ నటిస్తున్నాను...'
అనూ అగర్వాల్ పేరు వినబడగానే మణిరత్నం ‘దొంగా దొంగా’ సినిమాలో ‘కొంచెం నీరు..’ పాట పెదాల మీద ఇప్పటికీ పలుకుతుంది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఆషికీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనూ అగర్వాల్‌కు ఆ తరువాత చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. ఈలోపే ఆమెను దురదృష్టం వెంటాడింది. 1999లో ముంబాయిలో ప్రమాదానికి గురై చాలారోజులు కోమాలో ఉంది. దేవుడి దయ వల్ల ఆమె మృత్యువు నుంచి బయటపడింది. ఆ తరువాత మాత్రం అగర్వాల్ రూపంలో మార్పులు వచ్చాయి. కొందరైతే ఆమెను గుర్తు కూడా పట్టలేదు. తాజా వార్త ఏమిటంటే, ‘‘నేను మళ్లీ నటించనున్నాను’’ అని అనూ అగర్వాల్ సోషల్ నెట్వర్కింగ్ పేజీలో రాసింది. తన ఆటోబయోగ్రఫీ‘అనూజువల్-మెమరీ ఆఫ్ ఏ గర్ల్ హు కేమ్ బ్యాక్ ఫ్రమ్ ది డెడ్’ గురించి కూడా ప్రకటించింది. ఈ పుస్తకం వచ్చే నెలలో విడుదల కానుంది. ‘ఢిల్లీ యూనివర్శిటీ’ నుంచి సోషియాలజీలో గోల్డ్‌మెడల్ గెలుచుకున్న అగర్వాల్ మొదట్లో మోడలింగ్ చేసింది. మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్న ఆమె ముందు అవకాశాలు క్యూ కట్టడం లేదుగానీ, అనూ అగర్వాల్ ‘ఆటోబయో గ్రఫీ’లోని విషయాల గురించి ఆ నోటా ఈ నోట విన్న ఒక దర్శకుడు ఆమెను కలిసి- ‘‘వేరే కథ ఎందుకు? మీ జీవితకథనే సినిమాగా తీద్దాం’’ అన్నాడట. అందుకు అగర్వాల్ ఒప్పుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి!