
న్యూఢిల్లీ/ వాషింగ్టన్: భారతీయ దిగ్గజ ఫార్మా కంపెనీలకు భారీ షాక్ తగిలింది. అనుచితంగా ధరల పెంపునకు కుట్ర పన్నారంటూసన్ పార్మా, డా. రెడ్డీస్ తదితర ఏడు భారతీయ కంపెనీలతో పాటు 20 ఫార్మా కంపెనీలపై అమెరికాలో ఆరోపణలు చెలరేగాయి. అమెరికాలోని 40 రాష్ట్రాలతో పాటు, యాంటీ ట్రస్ట్ విభాగం కేసులను ఫైల్ చేశాయి. అంతేకాదు ఈ ఫార్మా సంస్థలకు చెందిన అయిదుగురు కీలక ఉద్యోగులను కూడా ఈ కేసులో చేర్చింది. 20 ఔషధ సంస్థలు వేర్వేరు మందుల ధరల్లో దాదాపు 400 శాతానికి పైగా పెంపునకు కుట్ర పన్నాయని ఆరోపించింది.
అందరికీ అవసరమైన మందుల ధరలకు కంపెనీలు ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నాయంటూ అమెరికాలోని 40కి పైగా రాష్ట్రాలు ఔషధ కంపెనీలపై మే 10వ తేదీన తేదీన కేసులు వేశాయి. డయాబెటిస్, క్యాన్సర్, హెచ్‌ఐవీ, మూర్ఛ వ్యాధి మందులు సహా సుమారు వెయ్యి రకాల ఔషధాల ధరలను నిర్ణయించడంలో 20 ఫార్మా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, కుట్రపూరితంగా ధరలను పెంచుతున్నాయనంటూ అభియోగాలు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థల్లో దేశీయంగా అరబిందో, గ్లెన్‌మార్క్, లుపిన్, వర్క్‌హాడ్, జైడస్ ఫార్మతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ మందుల తయారీ కంపెనీ టెవా ఫార్మాస్యూటికల్స్ కూడా ఉండటం గమనార్హం.
అమెరికన్ల జీవితాలతో ఆటలాడుతూ జనరిక్ మందుల తయారీ రంగంలోని కొందరు వందల కోట్ల డాలర్ల కుంభకోణానికి తెరతీశారనడానికి తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని కనెక్టికట్ అటార్నీ జనరల్ విలియమ్ టోంగ్ టోంగ్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ధరల దందాకు సంబంధించిన ఈమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్ రికార్డుల సాక్ష్యాలు తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన వివరించారు.
2013 జులై, 2015 జనవరి మధ్య పదుల సంఖ్యలో మందుల ధరలను అమాంతంగా పెంచేందుకు కంపెనీలు కుట్రకు పాల్పడ్డాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా 2013, 2014 జులై మధ్య కాలంలో 1200 జనరిక్ మందుల విలువ 448 శాతం పెరిగిందన్నారు. హెల్త్ కేర్ రంగంలో అమెరికాలో ఇది భారీ కుంభకోణమని ఆరోపించారు. అమెరికాలో వైద్య ఖర్చులు, మందుల ధరలు ఎందుకింత ఎక్కువగా ఉన్నాయన్న అంశంపై జరిగిన పరిశోధనలో ఈ స్కాం బయటపడిందన్నారు.
కాగా తాజా ఆరోపణలపై స్పందించిన టెవా ఈ ఆరోపణలను ఖండించింది. అలాగే ఇవి నిరాధారమైన ఆరోపణలన్నీ, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని సన్ ఫార్మా ప్రకటించింది. దీంతో మంగళవారం నాటి మార్కెట్‌లో హెల్త్ కేర్ సెక్టార్ 4 శాతం కుప్పకూలింది. సోమవారం సన్‌ఫార్మ ఏకంగా 21 శాతం పతనమైంది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా కంపెనీలు ఇంకా దీనిపై స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment