Hyderabad Pharma City
-
ఫార్మా సిటీతో కాలుష్యం? చిరుతలు, అరుదైన పక్షుల ఉనికి కనుమరుగు!
సాక్షి,హైదరాబాద్: మహా నగరానికి ఆనుకొని ముచ్చర్లలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఫార్మాసిటీతో సమీప భవిష్యత్‌లో కాలుష్యం పంజా విసరడం ఖాయమని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ప్రాంతంలో అరుదైన వృక్ష, జంతు జాలం మనుగడకు ఫార్మాసిటీ ప్రశ్నార్థకంగా మార్చేస్తుందని వెల్లడైంది. ప్రధానంగా ఈ ప్రాంతంలోని చిరుతలు, అరుదైన పక్షుల ఉనికి కనుమరుగవుతుందని తేలింది. ► ప్రభుత్వం సుమారు 19 వేల ఎకరాల్లో నిర్మించతలపెట్టిన ఫార్మాసిటీ పరిధిలో వృక్ష, జంతుజాలం ఉనికి, మనుగడ అన్న అంశంపై ఇటీవల ర్యాప్టర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. ► ఈ సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం సిద్ధం చేసిన పర్యావరణ ప్రభావ నివేదిక సైతం లోపభూయిష్టంగా ఉందని ఈ సంస్థ ఆక్షేపించడం గమనార్హం. తమ అధ్యయన వివరాలను సర్కారు ఏర్పాటు చేసిన పర్యావరణ మదింపు సంఘం (ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీ)కి సైతం సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ► ప్రధానంగా మద్దివెన్ను, కడ్తాల్, తిప్పారెడ్డిపల్లి రిజర్వు ఫారెస్టుల ఉనికిని ఫార్మాసిటీ ప్రశ్నార్థకంగా మార్చేస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ అభయారణ్యాలలో అరుదైన వృక్ష జాతులు, క్షీరదాలు, పక్షులున్నాయి. ఇందులో ప్రధానంగా అంతరించిపోయే ప్రమాదం ఉన్న పక్షి ఎల్లో ధ్రోటెడ్ బుల్బుల్ అనే పక్షి మనుగడం కష్టతరమవుతుందని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది. ► ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థ విడుదల చేసిన రెడ్‌లిస్ట్‌లో ఈ పక్షి ఉందని తెలిపింది. ఇక ఈ ప్రాంతంలో విస్తరించిన కొండల్లో చిరుత పులులకు ఆవాసాలున్నాయని, వీటికి ఆహారం,తాగునీటి వసతి కూడా ఇక్కడ ఉందని, ఫార్మాసిటీ ఏర్పాటుతో వీటి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొంది. పంటలకూ గడ్డుకాలమే.. ఫార్మాసిటీ ఏర్పాటుతో సుమారు 11 వేల ఎకరాల్లో విస్తరించిన విభిన్న పంటలు, అడవులు, వృక్ష, జంతుజాలం మనుగడ ప్రశ్నార్థకం కానుందని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది. వైట్ రంప్డ్ వల్చర్స్, స్నేక్ ఈగల్, సర్కేటస్ గాలికస్, వైట్ ఐ బజార్డ్, బుటాస్టర్ టేసా, షిక్రా, బ్లాక్షోల్డర్డ్ కైట్, ప్యాలిడ్ హ్యారియర్ వంటి పక్షులు అంతర్థానమవుతాయని ఈ అధ్యయనం తెలిపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ ప్రభావ నివేదిక లోపభూయిస్టంగా ఉందని సంస్థ ప్రతినిధి ప్రణయ్ జువ్వాది తెలిపారు. -
ఫార్మాసిటీకి ‘నిమ్జ్’ హోదా
సాక్షి, హైదరాబాద్: ఫార్మా రంగం విస్తరణ, నూతన పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’కి జాతీయ పెట్టుబడులు, ప్రోత్సాహక మండలి (నిమ్జ్) హోదా ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపింది. 2015లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా ఇచ్చేందుకు కేంద్ర పరిశ్రమల శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక విధాన విభాగం (డిప్) 2016 జనవరి 22న సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఫార్మాసిటీకి సంబంధించిన టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టు (సాంకేతిక ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక)తో పాటు అభివృద్ధి ప్రణాళిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమరి్పంచింది. ఈ నివేదికలను కూలంకషంగా పరిశీలించిన కేంద్ర పరిశ్రమల శాఖ ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా కలి్పంచాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఈ నెల 10న తుది ఆమోదం తెలపడంతో పాటు, రాష్ట్రానికి సమాచారం అందించింది. నిమ్జ్ హోదాకు పూర్తి స్థాయిలో ఆమోదం లభించిన నేపథ్యంలో ఫార్మాసిటీలో బాహ్య, అంతర్గత మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి గ్రాంటు రూపంలో సాయం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిధుల వేటలో రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,395 కోట్లు కాగా, నిమ్జ్ హోదా ద్వారా మౌలిక సదుపాయాలకు రూ.6 వేల కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫార్మాసిటీలో బాహ్య, అంతర్గత మౌలిక, సాంకేతిక సదుపాయాలకు రూ.6 వేల కోట్లు ఇవ్వాలని ‘డిప్’కు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు సమర్పించింది. తొలి విడతలో రూ.1,500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసినా నిధులు విడుదల కాలేదు. దీంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అక్టోబర్ 19న ఫార్మాసిటీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలంటూ మరోమారు ప్రతిపాదనలు సమరి్పంచారు. ఫార్మాసిటీ తొలి దశ అభివృద్ధిలో భాగంగా రోడ్లు, నీటి సరఫరా తదితర బాహ్య సదుపాయాలకు రూ.1,318 కోట్లు, అంతర్గత సదుపాయాల కోసం రూ.2,100 కోట్లు, మొత్తంగా రూ.3,418 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం చేపట్టిన ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ప్రపంచ శ్రేణి ఫార్మాసిటీని అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా ఈ అంశాన్ని ఇటీవల లోక్‌సభలో ప్రస్తావించారు. 5.6 లక్షల మందికి ఉపాధి రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 19,333 ఎకరాల్లో ఏర్పాటు చేసే హైదరాబాద్ ఫార్మాసిటీ ద్వారా 5.6 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మౌలిక సదుపాయాలు కల్పిస్తే రూ.64 వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని భావిస్తోంది. దీంతో మౌలిక సదుపాయాల కల్పనను త్వరితగతిన పూర్తి చేసేందుకు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ‘హైదరా బాద్ ఫార్మాసిటీ లిమిటెడ్’ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కూడా ఏర్పాటు చేశారు. ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సౌకర్యాల కు అవసరమైన నిధుల కోసం ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుకు ప్రతిపాదనలు సమరి్పంచింది. ఫార్మాసిటీని ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ సుమారు రూ.400 కోట్లతో రహదారుల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి పనులు కూడా ఎస్పీవీ చేపట్టింది. -
శివార్ల అభివృద్ధికే రేడియల్ రోడ్లు
హైదరాబాద్: నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు రేడియల్ రోడ్లకు శ్రీకారం చుట్టినట్లు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. హెచ్‌సీయూ డిపో నుంచి వట్టినాగులపల్లి వరకు రూ. 152 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు పనులకు శేరిలింగంపల్లి నల్లగండ్ల హుడాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పి.మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్లతో కలసి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. 35 రేడియల్ రోడ్లకు గాను ఇప్పటికే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 17 రేడియల్ రోడ్ల పనులు పూర్తయ్యాయని, ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల పనులు చేపట్టామని తెలిపారు. రేడియల్ రోడ్లతో నల్లగండ్ల, తెల్లాపూర్, వట్టినాగులపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల వారికి ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు ఐటీ ఉద్యోగులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. మిగిలిన 14 రేడియల్ రోడ్లనూ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామన్నారు. మహానగరంలో ఐటీ సంస్థలు, కొత్త తరం నాలెడ్జ్ ఇండస్ట్రీస్ వెస్ట్‌జోన్ పరిధిలోని గచ్చిబౌలి ప్రాంతంలోనే వస్తున్నాయన్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందన్నారు. మౌలిక వసతులు, రేడియల్, గ్రిడ్ రోడ్లతో ఐటీ, ఇతర సంస్థలు నగరానికి నాలుగువైపులా విస్తరించే అవకాశం ఉందని.. అందుకోసం ప్రభుత్వం ప్ర«ణాళికలు చేస్తోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఓఆర్ఆర్తో పాటుగా రీజినల్ రింగ్ రోడ్డును 350 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నట్లు కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్‌కు మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్)కు స్పష్టమైన ప్రణాళికతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. తద్వారా ఓఆర్ఆర్కు ఇరువైపులా కిలోమీటర్ చొప్పన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేస్తామన్నారు. అవసరమైతే రెండు కిలోమీటర్లకు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్, డ్రైనేజీ తదితర సమస్యలు భవిష్యత్తులో తలెత్తకుండా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే కొత్తగా రాబోతున్న హైదరాబాద్ ఫార్మా సిటీ, దండుమల్కాపూర్ వద్ద తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, కొత్తగా 350 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ పార్కు అభివృద్ధి చెందుతాయన్నారు. ఎస్ఆర్డీపీ ఫలాలు 2018లో వస్తాయన్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కోరినట్టుగా నల్లగండ్ల నుంచి నేరుగా శేరిలింగంపల్లి మున్సిపల్ ఆఫీస్ వరకు అర కిలోమీటర్ మేర కొత్త రోడ్డు అవకాశాలను పరిశీలించి మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ హరిచందనను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. -
నగరం నుంచి 1,160 పరిశ్రమల తరలింపు
పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం నుంచి కాలు ష్యకారక పరిశ్రమలను ఔటర్‌రింగ్ రోడ్డుకు అవతలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. నగరం లో 1,545 పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని పీసీబీ గుర్తించిందని, అందులో 385 పరిశ్రమలు ఇప్పటికే ఓఆర్ఆర్ బయట ప్రాంతం లో ఉన్నాయన్నారు. మిగిలిన 1,160 పరిశ్రమలను హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాంతానికి తరలించాలనే ప్రతి పాదన ఉందని పేర్కొన్నారు. కాలుష్య కారక పరిశ్రమల తరలింపుపై మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నగరం నుంచి పరిశ్రమల తరలింపు కోసం ఓఆర్ఆర్కు 100 కి.మీ.ల పరిధిలో పలుచోట్ల స్థలాలను టీఎస్ఐఐసీ గుర్తించిందని వెల్లడించారు. తర లింపు సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.