ఆన్‌లైన్‌లో డ్రగ్స్ లైసెన్స్: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం ముందువరుసలో ఉందని వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. సరళతర వాణిజ్య విధానంలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలో సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటికే ఈ–ఔషధి, ఈహెచ్‌ఎస్, ఆరోగ్యశ్రీ వంటిని ప్రారంభిం చామని, తాజాగా డ్రగ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానాన్ని లక్ష్మారెడ్డి శుక్రవారం సచివాలయంలో ప్రారంభించారు. ఆన్‌లైన్ డ్రగ్ లైసెన్స్ విధానంతో ఎన్నో ఉపయోగాలున్నా యని, జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
ఔషధాల తయారీ దారులు, రిటైల్, హోల్‌సేల్ డీలర్లు ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే అనుమతులు పొందొచ్చని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో తొలి సారిగా వైద్య విద్య పరిశోధన కోసం ప్రభుత్వం రూ.12 కోట్లు కేటాయించిందన్నారు. దీనికోసం ప్రత్యేకంగా మెరిట్(మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఇన్ తెలంగాణ) పేరుతో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో 165 పడకలతో ఐసీయూ, అత్యాధునిక ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వెరికోస్ వీన్స్ (నరాలు ముడత పడటం) వ్యాధికి ఇకపై ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తామని తెలిపారు.