ఆషికీ: ప్రేమకథకు పాతికేళ్లు... | Aashiqui: love story to the 25 years | Sakshi
Sakshi News home page

ఆషికీ: ప్రేమకథకు పాతికేళ్లు...

Published Tue, Sep 8 2015 11:11 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

ఆషికీ: ప్రేమకథకు పాతికేళ్లు...

ఆషికీ: ప్రేమకథకు పాతికేళ్లు...

ఆల్‌టైమ్ హిట్
 
‘ఆషికి’ ఎందరి జీవితాలను నిలబెట్టిందో చెప్పలేము. అందులో హీరోగా నటించిన రాహుల్ రాయ్, హీరోయిన్‌గా నటించిన అనూ అగర్వాల్, సంగీతం అందించిన నదీమ్-శ్రావణ్, పాడిన కుమార్ షానూ వీళ్లందరూ రాత్రికి రాత్రి సూపర్‌స్టార్స్ అయ్యారు. ఈ సినిమాను నిర్మించిన గుల్షన్ కుమార్‌కు ఈ సినిమా తెచ్చి పెట్టిన సంపద సామాన్యమైనది కాదు. కేవలం లక్ష రూపాయల ఖర్చుతో తయారైన పాటలు ఆ రోజుల్లో అతడికి కోట్లు సంపాదించి పెట్టాయి. ఇప్పటికీ సంపాదించి పెడుతున్నాయి. చరిత్రలో ఒక సినిమా తన సంగీతంతో ఎంత సంపాదించవచ్చు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు.

గుల్షన్ కుమార్ టి- సిరీస్ ద్వారా ఆడియో క్యాసెట్ల రంగంలో సంచలనం సృష్టించడంతో పాటు కొత్త గొంతులను పరిచయం చేయడంలో కూడా ముందుండేవాడు. పాత పాటలను రీమిక్స్ చేసి సొంత ఆల్బమ్స్ తయారు చేసి విడుదల చేసుకోవచ్చు అని ఎప్పుడైతే తెలిసిందో రఫీ, కిశోర్, ముఖేష్ వంటి గొంతులను పోలినవారిని వెతకడం మొదలుపెట్టాడు గుల్షన్ కుమార్. ఆ వెతుకులాటలో భాగంగా కలకత్తాకు చెందిన కుమార్ షాను దొరికాడు. నదీమ్-శ్రావణ్‌లతో కొన్ని బాణీలు చేయించి గీతకారుడు సలీమ్ చేత పాటలు రాయించి కుమార్ షాను గొంతులో రికార్డు చేయించి ఒక కొత్త ఆల్బమ్ విడుదల చేయాలని గుల్షన్‌కుమార్ ఆలోచన. అయితే అప్పుడే దర్శకుడు మహేష్ భట్ ఆ పాటలు విని ఈ పాటల ఆధారంగా ఒక సినిమా తీస్తాను అని ఆషికి తీశాడు. ఇందుకు పూర్తిగా కొత్త ముఖాలనే ఎంచుకున్నాడు. రాహుల్ రాయ్, అనూ అగర్వాల్, దీపక్ తిజోరి వంటి కొత్తవాళ్లతో వచ్చినా సరే కథాబలం, పాటల బలం, హీరో హీరోయిన్‌ల ప్రెజెన్స్ సినిమాను సూపర్ హిట్ చేశాయి.

బాగా డబ్బున్న కుర్రాడైన రాహుల్ రాయ్ అనాథ అయిన అనూ అగర్వాల్ ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకోవడం కథ. ఈ సీదాసాదా కథను మంచి మంచి పాటలతో నింపి చెప్పడం వల్ల కథనం ఆసక్తికరంగా మారింది. ఇందులోని ప్రతీ పాటా హిట్టే.

జానే జిగర్ జానెమన్ మై దునియా భులాదూంగా
నజర్‌కే సామ్‌నే జిగర్ కే పాస్
 తూ మేరీ జిందగీ హై
 బస్ ఏక్ సనమ్ చాహియే ఆషికీ కే లియే...

1990 ఆగస్టు మూడోవారంలో రిలీజైన సినిమా దేశమంతా దుమారం రేపింది. ప్రతి ఇంటా ప్రతి బండిలో ఆఖరికి ప్రతి లారీలో కూడా ఇవే పాటలు వినిపించేవి. ఇందులో పాడిన అనురాధా పౌడ్వాల్ ఆ రోజుల్లో లతా మంగేష్కర్‌కు గట్టి పోటీగా నిలిచింది. అయితే ఈ సినిమా వల్ల లబ్ధి పొందిన వారు ఆ తర్వాత జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. నదీమ్-శ్రావణ్‌లలో నదీమ్ హత్యకు గురయ్యాడు. గుల్షన్ కుమార్ కూడా హత్యకు గురయ్యాడు. అనూ అగర్వాల్ పెద్ద కార్ యాక్సిడెంట్‌కు లోనయ్యి ముఖం అంద వికారంగా మారడంతో సినిమాలకే దూరమయ్యింది. తనకు వెన్నుదన్నుగా నిలిచిన గుల్షన్ కుమార్ మరణం వల్ల అనురాధా పౌడ్వాల్ కెరీర్‌లో వెనుకబడింది. రాహుల్ రాయ్ ఒకటి రెండు సినిమాల్లో మెరిసినా తర్వాత రాణించలేకపోయాడు.

అయినప్పటికీ ‘ఆషికి’ ఒక గొప్ప ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలయ్యి 25 ఏళ్లు నిండిన సందర్భంగా గుల్షన్ కుమార్‌కు నివాళిగా ఈ సినిమాలోని ‘ధీరే ధీరే సే’ పాటను పాప్ గాయకుడు హనీ సింగ్ చేత రీమిక్స్ చేసి హృతిక్ రోషన్, సోనమ్ కపూర్‌ల మీద చిత్రించి ప్రత్యేక ఆల్బమ్‌గా విడుదల చేశారు. ఆ పాట చాలామందికి నచ్చుతోంది. అయితే పాత ఆషికీ మీద ఉన్న అభిమానంతో ఈ కొత్తపాటను ఈసడించుకుంటున్నవాళ్లు కూడా ఉన్నారు.
 ఆషికీని గుర్తు చేస్తూ ఇటీవల వచ్చిన ఆషికీ 2 కూడా హిట్ అయిన సంగతి తెలిసిందే.    
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement