ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ కాలుష్య కాసారంలో చిక్కి విలవిల్లాడుతోంది. మితిమీరిన కాలుష్యంతో గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణిస్తోంది. శుక్రవారం సాయంత్రానికి మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వాయు నాణ్యత సూచి(ఏక్యూఐ) 151కి చేరింది. ఇది చాలా అనారోగ్యకరమైందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన పరిమితి కంటే 6.3 రెట్లు ఎక్కువ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే నగరాన్ని పొగమంచు కప్పేయడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఈ సందర్బంగా పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని కోరినట్టు తెలుస్తోంది. దట్టమైన విషపూరిత పొగమంచు కప్పివేయడంతో శ్వాసకోశ , హృదయ సంబంధిత సమస్యలకు కారణమ వుతుందన్న ఆందోళన నేపథ్యంలో ఇంటి నుండి పని చేయడం, ప్రాంగణంలో ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, ఆన్‌లైన్‌లో వైద్య సలహాలు లాంటి అనేక చర్యలు చేపట్టినట్టు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. డెలాయిట్, కేపీఎంజీ, పానసోనిక్, బిగ్ బాస్కెట్, బ్లూ స్మార్ట్, Zepto , CIEL HR సర్వీసెస్‌తో సహా డజనుకు పైగా కంపెనీలు ఈ మేరకు ఆదేశించినట్టు తెలుస్తోంది.
ఉద్యోగులు ఇంటి నుండి పని చేయవచ్చని డెలాయిట్ తెలిపింది. అనారోగ్యంగా ఉన్న ఉద్యోగులు వెల్ బీయింగ్ డే ఆఫ్ ఆఫర్ చేసినట్టు పేర్కొంది. రైడ్-షేరింగ్ కంపెనీ బ్లూస్మార్ట్ పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేలా ఉద్యోగులకు సబ్సిడీ అందిస్తోంది. అలాగే ఉద్యోగులు ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే రిమోట్‌గా పని చేయవచ్చని పానసోనిక్ తన సిబ్బందికి తెలిపింది. దీంతోపాటు మాస్క్‌లు ధరించడం, హైడ్రేటెడ్‌గా ఉండటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సేల్స్ టీమ్‌కు సూచించినట్లు నివేదిక తెలిపింది. క్విక్ కామర్స్ స్టార్టప్ Zepto తన రైడర్‌లకు N95 మాస్క్‌లను అందించింది. ఆన్-కాల్ మెడికల్ సపోర్టును అందిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితికి సంస్థ నిర్దిష్ట చర్యలను అమలు చేయలేదని, అవసరమైతే ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు మేక్‌మైట్రిప్ చీఫ్ హెచ్‌ఆర్ శివరాజ్ శ్రీవాస్తవ తెలిపారు.
కాగా జాతీయ రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రధానంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 500 మార్కును అధిగమించడంతో ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. భవన నిర్మాణ పనులను, కూల్చివేతలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. దీనిపై ఇప్పటికే అత్యసరం సమావేశాన్ని నిర్వహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పలు కీలక చర్యల్ని చేపట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment