పసిడి... అంతర్జాతీయ పరిణామాలే దిక్సూచి!
న్యూయార్క్/ముంబై: పసిడి ధర కదలికలకు సమీప కాలంలో అంతర్జాతీయ అంశాలే ప్రాతిపదికకానున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఫండ్ రేటు జూన్‌లో పెంచవచ్చన్న ఆందోళనలు పసిడి ధర పరుగుకు సమీప కాలంలో విఘాతం కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏప్రిల్‌లో సమావేశమైన అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) సమావేశ మినిట్స్ వివరాల ప్రకారం- ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆందోళనలు కొంత తగ్గుతున్నాయి.
అమెరికా ఆర్థిక వ్యవస్థ కొంత ఆశావహంగా ముందుకు నడిచే అవకాశం ఉంది. ఫెడ్ అభిప్రాయాల నేపథ్యంలో- త్వరలో ఫండ్ రేటు ప్రస్తుత 0.50 శాతం స్థాయి నుంచి పెరిగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పసిడిలో అమ్మకాల ఒత్తిడి నెలకొన వచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సమీప కాలంలో న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ నెమైక్స్‌లో పసిడి ధర ఔన్స్‌కు 1,225 డాలర్ల నుంచి 1,300 డాలర్ల శ్రేణిలోనే కొనసాగవచ్చని అంచనా. తాజాగా గత శుక్రవారం ముగిసిన వారంలో నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న జూన్ డెలివరీ ధర వారం వారీగా దాదాపు 21 డాలర్లు తగ్గి 1,253 డాలర్ల వద్ద ముగిసింది. వెండి సైతం 17 డాలర్ల నుంచి 16 డాలర్లకు దిగింది.
దేశీయంగానూ నష్టమే..
దేశీయ ప్రధాన స్పాట్ బులియన్ మార్కెట్ ముంబైలో ధర శుక్రవారంతో ముగిసిన వారంలో వారం వారీగా 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు స్వల్పంగా రూ.125 తగ్గింది. రూ.29,905 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.29,775 వద్ద ముగిసింది. ఇక వెండి ధర కేజీకి రూ.600 నష్టపోయి రూ.40,395 వద్ద ముగిసింది. స్టాకిస్టుల అమ్మకాలు, అధిక ధరల వద్ద ఆభరణాలకు డిమాండ్ తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల వరుసగా రెండవ వారమూ పసిడి నష్టాల బాటన పయనించింది.