సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న కింగ్‌పిన్ బాబూ ఖాలేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) పట్టుకుంది. చాలాకాలంగా బాబూ ఖాలే కోసం గాలిస్తున్న ఎన్‌సీబీ.. ఈసారి అత్యంత పకడ్బందీ ఆపరేషన్ చేపట్టి అతడిని అరెస్టు చేసింది. వాస్తవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ఏరియాల్లో ఈ ఏడాది భారీగా గంజాయి సాగు చేశారు. లాక్‌డౌన్, విస్తారంగా కురిసిన వర్షాలు దానికి తోడయ్యాయి.
లాక్‌డౌన్ ఎత్తేశాక మహారాష్ట్ర, బెంగళూరులో గంజాయి మార్కెట్, అక్రమ రవాణా పెరిగాయి. కొద్దినెలలుగా ఏపీలోని సీలేరు నుంచి మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు గంజాయి గుట్టుగా తరలిపోతోందని ఎన్‌సీబీకి సమాచారం వచ్చింది. దానికితోడు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్ పెడుతున్నారన్న వార్తల నేపథ్యంలో.. ఈ ముఠాలు గంజాయిని వీలైనంత ఎక్కువగా రవాణా చేసే పనిలో పడ్డాయి. ఈ సమాచారంతో నాలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న గంజాయి రవాణాపై నిఘా పెంచారు.
హైదరాబాద్, కర్ణాటక మీదుగా..
ఎన్‌సీబీ అధికారులు ఈ గంజాయి నెట్‌వర్క్‌ను పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. పార్సిళ్లు తరలివెళ్తున్న మార్గాలను గుర్తించారు. హైదరాబాద్, కర్ణాటక మీదుగా ఉస్మానాబాద్ చేరుకుంటున్న సమయంలో స్మగ్లర్లు రెండు రకాల మార్గాలను అనుసరిస్తున్నారు. తొలుత ఏపీలోని సీలేరు, చింతపల్లి నుంచి తెలంగాణలోకి భద్రాచలం వరకు తెస్తున్నారు. ఎలాంటి ఇబ్బందీ లేదనుకుంటే ఖమ్మం–సూర్యాపేట మార్గం మీదుగా తరలిస్తున్నారు. నిఘా పెరిగిందనుకుంటే.. భద్రాచలం చేరుకున్నాక రూటు మార్చి.. ఖమ్మం–వరంగల్ మార్గంలో ఘట్‌కేసర్‌పై ఔటర్ రింగురోడ్డు ఎక్కుతారు. తర్వాత సంగారెడ్డి-జహీరాబాద్ రూట్‌లో కర్ణాటకలోని హుమ్నాబాద్, బసవకల్యాణ మీదుగా ఉస్మానాబాద్ చేరుకుంటున్నారు.
కాపుకాసి.. పట్టుకుని..
గంజాయి రాకెట్ కోసం చాలాకాలంగా కాపుగాస్తున్న ఎన్‌సీబీ అధికారులు.. పెద్ద అంబర్‌పేట వద్ద మార్చి 31వ తేదీన బాబూఖాలేకు చెందిన బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు. డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని, రూ.65 లక్షల విలువైన 332 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను గట్టిగా విచారించగా.. బాబూ ఖాలే నెట్‌వర్క్‌పై అవగాహన వచ్చింది. దీంతో రెండో రూటులోనూ దృష్టిపెట్టి.. ఏప్రిల్ 4న ఘట్‌కేసర్ టోల్ ప్లాజా వద్ద ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, ఒక ఐషర్ ట్రక్కును పట్టుకున్నారు.
ఐషర్ ట్రక్కు క్యాబిన్‌కు, ట్రాలీకి మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో 694 కిలోల గంజాయి బయటపడింది. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.1.4 కోట్లు ఉంటుంది. ఈ రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న ఐదుగురిని ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందులోనే నెట్‌వర్క్ సూత్రధారి బాబూ ఖాలే కూడా ఉండటం విశేషం. అధికారులు అందరినీ అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ప్రేమ వ్యవహారం: కొద్ది రోజుల్లో పెళ్లి.. యువతి తల నరికి
Comments
Please login to add a commentAdd a comment