విచ్చలవిడిగా లభించే మత్తు, నిద్ర మాత్రలు..
- యువత పెడదారి పట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు
- ఆన్‌లైన్ ఔషధాల సరఫరా హానికరమని వెల్లడి
- అమెరికా వంటి దేశాల్లో విటమిన్లు, సాధారణ మాత్రలే ఆన్‌లైన్‌లో
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్ పరికరాల వంటి వస్తువుల్లా ఔషధాలను ఆన్‌లైన్‌లో విక్రయించడం వల్ల అనేక అనర్థాలు పొంచివున్నాయని నిపుణులు అంటున్నారు. ఒక్కోసారి రోగులకు ప్రాణాంతకం కానుందని హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఔషధాలను విక్రయించే పద్ధతికి కేంద్రం అనుమతిస్తున్న నేపథ్యంలో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ రెండ్రోజుల కింద దేశవ్యాప్తంగా మెడికల్ షాపులను బంద్ చేశారు. సామాన్య రోగులకు ఈ పద్ధతి అందుబాటులో ఉండే వ్యవహారం కాదని పేర్కొంటున్నారు. మరోవైపు చిన్నపాటి మందుల దుకాణాల ఉనికి ప్రశ్నార్థకం కానుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాసిరకం మందులు అంటగట్టే ప్రమాదం..
డాక్టర్ రాసిన చీటీలోని మెడిసిన్స్‌ను ఆన్‌లైన్‌లో కొన్నట్లయితే అవి డాక్టర్ రాసిన కంపెనీకి చెందినవే కావొచ్చు.. కాకపోవచ్చు. ఆన్‌లైన్ దుకాణాదారులు తమకు చౌకగా లభించే నాసిరకం ఫార్మసీ కంపెనీల మందులను సొంత లాభం కోసం కట్టబెట్టవచ్చు. ఆన్‌లైన్‌లో ఇలాంటివి విక్రయిస్తే రోగులు నష్టపోతారు. ఒక్కోసారి ప్రాణహాని జరిగే ప్రమాదముంది. డాక్టర్ రాసినవి కాకుండా వేరే మెడిసిన్ ఇస్తే అవి రియాక్షన్‌కు దారితీసి వికటించే ప్రమాదముంది. అందుకు ఆన్‌లైన్ మందుల అమ్మకం దారులు ఎలాంటి జవాబు దారీత నం, బాధ్యత వహించరు. ఎలాంటి పర్యవేక్షణకు తావు లేని ఆన్‌లైన్ అమ్మకాల వల్ల మత్తు మందులు, నిద్రమాత్రలను యువత విచక్షణ రహితంగా ఆర్డర్ చేస్తే ఎన్నో అనర్థాలు జరుగుతాయి.
అనేక మందుల దుకాణదారులు ఔషధాలతోపాటు సంబంధిత ఉత్పత్తులను కూడా విక్రయిస్తున్నాయి. వాటినీ ఇష్టారాజ్యంగా అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తారు. అంతేకాదు వైద్యుడు చీటీ రాసినా ఆన్‌లైన్‌లో ఆర్డర్ వల్ల ప్రిస్కిప్షన్‌కు సాధికారత ఉండదు. దీనివల్ల మందుల చీటీ ఉంటేనే ఔషధాలు విక్రయించాలన్న కేంద్రం స్ఫూర్తి దెబ్బతింటుంది. అమెరికా వంటి దేశాల్లోనూ ఆన్‌లైన్‌లో కేవలం పారాసిటమాల్, విటమిన్ వంటి ట్యాబ్లెట్లనే విక్రయిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
డిస్కౌంట్ ప్రచారాలతో ప్రమాదం..
ఆన్‌లైన్ విక్రయాలు జరిపే కొన్ని మెడికల్ దుకా ణదారులు ఇంత బిల్లు చేస్తే డిస్కౌంట్లు ఇస్తామని, కొన్ని మెడికల్ టెస్టులు ఉచితంగా ఇస్తామని అంటున్నాయి. కొన్ని వస్తువులు ఉచితంగా ఇస్తామంటూ ప్రజల్ని ఆకట్టుకోవాలని చూ స్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విషపూరితమైన ఔషధాలకు ఇటువంటి ప్రకటనలు అనైతికమని చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండవని చెబుతున్నారు. ఆర్డర్ చేసిన వెంటనే మందులు వచ్చే అవకాశం లేకపోవడంతో ఆరోగ్యం విషమించే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కార్పొరేట్ మెడికల్ షాపులతో ఇప్పటికే చిన్న మెడికల్ దుకాణాలు తుడిచి పెట్టుకుపోతున్నాయి. ఇక ఆన్‌లైన్ విక్రయాలు కూడా తోడైతే వాటి ఉనికే ప్రశ్నార్థకం కానుంది.
యువతకు హాని
ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయాల వల్ల మత్తు మందులు, నిద్ర మాత్రలు కూడా విచ్చలవిడిగా దొరికే పరిస్థితి రానుంది. దీంతో వాటికి బానిసై పోయిన వారు ముఖ్యంగా యువతీ యువకులు శారీరకంగా మానసికంగా సామాజికంగా నష్టపోతారు. అందువల్ల ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయాలు నిలిపేయాలి.
– వేణుగోపాల్‌శర్మ, రాష్ట్ర కెమిస్ట్, డ్రగ్గిస్ట్ సంఘం ప్రతినిధి
అత్యంత ప్రమాదకరం
ఆన్‌లైన్‌లో మందుల విక్రయం అత్యంత ప్రమాదకరం. మందుల చీటీ లేకుండా కొనుగోలు చేయడమే తప్పు. అలాంటిది ఆన్‌లైన్ అనేది అందుకు విరుద్ధం. పైగా రోగి తనకు ఇష్టమైన, ఇష్టమైనన్ని మెడిసిన్స్ కొని వాడితే అది ప్రాణాంతకం కూడా అవుతుంది. అమెరికా వంటి దేశాల్లో డాక్టర్ మందుల చీటీ లేకుండా మందులు ఇవ్వరు.
– డాక్టర్ శివరామకృష్ణ, ఖమ్మం