హైదరాబాద్‌లో ‘సెక్స్‌ డ్రగ్‌’ కలకలం | Drugs Manufacturing in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ‘సెక్స్‌ డ్రగ్‌’ కలకలం

Published Sat, May 4 2019 7:20 AM | Last Updated on Wed, May 8 2019 9:04 AM

Drugs Manufacturing in Hyderabad - Sakshi

సీజ్‌ చేసిన ఇం–కెమ్‌ ఫ్యాక్టరీ, స్వాధీనం చేసుకున్న కేటమైన్‌ తయారీ యంత్రం

సాక్షి, సిటీబ్యూరో: నగర శివార్లలోని నాచారంలోని ఓ కర్మాగారంపై జరిగిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారుల దాడులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బెంగళూరులో బుధవారం చిక్కిన కేటమైన్‌ తయారీ, విక్రయ ద్వయం ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌ యూనిట్‌ అధికారులు గురువారం ఈ దాడులు చేశారు. నాచారంలోని ‘ఇంకెమ్‌’ సంస్థను సైతం సీజ్‌ చేసినట్లు శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సెక్స్‌ డ్రగ్‌గానూ పిలిచే కేటమైన్‌ వాడకంతో గుర్రాలతో పాటు మనుషులకూ సెక్స్‌ సామర్థ్యం పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నాచారంలో సెక్స్‌ డ్రగ్‌ కంపెనీ సీజ్‌ చేశారనే వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. అయితే ఇది కేవలం సెక్స్‌ డ్రగ్‌ మాత్రమే కాదని అధికారులు చెబుతున్నారు.

బెంగళూరులోని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) యూనిట్‌కు మంగళవారం ఓ సమాచారం అందింది. ‘అక్కడి మెజిస్టిక్‌ థియేటర్‌ సమీపంలో ఓ ట్రాలీలో గన్నీ బ్యాగ్‌ ఉందని, అందులో నిషేధిత మాదక ద్రవ్యమైన కేటమైన్‌ను విక్రయిస్తున్నారనేది’ దాని సారాంశం. వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం ఆ ప్రాంతంలో దాడి చేయగా దీనిని పసిగట్టిన విక్రేత, ఖరీదు చేసే వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. తన కారులో దూసుకుపోయిన విక్రేత అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఎన్సీబీ అధికారులపై దాడికి సైతం వెనుకాడలేదు. కారు నంబర్‌తో పాటు వివిధ ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన ఎన్సీబీ అధికారులు నిందితుడిని బెంగళూరులోని కెంగేరి శాటిలైట్‌ టౌన్‌ ప్రాంతానికి చెందిన శివరాజ్‌గా గుర్తించారు. బుధవారం అతడి ఇంటిపై దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి ఇంట్లో ఉన్న 26 కేజీల కేటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అక్కడే దీని తయారీ యంత్రం ఉండటాన్ని చూసిన ఎన్సీబీ అధికారులు కంగుతిన్నారు. సాధారణంగా ఎవరూ ఇలాంటి యంత్రాలను ఇళ్లల్లో ఉంచుకోరు. సైకోటోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ కేటగిరీలోకి వచ్చే కేటమైన్‌ను కొన్ని రసాయనాలను వినియోగించి తయారు చేస్తారు. మూసి ఉన్న గదిలో ఇలాంటి యంత్రాన్ని ఉంచి, రసాయనాలను ప్రాసెసింగ్‌ చేసి కేటమైన్‌ తయారు చేయడం రిస్క్‌తో కూడుకున్న విషయం. ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ విస్పోటనం జరిగే ప్రమాదం ఉంది. జనావాసాల మధ్య ఉన్న ఇలాంటి యూనిట్‌ను గుర్తించడం దేశంలో తొలిసారని ఎన్సీబీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే శివరాజ్‌కు దీని తయారీలో ఉన్న అనుభవం నేపథ్యంలోనే పకడ్బందీగా ఈ దందా చేస్తున్నాడని తేల్చారు.

ఇతడిచ్చిన సమాచారంతో డ్రగ్‌ను హోల్‌సేల్‌గా ఖరీదు చేసుకుని వెళ్లడానికి వచ్చిన చెన్నైకు చెందిన జె.కన్నన్‌ను సైతం ఎన్సీబీ యూనిట్‌ పట్టుకుంది. మైసూర్‌కు చెందిన శివరాజ్‌ తన భార్య, కుమార్తెతో కలిసి మూడేళ్ల క్రితం బెంగళూరుకు వలసవచ్చాడు. కేటమైన్‌ తయారీ యూనిట్‌ ఉన్న ఇంట్లోనే వీరితో కలిసి ఉంటున్నాడు. ఇతడి విచారణలో హైదరాబాద్‌ లింకులు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని నాచారంలో ఉన్న ఇంకెమ్‌ సంస్థలోనూ ఇలాంటి మరో తయారీ యంత్రం ఉందని చెప్పడంతో బెంగళూరు అధికారులు హైదరాబాద్‌ యూనిట్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన నాచారం వెళ్లిన హైదరాబాద్‌ టీమ్‌ ఇంకెమ్‌ సంస్థలో ఉన్న యంత్రాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు దాన్ని సీజ్‌ చేసింది. ఇంకెమ్‌ నిర్వాహకుడిగా భావిస్తున్న ఓ వ్యక్తినీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.  

గుట్టుగా..ఐదేళ్లుగా..
మల్లాపూర్‌: నాచారం పారిశ్రామిక వాడలో ఇంకెమ్‌ కెమికల్‌ ల్యాబ్‌ పేరుతో వెంకటేష్‌ అనే వ్యక్తి ఏకంగా ఫ్యాక్టరీ  ఏర్పాటు చేసి ఐదేళ్లుగా గుట్టుగా  వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. ‘సెక్స్‌ డ్రగ్‌’గా పేర్కొనే ఈ ‘కెటామిన్‌’ మాదకద్రవ్యాన్ని బెంగుళూరు, గోవా తదితర ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్‌ వాడిన వారు పైశాచిక ఆనందంతో మృగాళ్లాలా ప్రవర్తిస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. బెంగళూరులో డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులకు కెటమిన్‌ డ్రగ్స్‌తో పట్టుబడ్డ ముఠా ఇచ్చిన సమాచారంతో కర్ణాటక పోలీసులు గురువారం రాత్రి  నాచారం పోలీసులతో కలిసి ఇ–కెమ్‌ కెమికల్‌ ల్యాబ్‌ పరిశ్రమపై దాడి చేశారు. ఈ సందర్భంగా   ముడి సరుకుతోపాటు, పలు కీలకపైన ఫార్ములాలను సైతం  స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిర్వాహకుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement