మాయదారి మందుల్లో మనమే నెం.1 | Poor Quality Drugs Are Increased In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మాయదారి మందుల్లో మనమే నెం.1

Published Tue, Feb 12 2019 8:26 AM | Last Updated on Tue, Feb 12 2019 8:26 AM

Poor Quality Drugs Are Increased In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ప్రాణాలు నిలబెట్టాల్సిన మందుల వల్లే ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్లయినా ఉండటం లేదు. నాలుగున్నరేళ్లుగా నకిలీ మందులు, నాసిరకం మందులు విచ్చలవిడిగా వినియోగంలోకి వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.  ఎక్కడా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల చర్యలు లేవు. మందుల షాపుల్లో అటుంచితే ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా అయ్యే మందులు మరీ దారుణంగా ఉన్నట్టు ఔషధ నియంత్రణ శాఖ పరిశీలనలో వెల్లడైంది. జాతీయ స్థాయిలో సగటున 4 శాతం నాసిరకం మందులు వినియోగంలో ఉండగా,  ఏపీలో 5.1 శాతం నకిలీ, నాసిరకం మందులు వినియోగంలో ఉన్నాయి. దీనివల్ల పేద, సామాన్య ప్రజలకు జబ్బులు నయం కాకపోగా, కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో నాసిరకం మందులు, నకిలీ మందుల విషయంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. 2018 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు 2700కు పైగా నమూనాలు  సేకరించి ల్యాబ్‌లో పరిశీలిస్తే అందులో 133 నాసిరకమైనవిగా తేలాయి. ఇది 5 శాతం కంటే ఎక్కువ. జాతీయ సగటు 4 శాతంగా ఉంది. కేరళలో 3, కర్ణాటక 4, తమిళనాడు 4.1 నాసిరకం మందులు వినియోగంలో ఉన్నాయి. 

ప్రభుత్వాసుపత్రుల్లో మరీ నాసిరకం.. 
ఆరు నెలల క్రితం గోవా యాంటీబయోటిక్స్‌ కంపెనీ సరఫరా చేసిన యాంటీబయోటిక్‌ ఇంజక్షన్‌లు వాడగానే శ్రీకాకుళం రిమ్స్‌లో ముగ్గురు మృతి చెందారు. దీనిపై విచారణకు ఆదేశించినప్పటికీ తరువాత ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. తాజాగా ఈ నెల 9న తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం పోతనపల్లిలో మడకం గంగయ్య అనే వ్యక్తి నులిపురుగుల నివారణ మాత్రలు మింగి మృతి చెందాడు. అదే జిల్లా వీఆర్‌ పురం మండలం వడ్డిగూడెం పాఠశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ మాత్రలు మింగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదాహరణలు మచ్చుకు కొన్ని మాత్రమే. అసలు ప్రభుత్వాసుపత్రుల్లో ఏ మందులు పనిచేస్తున్నాయో, ఏవి పనిచేయడంలేదో అర్థం కాని పరిస్థితి. మందులు ఉత్పత్తి కాగానే వాటిని ముందుగా ల్యాబొరేటరీకి పంపించి నాణ్యతను నిర్ధారించాక ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేయాలి. కానీ ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసి, రోగులు వినియోగించిన తరువాత ల్యాబొరేటరీకి పంపిస్తున్న దుస్థితి నెలకొంది.

రాజకీయ నాయకులవైతే శాంపిళ్లు కూడా తీసుకోరు
మన రాష్ట్రంలో మందుల నాణ్యతా నిర్ధారణకు రాజకీయ ఒత్తిళ్లు అడ్డొస్తున్నాయి. కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతల మందులను కనీసం నమూనాలు సేకరించేందుకు కూడా ఔషధ నియంత్రణ అధికారులు భయపడుతున్నారు. ఉదాహరణకు గతేడాది స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కూతురు విజయలక్ష్మి డైరెక్టర్‌గా ఉన్న ‘సేఫ్‌’ ఫార్ములేషన్స్‌ సంస్థ కొన్ని పశువులకు సంబంధించిన మందులు తయారు చేసింది. ఈ మందులు నాసిరకం అని వెటర్నరీ డాక్టర్లు నివేదికలు ఇచ్చినా ఔషధ నియంత్రణ అధికారులు స్పందించలేదు. మరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తయారు చేసిన మందుల పరిస్థితీ ఇంతే. ఇలాంటి మందులు చాలానే ఉన్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement